జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తొలి రోజులు

shyamchi_aai

ఇక మనం 1954 లో మొట్టమొదటి సారిగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న చిత్రాల వివరాలు చూద్దాం.

శ్రీ మంగల్ దాస్ పక్వాసా అధ్యక్షుడిగా సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఇప్పుడు ఉన్నన్ని అవార్డులు ఆ రోజుల్లో లేవు. జాతీయ ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ పతకం అందచేసేవారు. పీకే ఆత్రే దర్శకత్వంలో వచ్చిన మరాఠీ చిత్రం “శ్యాంచీ ఆయ్” ఈ అవార్డు గెలుచుకుంది. శ్యాం అనే అల్లరి కుర్రవాడిని అతని తల్లి సక్రమమైన దారిలో నడిపించడమే ఈ చిత్ర కథ. ఈ చిత్ర దర్శకుడు పీకే ఆత్రే వృత్తి రీత్యా అధ్యాపకుడు కావడం చేత పిల్లలు బడిలోకంటే ఇంట్లోనే ఎంతో నేర్చుకోవలసిఉందని ఈ సినిమా ద్వారా ప్రబోధించారు.

అత్యుత్తమ చిత్రంతోపాటు మరో రెండు ఉత్తమ చిత్రాలకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ ఇచ్చేవారు. ప్రఖ్యాత దర్శకుడు బిమల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన “దో భీగా జమీన్” మరియు చైతన్య మహా ప్రభు జీవితంగా అధారంగా రూపొందించిన బెంగాళీ చిత్రం “భగవాన్ శ్రీ కృష్ణ చైతన్య” లకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డులను అందచేశారు.

ఇక్కడ ఇంకో చెప్పుకోదగిన విశేషం ఉంది. కథా చిత్రాలనే కాదు అప్పట్లో డాక్యుమెంటరీ సినిమాలనూ వాటితో సరి సమానంగా భావించేవారు. కాబట్టే ఉత్తమ కథా చిత్రాలకే కాదు ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రానికి కూడా స్వర్ణ పతకం అందచేశేవారు. మహాబలిపురం లోని రాతి ఆలయాల గురించి నిర్మించిన “మాహాబలిపురం” అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఈ స్వర్ణ పతకాన్ని అందచేశారు. అలాగే మరో రెండు డాక్యుమెంటరీ చిత్రాలకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అందచేసారు.

కథా చిత్రాలు మరియు డాక్యుమెంటరీ చిత్రాలతో పాటు ఉత్తమ బాలల చిత్రానికి స్వర్ణ పతకం ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ నామెనేట్ చేసిన సినిమాల్లో అత్యుత్తమైనది ఏదీ లేకపోవడంతో “ఖేల్ ఘర్” అనే సినిమాకి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ మాత్రం అందచేశారు.

మొదట్లో స్వర్ణ పతకంగా పిలిచే ఈ అవార్డులను ఆ తర్వాత స్వర్ణ కమలంగా మార్చారు. ఈ అవార్డులు ఇచ్చే సమయానికి భారతదేశంలో సగటున 250 సినిమాలు నిర్మితమయ్యేవి. వీటి నిర్మాణ వ్యయం దాదాపు 42 కోట్లు.

ఇక్కడ మరో విశేషం కూడా మనం చెప్ప్పుకోవాలి. జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన ఈ సంవత్సరంలోనే మొట్టమొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా ప్రకటించారు. మొట్టమొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకొన్న చిత్రం “దో భీగా జమీన్”.

మొదటి సంవత్సరంలో మూడు విభాగాల్లో మాత్రమే జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత సంవత్సరంలో ప్రాంతీయ భాషల్లో వచ్చిన ఉత్తమ చిత్రాలను సైతం గుర్తించాలనే ఆలోచనతో బెంగాలీ, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, తమిళం మరియు హిందీ భాషల్లో వచ్చిన చిత్రాలకు రజత పతకాల్ని అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ విధంగా 1955 లో ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో “మీర్జా గాలిబ్” అనే హిందీ చిత్రం స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా కేవి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “పెద్ద మనుషులు” సినిమా ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు గెలుచుకుంది.

ఇదే సంవత్సరం సర్టిఫెకెట్ ఆఫ్ మెరిట్ అవార్డులు గెలుచుకున్న మరో రెండు తెలుగు చిత్రాలు “విప్ర నారాయణ” మరియు “తోడు దొంగలు” .ఈ విధంగా జాతీయ చలన చిత్ర పురస్కారాలు పొందిన తొలి తెలుగు సినిమాలుగా “పెద్ద మనుషులు”, “విప్రనారాయణ” మరియు “తోడు దొంగలు” చిత్రాల్ని పేర్కొనవచ్చు.

1954 వ సంవత్సరంలో భారతదేశంలో మొత్తం 274 కథా చిత్రాలు నిర్మితంకాగా 120 కి పైగానే డాక్యుమెంటరీ సినిమాలు కూడా నిర్మితమయ్యాయి. ఈ విధంగా చూస్తే ఆ రోజుల్లో డాక్యుమెంటరీ చిత్రాలను కూడా ప్రజలు ఆసక్తిగా చూసేవారనిపిస్తుంది. కానీ రాను రాను డాక్యుమెంటరీల సంఖ్య తగ్గుతూ రావడం బాధాకరమైన విషయం.

ఈ సీరీస్ లోని మిగిలిన వ్యాసాలుజాతీయ చలనచిత్ర పురస్కారాలు – చరిత్రజాతీయ చలనచిత్ర పురస్కారాలు-పరిణామ క్రమం

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

1 Comment to “జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తొలి రోజులు”

  • ” రాను రాను డాక్యుమెంటరీల సంఖ్య తగ్గుతూ రావడం బాధాకరమైన విషయం.”
    Filmలో వున్న డాక్యుమెంటరీ చిత్రాలనే నంది అవార్డులకు పరిగణిస్తారంట. Digital format పరిగణించరంట. ఇది చిన్న బడ్జెట్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతలకు ఇబ్బందే. ఏదో ఉత్తరాది రాష్ట్రంలో ఇలాంటి నియమమే వుంటే అక్కడి filmmakers పోరాడి digital formatను పరిగణించేలా చేసుకున్నారు (ఎలా చేయొచ్చో తెలిసిన వారు చెప్పగలరు). మనమూ అలాంటిది ఏమైనా చేయాలి. అప్పుడు మరిన్ని డాక్యుమెంటరీలు వచ్చే అవకాశం వుంది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories