Menu

చూసినవారికి “దడ” పుట్టించే దడ


నాగచైతన్య నటించిన కొత్త సినిమా దడ ఈ రోజు విడుదలైంది. 100% లవ్ సినిమా సక్సెస్‌తో ఇప్పుడిప్పుడే అంచనాలు పెరుగుతున్న నటవారసుడు కాబట్టి, పోస్టర్లు గట్రా కొంచెం రిచ్‌గా వున్నాయికదా అని ధైర్యం చేసి (చాలా రోజుల తరువాత ఒక తెలుగు) సినిమాకి వెళ్తే నిరాశే మిగిలింది. ఒక పక్క తమిళ సినిమాల జోరులో ఆంధ్రదేశమంతా కొట్టుకుపోతుంటే మధ్యమధ్యలో విడుదలౌతున్న తెలుగు సినిమాలు మధ్యలోనే పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ మధ్య శక్తి సినిమా చూసి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నా లాంటి వారికి మళ్ళీ లేవకుండ కొట్టిన దెబ్బ - దడ.

సినిమా మొదటి సగం పూర్తికావచ్చినా హీరో ఎవరికి దడ పుట్టించబోతున్నాడో అర్థం కాదు. బహుశా అవసరమున్నా లేకపోయినా వచ్చే ఎనిమిది పాటలవల్ల జనాల్లో ఎప్పుడు పాట వస్తుందో అన్న గుండె దడనే సినిమాకి టైటిల్‌గా పెట్టారేమో అనిపిస్తుంది. ఈ ఎనిమిది పాటల మధ్య, నవ్వు రాని కామెడీ ట్రాకుల మధ్య కథని వెతకడం చాలా కష్టం. అయినా నాకు అర్థం అయిన కథ ఇది –

లాస్ ఏంజలస్‌లొ సెటిల్ అయిన ఒక అన్నా, తమ్ముడు, ఒక వదిన. ఎవరో దారిన పోయే అమ్మాయిని హీరోగారు కాపాడటంతో హీరో కోసం, హీరో చుట్టూ తిరుగుతూనే కనిపెట్టలేని విలన్ల గ్యాంగ్. ఈ మధ్యలో తల్లి లేక, బిలియనీర్ తండ్రి నిర్లక్ష్యానికి గురైన ఒక అమ్మాయితో హీరోగారి లవ్ ట్రాక్. ఇదీ కథ.

అసలు సినిమా లాస్ ఏంజలస్‌లో ఎందుకు జరిగిందో తెలియదు. హీరోయిన్ సమస్య ఏమిటో – ఆమె మొదట తన తల్లి ఆత్మహత్య చేసుకుందని ఎందుకు అనుకుంటుందో, హీరో చెప్తే తప్ప అది ఏక్సిడెంట్ అని ఎందుకు తెలియదో అర్థం కాదు. అన్నింటినీ మించి హీరో ఏ మాల్‌కి వెళ్తాడో, ఏ కాఫీ తాగుతాడో తెలిసినా కూడా అదే మాల్‌లో తిరుగుతున్న హీరోని పట్టుకోడానికి పది రీళ్ళ సినిమా ఎందుకు ఖర్చైందో తెలియదు.

నాగచైతన్య నటన ఫర్వాలేదు కానీ ఇంకా ప్రేక్షకులు అలవాటు పడాల్సి వుంది. కాజల్ మునుపటి సినిమాలలో లాగే బొమ్మలా వుంది. బొమ్మలాగే వుంది. విలన్ రాహుల్ దేవ్ అనవసరపు కథలు చెప్పి విసిగిస్తాడు. శ్రీరాం నటన ఫర్లేదు. కామెడీ నటులు వున్నారు, కామెడీ కనపడలేదు. మిగతా నటీనటులు వున్నా లేనట్టే.

రిచ్‌గా తీశము అని చెప్పుకుంటున్నారు కానీ అందుకు నిదర్శనం నిర్మాత ఖాళీ జేబు తప్ప సినిమాలో ఏమీ కనపడదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులలో అసహనాన్ని పెంచుతుంది. ఒకటి రెండు సీన్లు మినహా కొత్తగా తీసినవి ఏమీ లేవు. (హాలీవుడ్ కాపీ సీన్లు వదిలేస్తే). డైలాగులు కృతకంగాను, చాలా చోట్ల వ్యాకరణ దోషాలతోనూ వున్నాయి. ఎప్పుడో ఎనభైల్లో విన్న డైలాగులు అప్పుడప్పుడు వినిపిస్తాయి (… లేకపోతే నా మీద ఒట్టే..) ఏడిటింగ్ లొపాలు స్పష్టంగా కనిపిస్తాయి. దానివల్ల్ మరీ అతుకులబొంతలా తయారయ్యింది. ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ తన పని తాను చేసుకుపోయింది.

అన్నింటికన్నా బాధ కలిగించే విషయం ఏమిటంటే – సినిమా మొదలైన దగ్గరనుంచి ప్రతి పది నిముషాలకీ ఏదో ఒక పరభాషా చిత్రం గుర్తుకురావటం. టేకన్, టైటానిక్, అల్టిమేటం, షెర్లాక్ హొంస్, రాకీ… ఇలా ఎన్నో..!!

చివరిగా ఒక మాట (హీరో చెప్పే డైలాగు తరహాలో) – సినిమాకి వెళ్ళాలంటే మీకు రెండు చాయిస్‌లు – ఝండూబాం తీసుకెళ్తారా? సారిడాన్ తీసుకెళ్తారా?

 

23 Comments
 1. గీతాచార్య August 11, 2011 /
 2. pallavi August 11, 2011 /
 3. కమల్ August 11, 2011 /
 4. Ravi August 11, 2011 /
  • vinay August 12, 2011 /
 5. గీతాచార్య August 11, 2011 /
 6. చదువరి August 11, 2011 /
  • harilorvenz August 14, 2011 /
 7. Sowmya August 12, 2011 /
 8. Ram August 12, 2011 /
 9. vinay August 12, 2011 /
 10. vinay August 12, 2011 /
  • రామ August 13, 2011 /
  • kowndinya August 14, 2011 /
 11. bonagiri August 12, 2011 /
 12. రమణ మూర్తి August 12, 2011 /
 13. sridhar August 13, 2011 /
 14. Ravi August 15, 2011 /
 15. Ravi August 15, 2011 /
 16. ఆ.సౌమ్య August 17, 2011 /
 17. రాఘవేంద్ర August 19, 2011 /