Menu

నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే!

శుభసంకల్పం చిత్రంలో గురువుగారు శ్రీ సీతారామశాస్త్రి గారు వ్రాసిన పాటలు రెండు: అవి హరి పాదాన…హైలెస్సో… అన్నవి. రెండు పాటలూ కూడా నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే! అన్న మకుటంతో సాగుతాయి. ఆ మకుటం నిజంగా వేదాంతపరంగా మకుటాయమానమైనదని కీర్తిశేషులు వేటూరి గారు కూడా శాస్త్రి గారిని మెచ్చుకున్నారట. “అందులో వేదాంతాన్ని వివరించ”మని గతంలో యిద్దఱు ముగ్గురు స్నేహితులు అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా నాకు అర్థమైనది వ్రాస్తున్నాను. గురువుగారి పాట కనుక తార్కికంగా ఆలోచిస్తే తడుతుందన్న ప్రయత్నమే తప్పించి నేను వేదాంతం చదవనూలేదు, ఈ పంక్తి గుఱించి గురువుగారితో చర్చించినదీ లేదు. (కనుక క్రింద వ్రాసినదంతా నా స్వకపోలపైత్యమేనన్న నిష్పూచీ ముందుగానే తెలియజేస్తున్నాను.) ఆ రెండు పాటలనూ ఒక దాని వెంబడి ఒకటిగా, విడివిడిగానే విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

హరి పాదాన…:

హరి పాదాన పుట్టావంటే గంగమ్మా…
శ్రీహరి పాదాన పుట్టావంటే గంగమ్మా…!
ఆ హిమగిరి పై అడుగెట్టావంటే గంగమ్మా…!
కడలి కౌగిలిని కఱిగావంటే గంగమ్మా…!
నీ రూపేదమ్మా, నీ రంగేదమ్మా?
నడిసంద్రంలో నీ గడపేదమ్మా, గంగమ్మా!?
నీలాల కన్నుల్లో సంద్రమే…,  హైలెస్సో! నింగి నీలమంతా సంద్రమే…, హైలెస్సో!

ప్రస్తుతానికి మకుటాన్ని వదిలేసి చూస్తే నాకు అర్థమైనది ఇది:

గంగమ్మ తల్లిని పూజించే ఒక బెస్త స్త్రీ ఆ గంగానది ప్రస్థానాన్ని శ్రీహరి పాదాల నుంచి సముద్రంలో కలిసే దాకా చెబుతూ… అంతర్లీనంగా జీవితంతో చేస్తున్న అన్వయం చూచాయగా తెలుస్తోంది. దేవుళ్ళు నివసించే చోట్ల (వైకుంఠం, కైలాసం) ప్రాణం పోసుకున్న గంగానది (కూడా) చివఱకి సముద్రంలో కలవక తప్పదు. అలా సముద్రంలో కలిసిన గంగానది సముద్రంలో ఎక్కడ ఉంది, దాని రంగు, రూపు ఏమిటంటే ఏమని చెప్పగలం? (ఇది యథాతథంగా జీవాత్మకి అన్వయించుకోవచ్చు. సముద్రం పరమాత్మ రూపమనీ అనుకోవచ్చు.)

…ఇప్పుడు రెండో పాట (పల్లవి వఱకూ) చూస్తే:

హైలెస్సో హైలెస్సో…:

హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా!
సూర్యుడైనా, సలవ సెంద్రుడైనా, కోటి సుక్కలైనా, అష్టదిక్కులైనా…
నువ్వైనా, ఆహఁ, నేనైనా, ఆహఁ, రేవైనా, ఆహఁ, నావైనా…
సంద్రాన మీనాల సందమే… హైలెస్సో హైలెస్సో హైలెస్సో హైలెస్సా!
నీలాల కన్నుల్లో సంద్రమే…, హైలెస్సో… హైలెస్సా!
నింగి నీలమంతా సంద్రమే…, హైలెస్సో… హైలెస్సా!
నేల కఱిగిపోతే సంద్రమే…, నీటిబొట్టు పెఱిగిపోతే సంద్రమే…!

