Menu

మయూరి… ఒక సందేశాత్మక చిత్రం.

ఒక కారు ప్రమాదంలో ఒక కాలుని శాశ్వతంగా దూరం చేసుకున్నా, ఆత్మవిశ్వాసంతో జైపూర్ పాదంతో మళ్లీ నృత్యాన్ని సాధన చేసిన సుధ కదే ఈ మయూరి.నిజానికి సుధ తల్లిదండ్రులు ఆమెకి నృత్య కళ మీద ఉన్న మక్కువ చూసి తన మూడవ యేటనే ఆమె చేత సాధన మొదలుపెట్టించారు. ఒక ప్రదర్శన ఇచ్చి తిరిగి కారులో తండ్రితో వస్తున్నప్పుడు జరిగిన కారు ప్రమాదంలో డాక్టర్ గారి తెలియనితనం వలన తన కాలుని శాశ్వతంగా తొలగించవలసివచ్చింది. ఆ తర్వాత జైపూర్ పాదం కోసం ఆమె ఎక్కడో పేపర్లో చదవగా అక్కడికి వెళ్లి డాక్టర్ల సహాయంతో నడక నేర్చుకుని తనకి నటించే కాలు వద్దని నర్తించే కాలు కావాలని పట్టు బట్టి ప్రత్యేకమైన కాలుని వారి చేత తయారుచేయించి ధరించి నృత్యాన్ని సాధన చేసి ఎన్నో ప్రదర్శనలిచ్చిన వనిత సుధ. నిజానికి ఆమె నృత్యం చేయగలదని కాలుని అమర్చిన డాక్టర్లకి కూడా నమ్మకం లేదంట! ఈ విషయాన్ని డాక్టర్లే ఆమెతో స్వయంగా చెప్పారు. మరి ఎందుకు ముందే ఈ విషయాన్ని నాకు తెలియచేయలేదని ఆమె అడిగినప్పుడు నీ అమాయమైన ముఖాన్ని చూసి నిజం చెప్పడం మావలన కాలేదని డాక్టర్లు చెప్పారంటే నృత్య సాధన చేయాలనే తపన ఆమెలో ఏ స్తాయిలో ఉందో తెలుసుకోవచ్చు.

ఇంక సినిమా విషయానికి వస్తే.. సింగీతం గారి దర్శకత్వంలో రామోజీ గారి నిర్మాణంలో బాల సుబ్రమణ్యం గారి సంగీత సారధ్యంలో వేటూరి వారి సాహిత్యధార తో ఈ మయూరి రూపొందింది.ముందు ఈ సినిమా లో ముఖ్యపాత్రధారిణి గా ఎవరిని నటింపచేయాలి అన్న ఆలోచనలో చాలా మంది నటీమణుల పేర్లు ప్రస్తావనకి వచ్చినా చివరికి నిజజీవిత పాత్రధారిణి సుధనే ఈ అవకాశం వరించింది.

