Menu

చారిత్రకజానపదం “ఉరుమి”

పోర్చుగీసు నావికుడు, వైస్రాయ్ వాస్కోడిగామా గురించి భారతదేశానికి సముద్రమార్గం కనుక్కున్న మహావ్యక్తిగానే మనకు చరిత్రలో తెలుసు. కానీ ఆ చరిత్ర చెప్పని సత్యం అతడి క్రూరత్వం, అధికారలాలస, కుతంత్రం. విజేతల చరిత్రలో ఈ అంశాలకు చోటులేకుండా పోయింది. జనపదాల్లో, జానపదాల్లో ఇది కథగా మిగిలిపోయింది. అలాంటి ఒక కథే ఉరుమి.

పదహారవ శతాబ్ధపు కేరళలో వాస్కోడిగామా దురంతాలకు బలైన ఒక పిల్లవాడు, పెరిగి పెద్దవాడై, నవ యువకుడై వాస్కో ను చంపాలనుకుని చేసే ప్రయత్నాల గాధ ఈ సినిమా. ఆప్రయత్నంలో స్థానిక రాజుని చేరి, ప్రజల్ని కూడగట్టి, తన సాహసంతో ధీరత్వంతో ఎలా ప్రాణాలకు ఎదురొడ్డిపోరాడి మరణించిన స్వాతంత్ర్యసమర యోధుడు చిరక్కల్ కేలూ నయనార్ (పృధ్వి) యొక్క చరిత్రో,కల్పనో తెలియని కథ ఇది. బహుశా సినిమాలో చెప్పినట్టు చరిత్ర మర్చిపోయిన కథ ఇది.

గతచరిత్రని మరిచి, పుట్టిననేలపైనా భూమిపైనా ఏమాత్రం ప్రేమలేని ఒక ఆధునిక యువకుడు నియో-కొలొనియల్ పోకడగా ఒక విదేశీకంపెనీ తన పూర్వజుల భూమిని మైనింగ్ కోసం కొనాలనే ప్రపోజల్ పెడితే, గ్రామానికి బయల్దేరే క్రమంతో సినిమా మొదలౌతుంది. అమ్మేముందు ఒకప్పుడు ఇదే భూమిని విదేశీయుల దురంతాల నుంచీ విముక్తిచెయ్యాలనుకున్న ఒక వీరుడికి వారసుడిగా ఇది చెయ్యడం తగునా అని ప్రశ్నిస్తూ ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ లో మొత్తం  చిరక్కల్ కేలూ నయనార్ కథ తెరమీదకి వస్తుంది.

ప్రధానపాత్రలో పృధ్వి నటన, ఆహార్యం, శరీరతత్వం చాలా ఆకట్టుకుంటాయి. మళయాళపరిశ్రమ మరో అంతర్జాతీయస్థాయి నటుడిని భారతీయతెరకు పరిచయం చేసిందని చెప్పటంలో అతిశయోక్తి కాదు. చిరక్కల్ కేలూ నయనార్ ముస్లిం మిత్రుడు ‘వవ్వాలి’ పాత్రలో ప్రభుదేవ సినిమాకు కావలసిన హాస్యాన్ని అందించాడు. రాజుగా అమోల్ గుప్తే నటన గుర్తుంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది, సాధారణంగా తెలుగు సినిమాల్లో తింగరబుచ్చి వేషాలకు మాత్రమే పరిమితమైన జనీలియా డిసౌజా ప్రదర్శన గురించి. కళ్ళతో పలికే భావాలతోపాటూ, పోరాటదృశ్యాలు, నృత్యాలలో తన నైపుణ్యం నిబద్ధత కనిపిస్తుంది.ఆయేషా గా తన పాత్ర అభినందించదగ్గ పరిణామం. ప్రత్యేకపాత్రలో ఒక పర్యావరణ యాక్టివిస్టుగా మరియు భవిష్యత్తును పలికి కర్తవ్యం బోధించే దేవతగా విద్యాబాలన్ తన గుర్తింపుచాటుకుంటే, టబు ఒక పాటలో తళుక్కున మెరిసిమాయమౌతుంది. ప్రభుదేవాకు జోడిగా కనిపించే యువరాణి పాత్రలో నిత్యామీనన్ నటనతోపాటూ తన హొయలుని తెరమీద ఒలికించింది.

