Menu

సైద్దాంతిక గందరగోళం “విరోధి”

నక్సలైట్లు/మావోయిస్టులు ఒక జర్నలిస్టుని కిడ్నాప్ చేసే నేపధ్యంలో ఉన్న సినిమా అనగానే కొంత విషయంపై చర్చ, సామాజిక స్పృహ, ప్రస్తుతం నెలకొని ఉన్న సైద్దాంతిక గందరగోళంపై విమర్శ లాంటివి ఉంటాయని ఆశించివెళితే, కథ కంగాళీ అయి, మావోయిస్టుల సైద్దాంతిక కల్లోలమే కథనంలో కలగలిసి మంచి ప్రయత్నంగానే తప్ప గుర్తుపెట్టుకోదగ్గ సినిమాగా మిగిలిపోని చిత్రం ‘విరోధి’.

‘షో’ నుంచీ ‘మిస్టర్ మేధావి’ వరకూ సైకలాజికల్ డ్రామాలను సినిమాలుగా తీర్చిదిద్దగల నేర్పరిగా పేరొందిన దర్శకుడు నీలకంఠ లేటెస్ట్ చిత్రం విరోధి. తన సహజమైన సైకలాజికల్ డ్రామా శైలిని నక్సలిజం, జర్నలిజం మధ్యని సైద్దాంతిక ప్రాతిపదికకు అన్వయించి డ్రామా పండించాలనుకోవడం ఒక ఐడియాగా ఎక్సైటింగ్ గా అనిపించినా, ఒక కథకుడిగా దర్శకుడిగా నీలకంఠ ప్రయత్నం అంతగా పండలేదనే చెప్పొచ్చు.

ఒక సామాజిక, చట్టపరమైన, రక్షణ పరమైన, సైద్ధాంతిక పరమైన సమస్య గురించి చర్చించిన సినిమానేమో (ప్రోమోలలో అదే చూపిస్తారు) అని వెళితే, మళ్ళీ ఇగోలు, ఎత్తుకు పైఎత్తులు, మానసిక చెలగాటాలు, సైకలాజికల్ మానిప్యులేషన్స్, సమయానుకూల కౌన్సిలింగ్ ద్వారా మనిషిలో మార్పు తీసుకురావడం వంటి విషయాలే చెప్పేసరికీ ఎటూపాలుపోలేని స్థితికి ప్రేక్షకుడు వస్తాడు. సబ్జెక్ట్ పరంగా సివిల్ సొసైటి, చట్టం, నక్సలిజం వంటి  బలమైన కోణాల్లో ఏ కోణాన్నైనా సమర్థిస్తూనో లేక వ్యతిరేకిస్తూనో ఒక పాత్రతరఫున కథ కొనసాగి ఉంటే ఎటువైపు నుంచీ సినిమాని చూడాలో ప్రేక్షకుడికి కొంచానికి కొంచెమైనా క్లూ ఐనా దొరికుండేది. కానీ అలా కాకుండా గోడ మీది పిల్లివాటం లాంటి పాలసీతో కథసాగేసరికీ, ప్రేక్షకుడు ఎటువైపు వెళ్ళాలో తెలీక ప్రస్తుతం ఉన్న నక్సలిజం సిద్దాంతంగాలే గందరగోళంపాలై సినిమాకి విరోధిగా మారే అవకాశం ఎక్కువయ్యింది. కనీసం పాత్రల వ్యక్తిత్వాలపైనన్నా మొత్తం కథ నడిపివుంటే పరిస్థితి మరో రకంగా ఉండేది.

నటన పరంగా పాత్ర పాసివ్ అయినా కొన్ని సీన్లలో శ్రీకాంత్ పరిణితి చూపిస్తే, మరికొన్ని సీన్లలో క్లూలెస్ గా అనిపిస్తాడు. కమలినీ ముఖర్జీ ఈ సినిమాలో ఎందుకుందో అర్థం కాదు.  ప్రధానపాత్ర ‘గోగి’ గా అజయ్ నటన ఆకట్టుకుంటుంది. కమల్ కామరాజు, రవివర్మలు మంచి నటులు అనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ. అండర్ ప్లేచేస్తూ ఎమోషన్ పండించే కొన్ని సీన్లలో ఇద్దరూ చాలా బాగా నటించారు.  నూతన నటులు శ్రీరమ్య, కిరణ్ ల నటన బాగుంది. కిరణ్ క్లైమాక్స్ లో చేసిన నటన ఆకట్టుకుంటుంది.

ఆర్.పి. పట్నాయక్ సంగీతం బాగుంది. మూఖ్యంగా జానపద/ఉద్యమబాణీలో సాగే పాట హైలైట్. థీం మ్యూజిక్ కూడా నేపధ్యసంగీతంగా బాగా ఉపయోగపడింది. రామచంద్ర సినెమాటోగ్రఫీ, శంకర్ ఎడిటింగ్ సినిమాని ఆదుకున్నాయి. సినిమా నిడివి 90 నిమిషాలకు కుదించగలిగితే, అనవసరమైన సీన్లపొడిగుంపునుంచీ ప్రేక్షకుల్ని రక్షించినవాళ్ళయ్యుండేవారు.

చివరిగా… ఫలించని ఒక మంచి ప్రయత్నం ‘విరోధి’. మూస సినిమాల మధ్య ఈ సినిమా విభిన్నంగా ఎండమావిలా ఊరించి, ఒయాసిస్సుగా మారక నిరాశ కలిగించినా, మార్పు అవకాశాన్ని ప్రోత్సహిద్దామనుకుంటే ఖచ్చితంగా చూడండి.

5 Comments
    • G July 10, 2011 /
  1. రాజశేఖర్ July 3, 2011 /