Menu

వేలాది ‘ పూరో’ ల వేదన ఒక ‘ పింజర్’!

ఆధునిక భారత దేశ చరిత్ర లో ‘ దేశ విభజన’ అనేది ఎప్పుడు తలుచుకున్నా హృదయాన్ని బద్దలు చేసే సమయం, సందర్భం, సన్నివేశం.అప్పటి రక్తపాతం, హింస తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుట్టించే భయానక దుస్వప్నం. లక్షలాది మంది చనిపోయారు. లక్షలాది మంది స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. మనసుని దుఃఖంతో మెలిపెట్టే ఆ జ్నాపకాలు ఇండియా, పాకిస్తాన్ కి చెందిన ఏ ఒక్కరూ ఎప్పటికీ మరిచిపోలేని కఠిన వాస్తవం. మానవత్వం సిగ్గుతో తలదించుకున్న క్షణాలు అవి. ఒకరినొకరు చంపుకున్నారు. ఒకరిపై మరొకరు అత్యాచారాలు చేసుకున్నారు. ఒకరినొకరు దోచుకున్నారు. ఇవన్నీ ఎందుకు జరిగాయో, ఎందుకు జరగవలసి వచ్చాయో ఒకొక్కరూ ఒక్కో కారణం చెప్పారు.ఒకరు రాజకీయ ప్రయోజనాలు కారణమన్నారు, మరొకరు మతపరమైన విభేదాలు కారణమన్నారు. ఇంకొకరు బ్రిటీష్ వాడు కారణమన్నారు. ఎవరికి వారు ఎదుటివారే దీనికి కారణమని ఆరోపించుకున్నారు. ఈ విషాద సందర్భం మీద పుస్తకాలు రాశారు. సినిమాలు తీశారు. వీటిల్లో అందరి మన్ననలు పొందినది, వాస్తవికతకు బాగా దగ్గరగా వున్నది, నాకు నచ్చినది జ్ఞానపీఠ్ అవార్డ్ ను అందుకున్న తొలి మహిళ, రచయిత్రి,, కవయిత్రి అమృతా ప్రీతం కలం నుంచి వెలువడ్డ నవల ‘ పింజర్’ .

ఒక శరణార్థి గా, దేశ విభజన బాధితురాలిగా ఆమె 1950లోనే ఈ నవల రాశారు.ఈ నవలను కుష్వంత్ సింగ్ ఇంగ్లీష్ లోకి ” The Skeleton” గా అనువదించారు. పింజర్ అంటే అస్థిపంజరం. నవల వచ్చిన 50 ఏళ్ళకు గాని ఈ నవలను సినిమా గా తీసే ప్రయత్నం మొదలు కాలేదు. పింజర్ ని డా. చంద్రప్రకాష్ ద్వివేది అదే పేరు తో సినిమా గా మలిచారు. 2003 లో ఈ సినిమా విడుదలయింది. సినిమా గా తీయటానికి ఎక్కువ జాప్యం జరిగినా సరైన దర్శకుడి చేతిలో ఈ నవల ఒక దృశ్య కావ్యంగా రూపు దిద్దుకుంది. బుల్లి తెర మీద ‘ చాణుక్య ‘ లాంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న చంద్రప్రకాష్ తొలి సారిగా బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమా కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కి స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాసుకున్నారు. డైలాగులు మాత్రం అమృతా ప్రీతం, చంద్ర ప్రకాష్ ద్వివేది ఇద్దరూ రాశారు. మూడు గంటలకు పైగా సాగే ఈ సినిమా లో ఒక్క డైలాగ్ కూడా అనవసరం అనిపించదు.

చూస్తున్నంత సేపే కాదు, ఆ తర్వాత కూడా మనసు ని మెలిపెట్టి బాధతో నలిపేసే సినిమా ఇది . మాడిసన్ లో వున్నప్పుడు మొదటి సారి ఈ సినిమా 2004 లోనో, అయిదు లోనో చూశాను.’ పింజర్’ సినిమా మొన్న రెండో సారి నెట్ ఫ్లిక్స్ లో తెప్పించుకొని చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ కన్నీళ్లు పెట్టించింది .

