Menu

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- పథేర్ పాంచాలి

మొదటి రెండు సంవత్సరాల పాటు అవార్డులు వచ్చిన సినిమాల సంగతి ఒక ఎత్తైతే ఆ తర్వాత 1956 లో భారత ప్రభుత్వం ప్రకటించిన మూడవ జాతీయ అవార్డులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరంలోనే ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రూపొందించిన తొలి చిత్రం “పథేర్ పంచాలి” జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది.

గతంలో ఇచ్చిన అవార్డులన్నీ కూడా కథా ప్రధానమైన, భక్తి ప్రధానమైన లేదా ప్రబోధాత్మక సినిమాలకే ఇవ్వడం జరిగింది. కానీ 1956 లో మాత్రం కంటెంట్ కంటే ఫామ్ కే ప్రాధాన్యమున్న “పథేర్ పంచాలి” కి అవార్డు ఇవ్వడం అనేది ఈ సంవత్సరం అవార్డుల ప్రత్యేకత.

ప్రపంచంలోని వివిధ దేశాల్లో చలనచిత్ర కళ అబివృద్ధి చెందుతున్న ప్రక్రియలో భాగంగా ఆయా దేశాలకు చెందిన దర్శకులు తమ దేశ కాల పరిస్థుతుల కనుగుణంగా తమ దేశ చిత్రాలకంటూ ఒక భాష ఒక వ్యాకరణం ఏర్పరుచుకుంటూ వచ్చారు. ఉదాహరణకు అప్పటి రోజుల్లో తీసిన ఒక హాలీవుడ్ సినిమాకూ ఒక ఫ్రెంచ్ లేదా ఇటాలియన్ సినిమాకు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఇటలీలో డెస్సికా అనే దర్శకుడు తీసిన బైసికిల్ థీవ్స్ లాంటి చిత్రాల్లో ప్రొఫెషనల్ నటులు కాకుండా మామూలు ప్రజానీకాన్నే నటులుగా ఎన్నుకోవడం లాంటివి మనం గమనించవచ్చు. అలాగే జర్మనీ ఎక్సెప్రెసనిజం పేరుతో చలన చిత్ర కళ అబివృద్ధి చెందుతున్నప్పుడు వెలుగు నీడలతో కూడిన సినిమాటోగ్రఫీ ఎక్కువగా ఉపయోగించారు. అలాగే రష్యాలో ఎడిటింగ్ ద్వారా కొత్త ప్రక్రియలు జరిగాయి. కానీ మన దేశంలో మనకంటూ ఒక ప్రత్యేక శైలి అంటూ ఏదీ ఏర్పడకపోవడానికి అనేక కారణాలుండవచ్చు.

కానీ కొన్నాళ్ళ పాటు లండన్ లో నివసించిన సమయంలో సత్యజిత్ రే ఎన్నో ప్రపంచ సినిమాల చూసి వాటి ప్రేరణతో తన చిత్ర నిర్మాణం మొదలుపెట్టాడు. దాదాపు రెండేళ్ళ కృషి ఫలితమే “పథేర్ పాంచాలి”.

మన దేశంలోనే కాదు ప్రపంచంలోని వివిధ దేశాల్లోని చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా ఇప్పటికీ అత్యధిక అంతర్జాతీయ అవార్డులు పొందిన చిత్రంగా “పథేర్ పాంచాలి” చరిత్రలో నిలిచిపోయింది.

ఏమిటి ఈ సినిమా గొప్పతనం? రెండు మాటల్లో చెప్పాలంటే, “కళా ప్రదర్శన”. అంటే, సినిమా అన్న మాధ్యమం ఉపయోగిస్తూ అత్యంత కళాత్మకంగా తీసిన మొదటి భారతీయ చిత్రంగా ఈ సినిమాని పేర్కొనవచ్చు. అప్పటి వరకు, భారతీయ గ్రామీణ జీవితాన్ని కాని, లేదా పట్టణ జీవితాన్ని కాని సమగ్రంగా చూపించే సినిమాలు బహుశా రాలేదని అనుకోవాలి! అసలు ఈ సినిమా కథను ఎంచుకోటంలోనే రాయ్ గొప్పతనం కనపడుతుంది. ఈ సినిమా కథను, ఒక కథగా చూస్తే, అతి చప్పగా, అద్భుతంగా ఉండే ఎటువంటి సంఘటనా లేనటువంటి కథ ఇది.

సినిమాకొక భాష వుందని తెలియక, నిజజీవితంలో అసాధ్యమైన సంఘటనలను గుదిగుచ్చి ఓ సినిమా కథగా తయారు చేయాలనే మూఢనమ్మకాన్ని పథేర్ పాంచాలి పటాపంచలు చేసింది. దృశ్య మాధ్యమానికున్న శక్తిని ఆ చిత్రం తెలియజేసింది. ఆ చిత్రంలో దృశ్యమే మాట్లాడుతుంది. సంభాషణలు పొదుపుగా వాడబడ్డాయి. సంగీతం అవసరమైనంత వరకే వుంటుంది గానీ శబ్దాడంబరం వుండదు. అంతెందుకు… దృశ్య రచన ఎలా వుండాలో, ఏ అంశం ఎంత పాళ్లలో వుండాలో చెప్పడానికి నిర్దిష్టమైన కొలమానం పథేర్ పాంచాలి చిత్రం.

ప్రముఖ బెంగాలీ రచయిత అయిన బిభూతి భూషణ్ గంగోపాధ్యాయ రచించిన నవల ఆధారంగా సత్యజిత్ రే ఈ సినిమా ని రూపొందించారు. ఈ నవల ఆధారంగానే సత్యజిత్ రే మరో రెండు సినిమాలు రూపొందించారు. అవే “అపరాజితో” మరియు “ఆపుర్ సంసార్”. ఈ మూడు సినిమాలని కలిపి నేడు “అపు త్రయం” లేదా “అపు ట్రిలాజీ” గా పిలవబడుతోంది.

ఈ ట్రిలాజీ లో వచ్చిన రెండవ సినిమా “అపరాజితో” కి జాతీయ చలనచిత్ర అవార్డులు రాలేదు కానీ పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ సినిమా అవార్డులు అందుకుంది. కానీ ఈ ట్రిలాజీ లో వచ్చిన మూడవ సినిమా అయిన “అపుర్ సంసార్” మాత్రం 1960 లో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది.
ఆ తర్వాత తీసిన ఎన్నో సినిమాలకు సత్యజిత్ రే జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. కేవలం దర్శకునిగానే కాకుండా సంగీత దర్శకునిగా, స్క్రీన్ ప్లే రచయితగా కూడా ఆయన అవార్డులు గెలుచుకున్నారు.

దాదాపు నలభై ఏళ్ళ పాటు అత్యుత్తమ చలనచిత్రాలను నిర్మిస్తూ వచ్చిన సత్యజిత్ రే మొత్తానికి 32 జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నారు. అలాగే పలు అంతర్జాతీయ అవార్డులతోపాటు ఆస్కార్ అవార్డు కూడా సత్యజిత్ రే ని వరించింది.

అందుకే సత్యజిత్ రే భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడిగా ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతాడన్నది ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం.

One Response
  1. Sowmya August 31, 2011 /