Menu

zindagi mein LIFE

“ఎప్పటినుంచో ఉన్న ఊడలు దిగిన వటవృక్షాలు కూలిపోయి
వాటి జటిల జటల్లోంచి నానావిధ శాకుంతాలు వృంతచ్చిన్న లతాంతాల్లా రాలిపోయి..” – బైరాగి

మనిషి తల్చుకున్నదే తడువుగా తాననుకుంటున్న చోటుకి వెళ్ళలేకపోవడం ఓ అదృష్టం. ఎందుకంటే అలా వెళ్ళలేకపోవటం వల్ల మార్గాంతరాలు వెతుక్కున్నాడు. ముందు నడకతో. తర్వత జంతువులతో. ఆ పై ఇంధనాలతో. పేరుకే ఒంటరి ప్రయాణం. ప్రయాణం అంటూ మొదలెట్టాక మనిషి ఒక్కడే ఉండలేడు. ఏదో దేశానికి మీరొక్కరే వెళ్తున్నారు. కాని మీరెక్కే ఫ్లైట్‍లో ఇంకెంతో మంది ఉంటారు. అపరిచితులే! పరిచయమవ్వడానికి క్షణం కూడా పట్టదు. పరిచయం ప్రణయానికో, ప్రళయానికో దారితీయడానికి అంతకన్నా కాస్త ఎక్కువ సమయం పడుతుందంతే. ఒకవేళ, ఒంటరిగా కాక చిరపరిచితులతోనో, స్నేహితులతోనో ప్రయాణాలకు సిద్ధమైతే అక్కడ ఎంత ఆహ్లాదం ఉంటుందో, అంత ఆందోళనా ఉంటుందని నాకెప్పుడూ అనిపిస్తుంది. అసలిద్దరి వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని పరీక్షించాలంటే వాళ్ళిద్దరితో ఎక్కడికైనా ప్రయాణాలు చేయిస్తే సరి! సంగతేంటో తేలిపోతుందని నాకో అభిప్రాయం. దాన్ని నిజమని నిరూపించిన చిత్రం: జిందగీ న మిలేగీ దొబారా!

“వెధవది! మళ్ళీ జీవితం ఎవడికి కావాలోయ్? ఉన్నదానితోనే వేగలేకపోతున్నాం.” అన్న విసుగుపూరిత జీవితాన్ని గడిపేవారిని కూడా ఆలోచింపజేయగల చిత్రం. మీరంటే ప్రాణం పెట్టే స్నేహితులూ, మీ ప్రాణమైన వారితో కల్సి చూడదగ్గ, చూడాల్సిన సినిమా ఇది.

ఒక ఫోన్ కాల్‍తో భూగోళానికి అవతల ఉన్నవారిని కూడా చిటికెలో పలకరించుకోగల ఈ తరం స్నేహితుల మధ్య దూరాలెలా పేరుకుపోయాయో చక్కగా ఆవిష్కరించారు. ముగ్గురు స్కూల్ నాటి స్నేహితులు. సారీ! ఇస్కూల్ నాటి స్నేహితులు – ఇమ్రాన్ (ఫర్హాన్ అఖ్తర్), కబీర్ (అభయ్ డియోల్), అర్జున్(హృతిక్ రోషన్). కథ మొదలైన కొన్ని నిముషాలకే ముగ్గురి జాతకాలు తెల్సిపోతాయి. కబీర్ మోకాలు నొప్పెటేంతగా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి, పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఇమ్రాన్ తన కన్నతండ్రిని మొట్టమొదటి సారి కలవడానికి తాపత్రయపడుతున్నాడు. ఇహ, అర్జున్! డబ్బు యావలో పీకలోతు మునిగి, తీసుకుంటున్న ఊపిరిని కూడా తన ధనాపేక్షకు అడ్డురాకుండా తీసుకునే రకం. “నాకు పెళ్ళవ్వబోతుంది” అని తన మాజీ ప్రియురాలితో అప్పుడే చెప్పించుకొనుంటాడు.