తండ్రి, సవితి తల్లి, నాయనమ్మ, చెల్లి, తమ్ముడు.. ఇదే మయూరి కుటుంబం. నృత్యంమంటే అయిష్టం తప్ప మరో ఆలోచనే ఉండదు సవితి తల్లి వేదవల్లికి. అందుకు ఒక కారణం కూడా ఉంది. అదేమిటంటే మయూరి కన్నతల్లి మొదటి సారి ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఆమె తండ్రిని కోల్పోతుంది. రెండవ సారి ప్రదర్శన ఇచ్చినప్పుడు అగ్ని ప్రమాదంలో ఆమే చనిపోతుంది. మయూరి తండ్రికి రెండవ భార్యగా వచ్చిన వేదవల్లికి ఈ విషయం తెల్సిన దగ్గర నుండి ఆమెకి నృత్యం అంటే అయిష్టం పెరిగిపోతుంది. కానీ తల్లికి నృత్యమంటే ఇష్టమవడం వలనో ఏమో మాయూరి కి కూడా నృత్యం అంటే అంతులేనంత అభిమానం ఏర్పడుతుంది. అది ఎంతంటే.. పక్క ఇంటి వసారాలో స్నేహితురాలు చేసే సాధన చూసి నేర్చుకునే అంత. కొన్ని కారణాల వలన మయూరి ఆమె కాలేజీమేట్ మోహన్ తో అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక అమ్మాయికి ముద్రలు నేర్పిస్తుంది మయూరి. అప్పుడు మోహన్ వాళ్ల అమ్మ( నృత్య కళాశాల ప్రిన్సిపాల్) చూసి ఎక్కడ నృత్యాన్ని నేర్చుకుంటున్నావని అడుగుతుంది. ఎక్కడా లేదు అని మయూరి చెప్పిన సమాధానంతో ఆశ్చర్యపోయి శాస్త్రీయంగా నేర్చుకో … దేశం మెచ్చే కళాకారిణివి అవుతావు అని చెప్తుంది. ఇంకా ఎంతోమంది అలాగే చెప్పడంవలన మయూరి మొత్తానికి కాలేజీలో మద్యాహ్నం క్లాసులు మానేసి మరీ ఇంట్లో చెప్పకుండా నృత్యాన్ని అభ్యసిస్తుంది. అప్పుడే మోహన్ తో ప్రేమలో కూడ పడుతుంది. తర్వాత ఇంట్లో వారు పెళ్లిచూపుల ప్రస్తావన తెచ్చేసరికి అంతవరకు నెమ్మదిగా ఉన్న మయూరి, చదువుని కారణంగా చూపి గట్టిగా పెళ్లిచూపులు వద్దంటుంది. అనుమానమొచ్చిన సవితి తల్లి పిల్ల కాలేజీకి అంటూ ఇంకెక్కడికెళ్తుందో అని చూడమని భర్తని పురమాయిస్తుంది. కూతురి మీద అనుమానంతో కాకపోయినా, తండ్రి గా కూతురి ప్రవర్తనలో వచ్చిన మార్పుని తెల్సుకోవడానికి నిశ్చయించుకుంటాడు ఆమె తండ్రి. అప్పుడే తండ్రికి మయూరి నృత్యం అభ్యసిస్తున్న విషయం తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని చెప్తే తన భార్య ఎక్కడ గొడవ చేస్తుందో అని ఆమెకి చెప్పడు. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వాళ్లు వస్తారు. వాళ్లకి అమ్మాయి నచ్చుతుంది. త్వరలో ముహూర్తాలు కూడా పెడతారు. పెళ్లిని ఆపాలనే ఉద్దేశ్యంతో మోహన్ బలవంతం మేరకు మొదటి సారి ప్రదర్శన ఇచ్చేందుకు ఒప్పుకుంటుంది మయూరి. అనుకున్నట్టు గానే పెళ్లి రద్దవుతుంది. ఇంట్లో పేద్ద గొడవవుతుంది. ఇంట్లో నుండి బయటకి వెళ్లడానికి సిద్దపడుతుంది కానీ నృత్యాన్ని మాత్రం వదలనంటుంది మయూరి. కానీ అనుకోని మలుపు… ఒక కారు ప్రమాదంలో తన కాలుని పోగొట్టుకుంటుంది. ప్రేమించిన మోహన్ తప్పుకుంటాడు. నృత్యమంటే ఇష్టంలేని సవితి తల్లి నానా మాటలతో మయూరి మనసుని గాయపరుస్తుంది. స్తల మార్పు కోసం స్నేహితురాలి ఇంటికి వచ్చి, అక్కడే జైపూర్ పాదంకోసం తెలుసుకుని జైపూర్ వెళ్ళి కాలు పెట్టించుకుని ఎంతో సాధన చేసి నృత్య ప్రదర్శన ఇచ్చి ఎంతో పేరు తెచ్చుకుంటుంది మయూరి. సూక్ష్మంగా అయితే ఇదే మయూరి సినిమా కధ.

సాధారణ కధలో లాగా ఇక్కడ కూడా మొదట మయూరి మీద కొంత వరకు ప్రేక్షకుడిని జాలి పడేలా చేయడంలో దర్శకులు సఫలీకృతులయ్యారు.

వేటూరి కలం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా టైటిల్స్ దగ్గర పాదం గురించి వ్రాసిన పాట అద్బుతం. ” ఈ పాదం.. ఇలలోన నాట్య వేదం…” అంటూ పాదాన్ని కీర్తిస్తారు. మయూరి కాలు తొలగించినప్పుడు ఆమె నటరాజు దగ్గర పాడే పాట “కైలాసంలో తాండవమాడే నటరాజ… ఓ నటరాజా”. ఈ పాటలో మయూరి బాధని మాటల రూపంలో నటారాజుకి నివేదిస్తారు వేటూరి. (అప్పుడెప్పుడో ఈ టివి లో కళంకిత సీరియల్ లో కళ కారెక్టర్ కి చెవుడు వచ్చినప్పుడు ఆమె కళామతల్లి దగ్గర “సన్మతి నీయవే భారతీ” అని పాడుతుంది. ఆ పాటకి ఈ పాట స్పూర్తి అవ్వచ్చు.) ఇంక చివర వచ్చే పాట “అందెలు పిలిచిన ఒరవడిలో” ఆ వర్ణనలు వేటూరికే సాద్యం.

