Menu

ఓ పేద హృదయపు ప్రేమ కథ

ఆదిమనసు మాయో..లేక హార్మోనుల ప్రభావమో తెలియదుకాని యవ్వనపు తొలినాటి నుండి అవతలివ్యక్తి మీద ఆకర్షణ మొదలవుతుంది.ఆది బలమై ప్రేమగా మారుతుంది.ప్రేమ మనసుకు ఆనందాన్నిస్తుంది.ఆ ఆనందం కోసం మనిషి పరితపిస్తుంటాడు..కాని విధి ఆడే వింత నాటకంలో ప్రేమని పొందలేక పోతారు కొందరు…… ప్రతి మనిషి జీవితంలోఇలాంటి స్థితిని ఎదురుకొంటాడు.

జీవితం ఒక సర్కస్ అయితే, బాధలన్నీ గుండెమాటున దాచుకొని..మోహంలో ఆ భావాలు కనపడకుండా రంగుపులుముకొని…ప్రేక్షకులని నవ్వించటమే  ఓ జోకర్ చేయాల్సింది. అతని జీవితంతో…పేదరికంతో..బాధలలో.. దేనితోను ప్రేక్షకులని సంబంధం లేదు. ఒక్కసారి జోకర్ పాత్ర ధరించాక మనం నిజంగా ఏడ్చినా అందరూ నవ్వుతారు. ఆది లోకం తీరు.
ప్రపంచం  అనేది సర్కస్ /నాటకరంగం అయితే.. ప్రతివాడు ఓ పాత్ర పోషించాల్సిందే. పుట్టేది ఇక్కడే చావాల్సింది ఇక్కడే. ఇదే స్వర్గం ఇదే నరకం.

రాజు క్లాసు రూం లో అందరిని నవ్విస్తుంటాడు. కొత్తగా వచ్చిన టీచర్ రాజు అమాయకత్వాన్ని చూసి అభిమానిస్తుంది.
తన తండ్రీ ఏం చేస్తుండే వాడో రాజుకి తెలిదు ఒక సందర్భం లో తల్లిని నిలదీస్తాడు.
రాజు తండ్రీ ఒక సర్కస్ లో జోకర్ అని.. అందర్నీ నవ్విస్తూనే కన్నుముసాడనీ చెపుతుంది .  ఓ జోకర్ నిజంగా ఏడ్చినా జనానికి ఆది హాస్యమే, కనక ఆమెకి జోకర్ అంటే  ఇష్టం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోను రాజు జోకర్ కాకూడదు అని అంటుంది. తన తండ్రి సర్కస్ లో జోకర్ అని తెలిసి ఆనంద పడతాడు రాజు.

తనని ప్రత్యేకంగా అబిమానించే టీచర్ అంటే రాజుకి చాలా ఇష్టం.రాజు  టీచర్ని  ప్రేమిస్తాడు.
ఆమె సెలవులకి వెళ్లిపోతుంటే బాధగా అనిపించింది. సెలవులన్నీ భారంగా గడుపుతాడు.సెలవులు ముగిసాయి రాజు స్టేషన్లో  ఆమె కోసం చూస్తాడు.
ఆమె వచ్చింది కాని ఒంటరిగా కాదు తనకి కాబోయే భర్త తో. వాళ్ళిద్దరినీ ఏకాంతం లో చూసిన ప్రతిసారీ రాజు మనసు కలుక్కుమంటుంది. రాజుది తొలి యవ్వనపు ప్రేమ.

