Menu

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ప్రపంచ చలనచిత్ర పురస్కారాల చరిత్ర

వచ్చే నెల 9వ తేదీ 58 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రధానం చేయబడే రోజు. ఈ సందర్భంగా జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి మనం తెలుసుకుందాం. యాభై ఎనిమిది ఏళ్ళ పాటు నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న ఈ చలనచిత్ర పురస్కారాల చరిత్ర తెలుసుకోవాలంటే, ముందు చలనచిత్ర కళ యొక్క ఆవిర్భావం నుంచి మొదలుపెట్టాలి.

1895 లో లూమియర్ సోదరులు తొలిసారిగా ఒక చలనచిత్రాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.

లండన్ లో ఈ ప్రదర్శన జరిగిన సంవత్సరంలోపే మన దేశంలోని ముంబాయి నగరంలో తొలిసారిగా చలనచిత్ర ప్రదర్శన జరిగింది. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో కనుగొనబడిన ఏ సాంకేతికత అయినా భారతదేశం రావడానికి కొంచెం సమయం పడ్తుంది. కానీ చలనచిత్రం మాత్రం భారతదేశంలో చాలా త్వరగా ప్రవేశించి అంతే త్వరగా అశేష ప్రజానీకానికి దగ్గరయ్యింది.
ప్రపంచం వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందుతున్న చలనచిత్ర ప్రక్రియను భారతదేశానికి తీసుకొచ్చింది పాశ్చాత్యులయినప్పటికీ హీరాలాల్ సేన్ అనే భారతీయుడు 1898 నాటికే తొలి భారతీయ చలనచిత్రాన్ని రూపొందించారు. కానీ ఆయన రూపొందించిన చలనచిత్రాలు ఎక్కువగా లఘు చిత్రాలు, వ్యాపార ప్రకటనలు మరియు డాక్యుమెంటరీ చిత్రాలు. భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి పూర్తి నిడివి చలనచిత్రం “రాజా హరిశ్చంద్ర”. దాదా సాహెబ్ ఫాల్కే ఈ చిత్రాన్ని1913 లో రూపొందించారు. అలా మొదలయిన భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటిగా నిలిచింది. అత్యధిక చలనచిత్రాలు నిర్మించే దేశాల్లో భారతదేశం నేడు మొదటి స్థానంలో ఉంది.

ఇరవైయ్యవ శతాబ్దపు మొదటి రోజుల్లో యూరోప్ మరియు ఇతరదేశాల్లో చలనచిత్రం ఒక కళగా, పరిశ్రమగా అబివృద్ధి చెందుతున్న రోజుల్లో మొదటి ప్రపంచ యుద్ధం రావడంతో యూరోప్ లో చలనచిత్ర నిర్మాణం తగ్గు ముఖం పట్టింది. ఆ రోజుల్లోనే అమెరికాలో చలనచిత్ర నిర్మాణం మొదలయింది. 1916 లో డి.డబ్ల్యూ గ్రిఫిత్ నిర్మించిన ’బర్త్ ఆఫ్ ఎ నేషన్’ మరియు ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే నిర్మింపబడిన ’ఇంటోలరెన్స్’ చిత్రాలు అమెరికన్ చలనచిత్ర పరిశ్రమ కు ఒక కొత్త వెలుగునిచ్చాయి. అదే సమయానికి యూరోప్ లోని వివిధ దేశాలకు చెందిన దర్శకులు సాంకేతిక నిపుణులు అమెరికా తరలి రావడంతో అమెరికాలో చలనచిత్ర నిర్మాణం ఒక పెద్ద పరిశ్రమగా ఏర్పడింది. కానీ ఆ తర్వాత పదిహేనేళ్లకు కానీ ఉత్తమ చలన చిత్రాలకు పురస్కారాలు అందించాలనే ఆలోచన ఎవరికీ రాలేదు. అది కూడా అనుకోకుండా జరిగిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.

చలనచిత్ర పరిశ్రమలో పని చేసే వివిధ సాంకేతిక నిపుణులు మరియు సినిమా నిర్మాతల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి తటస్థంగా వ్యవహరించే ఒక సంస్థ అవసరాన్ని గుర్తించిన లూయిస్ బి మేయర్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పేరుతో ఒక సంస్థను స్థాపించారు.

ఈ సంస్థ ఆ తదుపరి కాలంలో సంవత్సరానికొక సారి సభ్యులందరూ సమావేశమై ఆ సంవత్సరంలో వారు ఎదుర్కొన్న సమస్యల గురించి చర్చించాలని నిర్ణయానికొచ్చినప్పుడు ఇదే సమావేశంలో అత్యుత్తమ చలనచిత్రాలను మరియు సాంకేతిక నిపుణులను గుర్తిస్తూ ప్రతి యేటా పురస్కారాలు అందచేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇదంతా 1929 నాటి సంగతి. ఈ విధంగా ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి చలనచిత్ర పురస్కారాలు 1929 లో మొదలయ్యాయని చెప్పవచ్చు. అలాగే యూరోప్ లోని డెన్మార్క్ దేశంలో ఇవ్వబడే బోడిల్ అవార్డ్స్ ని యూరోప్ లో కెల్లా మొట్టమొదటి చలనచిత్ర పురస్కారాలుగా గుర్తించవచ్చు. అప్పటికే వెనిస్, కాన్స్ చలన చిత్రోత్సవాల్లో అత్యుత్తమ సినిమాలకు అవార్డులు ఇస్తున్నప్పటికీ చలనచిత్రోత్సవాల్లో కాకుండా ఇచ్చే అవార్డుల్లో ఈ బోడిల్ అవార్డ్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంది.

కానీ ఆస్కార్ అవార్డులుగా పిలువబడే అకేడమీ అవార్డుల ప్రధానం జరిగిన పాతికేళ్ళకు గానీ మన దేశంలో అత్యుత్తమ చలనచిత్రాలకు పురస్కారాలివ్వాలనిపించకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే.

అయితే ఏసియా ఖండంలో మొట్టమొదటి సినిమా అవార్డులుగా మన జాతీయ చలనచిత్ర అవార్డులను పేర్కొనవచ్చు. భారతదేశం తర్వాత అత్యుత్తమ చలనచిత్రాలకు అవార్డులు అందచేసిన దేశం బహుశా పాకిస్తాన్ అయ్యుండొచ్చు.1958లో పాకిస్తాన్ దేశంలో ప్రచురింపబడే నిగార్ అని పత్రిక యాజమాన్యం అప్పటి పాకిస్తానీ సినిమాలకు అందించిన నిగార్ అవార్డులే మొట్టమొదటి పాకిస్తానీ చలనచిత్ర అవార్డులుగా చరిత్ర చెప్తోంది. ఆ తర్వాత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అత్యుత్తమ చలనచిత్రాలను గుర్తిస్తూ అవార్డులు ఇవ్వడం జరుగుతూనే ఉంది.