Menu

తుమ్ జో మిల్ గయో హో రపీ సాబ్

(24.12.1924 – 31.7.1980)

మహ్మద్ రఫీ చనిపోయి ముప్పై సంవత్సరాలైంది. కానీ అతని పాట మరణించలేదు. భారతీయ సినిమా పాటల నేపధ్యం గానంలో సైగల్ తరువాతి శకంలో ఒక కొత్త ఒరవడిని తెచ్చింది రఫీనే. భారతీయ సినిమా పాట ఎల్లలు దాటి ఒక సంస్కృతి గా, పెద్ద మార్కెట్ గా విస్తరించుకోవడానికి రఫీ లాంటి కొన్ని స్వరాలే కారణం. ఇపుడు టెలివిజన్ సంగీత, నృత్య రియాలిటీ షోల రూపంలో చాలా పెద్ద మార్కెట్ గా అవతరించిందంటే కారణం రఫీ లాంటి అమర గాయకులే. ఎందరో అనామకులైన గాయకులు ఉచ్ఛ జీవితాన్ని చవిచూస్తున్నారంటే దానికి కారణం కూడా మహ్మద్ రఫీ లాంటి అమర గాయకులే.సినిమా పాట కేవలం ఒక అనుభవం, అనుభూతి సాధనం, భావుక జ్ఞాపకమే కాదు పూర్తి స్థాయి పాపులర్ సంస్కృతి . ఆ సంస్కృ఼తి విస్తారం కావడంలోనూ, స్థిరపడటంలోనూ రఫీ ది ప్రధాన పాత్ర.

భారతీయ సినిమాలో రఫీ మొదటి ఆధునిక గాయకుడు. అందుకే ఆయన చాలా మందికి ఆరాధ్యనీయుడు. సినిమా ప్రధాన స్రవంతి వినోద , విజ్ఞాన సాధనం అయినపుడు అది ఎప్పటి కపుడు ప్రజామోదం కోసమో లేదా తను అనుకున్న ప్రజామోదం కోసమో తనను తాను విస్తరించుకుంటుంది. సినిమా కొత్త స్వరూపాన్ని ఎవరు, ఎలా తమ ప్రతిభతో నిర్వచించుతారో వారికి మహామహులుగా గుర్తింపు లభిస్తుంది. ఏ కళాకారుడైనా తన ముందున్న వారి గతిని తిరగ రాసినపుడో లేదా అదే గతిని మరింత నిర్దుష్టంగా , స్పష్టంగా కొనసాగించిననపుడో లేదా తనవైన కొన్ని కొత్త ముద్రలు వేసినపుడో దిగ్గజం అవుతాడు. రఫీ తన ముందున్న వారి గతిని మార్చేశాడు. మొత్తంగా సినిమా పాట పరవళ్ళు తొక్కడానికి రఫీ గొంతు చాలా వరకు కారణం. అతను మొదటి సారి