సూర్యుడు, చంద్రుడు, తారలు, దిక్కులు, నువ్వు, నేను, రేవు, నావ …ఇవి బెస్తవానికి ఠక్కున గుర్తొచ్చే అంశాలు ప్రపంచంలో. ఇవన్నీ కూడా సముద్రంలో చేపల లాంటివే అని చెబుతున్నాడు. అంటే, సృష్టిలోని సమస్తమూ సముద్రమేనని చెప్పటం కనిపిస్తుంది. ఇక్కడ సముద్రమన్నది సకల చరాచర జగత్తుతో పోలికగా చెప్పిన మాట – బెస్తల జీవితంలోని భావోద్వేగాలన్నిటినీ తనలో యిముడ్చుకున్న విస్తృతి, ఆ జీవితానికి ఆదీ అంతమూ కూడా అయిన ఆకృతి. అన్నిటినీ సముద్రంలో చేపలతో పోల్చటంలో “సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే మరణిస్తాయి, సముద్రంలో నుంచి బయటపడినా మనుగడ లేదు” అన్నది అంతర్లీనంగా ఉన్న వేదాంతం. పైన చెప్పినవన్నీ కూడా సముద్రంలో చేపలే అయితే మఱి సముద్రమంటే యేమిటి, అదెలా వచ్చిందిట? (ఆ చేపల) నల్లని కళ్ళలో ఉన్నది సముద్రమే, నింగిలోని నీలమంతా కూడా సముద్రమేనట. అందుకనే ఆకాశంలో ఉండే సూర్యచంద్రులు, తారలు కూడా ఆ సముద్రంలోనే ఉన్నాయి. నేల మీద సముద్రాలలోని (నీటి) నీలమే నింగికి చేఱుతుంది, అక్కడి మబ్బులే క్రిందకి వస్తాయి. ఇది సాధారణార్థమే అయినా యిందులోనే సృష్టిలో సమతౌల్యత సాధించే చక్రభ్రమణం కూడా కనిపిస్తుంది. మనమున్న నేల కఱిగినా, ఒక చిన్న నీటిబొట్టు పెఱిగినా సముద్రమే. (ఈ అన్వయం యుగాంతానికి, ప్రళయానికి… అన్వయంలో మరణానికీ కూడా సూచన. ఇంకా వంద రకాలుగా అన్వయించుకోవచ్చు. మనం నమ్మిన నిజాలు కల్లలైనా, మనలో బాధలు మనల్నే ముంచెత్తినా సముద్రమే అవుతుందని… వగైరా.) మన భావోద్వేగాలతో మనమే సముద్రాన్ని సృష్టిస్తున్నాము. (అంటే యీ సముద్రం మన మనస్సుల్లోనే ఉంది.) మనకున్న ఆధారం తొలగిపోయినా (నేల కఱిగిపోతే) సముద్రం ఉంటుంది, మన భావోద్వేగాలకు నిలయమైన మనస్సు విస్తృతమయినా సముద్రం అవుతుంది.

“ఏది యేమైనా సముద్రమే మిగులుతుంది” అని చెప్పటం బృహదారణ్యకోపనిషత్, ఈశోపనిషత్తులలో కనిపించే శాంతిమంత్రాన్ని గుర్తు చేస్తుంది: ఓమ్ పూర్ణమదః పూర్ణమిదమ్ పూర్ణాత్పూర్ణముదచ్యతే । పూర్ణస్య పూర్ణమాదాయమ్ పూర్ణమేవఽవశిష్యతే ॥ (పూర్ణం అక్కడా ఉంది, పూర్ణం యిక్కడా ఉంది. పూర్ణం నుంచి పూర్ణమే పుడుతుంది. పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసివేస్తే మిగిలేది కూడా పూర్ణమే.) ఆ పూర్ణమే దైవమని, సకలజగదాధారమని, సృష్టికి మూలమని చెబుతారు. ఇక్కడ సాకల్యమైన (entirety/wholeness) సముద్రం యీ “పూర్ణం” అనే అనిపిస్తూంది. సముద్రంలో చేపల్లా ఉన్న మనం “నీలాల కన్నుల్లో” (“నీటిబొట్టు పెఱిగిపోతె”) సృష్టించేదీ సముద్రమే, “నింగి నీలమంతా” (“నేల కఱిగిపోతె” ఉండే శూన్యమంతా – అంటే ఆకాశమంతా) కూడా సముద్రమే. సముద్రంలో నుంచి సముద్రం పుడుతూ సముద్రంలో నుంచి సముద్రాన్ని తీసేసినా (నేలను ఉన్న సముద్రం నింగిని చేఱినా) ఉండేది సముద్రమే. (పైన చెప్పుకున్నట్టు నేలను ఉన్న సముద్రమంటే సముద్రంలో చేపలా సముద్రంతో మమేకమైన జీవాత్మ, నింగిలో ఉన్న నీలమంటే పరమాత్మ కావచ్చు. సూర్య-చంద్ర-తారా-దిశలను కూడా పోల్చటం చూస్తే సాకార/సాపేక్ష రూపమైన సృష్టి, నిరాకారరూపుడైన పరమాత్మ అని అన్వయించుకోవటం సముచితమేమో.)