తరువాత నటీ నటుల నటన. ముఖ్య పాత్ర ధారిణి సుద. ఆమె జీవితమే కాబట్టి బాగానే నటించింది. నాట్యంలో ఆమెకిక పేరుపేట్టలేము. నాట్యం చేసేటప్పుడు ముఖం లో ఎన్నో భావాలను ఒలికించిన ఆమె కొన్ని సన్నివేశాలలో మాత్రం సాధారణంగా నటించింది. తరువార మయూరి తండ్రి ప్రాత్ర పి.ఎల్. నారయణ గారు చేశారు. అమాయకపు తండ్రి అంటే ఇలానే ఉంటారేమో అని అనిపించేటట్లు నటించేశారు కాదు కాదు జీవించేశారు. ఒక్కొక్క సెకన్లో ముఖంలో ఒక్కొక్క భావాన్ని భలేగా ఒలికించారు ఆయన. చివర్లో తన కూతురి గొప్పతనాన్ని చూసి ఆమె ని కలవలేక దూరం నుంచే ఆనందించి వెళ్లిపోతారాయన. మళ్లీ మయూరి నాన్న.. అని పిలవడంతో ఆమెతో మాట్లాడే సన్నివేశంలో అతని నటన అమోఘం. ఎన్ని నందులు అతనికి ఇచ్చినా తక్కువే అవుతుంది. చివరగా మయూరి నాయనమ్మ నిర్మలమ్మ. ఆమెకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఆమె నిజజీవితంలో ఎలా మాట్లాడేవారో కానీ ఆమె సినిమాలలో నటిస్తుంటే అది నటనలా మాత్రం ఉండదు. ఇంట్లో నాయనమ్మలు, అమ్మమ్మలు మాటలాడినట్టే ఉంటుంది. ఈ సినిమాలో ఇంట్లో ఒక మూలన కూర్చుని పి.ఎల్. నారాయణకి అప్పుడప్పుడు వచ్చే సందేహాలని కాస్తంత చమత్కారంతో కలిపి వాటిని నివృత్తి చేస్తూ ఉంటారీమె. సవితి తల్లి గా వై.విజయ, వంటవాడు గా సుబ్బరాజు, మోహన్ గా శుభాకర్, ప్రిన్సిపాల్ గా పి.ఆర్. వరలక్ష్మి అందరూ వారి పరిది మేరకు వారు బాగా నటించారు.

సాహిత్యానికి పెద్ద పీట వేసి కూర్చిన రాగాలు అద్బుతంగా ఉన్నాయి. బాల సుబ్రమణ్యం బాగా కూర్చారు రాగాలని.

నృత్య దర్శకుడి శేషు గారి ప్రతిభ తెల్సుకోవాలంటే టైటిల్స్ వస్తున్నప్పుడు వచ్చే “ఈ పాదం ఇల లోన నాట్య వేదం” అనే పాట చూడాలి. కేవలం పాదాలతీ ఎన్నో ముద్రలని ఎంతో బాగా చిత్రీకరిస్తారు ఇందులో.

నిజ జీవిత కధని కొన్ని మార్పులతో హృద్యంగా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలీకృతులయ్యారు.

ఈ సినిమా కమర్షియల్ గా ఎంత విజయం సాధించిందో నాకు తెలియదు కానీ ఒక మంచి చిత్రాన్ని నిర్మించామన్న తృప్తిని అయితే మాత్రం ఖచ్చితంగా నిర్మాతకి ఉంటుంది. అయినా ఒకప్పుడు ఉషా కిరణ్ మూవీస్ వారి చిత్రమంటే ఇలాగే సందేశాత్మకంగా, ఎంతో హృద్యంగా ఉండేవి. అందుకేనేమో ఎన్నో రంగాలలో ఎంతో విజయాన్ని చూసిన రామోజీరావు గారికి ఎన్నో చిత్ర విజయాలు లభించలేదు.

పట్టుదల, కృషి ఉంటే గమ్యమెంత దూరంగా ఉన్నా ఒడిదుడుకులతో కూడుకున్నదైనా సాధించవచ్చని నిరూపించిన సుధ నిజ జీవిత కదే కొన్ని కమర్షియల్ హంగులతో వచ్చిన ఈ మయూరి. అసభ్యానికి తావు లేకుండా ఎన్ని తరాలు మారినా అందరికీ సందేశాన్ని పంచే చిత్రమిది.

ఎప్పుడో నేను పుట్టకముందు వచ్చిన ఈ చిత్రం చూసి ఎంతో ప్రేరణ పొంది, అనుకున్నవాటినెన్నో నేను సాదించుకున్నాను. ఈ చిత్రం మరెందరికో ప్రేరణ కావాలని కోరుకుంటూ…

-జాహ్నవి.

12 Comments
 1. mitra August 24, 2011 /
 2. vinay August 24, 2011 /
 3. రాణి August 24, 2011 /
   • కమల్ August 25, 2011 /
 4. రాణి August 25, 2011 /
  • అబ్రకదబ్ర September 1, 2011 /
 5. శ్రీరామ్ వేలమూరి August 25, 2011 /
  • రామ August 30, 2011 /
 6. Krishna Mohan August 26, 2011 /
 7. సుజాత September 3, 2011 /
 8. సుజాత September 3, 2011 /