Menu

” ఉరుమి ” ఎందుకు చూడాలి ?

“భారతదేశమునకు సముద్రమార్గమును కనుగొన్న పోర్చుగీసు నావికుడెవరు ? ” లాంటి ప్రశ్నలు మన చరిత్ర పాఠాల్లో కనిపిస్తాయి. దానికి జవాబుగా ” వాస్కోడిగామా ” లాంటి సమాధానాలు కనిపిస్తాయి. కాబట్టే యూరోపియన్లు, యూరప్ చరిత్రంటే ” ప్రపంచ చరిత్రే ” అని మోర విరుచుకుని తిరుగుతూంటారు.

మనం ఎంతమాత్రం సిగ్గులేకుండా ” వాళ్ళే లేకపోతే మనకి అభివృద్ధంటేనే తెలియదు , మనం ఈరోజు ఇలా జీవించగలుగుతున్నామంటే దానిక్కారణం ఆ యూరోపియన్లే ” అనే భ్రమల్లో పిల్లి గెడ్డాలూ నైకీలూ ఫోర్డులూ వేసుకుని మురిసిపోతూంటాము. కాబట్టే మనకి ” బుస్సీని ఎదిరించిపోరాడిన వీరుడెవరు ?” లాంటి ప్రశ్నలూ ఉండవు ! ” తాండ్రపాపారాయుడు ” లాంటి జవాబులూ ఉండవు ! ( ఇలాంటివాళ్ళకి పోర్చుగీసుల్ని తెలుగువాళ్ళు బుడతకీచులనేవారని ఏం తెలుస్తుంది. )

అందుకే ” ఉరుమి ” సినిమా చూసి బయటికి రాగానే నాకు సినిమా చూసిన అనుభూతి కంటే పరాయీకరణలో పడి తమ ఉనికిని కోల్పోతున్న భారతీయులందరూ మదిలోమెదిలి కళ్ళలో రెండు కన్నీటి చుక్కలు నిలిచాయి.
సంతోష్ శివన్ ఈ సినిమాలో మనకి చెప్పిన కథ అదే. మన్ని మనంకోల్పోకూడదు. ఎవరైతే తన అస్తిత్వాన్ని తాకట్టు పెడతాడో వాడికి ఏదో ఒకనాడు సమాజానికి జవాబు చెప్పక తప్పదు. ఆ జవాబ్దారీతనం లేకపోతే ఏదో ఒకరోజు ఎవరో ఒకరిచేత ఏదో ఒకవిధంగా చెప్పుదెబ్బలు తినక తప్పదు.

ఇంతవరకూ ఈ ఉరుమి తప్ప ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక్కసినిమా కూడా రాలేదు.
సినిమా ఒక ప్రభావయుతమైన మాధ్యమం అని అందరూ కబుర్లు చెప్పేవాళ్ళేతప్ప దాన్ని ప్రభావయుతంగా ప్రయోగించిన కళాకారులు మన భారత దేశంలో చాలా తక్కువ. హిందీ తెలుగు సినిమాలైతే పక్కా పెట్టుబడిగా మారిపోయి కూరగాయల వ్యాపారంతో కూడా పోల్చలేనంతగా కుళ్ళిపోయాయి.

ఈ కథని అల్లడంలో సంతోష్ శివన్ చూపించిన నైపుణ్యం అపూర్వం. రచయితని కాగితంమీది దర్శకుడనీ, దర్శకుణ్ణి వెండితెరమీది రచయిత అనీ ఎందుకంటారో దీన్ని చూస్తే అర్ధమౌతుంది. సినిమాని కళగా ఆరాధించే ప్రతి ఒక్కరూ దీన్ని తప్పకుండా చూడాలి. ఎందుకంటే కథ, చిత్రకథ, దర్శకత్వం ఈ మూడు ప్రతిభలనీ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం ఎలాగో అర్ధమౌతుంది.

మంచి సినిమా కథంటే కేవలం ఒకే ఒక్క వాక్యంలో చెప్పడానికి అనువుగా వుండాలనేది ప్రాథమిక సూత్రం. ఈ సినిమా కథ ” గతాన్నించీ వర్తమానాన్ని పిండుకుని భవిష్యత్తుని వండుకోవడమే సామాజిక బాధ్యత ” ఎంత అద్భుతమైన వాస్తవికత నిండిన జీవిత సత్యమిది ? దీన్ని ఎంత చక్కగా ఆవిష్కరించాడు ? ఆ ఆవిష్కరణకి ఆయన ఎంచుకున్న కథా నేపథ్యం ఎంత సమంజసంగా వుంది ? దానిలో ఎంతటి దార్శనికత దాగి వుంది ?