ఒక సాధారణ పంజాబీ అమ్మాయి వైపు నుంచి ఈ కథ నడుస్తుంది. ఈ నవలను రాసింది ఒక మహిళ. ప్రధాన పాత్రధారి మహిళ. అంతమాత్రానా ఇది కేవలం స్త్రీల కథ కాదు. స్త్రీల కోసం మాత్రమే తీసిన సినిమా కాదు. పింజర్ లో ప్రధాన పాత్రధారి ‘పూరో’ అనిపిస్తుంది కానీ ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకంగా నిలుస్తుంది. కథ మొత్తం ‘ పూరో’ ( ఊర్మిళా మటోండ్కర్) జీవితం చుట్టూ నడిచినా , ఆమె జీవితం చుట్టూ అల్లుకున్న పురుష పాత్రలు కూడా అంతే ప్రధానమైనవన్న సంగతి సినిమా చూస్తున్నంత సేపూ మన మనసుకు అర్థమవుతూనే ఉంటుంది. ఇందులో పూరో, లాజో ల బాధ ప్రధానంగా గుర్తించదగ్గది, పట్టించుకోదగ్గది. అయితే ఇక్కడ’ పూరో’ ని దేశానికి ప్రతీక గా చూడాలి. ఆమె ను బలవంతంగా ఎత్తుకెళ్లడం, వేరే గత్యంతరం లేక జరిగినఆమె పెళ్ళి, ఆమె ఇష్టాయిష్టాలకు అతీతం గా ఆమె తల్లి అయిన విధానం వీటన్నింటిని అవిభక్త భారత దేశానికి జరిగిన మార్పులుగా కూడా చూడవచ్చు.

పూరో బాధ వేరు, రషీద్ వేదన వేరు. రామచంద్ర ఎదురుచూపులు వేరు. చెల్లెలు కోసం అన్న గా త్రిలోక్ పడే బాధ వేరు. చెల్లెలు కోసం అన్న గా బాధపడటం తప్ప భార్య గా తన బాధను గుర్తించటం లేదన్న లజ్జో దుఖం వేరు. అందరి బాధలు పైకి చూడటానికి వేర్వేరుగా కనిపించినా ఆ బాధలకు, భారత దేశానికి ఒక అంతఃసూత్రం వుంది. రెండు ముక్కలు గా, రెండుదేశాలుగా విభజనకు గురైన విషాదం ఉంది. రెండు దేశాల సరిహద్దు రేఖ చుట్టూ చెలరేగిన మారణకాండ, మత అల్లర్లు వున్నాయి.

దేశ విభజన కు ఒక ఏడాది ముందు అంటే 1946 లో ఈ కథ మొదలవుతుంది. 1946 నుంచి 1948 వరకూ పూరో జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో , దానికి విధి, పరిస్థితులు, దేశ విభజన నాటి సంఘటనలు ఎలా కారణమయ్యాయో తెర మీద చూస్తున్నప్పుడు కళ్ల నీళ్ళు రాకమానవు. నిజానికి ఇక్కడ పూరో కేవలం ఒక స్త్రీ పాత్ర మాత్రమే కాదు. భారత మాత కి ఆమె ఓ సంకేతం. జరిగిన వాటిల్లో దేనిలోనూ ఆమె తప్పు లేదు. కానీ జరిగిన వాటికి ఆమె బాధితురాలు.