1 944లో అదీ ఒక పంజాబీ సినిమాకు పాడాడు… రఫీ స్వస్థలం పంజాబే. అతను తన ముందరి దిగ్గజం సైగల్ ని విపరీతంగా ఆరాధించే వాడు, సైగల్ ను రఫీ కలుసుకున్నపుడు సైగల్ కూడా మనందరి లానే అతని గొంతును ఆరాధించాడు. లాహోర్ రేడియో వారికి రఫీ గురించి సిఫారసు చేశాడు. ఒక పంజాబీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకు తన సినిమాలో పాడేందుకు అవకాశం ఇచ్చాడు. రఫీ గళ లక్షణాలకు ముచ్చట పడిన ఆ సంగీత దర్శకుడు వేరే హిందీ సినిమాలో కూడా అవకాశం ఇచ్చాడు. అయితే రఫీ ఎంత బాగా పాడినా అతనికి తన స్వర ప్రయాణంలో కొన్ని కుదుపులు తప్పలేదు. రఫీ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన కాలంలో గాయకులైన వారే నటులయ్యే వారు లేదా నటులే పాడేసే వారు. కుందన్ లాల్ సైగల్ అలా తెర మీద కనిపిస్తూనే పాడే వాడు. నేపధ్య గానం ( ప్లేబ్యాక్ సింగింగ్ ) ఇంకా పూర్తిగా మొదలు కాని సమయం అది. అందుకే పాటలు పాడాలని గంపెండు ఆశతో బొంబాయికి మకాం మార్చిన రఫీకి ఈ వాతావరణం ముందు కలిసిరాలేదు. ఆ తరువాత నేపధ్య గానం (నటులకు గాయకులు పాడటం) మొదలయ్యాక కూడా, మంచి గాయకుడిగా పేరు వచ్చాక కూడా రఫీ అవకాశాల విషయంలో అష్ట కష్టాలు పడ్డాడు. ఆ రోజుల్లో నేపధ్యగానంలో అవకాశాలు స్వర మధురిమ , గాన ప్రతిభ వల్ల కాక అంతకు ముందు ఏ తారలకు పాట పాడారు అనే ప్రాతిపదిక మీద వచ్చేవి. రఫీ అందరికీ పాటలు పాడేవాడు. ఆ కారణంగానే నౌషాద్ లాంటి సంగీత దర్శకులకు రఫీ గానం మీద నమ్మకం ఉన్నా కూడా కోరస్ పాటలే ఇచ్చేవారు.. రఫీ లాంటి గాయకుడు కూడా తారల సంస్కృతి కారణంగా కోరస్ పాటలు పాడాల్సి వచ్చింది. సినిమాలో స్టార్ కల్చర్ అక్కడ నుంచే వేళ్ళూనుకుంది. అందుకే మనకు తారలే దిగ్గజాలు అయ్యారు తప్ప సినిమా రంగంలో ని ఇతర కళాకారులు ఆ స్థాయికి రాలేదు. ఆ కాలంలో ఇంకెంత మంది గాయకులు తమ గొంతును అభినయించే తార దొరక్క మూగవోయారో మనకు తెలియదు. అప్పటి ఈ పరిమితిని రఫీ తన స్వరంలో ని విస్తృతి ద్వారా అధిగమించాడు. సైగల్ లానో, ఆనాటి మరో గాయకుడిలానో కొన్ని తరహాల పాటలే కాదు చాలా రకాల పాటలు పాడగలిగిన ప్రతిభ అతనికి ఉండేది.రఫీ సినిమాల్లో కి వచ్చే’సరికి భారతీయ సినిమా , బాలీవుడ్ ఇంకా తొలి అడుగులు వేసే దశలోనే ఉన్నాయి. నాటకాల ప్రభావం వాటి మీద చాలా ఉండేది. పాటలు, పాడే వారి శైలి కూడా నాటకీయంగానే ఉంది. ఎపుడైతే సినిమా, దానిలో సంగీతం ఈ నాటకీయతను కొద్ది కొద్దిగా దాటుకుంటూ వచ్చాయో ,దాని స్థానంలో ఆదునిక వైఖరి మొదలైందో అప్పుడే నాటకీయత లేకుండా, శాస్ర్తీయ సంగీత వాసనలు కూడా లేకుండా లలిత సంగీతం లా సరళంగా పాడే ఆధునిక గాయకుడి అవసరం వచ్చింది. అలాంటి పాటలు ఎలా పాడాలో చూపెట్టిన వాడు రఫీనే. అందుకే కోరస్ గా పాడించిన నౌషాదే మొదటి హిట్ పాట కూడా ఇచ్చాడు. బైజు బావరా సినిమా రఫీని పూర్తిగా వెలుగులోకి తీసుకు వచ్చింది. గీత్, గజల్ , ఖవ్వాలి, రాక్ ఏ శైలి అయినా చక్కగా పాడేస్తాడు అనే నమ్మకం సంపాదించుకున్నాడు. అతనిలో విస్తృతి ఎంత ఉందో చెప్పడానికి ఈ పాటల జాబితా చాలు..

