జాతీయ చలనచిత్ర పురస్కారాలు-పరిణామ క్రమం

evolution-of-awards

భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అబివృద్ధి చెందుతూండగా ఎన్నో మార్పులు సంభవించాయి. మొదట్లో అత్యధిక శాతం సినిమాలు హిందీ నిర్మించబడేవి. కానీ ఈ రోజు తమిళం మరియు తెలుగు సినీ పరిశ్రమలు హిందీ సినిమా పరిశ్రమకు ధీటుగా నిలిచాయి. ఈ మార్పుల కారణంగానే జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందచేయడంలో కూడా మార్పు సంభవించిందనే చెప్పాలి. ముఖ్యంగా 1970 మరియు 1980 లలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏర్పడిన మార్పులు ఇందుకు కారణం అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కళాత్మకమైన చిత్రాల నిర్మాణం అధికమైంది. ముఖ్యంగా బెంగాలీ, మళయాలీ భాషలకు చెందిన చిత్రాలు మరియు హింది, మరాఠీ, కన్నడ భాష ల్లో కూడా కళాత్మక చిత్ర నిర్మాణం మొదలయింది. ఈ చలనచిత్రాల్లో కథ కంటే కూడా సాంకేతికత మరియు శిల్పానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది.

ఇటువంటి చిత్రాలు అధికంగా వస్తున్న సమయంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలను పరిశీలిస్తే అధిక శాతం అవార్డులు ఇలాంటి సినిమాలకే వచ్చినట్టు మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇదే కాలంలో దేశమంతా ఫిల్మ్ సొసైటీ ఉద్యమం ప్రారంభమవడం మరియు సమాంతర సినిమా పేరుతో కళాత్మక విలువలున్న సినిమాల నిర్మాణం ఆరంభం కావడంతో ఆ కాలంలో ఆవార్డులన్నీ కథా ప్రాధాన్య లేని చిత్రాలే దక్కించుకున్నాయి. అయితే ఈ కారణంగా అత్యధిక ప్రజాదరణ పొందిన వినోదాత్మకమైన సినిమాలకు గుర్తింపు లేకుండా పోయిందనే చెప్పాలి.

కానీ కొన్నేళ్ళకి అంటే గత పది పదిహేను సంవత్సరాలుగా అటు కళ నూ ఇటు వినోదాన్ని బ్యాలెన్స్ చేస్తూ అవార్డులు ఇవ్వడం మనం గమనించవచ్చు. మొట్టమొదటి చలనచిత్ర అవార్డుల ఆహ్వాన పత్రిక లో భరతముని వాక్యాలు ప్రచురిస్తే ఇప్పటి ఆహ్వాన పత్రికలో “ఈ చలనచిత్ర అవార్డులు 1953 లో స్థాపించబడినవి. కళాత్మకతతో పాటు సామాజిక స్పృహ మరియు తత్సంబంధ అంశాలతో కూడిన చిత్రాలకు ఈ అవార్డులు అందచేయబడతాయి. అలాగే చలనచిత్రం అనే ప్రక్రియ లోని వివిధ సాంకేతిక నిపుణులు మరియు కళాకారులను గుర్తించడం కూడా ఈ పురస్కారాల యొక్క లక్ష్యం” అని ప్రచురింపబడి ఉండడం మనం గమనించవచ్చు.

ఈ మధ్యనే ప్రకటించిన యాభై ఎనిమిదవ జాతీయ చలనచిత్ర పురస్కారాల వివరాలు చూసినట్టయితే మనకీ విషయం సులభంగా అర్థమవుతుంది. ఒక వైపు “దబాంగ్” లాంటి కమర్షియల్ సినిమాతో పాటు వాస్తవిక కథనంతో రూపొందించిన “అదమింటే మకాన్ అబు” అనే మళయాళీ చిత్రాన్ని కూడా అత్యుత్తమ చిత్రాలుగా ప్రకటించారు.ఈ విధంగా కళాత్మకమైన చలనచిత్రాలను, ప్రజాదరణ పొందిన చిత్రాలనూ గుర్తించడం లో జాతీయ చలనచిత్ర పురస్కారాలు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేస్తున్నట్టే!