తన కలల రాకుమారుడు ‘ రామ్ చంద్’ తో పెళ్లి జరగబోతోందన్న సంతోషంతో ‘ పూరో’ వున్నప్పుడు ‘ రషీద్’ ఆమె ను గుర్రం మీద వచ్చి ఎత్తుకుపోతాడు. పది రోజులు తన దగ్గర రహస్యంగా అట్టి పెట్టుకున్నాక , ఎలాగో ఒక రోజు రాత్రి రషీద్ నుంచి తప్పించుకొని తన ఇంటికి వెళ్తుంది పూరో. ” ఇంత జరిగాక ఇప్పుడు నీకంటూ ఒక మతం లేదు, ఒక పుట్టుకహక్కు కూడా లేదు. నువ్వు పుట్టినప్పుడే చచ్చిపోయి ఉంటే బావుండేది. ఈ కుటుంబం క్షేమంగా ఉండాలంటే , సమాజం లో ఈ కుటుంబ గౌరవం నిలిచి ఉందాలంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవటమే మంచిద”ని చెప్తారు తల్లితండ్రులు. తెలిసొ, తెలియకో తప్పులు జరిగాక పుట్టింటికి తిరిగి వెళ్ళిన ఎందరో ఆడపిల్లకు ఇలాంటి అనుభవమే ఎదురవుందన్నది కఠోర సత్యం. జరిగిన దాంట్లో తన తప్పేమీ లేకపోయినా కుటుంబం నిరాకరించేటప్పటికి గత్యంతరం లేని పరిస్థితుల్లో తిరిగి రషీద్ దగ్గరకు వెళ్ళి అతనితో పెళ్లి కి ఒప్పుకుంటుంది పూరో.
అక్కడితో ఆమె కథ ముగియలేదు. ఆ తర్వాత జరగబోయే సంఘటనలకు అదొక ప్రారంభం. పుట్టిన దగ్గర నుంచి ఒక పంజాబీ సిక్కు యువతిగా బతికిన పూరో , చేతి మీద పచ్చబొట్టు సాక్షిగా ‘ హామీదా’ గా మారిపోతుంది. గర్భవతి అవుతుంది. కానీ ఆ గర్భాన్ని రషీద్ చేసిన పాపాలకు ప్రతిరూపంగానే చూస్తుంది పూరో. ఆ గర్భం కూడా నిలవదు. వూర్లో ఒక పిచ్చిది పిల్లాడి ని ప్రసవించి చనిపోతే పూరో ఆ బిడ్డ ను తీసుకొచ్చి పాలిచ్చి పెంచుకుంటుండగా వూర్లో హిందువులకు ఆ బిడ్డ హిందువుల బిడ్డ అని గుర్తొస్తుంది. బలవంతంగా ఆ బిడ్డ ను ఆమె నుంచి లాక్కుంటారు.

హామీదా గా మారినప్పటికీ పూరో మనసు లోంచి తన జీవిత భాగస్వామి కావల్సిన రామ్ చంద్ స్మృతి చెరిగిపోదు. పూరో అదృశ్యమైపోయినా అక్కడ రామ్ చంద్ తన జానకి కోసం తనకు తాను విధించుకున్న వనవాస ప్రవాసాన్ని అనుభవిస్తుంటాడు. కుటుంబం దృష్టి లో పూరో చచ్చిన దానితో సమానం. పూరో స్థానం లో ఆమె చెల్లెలు పెళ్ళికూతురవుతుంది. ప్రాణాతిప్రాణంగా ప్రేమించే తన చెల్లెలు కనిపించకుండా పోతే పూరో అన్న త్రిలోక్ కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటానికి కుటుంబం అంగీకరించదు. రామ్ చంద్ చెల్లెలిని త్రిలోక్ పెళ్లి చేసుకుంటాడు కానీ అతని మనసు నిండా చెల్లెలి కోసం బాధ నే నిండి ఉంటుంది. అటు రామ్ చంద్, ఇటు త్రిలోక్ ఇద్దరూ పూరో కోసం వెతుకుతూనే వుంటారు.

అక్కడ హామీదా గా మారిన పూరో మనసు తన కుటుంబం కోసం ఆలోచిస్తూ నే వుంటుంది.’ చచ్చిన వాళ్ళను కూడా ఏడాదికోకసారి తల్చుకుంటారు.కానీ కనీసం నన్ను చచ్చిన దాని కింద కూడా లెక్క వేయటం లేదా ?’ అనుకుంటుంది పూరో.