కనుక ఒక్క ముక్కలో చెప్పాలంటే సమస్తజగదాధారమైన పూర్ణత్వాన్ని గుఱించి చెప్పబడిన ఉపనిషద్వాక్యాన్ని అయిదే అయిదు మాటల్లో చెప్పారని తెలుస్తుంది. ఆ అయిదు మాటల వివరాన్ని యింత విస్తారంగా చెప్పవలసిరావటం నాలోని పామరత్వానికి ప్రతీకగా గ్రహింపు కలుగుతోంది.

(షరా: ఇక్కడ నీలమంటే blue, black కూడా. దురదృష్టవశాత్ రెండు రంగులకీ పేరొకటే. అందుకే మన “నీలమేఘశ్యాముడు” రాముడైనా కృష్ణుడైనా “ఈనా బ్లూ కలరేనా?” అన్నట్టు తయారైంది మన పరిస్థితి.)

గీతగర్భితం (Interlude):

Life is a holiday, jolly day …హాయ్‌లో హైలెస్సా!
Spend it away in a fabulous way …హాయ్‌లో హైలెస్సా!
You, need a break boy? Don’t think that way!
 (?)
It’s a piece of cake …హాయ్‌లో హైలెస్సా! హాయ్‌లో హైలెస్సా!
Twinkle little star, I know what you are
జానే భీ దో యార్, గోలీ తో మార్!
హైలెస్స హైలెస్సా… Life is a తమాషా!
You sing it, హమేషా! …I don’t know సా-పా-సా!

బెస్తవాడి పాటలోని ఊపు, ఉల్లాసం మాత్రం ముచ్చట గొలపగా ఒకమ్మాయి యేవో లొల్లాయి పదాల్లా పాడే పై పంక్తులు కూడా (నాకయితే) పూర్తిగా వేదాంతపరంగానే కనిపిస్తాయి. “జీవితం అంటే ఒక సెలవు రోజులా అద్భుతంగా గడపాలి – అప్పుడప్పుడూ విసుగొచ్చి “ఈ జీవితం వద్దురా బాబూ!” అనిపించినా నల్లేరు మీద బండి నడక లాంటిదే జీవితం – మనమేంటో మనకు తెలిస్తే కష్టాలకి చెల్లుచీటీ యిచ్చేసినట్టే – జీవితమనే తమాషాని నువ్వు అనునిత్యం పాటలా పాడుతూనే ఉంటావు – కానీ నాకేమో మొదటి మెట్టు కూడా తెలియదు!” – స్థూలంగా యిదీ ఆ పంక్తుల్లో ఉన్న భావం. ఆ బెస్తవాని జోరు చూసి అచ్చెరువొందినట్టు పాడినట్టు పైకి కనిపిస్తూనే… ఆ బెస్తవాడు అప్పటికే (పల్లవిలో) చెప్పిన వేదాంతంలోని లోతును గ్రహించి “నింగిలో చుక్క లాంటి నువ్వేంటో నాకు తెలుసు… కష్టాలన్నీ త్రోసి రాజని జీవితాన్ని యెప్పుడూ తమాషాగా పాడెయ్యగలవు… నాకలా చేత కాదు!” అంటూ అతని కర్మయోగానికి అర్థం చేసుకున్న దీటైన అంతరార్థమూ కనిపిస్తుంది (నాకు).

ఉపసంహారం (Epilogue):

ఈ సందర్భంలో యిదే చిత్రంలోని (వేటూరి గారి) మఱో పాటలో పంక్తులు గుర్తు రాక మానవు:

చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి, చివఱికా కావేరి కడలి దేవేరి
కడలిలో వెతకొద్దు కావేరి నీరు, కడుపులో వెత కొద్ది కన్నీరు కాఱు!

