వైవిధ్యమైన చిత్రాల నాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పలువురి ప్రశంసలు అందుకున్న ఆమిర్ ఖాన్ నిర్మించిన సినిమా అంటే సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూడటం సహజం. అమీర్ నిర్మించిన సెటైర్ కామెడీ “పీప్లీ లైవ్”, కావ్యాత్మకమైన చిత్రం “దోభీ ఘాట్” చూసినవారు తర్వాత చిత్రం కూడా అలాంటిదే వుంటుందని ఆశించవచ్చు. అయితే ఇప్పుడు విడుదలైన “ఢిల్లీ బెల్లీ” చిత్రం ఆ చిత్రాలకు విరుద్ధంగా ఒక కొత్త పంధాలో తీసినప్పటికీ, ప్రేక్షకుల్ని నిరాశపరచదనే చెప్పచ్చు. ఈ చిత్రం గురించి అమీర్ ముందే హెచ్చరించినట్లు ఇందులో వాడిన మాటలు, కొన్ని సన్నివేశాలు కేవలం పెద్దలకు మాత్రమే (పెద్ద అక్షరాలలో) కావటం, కొంత జుగుప్సాకరమైన సన్నివేశాలు వుండటం వల్ల అన్ని వర్గాలనీ ఆకట్టుకుంటుందా అనే సందేహమే. ఆ విషయాలను పక్కన పెట్టి చూస్తే, ఇప్పటికే బాలీవుడ్ లో వస్తున్న “గోల్ మాల్” తరహా హాస్య చిత్రాలకు పూర్తి భిన్నంగా తయారైన ఈ సినిమా (చాలా కాలం తరువాత) కడుపుబ్బ నవ్వుకునే చిత్రంగా గుర్తుండిపోతుంది.
ఇక కథలోకి వెళ్తే – ఒక పత్రికలో జర్నలిస్ట్ గా పని చేస్తున్న తాషి (ఇమ్రాన్ ఖాన్), ఫోటోగ్రాఫర్ నితిన్ (కునాల్ రాయ్ కపూర్), కార్టూనిస్ట్ అరూప్ (వీర్ దాస్) ముగ్గురూ ఒకే ఇంట్లో వుంటుంటారు. అనుకోని పరిస్థితిలో తాషి ప్రేమికురాలు, ఎయిర్ హోస్టస్ సోనియా (షెహనాజ్) ఒక వజ్రాల పేకెట్ ను వీరి రూమ్ కి చేర్చి, వాటిని ఒక గ్యాంగ్ స్టర్ (విజయ్ రాజ్)కి చేర్చమని కోరుతుంది. ఈ లోగా స్ట్రీట్ ఫుడ్ తిన్న నితిన్ కడుపులో గడబిడ మొదలౌతుంది. మెడికల్ లాబ్ కి చేరాల్సిన స్టూల్ సాంపిల్, వజ్రాల పేకెట్ తారుమారు కావడంతో కథ అడ్డం తిరుగుతుంది. ఇక అక్కడి నుంచి మొదలైన పరుగు, ఆ రాకెట్ ను బస్ట్ చేయడంతో ముగుస్తుంది. ఈ లోగా తాషి కొలీగ్ మేనక (పూర్ణా జగన్నాథ్) తాషిని ప్రేమించడం, ఆమె భర్త తాషిని వెంటాడటం, ముగ్గురు హీరోల ఇంటి ఓనర్ రాసలీలల్ని నితిన్ తన కెమెరాలో బంధించి అతన్ని బ్లాక్ మెయిల్ చెయ్యడం, అతను వీళ్ళకోసం వెతకడం – ఇవన్నీ కలిసి మనకి కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి.
ఇలాంటి కామెడీ సినిమాలు ఇంతకుముందు చాలా వచ్చినా ఈ సినిమా భిన్నంగా వుండటానికి కారణం దర్శకత్వం, స్క్రీన్ ప్లే, మాటలు. అమీర్ ఖాన్ సినిమాలు మొదలుపెట్టిన దగ్గర్నించి కొత్తవారిని ప్రోత్సహిస్తూ వచ్ఛాడు. అదే పంధాలో ఈ సినిమా కూడా దర్శకుడు అభినయ్ దేవ్ కి తొలి చిత్రం. రచయిత అక్షత్ వర్మ కూడా కొత్తవాడే. ఇది పేరుకి హిందీ సినిమా అయినా సినిమా మొత్తం ఇంగ్లీషులోనే సాగుతుంది. అక్కడక్కడ హిందీ మాటలు వినపడ్డా వాటిలో ఢిల్లీ లాంటి ప్రాంతంలో వాడే బూతు మాటలే ఎక్కువ. ఇక ఇంగ్లీషులో వాడిన చాలావరకు పదాలను ఇక్కడ చర్చించడం దాదాపు అసంభవం. చిత్రం పేరులోనే చెప్పిన “బెల్లీ” కష్టాలు కొంత ఓవర్ డోస్ అయినా నవ్విస్తాయి. నీళ్ళు లేని రూం లో నితిన్ డయోరియా ఇబ్బందులు కొంచెం హద్దుమీరాయి. ఇక విలన్ దగ్గరకు వెళ్ళిన పార్సిల్ ని తెరిచి వివరంగా చూడటం లాంటివి చూడటానికి కొంచెం గుండె దిటవు కావాలి. ఈ సినిమాకి ఢిల్లీకి ఏం సంబంధముందో అర్థం కాదు. ఇదే కథని వేరే ఏ వూర్లో తీసినా మారేదేమీ లేదు. కనీసం పాత్రలు (ఇంగ్లీషు మధ్యలో) ఢిల్లీ భాష మాట్లాడినా కొంతవరకు బాగుండేదేమో. ఇక నితిన్ “బెల్లీ” సమస్యని మరీ ఎక్కువగా “చూపించారేమో” అనిపించింది. సినిమా ద్వితీయార్థంలో ఇది కొంచెం ఓవర్ డోస్ అయినట్లు అనిపించినా, చివరి పదినిముషాలు అనవసరమైన లాగుడు అనిపించినా చివరికి మంచి సినిమా చూశామని అనిపిస్తుంది.
