Menu

కాటేసిన ‘కందిరీగ’

‘దడ’దెబ్బకు ఝడిసి తెలుగు సినిమాలకు మస్కా కొట్టాలనుకున్న నాకు బాగుంది బాగుందని చాలా మంది రొదపెట్టేసరికీ, ఓహో తియ్యగా కుట్టిందేమో అన్న అపోహతో కందిరీగకు వెళితే, అది తీరా కసితీరా కాటేసిన అనుభవం ఎదురయ్యింది. ఆకట్టుకునే చివరి ఇరవై నిమిషాలు తప్ప  మిగతా అంతా ఎందుకొచ్చాన్రా భగవంతుడా అనే నా బాధలో తెలుగు ప్రేక్షకుడి అల్పసంతోషం 70 mm స్క్రీన్ మీద కనిపించింది.

పరమ బేవార్స్, శాడిస్ట్ ఉంటున్న ఊరికే శనిగాడైన విలన్ లాంటి హీరో‘రామ్’. అతగాడి టార్చర్ తట్టుకోలేక వాడు చస్తేనో లేదా ఊరొదిలి వెళ్ళిపోతేనో బాగుండుననుకునే ఊరిజనం ప్రార్థన విని దేవుడు, రామ్ మరదలు (కలర్స్ స్వాతి సెషన్ అప్పియరెన్స్) పెళ్ళికి ఛీ కొట్టడంతో డిగ్రీ పాసవడానికి హైదరాబాద్ వెళ్ళే కోరిక పుట్టిస్తాడు (అదేదో హైదరాబాద్ లో తేగా డిగ్రీలు పాస్ చేస్తున్నట్టు). హైదరాబాద్ కాలేజికి రావడం రావడం రెడీగా అక్కడి లోకల్ రౌడి సోనూసూద్ ప్రేమించిన నమిత లాంటి ‘హంసిక’ని రామ్ అర్జంటుగా ప్రేమించేస్తాడు. దీనితో రామ్ డిగ్రీ అటకెక్కి సినిమా యాక్షన్ లోకి దిగుతుంది.

ఊరికంతా విలనైన సోనూసూద్ హీరో వెధవ్వేషాలకు మాత్రం జోకర్ గాడిలాగా తలాడిస్తూ, “ఏదీ నా ప్రేయసిని ప్రేమలో పడెయ్ చూద్దాం” అని ఛాలెంజ్ విసురుతాడు.  ఆ ఛాలెంజ్ ని కొన్ని పాటలు, ఒక భారీస్థాయి ఫైట్ సీక్వెన్స్ మధ్య హీరో పూర్తిచేసేస్తాడు. ఇక్కడే కహానీలో ట్విస్ట్ లాగా మరో కథవచ్చి కలుస్తుంది. అదే వరంగల్ రాజన్న(జయప్రకాష్ రెడ్డి) కథ.

నో్టిదూల. చేతి దురదా మహబాగా ఉన్న హీరో ట్రైన్ లో కొందరు గూండాల మీద చెయ్యిచేసుకుంటుండగా చూసి చూసిముచ్చటపడిన జయప్రకాష్ రెడ్డి కూతురు ‘అక్ష’ కోరిక తీర్చడానికి సోనూసూద్ పోరంబోకు సలహా మేరకు హంసికను కిడ్నాప్ చేస్తాడు. ఆ తరువాత రామ్ వచ్చి ఎలా తన ప్రేమని గెలిపించి అందరి విలన్లనూ తన తింగరి చేష్టలతో వెధవల్ని చేస్తాడు అనేది మిగతా కథ.

అన్ని హైబడ్జెట్ చిత్రాలలాగానే అతుకుల బొంతలాంటి అర్థరహితమైన కథ. ప్రతి సీన్లోనూ ట్విస్టులు పెట్టుకుంటూ వేళ్ళే కథనం. ప్రాసలూ పంచులూ ఉండే భావరహిత డైలాగులు. చరిత్రహీనమైన పాత్రలు. కాకపోతే ఇవన్నీ మరీ నీచంగా కాకుండా ఒక మోస్తరుగా, అక్కడక్కడా బాగున్నాయే అనిపించేలా చెయ్యడంలో నూతన దర్శకుడు  సంతోష్ శ్రీన్ వాస్ (అవును ఇదే అతని పేరు ‘శ్రీనివాస్’ కాదు).