తనను చూసి అందరూ నవ్వుతున్నారని రాజు బాధపడుతుంటే…’మూనాళ్ళ ముచ్చట’ అయిన  జీవితంలో మనస్పూర్తిగా మనిషిని  నవ్వించేది ఒక జోకర్ యే అని  చెపుతాడు టీచర్ ఫియాన్సీ మనోజ్ కుమార్.ఆ మాటలు రాజుకి మనసుకి బాగా హత్తుకుంటాయి. హాయిగా అనిపిస్తాయి. తను జోకర్ అందరినీ నవ్విస్తాడు.
తను జోకర్ అని నమ్మిన రాజు రోడ్డుమీద ఏదో గారడీలు చేస్తుంటాడు.దాంతో స్కూల్ నుండి గెంటి  వేయబడతాడు. తనని అభిమానించే  టీచర్ కూడా కాపాడలేకపోతుంది.
టీచర్ పెళ్లి జరిగి తన భర్తతో వెళ్ళిపోతుంది…దాంతో రాజు హృదయం వికలం అవుతుంది.

ముంబై వీధుల్లో తమాషాలు చేస్తూ జీవనోపాధి పొందుతుంటాడు రాజు.  ఓ విదేశీ సర్కస్ బృదం తో పాటు సర్కస్ కంపనీలోకి దూరుతాడు.
డబ్బుకోసం  రింగ్ మాస్టర్ గా సింహాలని ఆడించబోతాడు. ప్రమాదం తప్పుతుంది. కానీ రాజు లోని జోకర్ ని గమనించిన కంపనీ యజమాని రాజు ని జోకర్ ని చేస్తాడు.
అక్కడ కొత్తవిధ్యలు నేరుస్తాడు. విదేశీ వనిత రీనా తో పరిచయం పెరుగుతుంది.. ఆమెని ప్రేమిస్తాడు. రీనా కూడా రాజు అంటే అభిమానం చూపుతుంది.
రీనాని తన తల్లికి పరిచయం చేస్తాడు. రీనా ని కోడలి గా ఉహించుకొని ఆ తల్లి హృదయం ఆనందపడుతుంది.
రాజు కలల ప్రపంచం లో విహరిస్తాడు. కాని జీవితం కల  కాదు కదా..జీవితంలో  కలలు ఎన్ని అయినా కనొచ్చు. కాని కన్నా ప్రతి కలా నిజం కావాలనుకుంటే  బాధే మిగులుతుంది. రాజు కి కూడా అదే జరిగింది.  విదేశీయులు వెళ్ళిపోయే సమయం వస్తుంది.రీనా రాజు అంటే ప్రేమ లేనట్టే వెళ్ళిపోతుంది. రాజు హృదయం బీటలు వారుతుంది.

ఒంటరిదైన ‘మిను’ తనని తాను రక్షించుకునెందుకు మగ వేషం లో తిరుగుతుంటుంది.  ఎప్పటికయినా హీరోయిన్ కావాలనే కల అమెది. రాజుకి ఆమెతో పరిచయం అవుతుంది. ఇద్దరు కలిసి మళ్లీ రోడ్డు మీద తమాషా చేస్తూ బ్రతుకుతుంటారు . ఒకరోజు మీను  అమ్మాయి  అనితెలుస్తుంది. ఆమె అబద్దం  చెప్పటం  రాజుకి నచ్చదు. వెళ్లి పోవాలనుకుంటాడు. కాని ఆమె అతన్ని ప్రేమిస్తున్నాను అని చెపుతుంది. వెనకా ముందు లేని మిను తనని వదిలి వెళ్లిపోవద్దని అంటుంది.  ఎండిపోయిన  రాజు గుండెకి ఇది తొలకరి చినుకులా అనిపిస్తూంది. కొంతకాలం సజావుగా సాగుతుంది. మిను నాట్య ప్రదర్శనల్లో కాలం బాగానే గడుస్తుంది. కాని ఒక ప్రదర్శనలో తన అభిమాన నటుడు మీను ని  మెచ్చి హీరోయిన్ గా అవకాశం ఇస్తాడు. మీను పెద్ద హీరోయిన్ అవుతుంది. రాజుని మరిచిపోతుంది.  ఒంటరి వాడయిన రాజు హృదయం ముక్కలవుతుంది.
” లోకంలో చాలా మంది స్త్రీలు ఇంతే…ప్రేమిస్తారో.. ప్రేమించినట్టు నటిస్తారో…ప్రేమించి తమను తాము మోసం చేసుకుంటారో.. ప్రేమలో ఉండే కష్టాలకి జంకి  సుఖం వైపు పరుగుపెడతారో..” తెలీదు.