సంగీతం, ముఖ్యంగా “భాగ్ డీకే బోస్” పాట గుర్తుండిపోతుంది. కెమెరా పనితనం చాలా బాగుంది. రద్దీ ఢిల్లీ గల్లీలలో చాలా సహజంగా (బహుశా 5D వాడి) తీసిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నటీనటులంతా పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ఇమ్రాన్ ఖాన్ ఈ సినిమాతో మంచి నటుడిగా కూడా మార్కులు కొట్టేశాడు. “బెల్లీ” కష్టాలు పడే నితిన్ గా నటించిన కునాల్ రాయ్ కపూర్, గ్యాంగ్ స్టర్ గా విజయ్ రాజ్ గుర్తుండిపోతారు.
చివరిగా ఒక మాట – మార్కెటింగ్ పరిభాషలో సినిమాని ఒక ప్రాడక్ట్ అనుకుంటే దాన్ని ఆదరించే కస్టమర్స్ కొంతమంది వుంటారు. ప్రేక్షకుల్ని అందరినీ (అన్ని వర్గాలనీ) ఆకట్టుకునే “ఆ బాలగోపాల చిత్రం” తీస్తామని అనుకోవడం చాలా మంది దర్శక/నిర్మాతల అమాయకత్వం లేదా మూర్ఖత్వం. ప్రతి సినిమాకీ ఒక సెగ్మెంట్ (segment) వుంటుంది. లేదా సినిమాని బట్టి సెగ్మెంట్ ని తయారు చేసుకోవాలి. “ఢిల్లీ బెల్లీ” చేసిన పని అదే… ఇరవై ముఫై మధ్య వయసు వున్న, ఇంగ్లీషు మాట్లాడగలిగిన, మోడరన్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రమే ఇది నచ్చుతుందని నా అభిప్రాయం. (తప్పు కావచ్చు). అయితే ఇంత చిన్న సెగ్మెంట్ వుందని గుర్తించి, అలాంటి సినిమా తీయచ్చని ధైర్యం చేసిన నిర్మత ఆమిర్ ఖాన్ అభినందనీయుడు.
ఈ సినిమా చూస్తే నవ్వుల విందు అని ఖచ్చితంగా చెప్పచ్చుకానీ, చూడాలా లేదా అనే విషయంలో కొంచెం ఆచితూచి నిర్ణయించుకోవడం మంచిది.
కొసమెరుపు: సినిమా చివర్లో (క్రెడిట్ రోల్స్) హటాత్తుగా కనిపించిన అమీర్ ఖాన్ టైటిల్స్ పూర్తైయ్యేదాకా సీటులో నించి కదలనివ్వడు. ఎనభైల్లో వచ్చిన మిధున్ – బప్పీలహరీ లాంటి పాటకు అమీర్ నృత్యం ఆకట్టుకుంటుంది.
ఢిల్లీ బెల్లీ
దర్శకత్వం: అభినయ్ డియో
నిర్మాతలు: ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, రోనీ స్క్రూవాలా
రచన: అక్షత్ వర్మ
సంగీతం: రామ్ సంపత్
Sreekanth says:
Abhinay Deo first directed film was GAME. A action thriller but a flop, it was shot is exotic locations.
http://en.wikipedia.org/wiki/Game_(2011_film)
sahiti says:
“ఢిల్లీ బెల్లీ” అంటే కడుపులో గడబిడ అని అర్ధం .
దర్శకుడు అభినయ్ “డియో” కాదు అభినయ్ దేవ్
ఆ స్పెల్లింగ్ ఎందుకు రాస్తారో వాళ్ళకే తెలియాలి.
zulu says:
Movie is good and I recommend to watch this along with friends and if your partners are highly broadminded, then I can bet you will have fun for sure. The screen play is so crisp and I never felt there shld be a break in between. Worth watching.