అక్కడక్కడా పవన్ కళ్యాన్ లాగా, అప్పుడప్పుడూ రవితేజలాగా కనిపించి, వినిపించి, నటించే(?) ఎనర్జిటిక్ హీరో రామ్ (ఈ సినిమాతో ఈ ట్యాగ్ తగిలించేశారు టైటిల్స్ లో) చూడ్డానికి బాగానే ఉంటాడు కాబట్టి హీరోగా భరించెయ్యొచ్చు. నటనకూడా ఇమిటేషనైనా బాగానే ఉంది. హంసికా మోత్వాని సినిమాలో చాలా నిండుగా ఉంది. తన భారీకాయాన్ని దాచడానికి కాస్ట్యూమ్స్ మరియూ సినెమాటోగ్రఫీ విభాగం పడిన కష్టం కనిపిస్తుందిగానీ, ఫలితం మాత్రం దక్కలేదు. చెప్పడానికి వీళ్ళు హీరోహీరోయిన్లైనా సినిమాలో ఆకట్టుకునేది మాత్రం సోనూ సూద్ మరియు అక్ష ల నటన. కామెడియన్స్ బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, ధర్మవరపు, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి వంటివాళ్ళు ఉన్నా జయప్రకాష్ రెడ్డి పాత్ర, నటన చాలా బాగున్నాయి.

ఒక తమన్ సంగీతం మినహా సాంకేతికంగా ఆండ్రూ సినెమాటోగ్రఫీ, వెంకటేశ్వర రావు ఎడిటింగ్ చాలా బాగున్నాయి. అర్జంటుగా తమన్ ను తెలుగు సినిమాలకు దూరంగా ఉంచడం పరిశ్రమకు, సంగీతానికీ మంచిది(ప్రేక్షకుడికి కూడా). ఒక కొత్త దర్శకుడు హిట్ సినిమా ఇచ్చాడని ఆనందపడాలో ఏమాత్రం వైవిధ్యం ఇవ్వలేదని ఈసడించుకోవాలో తెలీదు. అచ్చంగా మరో రెడీ, డీ లాంటి సినిమా చూసిన ఫీలింగ్ ని శ్రీన్ వాస్ కలిగించాడు.

ఇలాంటి సినిమాలు ఇప్పటికి బోలెడొచ్చినా, ఇంకా కాస్తోకూస్తో నవ్విస్తేచాలు నెత్తిన పెట్టుకుంటామనే తెలుగు ప్రేక్షకుడి విశాలహృదయానికి ఆశ్చర్యపోయి అభినందించాలో లేక అల్పసంతోషాన్ని చూసి బెంగపడాలో అర్థంకాని పరిస్థితిలో ఈ సినిమా నన్ను వదిలిపెట్టింది. ఆఖరి ఇరవై నిమిషాల ఆకర్షణను చూసి సినిమా బాగుందని చెప్పేంత విశాల హృదయం నాకు లేదు కాబట్టి నాకైతే ఈ సినిమా నచ్చలేదు. నిజానికి తెలుగు సినిమాల, ప్రేక్షకుల పరిస్థితి చూసి భయమేసింది.

మెడడు మోకాల్లో పెట్టుకుని, సినిమా అంటే కాస్సేపు కసితీరా(ఆ మాత్రం శాడిజం లేకపోతే ఈ సినిమాని ఎంజాయ్ చెయ్యడం కష్టం మరి) నవ్వుకోవడం అనుకుంటే వెళ్ళండి. ఎంజాయ్ !

10 Comments
 1. గీతాచార్య August 16, 2011 /
 2. రమణ మూర్తి August 17, 2011 /
 3. ఆ.సౌమ్య August 17, 2011 /
  • Srinu Pandranki August 17, 2011 /
 4. vignesh August 17, 2011 /
 5. tolakari August 18, 2011 /
 6. vinman August 19, 2011 /
 7. satish August 20, 2011 /
 8. sreenu August 21, 2011 /
 9. సుధాకర్ August 22, 2011 /