ఇంతలో దేశవిభజన ఘట్టం జరుగుతుంది. అప్పటి దాకా పచ్చపచ్చగా వున్న పంజాబ్ నేల నెత్తురుతో తడుస్తుంది. నిన్నటి దాకా పంజాబ్ గా పిలవబడ్డ నేల రాత్రికి రాత్రి కొత్త దేశం పాకిస్తాన్ గా మారిపోతుంది. హిందువులు, ముస్లిములు మత పరం గా దేశాల్ని ఎంపిక చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పక్కింటి ముస్లిం స్నేహితులు పొరుగు దేశం పాకిస్తాన్ వాళ్ళు గా మారిపోతారు. ఎదురింటి హిందువులు పక్క దేశం ఇండియా వాసులైపోతారు. హామీదా గా మారిన పూరో పాకిస్తాన్ నివాసి అవుతుంది. పూరో కుటుంబం ఇండియా లో మిగిలిపోతుంది. ఈ దుర్ఘటనల మధ్య పూరో వదిన లాజో ని పాకిస్తాన్ కి చెందిన ఒక ఆందోళనకారుడు బలవంతంగా ఎత్తుకుపోయి ఆమె ను, ఆమె ఇంటిని ఆక్రమించుకుంటాడు. పాకిస్తాన్ నుంచి ఇండియా కి వలస వెళ్తున్న శరణార్థుల్లో రామ్ చంద్ ను కలుసుకున్న పూరో కి లాజో విషయం తెలుస్తుంది. రషీద్ సహాయం తో లాజో ని అక్కడి నుంచి తప్పించి సరిహద్దు దగ్గరకు తీసుకొస్తుంది పూరో. ఎంతో కాలం తర్వాత అక్కడ అన్న త్రిలోక్ ని చూస్తుంది పూరో. లాజో ని అన్న దగ్గరకు పంపించగలుగుతుంది. పూరో ని స్వీకరించి తిరిగి పెళ్లాడటానికి రామ్ చంద్ కూడా సిద్ధంగా ఉంటాడు. తన వల్ల జరిగిన తప్పుకు క్షమాపణ అడిగి పూరో ని ఆమె కుటుంబం దగ్గరకు పంపించి వేయటానికి రషీద్ కూడా అంగీకరిస్తాడు. మరి పూరో జీవితం చివరకు సుఖాంతమయిందా? అన్నది క్లైమాక్స్. పూరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది అన్నది తెర మీదనే చూసి తెలుసుకోవటం బావుంటుంది.
అసలు ఏ జీవితానికైనా సుఖాంతమనేది ఒకటుంటుందా? మరీ ముఖ్యం గా పూరో లాంటి జీవితానుభవాలకు ?
దేశ విభజన సమయం లో లాహోర్ నుంచి డిల్లీ కి వచ్చిన ఒక శరణార్థిగా, దేశ విభజన బాధితురాలిగా అమృతా ప్రీతం రాసిన ఈ అద్భుతమైన నవల ను అంత అద్భుతంగా తెరకెక్కించటం లో చంద్ర ప్రకాష్ లో విజయం సాధించాడు. దేశ విభజన సమయం లో జరిగిన సంఘటనలను వాస్తవికంగానూ, సున్నితంగానూ తెరకెక్కించగలిగారు.ఆ గొప్పతనం అమృతా రాసిన కథ లోదే అయినా, చిత్రీకరణ లోనూ, పాత్రల ఎంపిక లోనూ , సినిమాటోగ్రఫీ లోనూ, ముఖ్యం గా సంభాషణల్లోనూ దర్శకుడి ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఏ మతం పట్ల ప్రత్యేక పక్షపాతం కనిపించదు. ఎవరినీ అనవసరంగా దుమ్మెత్తిపోయటం లేశ మాత్రం కనిపించదు. స్త్రీరియో టైప్ పాత్రలకు విభిన్నంగా ఉంటాయి ‘పింజర్’ లోని పాత్రలు. కృష్ణ వంశీ సినిమాల్లో లాగా దేశ భక్తి అంటే ఆవేశ పూరితమైన ప్రసంగాలుండవు. కేవలం ఏం జరిగిందో మాత్రం చెప్తుంది సినిమా . ఆ చెప్పేదానికి ఎలాంటి ‘ గూఢార్థాలు, వ్యంగ ధ్వనులు’ ఉండవు. దాదాపు 8 నెలల కాలంలో కనీసం వంద సార్లు ఈ నవలను చదివాడు దర్శకుడు. ఈ సినిమా ను అంత సీరియస్ గా తీసుకోగలిగాడు కాబట్టే చంద్ర ప్రకాష్ నవల లోని ఏ ముఖ్య మైన సన్నివేశాన్ని వదిలి పెట్టలేదు.