కబీర్ ఎటూ ఓ ఇంటివాడయ్యిపోతున్నాడు కాబట్టి, ఇహపై స్నేహజీవన స్రవంతిలో కలుస్తాడన్న నమ్మకం తక్కువ కాబట్టి ఎప్పుడో వాయిదా వేసుకొన్న ఎడ్వంచర్ ట్రిప్‍కు ఇప్పుడు వెళ్ళాలనీ, దానికోసం స్పెయిన్‍ను ఎంచుకుంటారు. వెళ్తారు. బోలెడు ఎడ్వంచర్లు చేస్తారు. అవేమిటి? వాటి వల్ల వీళ్ళ మీద వ్యక్తిగతంగా, గుంపుగానూ పడ్డ ప్రభావాలు ఎలాంటివి? స్పెయిన్ వీధుల్లో తిరుగుతూ, తిరుగుతూ వీళ్ళు చేసిన అంతర్గత ప్రయాణాలు ఎలాంటివి? అసలు వీళ్ళ మధ్య ఈక్వేషన్లు ఎలా ఉన్నాయి? ఎలా పరిణామాలు చెందాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం కాదు, ఈ సినిమా చూడాల్సింది.

హిందిలో ఒక సామెత లాంటిది ఉంటుంది; నడవడం చేతకాదనుకొని ఒక మూల కూర్చొండిపోయినవాడు, ఇల్లు తగలడుతుంటే పరిగెత్తుకొని పారిపోయి అప్పుడు తనకి కాళ్ళున్నాయని గ్రహించాడట. “ఫారెస్ట్ గంప్” చిత్రంలో ఒక సీన్ ఉంటుంది. తెలీని కారణాల వల్ల సరిగ్గా నడవలేకపోతున్న గంప్‍కు సహాయంగా ఉంటాయని ఏవో పరికరాలు అమరుస్తారు డాక్టర్లు. చిన్నారి గంప్ వాటిపైనే నడుస్తుంటాడు. ఒకరోజు, కొందరు ఆకతాయి పిల్లలు తనని ఆటపట్టిస్తూ, అల్లరి చేస్తారు. వాళ్ళ చేతికి గంప్ చిక్కితే అంతే సంగతులు. అతడితో ఉన్న అతడి గర్ల్ ఫ్రెండ్ అతణ్ణి తప్పించడానికి ప్రయత్నించి, కుదరక, “రన్.. గంప్.. రన్!” అని ప్రోత్సహిస్తుంది. అప్పటికే ప్రాణభయంతో వడివడిగా అడుగులు వేయడం మొదలెట్టిన గంప్ మరింత చకచకా నడుస్తూ పోతాడు, ఆ పరికరాలు అడ్డుతగులుతున్నానూ. అతడి నడకలో వేగం ఎంతగా హెచ్చుతుందంటే ఒకానొక క్షణంలో ఆ పరికరం దానంతట అదిగా విరిగి ముక్కలైపోతుంది; ఇతడి వేగాన్ని భరించలేక. తెలీకుండానే గంప్ పరిగెట్టేస్తుంటాడు ఆ పాటికి. ఆ తర్వాత, అతడు నడవడానికి మరే అదనపు పరికరం అవసరం పడదు. ఈ సీన్‍ని చాలా బాగా తీసారు ఆ సినిమాలో.

మనకు తెలీకుండానే మన జీవితాల్లో పైన చెప్పిన లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కాకపోతే ఆ అవటితనాలు కాని, లోపాలు కానీ, వాటికి ఆసరా ఇచ్చే అదనపు అడ్డంకులు గానీ కళ్ళకు కనిపించేవి కావు. మనిషిలో ఉన్న మనిషిని కట్టిపడేసేవి. మిమల్నో, మీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఒకసారి నిశితంగా చూసుకుంటే ఇట్టే తెల్సిపోతుంది, కనిపించని తాళ్ళతో తనని తాను కట్టేసుకున్న మనుషులెవరో అని. “హయ్యో” అనుకొని గబగబా ఆ తాళ్ళు విప్పేసి వాళ్ళకి విముక్తి ప్రసాదిద్దాం అంటే కుదరదు. వాళ్ళంతట వాళ్ళే వాటిని తెంచాలి. అదెలానో చాలా హృద్యంగా చూపించిన సినిమాల్లో జిందగీ న మిలేగీ దొబారా ఒకటి. (ఇప్పటికిప్పుడు గుర్తొస్తున్న మరో చిత్రం: ఉడాన్.)