శశాంక్ శివరామకృష్ణ కథ మెలికలతో ఆకట్టుకుంటే, దీపక్ దేవ్ సంగీతం మొదట్లో కొంచెం ఇబ్బందిపెట్టినా, అలవాటయ్యేకొద్దీ సినిమాలోకి మనల్ని తీసుకెళ్ళడంలో సఫలం అయ్యింది. సాధారణంగా ఏమాత్రం ఆకట్టుకోని శశాంక్ వెన్నెలకంటి అనువాదరచన ఈ సినిమాలో చాలా బాగుంది. శ్రీకర్ ప్రసాద్ కూర్పు ఎప్పటిలాగే సినిమాకి అనుగుణంగా ఉంది.

సాంకేతిక నిపుణుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది సంతోష్ శివన్ సినెమాటోగ్రఫీ. తన మొదటి సినిమా టిబ్లు నుంచీ ఉరిమి వరకూ వర్షంతోనూ, నీళ్లతో, తడితోనూ ప్రతిఫ్రేమునూ మేళవించే ఒక విన్నూత్నశైలి విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాకపోతే ఒక్కోసారి దర్శకుడి విజన్ ని, కథ మూలాల్ని కూడా పక్కనపెట్టి ఈ దృశ్యీకరణ ఉంటడం ప్రమాదమే అయినా, నయనానందకరం. ఉరిమికి దర్శకుడుకూడా తనే అవడంతో ఒక దృశ్యకావ్యం అయ్యిందని చెప్పడం సరైన మాటే అవుతుంది.

మంచికథని, నటుల్ని ఎన్నొకోవడంలో సఫలమైన సంతోష్ శివన్ దర్శకత్వప్రతిభ మనకు ముందే తెలిసినా, ఈ సినిమాలో కూడా అక్కడక్కడా కొంత ఇండల్జెన్స్ కారణంగా ప్రేక్షకుడిని ఎమోషనల్ గా దూరంచేస్తుంది. కాకపోతే సినిమా మొత్తగా మాత్రం ఒక సంతృప్తికరమైన అనుభవాన్ని మిగులుస్తుంది.

తప్పకుండా చూడవలసిన చిత్రం. ఈ సినిమా చూస్తుంటే అప్రయత్నంగా అల్లూరి సీతారామరాజు గుర్తుకు వస్తాడు. తెలుగునాటకూడా పరాయిపాలనకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడిన యోధులు ఎందరోవుండగా వారి కథల్ని మనం సినిమాలుగా తియ్యకపోవడం ఎంత కృతఘ్నతో కదా అనిపించింది. ముఖ్యంగా నాలుగుభాషల్లో (మళయాళం, తమిళం, తెలుగు, హిందీ) దాదాపు 25 కోట్లవ్యయంతో నిర్మించిన ఈ చిత్రాన్ని చూస్తుంటే, మనోళ్ళు పరమచెత్త చిత్రాలపై చేసే కోట్లఖర్చు గుర్తొచ్చి బాధకలిగింది.

17 Comments
 1. Faustin Donnegal August 27, 2011 /
 2. challa August 27, 2011 /
 3. Sowmya August 27, 2011 /
  • Sowmya December 14, 2011 /
 4. subhadra August 27, 2011 /
 5. Venkat .Balusupati August 27, 2011 /
 6. Venkat .Balusupati August 27, 2011 /
 7. శ్రీరామ్ వేలమూరి August 27, 2011 /
 8. కంచరకుంట్ల భరత్ రెడ్డి August 28, 2011 /
 9. krishna August 30, 2011 /
 10. sasank September 1, 2011 /
  • cinema legend September 1, 2011 /
   • sasank September 10, 2011 /
 11. cinema legend September 10, 2011 /