పాట ఏ తరహా సినిమా పేరు

మన్ తరపత్,, శాస్ర్తీయ సంగీతం బైజు బావరా

లేకే పహలే ప్రేమ సిఐడి

హహ్ బేఖుది గాఢ మైన ప్రణయం కాలా పాని

చౌదువీ కా సున్నితత్వం చౌదువీ కా చాంద్

చాహే కోయి ముఝే సరదా అల్లరి జంగ్లీ

సర్ జో తేరా హాస్యం ప్యాసా రఫీని1950 నాటికి రఫీ ముకేష్, లతా, ఆశా వంటి మహామహుల సరసన చేరాడు. అదే రఫీ 70 ల కాలంలో కిషోర్ కుమార్ ప్రభంజనం ధాటికి వెనకపడ్డాడు. రఫీ తన కెరీర్ లో దాదాపు 4,516 హిందీ,112 హిందీ ఏతర, 328 ప్రైవేట్ పాటలను పాడాడని వికీ పీడియా చెబుతోంది. రఫీ తొలి తరం భారతీయ సినిమా ప్రయాణానికి దిక్సూచి లాంటి వాడు. పృథ్విరాజ్ కపూర్, రాజ్ కపూర్, రిషీ కపూర్ లకు అతను స్వరమిచ్చాడు. మూడు తరాల సినిమాల తాలూకు వైఖరులు , వాటికి తగ్గట్లు పాటల్లో వచ్చిన మార్పులను మనం రఫీ పాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. సినిమా మార్కెట్ పూర్తిగా విస్తరించాక ఆ రంగంలో ఆయా శాఖలకు ఇచ్చే ప్రాధాన్యత మారింది. రఫీలానే ఆధునిక రూపం సంతరించుకుంటున్న పాటను ఆవిష్కరించారు కనుకే అప్పటి గాయకులు సంగీత దర్శకులతో సమాన స్థాయి అందుకున్నారు. పదే పదే పాటను సాధన చేయడం రఫీ వ్యవహార సరళిలో భాగం. అవసరమైతే సాహిత్యం కూడా మార్చేయమనే వాడు. పర్ఫెక్షనిజం అనే జబ్బు ఉందని పరిశ్రమలో వారు తిట్టిపోసుకున్నా అతను మాత్రం దానిని వృత్తి మీద నిబద్దతగానే భావించేవాడు. రఫీకి రకరకాల పాటలు పాడే సామర్ద్యంతో పాటు మరో ప్రతిభ కూడా ఉంది. సంగీతం సహజంగా అబ్బి, పాడటంలో శిక్షణ తీసుకోని వారు తక్కువ పదాలతో కూడిన పాటలను సునాయాసంగా అందుకోగలరు. అవే పాటలు రఫీ కూడా బాగా పాడగలడు. అయితే లోగొంతుక లో ఉండే పాటలంటే రఫీ గొంతులో వెలక్కాయ పడ్డట్లే. కానీ ఇలాంటి పాటలను పాడేందుకు రఫీ తనదైన సరళమైన శైలి అనుసరించాడు. వాటిని ఎటువంటి నాటకీయత లేకుండా పాడేసే వాడు. (షామ్ ఎ బహార్ ఆయా .. షమా పర్వానా ) ఇక్కడ దాకా రఫీ సినిమా పాటకు కొత్త ముద్ర వేస్తే జంగ్లీ తరువాత పూర్తిగా తనదైన ముద్ర వేశాడు. హిందీ సినిమాల కధలు హీరో చుట్టూనే అల్లుకుపోవడం, హీరో గొంతుకు మగతనపు స్పర్శ అవసరమైపుడు ఆ అవసరాన్ని పూర్తిగా తీర్చినవాడు రఫీనే. భారతీయ సమాజం జీవనశైలి పరంగా నిదానంగా పశ్చిమం వైపుకు వెడుతున్నపుడు లేదా ఆ ప్రయాణం ఊపందుకున్నపుడు ఆ మార్పులకు తగ్గ సినిమాలు వచ్చాయి. పాటలూ వచ్చాయి. యాహూ వంటి జంగ్లీ పాటలు వచ్చాయి. (ఈ పాటలు పాడటం ఆయనకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు అది వేరే విషయం ) సినిమా నిర్మాణంలో, సాంకేతికతలో వచ్చిన మార్పులను బట్టి నటీనటుల శైలి మారింది. తన గొంతును తెర మీద అభినయించే వారి నటన పరంగాను, సంగీతంలో సాంకేతికాంశాల పరంగా వచ్చిన మార్పులను కూడా తన గొంతులో రఫీ బాగా పలికించాడు.. అతని కెరీర్ లో కొన్ని ఉత్తమ పాటలు చాల గొప్ప సంగీత దర్శకుల కోసం పాడ లేదు. రఫీ ఎవరి దగ్గరైనా పాట పాడేవాడు. పాట బావుండటమే అతని షరతు. అందుకే సినిమా పెద్దదా కాదా అనే దానితో సంబంధం లేకుండా అతని పాటకు గుర్తింపు వచ్చింది. రఫీ గొంతు గురించి నికార్సుగా చెప్పాలంటే సంగీత పామరుడు కూడా అతని పాట వినేసి కూనిరాగాలు తీసేయగలడు. అతను పూర్తి స్థాయి గానప్రతిభ కలవాడా అంటే సమాధానం గట్టిగా చెప్పలేం కానీ సినిమా మాధ్యమానికి సంబంధించిన అవసరాలను ఎలా తీర్చాలో భవిష్యత్తు తరాలకు తన పాట ద్వారా స్పష్టంగా మార్గ నిర్దేశనం చేశాడు. అతను తన జీవిత కాలానికి సంబందించిన తరాలకే చిరస్మరణీయుడు గా మిగిలిపోలేదు. రఫీ స్వర సరళి కేవలం అతని పాటల్లోనే కాదు..ఇపుడు శ్రోతల ఆదరణ పొందిన చాలా మంది గాయకుల శైలిలో కూడా పదే పదే వ్యక్తమౌతుంటుంది అందులో ఇప్పటి నెంబర్ వన్ గాయకుడు సోను నిగమ్ కూడా ఉన్నారు. అలాంటి సోను నిగమ్ ను చూసి స్ఫూర్తి పొంది టెలివిజన్ రియాలాటీ షోల ద్వారా తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్న చిన్నారి గాయకుల లేత గొంతుల్లోనూ రఫీ ప్రతిధ్వనిస్తున్నాడు. పాటను అమాంతంగా శ్రోతల హృదయాల వాకిట నిలబెట్టాలంటే రఫీ పాటను పుస్తకంలా చదువుకోవాల్సిందేనని సోను నిగమ్ చెప్పే మాటల అర్ధం ఒక్కటే.. నేపధ్య గాన సరళిని అలవరుచుకోవడానికి అతనో పునాది లాంటి వాడు.. అందుకే రఫీ చనిపోయి ముప్పై సంవత్సరాలే కాదు, మరో ముప్పై సంవత్సరాలు గడిచినా అతని స్వరం, శైలి సందర్భ నీయతను కోల్పోవు.. అందుకే మహ్మద్ రఫీ పాటకు నిత్య సంస్మరణ జరుగుతుంది. .

శ్రీబాల

One Response