పూరో పాత్ర కు ఊర్మిళ ను ఎంపిక చేసుకోవటం లోనే దర్శకుడి ప్రతిభ అర్థమైపోతూ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలో కనిపించిన ఊర్మిళ వేరు. పింజర్ లో పూరో గా ఊర్మిళ నటన వేరు. పంజాబీ అమ్మాయి పాత్రలో నిండైన దుస్తుల్లో చక్కగా సహజంగా ఒదిగిపోయింది ఊర్మిళ. ఒకటి రెండు సీన్ లలో తప్ప ఎక్కడా ఊర్మిళ ని మనం గుర్తు పట్టలేము. కేవలం మన పూరో గానే ఆమె కనిపిస్తుంది. రషీద్ గా ప్రకాష్ బాజ్ పాయ్ పాత్ర ఎంత అద్భుతంగా ఉందో, అతని నటన, రామ్ చంద్ గా సంజయ్ సూరి నటన కూడాఅంత చక్కగా ఉంది. గుల్జార్ పాటలు బావున్నాయి.సంతోష్ తుండియల్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణాల్లో ఒకటి గా చెప్పుకోవచ్చు.
నవల లోని ఏ ముఖ్యమైన సన్నివేశాన్ని వదలకుండా తెరకెక్కించటం వల్లనే ఈ సినిమా మూడు గంటలకు పైగానే సాగుతుంది. ఈ సినిమా లో లోపాలు అసలు లేవని కాదు. కాకపోతే అవి చిన్న చిన్న లోపాలు ( లాస్ట్ వైస్ రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ పెళ్లి ) అవి పెద్దగా పట్టించుకొదగ్గవి కావు. ఇంటర్వెల్ తర్వాత ఒకటి రెండు సన్నివేశాల్లో కొంత కథ ను లాగినట్లు అనిపించినా మనల్ని తెర ముందు నుంచి పక్కకు వెళ్ళేలా మాత్రం చేయవు. ఇక కన్నీళ్లు పెట్టించే మెలోడ్రామా గురించి…ఆవేశం తో పూనకం తెప్పించే ‘అమ్మోరు’ లాంటి మహిళా చిత్రాల కన్నా నిజమైన కన్నీళ్లు పెట్టించగలిగె ,జీవితానికి అవసరమైన మెలోడ్రామా ఇది అనినేననుకుంటాను .