వేటూరి గారు వ్రాసిన యీ పాటలో కూడా అలతి పదాల్లో అద్భుతమయిన విషయాన్ని చెప్పటం కనిపిస్తుంది. శ్రీయుతులు వేటూరి, సీతారామశాస్త్రి గార్లలో ముందుగా యెవఱు వ్రాసారో నాకు తెలియదు కానీ హరి పాదాన… అన్న పాట, ఇదీ చూస్తే యిద్దఱూ ఒకే ఆలోచనాసరళి/ఉద్దేశ్యంతో వ్రాసినట్టు అనిపిస్తుంది నాకు. కానీ, ఒకవేళ సీతారామశాస్త్రి గారు ముందుగా వ్రాసి ఉండినా గానీ – “ఉద్దండుల భుజస్కంధాల మీద నిలబడి ప్రపంచాన్ని చూస్తున్నాము కనుక మనము మన పూర్వుల కన్నా యెక్కువ దూరం చూడగలము” అని న్యూటన్ చెప్పినట్టు – శాస్త్రి గారికి గురుతుల్యులైన శ్రీ వేటూరి గారు నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన – ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన! వంటి వేదాంతాన్ని యెప్పుడో వెలువరించి శాస్త్రి గారి లాంటి తఱువాతి తరం కవులకు దాఱి చూపించారని మఱచిపోరాదు. వేదాంతసారం నింపుకున్న పంక్తులనెన్నిటినో వ్రాసిన ఆత్రేయ గారు తనకి గురుతుల్యులని వేటూరి గారు అనటమూ మనకు తెలిసినదే! (వీరిద్దఱి పాటలకూ కాస్తయినా పోలిక కనిపించటం దర్శకుడు విశ్వనాథ్ ప్రభావం వలన కూడా కావచ్చు. ఆయన చిత్రాల్లో గమనిస్తే ముఖ్యమైన పాత్రల్లో లేదా ఆయా పాత్రల తీరుతెన్నుల్లో వచ్చిన మార్పుని సాహిత్యంతోనో సన్నివేశంతోనో అద్దం పట్టటమన్నది మనకు తఱచుగానే కనబడుతుంది. స్వర్ణకమలం చిత్రంలోని ఘల్లుఘల్లుఘల్లుమంటు…కొత్తగా ఱెక్కలొచ్చెనా… అన్న పాటలు చూస్తే మొదటి పాటలో వలలో ఒదుగునా విహరించే చిఱుగాలి? అని ప్రశ్నించిన కథానాయిక ఎదిఱించిన సుడిగాలిని జయించి… ఆనందపు గాలివాలు తనని నడిపించాలని (శివపూజకు… అన్న పాటలో) కోరుకుని, వెదురులోకి ఒదిగింది కుదుఱు లేని గాలి అంటూ ఒద్దికగా పలుకుతుంది రెండో పాటలో. సాగరసంగమం చిత్రంలో కూడా – శరత్‌బాబు గతచిత్రణలో (flashback) – తాగుబోతు నాట్యగురువైన మిశ్రోని తిట్టిన కమల్‌హాసన్ వర్తమానంలోకి వచ్చేసరికి తప్పతాగిన స్థితిలో దగ్గటం చూపిస్తారు, చిత్రం చివర్లో శైలజకి నాట్యం నేర్పాలన్న పట్టుదల కలిగినప్పుడు కమల్‌హాసన్ తాగుడు మానేసినట్టు చూపిస్తారు. అంటే తాగుడుకీ, నాట్యాచార్య వృత్తికీ గౌరవప్రదమైన దూరమే ఉంది అతని దృష్టిలో యింకా – పూర్తిగా భ్రష్టుడయిపోలేదు కనుక యింకా నేర్పగల స్థితిలోనే ఉన్నాడు …అన్నది అంతఃసూత్రం.)

                                                                                                                                                                                                                                                                      –     నచకి (NaChaKi)

15 Comments
  1. జ్యోతి August 5, 2011 /
    • నచకి August 6, 2011 /
      • నచకి August 6, 2011 /
  2. కిరణ్ August 5, 2011 /
    • నచకి August 6, 2011 /
    • నచకి August 6, 2011 /
      • నచకి August 6, 2011 /
  3. ashok August 8, 2011 /
    • రామ August 9, 2011 /
      • నచకి August 9, 2011 /
    • NaChaKi August 9, 2011 /
  4. Mohan ram prasad August 9, 2011 /
  5. Mohan ram prasad August 9, 2011 /