Menu

ఇద్దరు ప్రేమికులు చేసిన ఒక మర్డర్ కథ : నాట్ ఎ లవ్ స్టోరీ

“కోయీ ఖుద్ సె బురా నహీ హోతా,పల్ తో కిసీకా సగా నహీ హోతా” అనేది రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమాలోని పాట సాహిత్యం. తెలుగులో చెప్పాలంటే ‘మనంత చెడ్డ మరెవరూ కారు, ఆ క్షణం ఎవడబ్బ సొత్తూ కాదు’ అని. అదే ఈ సినిమా కథ కూడా.

అనుకోని క్షణంలో జరిగే ఒక ఘటన ఇద్దర్ని హంతకుల్ని చేస్తే మరొహరిని హతుడిని చేస్తుంది. ప్రేమికులు హంతకులైతే, ఒక హితుడు, స్నేహితుడు హతుడిగా మిగులుతాడు. ఎవరికీ సొంతంకాని ఆ క్షణం ఎలా సంభవించింది? మంచిగా ఉన్న మనుషులే రాక్షసులయ్యే ఘటన ఎలా జరిగింది? చివరికి ఆ ప్రేమికులు ఏమయ్యారు? అనేదే ఈ సినిమా. ఇంతకు మించి కథ చెబితే ఉన్న(ఉన్నదే తక్కువ) కిక్కు పోతుంది.

మాహి గిల్, దీపక్ దోబ్రియాల్ నటన ఆకట్టుకుంటుంది. నిజానికి రాంగోపాల్ వర్మ కోసం సినిమాలు చూసే నేను మొట్టమొదటిసారిగా ఎవరో మాహి గిల్ నటన బాగుందంటే ‘దేవ్ డి’తో ఇంప్రెస్ చేసిన తన నటనచూడ్డానికి ఈ సినిమాకి వెళ్ళాను. She didn’t disappoint. కాకపోతే ద్వితీయార్థంలో కథ అయిపోయిన తరువాత సాగిన కొంత సాగదీతలో తన నటనా బోర్ కొట్టింది. మళ్ళీ క్లైమాక్స్ సీన్ తో ఆకట్టుకుంది. దీపక్ నటన కూడా పోటాపోటీగా ఉంది.

5D Mark II కెమెరాతో తీసిన సినిమా అయినా క్వాలిటీ పరంగా చాలా బాగుంది. అయితే, చిత్రమైన క్యామెరా కోణాలూ, మరీవిచిత్రమైన (అప్పుడప్పుడూ అసహ్యమైన) యాంగిల్సూ distract చేస్తాయి. సందీప్ చౌతా సంగీతం ఫరవాలేదు. గుర్తుపెట్టుకోదగ్గది కాదు.

ఈ సినిమా రాంగోపాల్ వర్మ కాకుండా ఎవరైనా కొత్త దర్శకుడు చేసుంటే ఖచ్చితంగా అభినందించొచ్చు. కానీ తీసింది రాంగోపాల్ వర్మ కాబట్టి ఓకే, ఫరవాలేదు, అతడు తియ్యాల్సిన సినిమా కాదు అని చెప్పొచ్చు. బహుశా అందుకే తీశాడేమో! సినిమా శీర్షిక నాట్ ఎ లవ్ స్టోరీ అని చెప్పినా, చివరికొచ్చేసరికీ ఇది ప్రేమకథే అని కూడా మనచేత అనిపిస్తాడు ఈ మహానుభావుడు.Anything is possible with RGV.

5D Mark II కెమెరాతో ఏమైనా చెయ్యొచ్చు అనే విషయం చూడ్డానికైతే వెళ్ళండి. కొంత గుండే దిటవు చేసుకుని లేదా కొరియన్ సినిమాలలోని హింసాత్మకదృశ్యాల్ని చూసే అలవాటు ఉంటే చూడండి. రాంగోపాల్ వర్మ సినిమా కదా చూద్దాం అనుకుంటే చూడండి. మాహి గిల్ మీదా నాలాగా కొంచెం అభిమానం ఉంటే ప్రయత్నించండి. అంతకు మించి ఈ సినిమాలో చూసి ఆనందించడానికి ఏమీలేదు. చల్లటి వర్షాకాలపు సాయంత్రం లేదా వీకెండ్ హాయిగా ఏదైనా సినిమాకి వెల్దాం అనుకుంటే మాత్రం ఇది ప్రోత్సహించదగ్గ ఛాయ్స్ కాదు.

4 Comments
  1. Indian Minerva August 25, 2011 /
  2. kishore August 27, 2011 /
  3. Sowmya September 13, 2011 /
  4. రాజశేఖర్ September 14, 2011 /