Menu

జానతెలుగుపాటల పుంస్కోకిల – ఒక స్మృత్యాంజలి

తను తెలుగు వాడిగా — వాడిగా తెలుగు వ్రాయగల వాడిగా — పుట్టడం మన అదృష్టం అన్న గర్వంతో మనసు పులకరిస్తుంది ఆయన పేరు వింటే.

నేను తెలుగు వాడినై — అంతో ఇంతో తెలుగు చదవగలిగిన వాడినై — పుట్టడం నా అదృష్టం అన్న స్పృహతో వళ్ళు గగుర్పొడుస్తుంది ఆయన రచన చదివితే.

పానగల్ పార్కులోని పేరులేని చెట్టును తక్షశిల, నలందా, వారణాశి విశ్వవిద్యాలయాలంత “ఎత్తు”కు పెంచిన కులపతి — పుంభావసరస్వతి — ఆయన.

రూపాయ చేసే సెకెండు హ్యాండు పుస్తకాన్ని “విలువ” తెలిసి రెండున్నర పెట్టి కొనుకున్న జోహారి — మేలిమి వజ్రాల బేహారి —ఆయన.

తన రచనలు వేరొకరి పేరుతో చెలామణీ అయినా తనకు అందాల్సిన శ్రీ యశః కీర్తులు వేరొకరి పరమయినా చిరునవ్వే సమాధానంగా కూర్చున్న గుప్తదానపథ సంచారవర్తి — సాక్షాత్ శిబి చక్రవర్తి — ఆయన.

సంగీతం కాదు — స్వరం కాదు — గాయనీగాయకుల కంఠస్వర ప్రతిభాపాటవం అంతకన్నా కాదు — కేవలం — అదునూ పదునూ ఎరిగి ఆయన వేసిన అందమైన మల్లెపూరేకులవంటి మాటల తేటలు చాలు — సినిమా పాటలో మాధుర్యం ఊటలై ఉప్పొంగటానికి.

ఆ మహానుభావుడు, మరెవరో కాదు…

చిగురాకు పదాలతో —

చలనచిత్ర సాహితీ భారతి పాదాలకు —

చిరకాలం నిల్చిపోయే —

చిరువేకువ సిరివెల్గుల పారాణి పూసిన —

వచన రచనాశిల్ప మేస్త్రి!

“మేష్టారు” మల్లాది రామకృష్ణ శాస్త్రి!!

భాషాపరశేషభోగి

సంస్కృతాంధ్ర అంగ్లాలతో పాటు…

— తమిళ కన్నడ మలయాళముల వంటి ప్రాంతీయ భాషలూ…

— అస్సామీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ, గూజరాతీ, తుళు, ఉర్దూల వంటి జాతీయ భాషలూ…

— అరబ్బీ, పారశీ, జర్మన్, ఇటాలియన్, ఫ్రెంచి, చైనీసు, గ్రీకు, లాటిను, జాపనీసు వంటి పాశ్చాత్య విదేశీ భాషలూ…

…ఇవ్వన్నీ వ్యాకరణాలంకార సహితంగా ఔపోశన పట్టిన అగస్త్యులవారు శాస్త్రి గారు.

అంతే కాదు ఆయనకు పాళీ, పైశాచీ, ప్రాకృతాల వంటి ప్రాచీన జీర్ణ భాషల్ని మధించిన అనుభవం కూడ ఉంది — అట — అని జనాలు చెప్పుకోవడమే గానీ ఏనాడూ తనను గురించి తాను చెప్పుకోలేదు ఆయన.

అయినా ఎవరో చెప్పినట్టు (ఆరుద్ర గారు?) శాస్త్రి గారిని అగస్త్యునితో పోల్చడం సరి కాదు. అగస్త్యులవారు తాము ఔపోశన పట్టిన సాగరాన్ని మళ్ళీ వదిలివేస్తే శాస్త్రిగారు మాత్రం తాము త్రాగిన సాహిత్యమహాంబుధులన్నీ తమలోనే భద్రంగా నిక్షిప్తంచేసుకొన్న విజ్ఞానఖని. తరగని గని.

“అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి ఆపలేరు” — ఇది గోడలపై, కొండొకచో ఉడుకునెత్తురు కుర్రాళ్ళ పుస్తకాలపై, కనిపించే ఒక విప్లవ నినాదం. సర్వ “శాస్త్రి” గారి విషయంలో మాత్రం ఇది పచ్చి నిజం.