1954 లో తొలి జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందించినప్పుడు కేవలం ఉత్తమ చలనచిత్రాలను మాత్రమే గుర్తించేవారు. ఆ తర్వాత వివిధ ప్రాంతీయ భాషల్లో నిర్మితమైన చలన చిత్రాలను గుర్తించి ఆయా భాషల్లోని అత్యుత్తమ చిత్రాలకు పురస్కారాలు అందచేయడం 1956 లో మొదలైంది.ఇలా పదిహేనేళ్ళ పాటు పెద్దగా మార్పులు లేకుండా సాగిన ఈ పురస్కారాలు 1968 లో చలనచిత్రాల్లో నటించిన నటీ నటులు, తెర వెనుక పనిచేసిన సాంకేతిక నిపుణులను గుర్తిస్తూ పురస్కారాలు అందచేయాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

ఉత్తమ నటుడు కి ఇచ్చే అవార్డును “భారత్” గాను ఉత్తమ నటి కి ఇచ్చే అవార్డు “ఊర్వశి” గానూ బిరుదులివ్వాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ ఆ తర్వాత కాలంలో ఈ బిరుదులు లేకుండానే పురస్కారాలు అందచేస్తున్నారు. 1968 లో ప్రకటించిన మొట్టమొదటి ఉత్తమ నటుడు అవార్డును ఉత్తమ్ కుమార్ గెలుచుకోగా, ఉత్తమ నటి అవార్డును నర్గీస్ దత్ గెలుచుకున్నారు. ఇదే సంవత్సరం సాంకేతిక నిపుణులు మరియు కళాకారులకు అందచేసిన పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా సత్యజిత్ రే, ఉత్తమ సంగీత దర్శకునిగా కెవిమహదేవన్ అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ చలన చిత్రాలు, ఉత్తమ కళాకారులు మరియు సాంకేతిక నిపుణులను గుర్తిస్తూ వచ్చిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఆ తర్వాత రోజుల్లో మరిన్ని అవార్డులను కూడా ప్రకటించింది.

ముఖ్యంగా కమర్షియల్ సక్సెస్ సాధించి ప్రజల మన్ననలు అందుకున్న సినిమాలను గుర్తిస్తూ “బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్ సం ఎంటర్టైన్మెంట్” అవార్డును ప్రకటించారు. అలాగే విద్యా సంబంధిత విషయాలు, కుటుంబ సంరక్షణ పోషణ మరియు ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలతో నిర్మించిన చిత్రాలను కూడా ప్రత్యేకంగా గుర్తించడం కూడా ఇప్పుడు జరుగుతోంది. అలాగే చలనచిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవలు అందించిన చలనచిత్ర ప్రముఖలను గుర్తిస్తూ “దాదా సాహెబ్ ఫాల్కే” అవార్డు ఇవ్వడం కూడా ఈ జాతీయ అవార్డుల్లో భాగమే. ఈ విధంగా చలనచిత్ర అభివృద్ధి తో పాటు ఈ పురస్కారాలు సైతం మార్పు చెందుతూ వచ్చాయని చెప్పుకోవచ్చు.

ఈ సీరీస్ లోని మిగిలిన వ్యాసాలుజాతీయ చలనచిత్ర పురస్కారాలు- తొలి రోజులుజాతీయ చలనచిత్ర పురస్కారాలు – బెంగాలీ సినిమాలు

Click to comment

Leave a Reply

Subscribe to Navatarangam via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 24 other subscribers

Copyright © 2015 నవతరంగం. Love For Cinema, powered by Venkat Siddareddy.

To Top
Menu Title