భవితవ్యాన్ని దర్శించగలగడం కళాకారుని ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతని సంతోష్ శివన్ ఎంత బాధ్యతాయుతంగా నిర్వర్తించారో ఈ సినిమాని చూస్తే అర్ధమౌతుంది. ఉరుమి అనేది ఒక ఆయుధం. ” అన్నా హజారే ” అనే ఒక ఆయుధం ఈనాటి సమాజాన్ని సరిదిద్దడానికి అవసరం అవుతుందని ప్రపంచీకరణ అనంతర పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్న దర్శకుడికి అర్ధం కావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. దీన్నే జనరంజకంగా చెప్పడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు.

అంత చక్కని శాంతి సందేశాన్నివ్వడానికి ఇంత రక్త పాతాన్ని చూపించడం అవసరమా అనేది అసలు ప్రశ్న. గౌతమ బుద్ధుడు, గాంధీ మహాత్ముడు, మార్టిన్ లూథర్ కింగ్, అన్నా హజారేలు హఠాత్తుగా పుట్టుకు రాలేదు. ఒకానొక సామాజిక సందర్భం వాళ్ళని నాయకులుగా అవతరించేలా చేసింది. ఆయా సామాజిక సందర్భాలన్నిటి వెనుకా ఉన్నది హింసే. అది భౌతికం కావచ్చు లేదా మానసికం కావచ్చు. హింస.., హింసే..! అందులోనూ చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూస్తే కనపడేది పూర్తిగా రక్త పాతమే.చరిత్రలు రాసుకునే మేధావులు కేవలం నాణానికి ఒక వైపు మాత్రమే చూస్తారు ! చూపిస్తారు !!
ఆ రెండోవైపున ఎంత కుత్సితం దాగివుందో ఎన్ని కుహకాలు నక్కివున్నాయో చూపించే ప్రయత్నం చెయ్యడం కళాకారుడి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి రక్తపాతమే ఉపాధి. అందుకే యుద్ధాలని చూపించినా ఇందులో మన వ్యాపార సినిమాల్లా రక్తపాతాన్ని వైభవీకరించడం జరగలేదు.

దీన్ని మనం ఎందుకు చూడాలంటే..,

మనం కోల్పోతున్న అస్తిత్వాన్ని గురించి ఒక్క క్షణం అయినా నిలబడి ఆలోచించుకోవడం కోసం చూడాలి.
సెజ్ ల పేరిట బంగారం పండే భూముల్ని రసాయనాలతో విషతుల్యం చెయ్యకుండా కాపాడుకోవలసిన అవసరాన్ని గురించి తెలుసుకోవడంకోసం చూడాలి.

తరతరాల సంస్కృతీ సాంప్రదాయాలు, వాటిని నిలబెట్టుకోవడం ద్వారా విలసిల్లే వైవిధ్యాన్ని కొనసాగేలా చేసుకోవడం ఎలాగో తెలుసుకోవడం కోసం చూడాలి.

మనిషి మౌలిక లక్షణాలయిన స్పందనలని కోల్పోకుండా వుండటం కోసం చూడాలి.
ఆటవిక దశనించీ మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంత నాగరీకుడైనా అడవుల్ని రక్షించుకోకపోతే ఎలా నాశనమైపోతాడో తెలుసుకోవడం కోసం చూడాలి.

రాజకీయం ముదిరి నాగరికతనే ముంచేసేంత ప్రమాదకరంగా మారితే ఆ నాగరీకులు ఆటవికుల చేతుల్లోనే ఎలా చెప్పుదెబ్బలు తినాల్సి వస్తుందో తెలుసుకోవడంకోసమైనా చూడాలి.
మనిషిగుండెలోని తడిని తెరమీద ఎలా ఆవిష్కరించవచ్చో చూడటానికైనా మనం ఈ సినిమాని తప్పకుండా చూడాలి.

– జొన్నవితుల

25 Comments
 1. vinay August 29, 2011 / Reply
 2. రవి August 29, 2011 / Reply
 3. రాణి August 29, 2011 / Reply
 4. Mohan ram prasad August 29, 2011 / Reply
 5. lakshmi radhika August 29, 2011 / Reply
  • cinema legend August 30, 2011 / Reply
 6. Venu August 30, 2011 / Reply
 7. krishna August 30, 2011 / Reply
 8. రమణ August 30, 2011 / Reply
 9. kavitha August 30, 2011 / Reply
 10. కల్యాణి August 30, 2011 / Reply
  • చదువరి August 30, 2011 / Reply
  • రవి August 31, 2011 / Reply
 11. bonagiri August 30, 2011 / Reply
 12. krshany August 31, 2011 / Reply
 13. venkat August 31, 2011 / Reply
 14. telugodu.. August 31, 2011 / Reply
 15. sasank September 1, 2011 / Reply
 16. కల్యాణి September 2, 2011 / Reply
 17. Kish September 2, 2011 / Reply
 18. కల్యాణి September 2, 2011 / Reply
 19. Ramu September 9, 2011 / Reply
 20. కల్యాణి September 13, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *