Menu

మనకోసం ‘మరో సినిమా’

డెబ్భయ్యో దశకం నాటి భారతీయ సినిమాలో ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం పేరు ‘మరో సినిమా’. సినిమా వినోదం కోసమే కాదు, ఒక సంపూర్ణ కళారూపం అన్నది ఆ విప్లవ నినాదం.

సహజ సరుకు!

భారతదేశంలో మధ్యతరగతి ఒక వర్గంగా ఆవిర్భవించిన సమయమది. ఆ వర్గానికి కొనుగోలు శక్తి పెరిగిన సమయం కూడా. పారిశ్రామిక కళా రూపమైన సినిమా, సహజంగానే, మార్కెట్ ప్రోడెక్టే! అయితే సినిమాకి రకరకాల మార్కెట్లు. ఆ రకరకాల మార్కెట్లకి రకరకాల సినిమాలు కావాలని ఆ రోజు తెలియదు. ఆ మార్కెట్లు ఉన్నాయని తెలిసినా, భారతదేశానికి ఆ మార్కెట్లలోకి ప్రవేశం చాలా పరిమితం. సత్యజిత్ రే పేరు అంతర్జాతీయంగా వినిపించేది. కాని అది ఒంటరి పొలికేకే. అదే నేపథ్యంలో పూనా ప్రభాత్ స్టూడియోను ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్‌గా మలచి సినిమా విద్యాధికులకు తర్ఫీదు ఇవ్వాలని అప్పటి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

సమాంతర ‘రే’ఖ!

ప్రపంచంలో రెండు రకాల సినిమాలు ఉన్నాయి. ఒకటి హాలీవుడ్ రకం. మరొకటి యూరోపియన్ రకం. ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్ భారతదేశానికి యూరప్‌ను తీసుకువచ్చింది. రాజ్‌కపూర్ సైతం మాట్లాడని రష్యన్ దార్శనికుడు ఐసెన్‌స్టైన్. అతగాడి చేతుల్లో రూపు దిద్దుకున్న రష్యన్ కోణం, పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠ్యాంశమైంది. ఆ ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉత్తీర్ణులై వచ్చిన తొలి విద్యార్థి బృందంలో మణికౌల్ ఒకరు. అక్కడ మణికౌల్ చదువుకుంటున్న రోజుల్లోనే రిత్విక్ ఘటక్ ప్రిన్సిపాల్‌గా వచ్చారు (‘అమ్మ అడిగింది, అందుకే వచ్చాను’ అనేవా డట ఆయన. అమ్మంటే ఇందిరా గాంధీ). సత్యజిత్ రేకి దీటుగా మరింత హృద్యంగా సినిమాలు తీసినవాడు ఘటక్. కానీ రే మాదిరిగా ఘటక్ ఉన్నత వర్గీయుడు కాదు. ప్రజానాట్య మండలి అందించిన ఉద్యమకారుడు.

విప్లవ శిల్పం

ఘటక్ వంటి గురువు దగ్గర సినిమా కళలో ఓనమాలు దిద్దిన మణికౌల్ తీసిన మొదటి సినిమా ఎలా ఉంటుంది? సమకాలీన సినిమా శిల్పం మీద విప్ల వమై ఉంటుంది. ‘ఉస్కీ రోటి’ (వాడి రొట్టె) అలాంటి విప్లవ వ్యక్తీకరణే. లీనియారిటీ ఉండదు. షాట్ నిడివి చిన్నదే అయినా సినిమా పరిగెట్టదు. కమర్షియల్ సినిమాకి పూర్తి విరుద్ధం. మెయిన్‌స్ట్రీమ్ సినిమా వారంతా హాహాకారాలు చేశారు. ఆపై మణికౌల్ ను అపహాస్యం చేశారు.

మణికౌల్ ఆయన స్నేహితుడూ, సహపాఠి కుమార్ సహానీతో కలిసి తమ ఉద్య మాన్ని మీడియా సాయంతో అలా రెపరెపలాడించారు (ఆ వచ్చిన ప్రతి స్పందన శ్యామ్ బెనెగల్ ‘అంకుర్’ సినిమాకు ఎందుకు ఎలా ఉపయోగపడింది అన్నది వేరే అంశం. థియేటర్ వరకు వచ్చినవి బెనెగల్ సినిమాలే). మణికౌల్ తీసిన సినిమాలు-‘ఆషాఢ్ కా ఎక్‌దిన్’, ‘సత్తాహ్‌సే ఉఠ్‌తా ఆద్మీ’, ‘నజర్’, ‘దువిధా’, ‘నౌకర్ కీ కమీజ్’, ‘తోతా నామా’- ఏవీ థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. ఒక్క ‘అహ్మక్’ మాత్రం డీడీలో సీరియల్‌గా వచ్చింది. తన 48 సంవత్సరాల ప్రయాణంలో కేవలం పదకొండు సినిమాలు నిర్మించిన మణికౌల్ సినిమాలు తీయడం తప్ప మరో పని చేయలేదు. సినిమాతోనే బతికాడు. తనకు ఇష్టమైన ైవైడ్ యాంగిల్‌లోనే బతికాడు.

సర్వమణి!

మణికౌల్ స్వతహాగా గొప్ప రచయిత కాదు. కాని క్లాసిక్స్ నెన్నింటినో ఔపోశన పట్టినవాడు. మణికౌల్ రుద్రవీణ వాయిస్తే, ఓ రాగం పాడితే బాగుండేది, కానీ అదే ముక్క ఆయన చెప్పిన షాట్‌కి వేస్తే గొప్పగా ఉండేది. మణికౌల్ గొప్ప పెయింటర్ కాదు (జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో రెండు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు). కాని స్టిల్ పెయింటింగ్‌కు సయితం ఆయన కదలికలు నేర్పగలడు. భారతీయ మినీయేచర్ పెయింటింగ్‌లోని స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్‌ని సినిమాకి ఆపాదించి, అన్వయించిన వాడు మణికౌల్. సినిమా షాట్లో చూడాలి ఆయన్ని; క్లాప్ బాయ్ నుంచి సినిమాటోగ్రాఫర్ వరకు; సెట్ బాయ్ నుంచి డెరైక్టర్ వరకు అన్నీ ఆయనే.

ఒక్కముక్కలో చెప్తే, మణికౌల్ ఒక గొప్ప సినిమా టెక్నీషియన్. అంతే!

– ఉపేందర్ కాశ్యప్

One Response