ఇందులో పూరో, లాజో ల పాత్ర చిత్రణ గురించి ఎంతో రాయాల్సి ఉంది. అయితే అది సినిమా పరిధి కిందకు రాకపోవచ్చు. నవల లో పాత్రలుగా విశ్లేషించాల్సి ఉంటుంది. దేశ విభజన కు ముందు పూరో జీవితం నాశనమవుతుంది.లాజో జీవితం దేశ విభజన తర్వాత ధ్వంసం అవుతుంది. చెల్లెలు పూరో కోసం త్రిలోక్ బాధపడుతుంటే భార్య లాజో జరిగినది నువ్వెలాగు మార్చలేవు. జీవితం సాగిపోవాల్సిందే. ఇక ఆ విషయం వదిలి పెట్టేయమని చెప్తుంది. కానీ పూరో ఎదుర్కొన్న జీవితానుభవం లాంటిదే లాజో కి కూడా జరిగితే కానీ అందులోని వేదన ఆమె కు నిజంగా అర్థం కాలేదు. ఇక తన జీవితం ఆ పాకిస్తాన్ లోనే మిగిలిపోయిందని, తానెప్పటికీ భర్త దగ్గరకు వెళ్లలేనని లాజో అనుకున్నా, జరిగినది మన ఖర్మ , ఇక ఇంతేలే అని పూరో అనుకొని వూరుకోలేదు. తనకు జరిగిన దుఃఖం నుంచి తన వదిన ను అర్థం చేసుకొని ఆమె జీవితాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసి అందులో సఫలమయింది. ఆమె ను తిరిగి తన కుటుంబం దగ్గరకు చెర్పించగలిగింది.తన జీవితం లో జరిగిన సంఘటనల నుండి పూరో ఎంతో నేర్చుకుంది. రషీద్ తప్పులను క్షమించగలిగింది. అతని మనసు లో తన మీదున్న ప్రేమ ను అర్థం చేసుకోగలిగింది. తన జీవితం ఎక్కడ ముడిపడి ఉందో అన్న సత్యాన్ని దర్శించగలిగింది.

చిత్రం చూశాక కొన్ని రోజుల పాటు మనం మామూలు స్థితి లోకి రాలేము. వేలాది మంది పూరోల కోసం కన్నీళ్ళు లోపల నుంచి ఉబికి వస్తూనే వుంటాయి. మనసంతా వేదనగా మిగిలిపోతుంది. ఆ కన్నీళ్లను, ఆ దుఃఖాన్ని అక్షరాల్లోకి, మరీ ముఖ్యం గా సమీక్ష లోకి అనువదించటం నాకు చేతకాలేదని చెప్పటానికి నేనేమీ సిగ్గు పడటం లేదు. తప్పని సరిగా చూడాల్సిన సినిమా , చదవాల్సిన నవల అని మాత్రం చెప్పగలను.

దర్శకుడు చంద్ర ప్రకాష్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పినట్లు మనం ఎవ్వరమూ ఆ దేశ విభజన సమయం లో పుట్టలేదు. కనీసం మనం పంజాబ్ లోనో, బెంగాల్ లోనో కూడా లేము.అయినా సరే, ఆ ఘట్టం తో మనందరి జీవితాలు ముడిపడి వున్నాయి. దేశ విభజన ఇప్పుడు మనకు గతం మాత్రమే కాదు. అది మన వర్తమానం. రేపటి భవిష్యత్తు కూడా. అందుకోసం అందరూ ఈ సినిమా చూడాల్సిందే. ఇందులోని విషయాల గురించి ఆలోచించాల్సిందే. దేశ విభజన అనే గాయం ఇప్పుడిప్పుడే మానేది కాదు. అసలేప్పటికైనా మానుతుందో లేదో కూడా ప్రశ్నార్థకమే!

కల్పనారెంటాల
www.kalpanarentala.blogspot.com

పి.ఎస్.: ఈ సినిమా తీయటం లో అనేక రకాలుగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి డా.చంద్రప్రకాష్ ద్వివేది ఇంటర్వ్యూ ఇక్కడ చదవండి

9 Comments
  1. Kalpana August 15, 2011 /
  2. Sharath Chandra August 16, 2011 /
  3. kalpana August 16, 2011 /
  4. శారద August 17, 2011 /
  5. kalpana August 17, 2011 /
  6. Venkat August 18, 2011 /
  7. Kalpana August 18, 2011 /
  8. kishore August 21, 2011 /
  9. kalpana September 3, 2011 /