ముగ్గురు అబ్బాయిలూ నటించలేదు. పనిలో పనని, జీవించేసారు. ముఖ్యంగా హృతిక్ రోషన్. highly volatile emotions చాలా నీట్‍గా ప్రెజెంట్ చేసాడు. మిగితా ఇద్దరూ కూడా బాగా అందుకున్నారు. ముఖ్యంగా ముగ్గ్రురి మధ్య కెమిస్ట్రీ, దిల్ చాహ్‍తా హై లో ముగ్గుర్నీ తలపింపజేసింది. అమ్మాయిల పాత్రను అవసరం మేరకే వాడుకున్నారు. ముఖ్యంగా కత్రినా రోల్‍ని glorify చేయకపోవడం చాలా నచ్చింది నాకు. (కత్రినా విపరీతంగా లావుగా ఉంది ఈ సినిమాలో. అయినా అందంగా అనిపించింది నా కళ్ళకు. ఆమెను ఒక గ్లామ్-డాల్‍గా కాక, ఒక పాత్రగా చూడ్డం నాకిదే మొదటిసారి అవ్వటం వల్లనేమో!)

స్పేన్ అందాలను అద్భుతంగా చూపించారు. కాని, వీళ్ళ ముగ్గురూ వేసే వేషాల వల్ల ధ్యాస అటుగా మల్లదు, ఎక్కువగా. ఈ సినిమా మొత్తానికే హైలైట్ “మాటలు.” ఫర్హాన్ రాసాడని చూసాను, క్రెడిట్స్ లో. కుమ్మేసాడు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు, ఎలా, ఎంత వరకూ మాట్లాడుకుంటారో క్షుణ్ణంగా తెల్సినవాడు రాసినట్టే రాసాడు. అసలు, డైలాగ్-హెవీ (అంటే, హెవీ డైలాగ్ అని కాదు. పాత్రలచేత ఎక్కువగా మాట్లాడించటం అని ఉద్దేశ్యం) చిత్రాలు హిందో రాగలవనీ, అవి ఇంత బాగుండచ్చనీ నేననుకోలేదు. పైగా బాచలర్ పార్టీ థీం కాబట్టి, అసభ్యంగా ఉండే అవకాశాలుంటాయని కంగారు పడ్డాను. ఆశ్చర్యంగా ఇబ్బంది కలిగించేవేవీ ఇందులో లేవు. హాస్యానికి కొదవ లేకపోయినా, ఎక్కడా శృతి మించలేదు. చాలా శ్రద్ధతో తీసిన సినిమా అని తెల్సిపోతుంది. పాటలు నన్ను నిరాశపరిచాయి. పాటలు లేకున్నా ఈ చిత్రానికొచ్చే లోటు లేదు. అయినా, పెట్టాలిగా అని పెట్టటమే! జావేద్ అఖ్తర్ రాసిన కవితలను ఇమ్రాన్ వాయిస్-ఓవర్‍గా వినిపించారు. వినీవినంగానే “వావ్” అనిపించేంతగా ఏదీ లేదు. కానీ కవిత్వం కదా, వినవినగా బాగుంటుందేమో.

’దిల్ చాహ్‍తా హై’ మోడ్రన్ క్లాసిక్! దానితో దగ్గర పోలికలున్న ఈ చిత్రాన్ని క్లాసిక్ అని ఖరారు చేయడానికి బోలెడు సమయం పడుతుంది. కాని, జీవితాల్లో కూరుకుపోయి, జీవిస్తున్నామనే స్పృహను కూడా కోల్పోతున్న ఈ కాలపు మనుషులను, వారి సమస్యలను, వాటికున్న పరిష్కారాలనూ సమర్థవంతంగా తెరకెక్కించిన చిత్రమని ఖచ్చితంగా చెప్పగలను.

సినిమా చూస్తున్నంత సేపూ ఏదో నవోత్తేజం చుట్టుముడుతూనే ఉంటుంది. హాలు నుండి బయటకొచ్చాక కూడా ఆ ప్రభావం అంత తొందరగా పోయేట్టు లేదు.

తొలిప్రేమల్లోనే కాదు, మళ్ళీ-మళ్ళీ (ఒకరితో లేక) ఒకే దానితో ప్రేమలో పడ్డంలోనూ మజా ఉంటుంది. అలాంటి మజా ఈ చిత్రంలో ఉంది. మిస్స్ కాకండి.

 

– పూర్ణిమ తమ్మిరెడ్డి
http://pisaller.wordpress.com/

8 Comments
  1. Sowmya July 23, 2011 /
  2. Krishna chaitanya allam July 24, 2011 /
  3. ash July 24, 2011 /
  4. sasank July 25, 2011 /
  5. naresh nunna August 7, 2011 /
  6. harilorvenz August 14, 2011 /
    • annon August 16, 2011 /
    • annon August 16, 2011 /