రాజు తన చివరి సర్కస్ ప్రదర్శనకి ఈ ముగ్గురినీ పిలుస్తాడు..ఒక జోకర్ మనసులో ఉండే ఆవేదనని వెళ్ళగక్కుతాడు. ప్రేమలేని పేద హృదయపు గోష ని వినిపిస్తాడు.
ఆ బాధలోంచే  గర్వంగా చెప్పుకుంటాడు.. ” మేరా నాం జోకర్”.

మనిషి ప్రేమని కోరుకుంటాడు. ప్రేమ కోసం తపిస్తాడు, చుట్టూ ఎంతో మంది మనుషులూ ఉన్నా ప్రేమించే హృదయం  అందరికీ దొరకదు. ఒక జోకర్ అందరినీ  నవ్విస్తాడు, అందరూ చప్పట్లు కొడతారు. తనని అందరూ  ప్రేమించినట్టు అనిపిస్తూంది, కాని తనని ఓ నవ్వించే బొమ్మగానే చూస్తారు  తప్ప మనిషి గా కాదు.

Khwaja Ahmad Abbas అందించిన అద్భుతమైన స్కీన్ ప్లే తో  నాకు ఈ సినిమా బాగా నచ్చింది.  దాదాపు మూడున్నర గంటల సినిమా అయినా ఎక్కడా పట్టు సడలకుండా మనసుని హత్తుకు పోతుంది.
సూటిగా ప్రవర్తించని మనిషి తత్వాన్ని,  ఎదుటి వ్యక్తి ప్రేమని గుర్తించీ గుర్తిన్చనట్టు ప్రవర్తించే స్త్రీ తత్వాన్ని చాలా బాగా చుపిస్తారీ చిత్రం లో.  నిర్మాతగా..దర్శకుడిగా..నటుడిగా..ఎడిటర్ గా బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఫిలిం మేకర్  గా మరోసారి నిరూపిస్తాడు రాజ్ కపూర్.
రాజు గా రాజ్ కపూర్ నటన అద్భుతం. అడుగడుగునా కరుణ రసం ఒలికిస్తాడు. ముఖ్యంగా జోకర్ పాత్ర లో.
“అరే భాయ్ జరా దెక్ కె చెలో ..” అందరికీ నచ్చే పాట.  ” జీనా యహా మర్నా యహా ” ఒక గొప్ప తత్వార్తాన్ని  తనలో దాచుకొంది.
” జానే కహా…గయే ఓ దిన్ ”  అనే పాట అయితే భారత చలన చిత్ర చరిత్రలో అ అద్భుత విషాద గీతం గా చెప్పుకోవచ్చు.  ముకేష్ గళం లో అమృతం గా మారిన స్వరాలు,  లో పిచ్ నుండి హై పిచ్ లోకి మారుతూ  మన మనసులోని మనకేతెలియని   బాధ ని వెలికి తీస్తుంది .

Jane Kaha Gaye Wo din.! video song.

బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అయినా  బెస్ట్ మ్యూజిక్. బెస్ట్ సింగెర్. బెస్ట్ డైరెక్టర్ ..బెస్ట్ సినిమాటోగ్రఫి విభాగాల్లో  ఫిలిం ఫేర్  అవార్డులు గెలుచుకొని
విమర్శకుల పశంసలు పొందిన  ఓ అద్భుత భారతీయ చిత్రం.

2 Comments
  1. సామ్రాజ్ఞి July 13, 2011 /
  2. $hankar December 28, 2011 /