ఎంతదాచినా… ఆయా భాషల, విద్యల, శాస్త్రాల సారం శాస్త్రిగారి రచనలో అక్కడక్కడా తొంగి చూస్తూనే ఉంటుంది — వివరం ఎఱిగి చూచే వారిని చిలిపిగా పలుకరిస్తూనే ఉంటుంది.

ఐతే, ఎన్ని భాషలు నేర్చినా ఆయన కథ, కవిత, పాట, పలుకు మాత్రం… అచ్చ తెలుగు వెచ్చదనపు ఊపిర్లు పీలుస్తుంటాయ్.

ఓరోజు మిట్ట మధ్యాహ్నం పూట పడక్కుర్చీలో కూర్చుని పరిచితులతో కబుర్లాడుతున్నప్పుడు ఎవరో అడిగారుట “శాస్త్రి గారు, తమరికెన్ని భాషలొచ్చు?” అని.

చేతనే ఉన్న తాటాకు విసనకర్ర పై ఆయన రేకుకొక్క భాషలో సంతకం చేస్తుంటే చోటు చాలక విసనకర్ర వెనక్కి త్రిప్పవలసి వచ్చిందట (తాటాకు వీవెనలు చూడని పట్నవాసులకు: లెఖ్కకు దాదాపు ముప్ఫై భాషలకు పైమాటే)!

అంబురుహుగర్భకులాభరణం

బందరు వాస్తవ్యులు పూజ్యశ్రీ మల్లాది నరసింహ శాస్త్రిగారు సంపన్నులు — సదాచార సంపన్నులు — రసహృదయులు. వారి ఏకైక పుత్రుడు, తండ్రికితగ్గ తనయుడు శ్రీరామకృష్ణుడు. ఖ్యాతిచెందిన మల్లాది వంశవారసునిగా తండ్రిలోని సుగుణాలన్నీ పుణికిపుచ్చుకోవడమే కాకుండా — వంగదేశపు రామకృష్ణుల పిట్టకథోపాఖ్యాన ధోరణిని, హంపీ విజయనగరపు వికటకవీంద్రుల వ్యంగ్యచమత్కార వైచిత్రి ని కూడా జన్మతః తోడు తెచ్చుకున్నారు — ఆ సార్ధక నామధేయులు.

అంతటితో ఊరుకున్నారా?

అదే బందరులోని “విద్యానిలయం”లో వెలసిన మరో సాహితీసరస్వతి బ్రహ్మశ్రీ పురాణం సూరిశాస్త్రిగారి చల్లని కంట పడ్డారు.

శ్రీపురాణంశాస్త్రివారు… ఆయన ఓ వెండి కొండ — తొణకని పాల కుండ!

తన తనుజ గిరిజ మనసిచ్చిన హరుని — నెత్తిన పెట్టుకొని పూజించుకున్నాడు, వెండికొండడు…

తన కురి సిరిని చేబట్టిన హరికి — శాశ్వతనివాసమై నిల్చి తనని తాను గౌరవించుకున్నాడు, పాలసంద్రుడు…

శ్రీ సూరిశాస్త్రిగారు అంతకన్నా ఘనులు!

నూనూగు మీసాల నూత్నయౌవ్వనంలోనే తన నిరంతర విశృంఖలశాస్త్రాధ్యాయనం వల్ల పచ్చల పిడిబాకులా పదునెక్కి ఉన్న ఆ యువ పుంభావ సరస్వతికి తన ఏకైక కుమార్తెను కన్యాదానమిచ్చి — అల్లుడి కాళ్ళు కడిగి — అల్లుణ్ణి తన నెత్తిన పెట్టుకున్నారు.

ఐతే అందరికన్నా ఘనులు రామకృష్ణులవారే…

అటు మల్లాది వంశానికీ ఇటు పురాణం వంశానికీ వారధై — రెండు వంశాల విశిష్ఠ ప్రతిభకూ ఏకైక వారసులై నిల్చారు.

అనారతాధ్యాపనతత్పరుడు

తెలుగు కన్య — రససిద్ధితో అదురుతున్న అధరాల్ని మునిపంటిబిగువున నొక్కిపట్టి — అరనవ్వుతూ — కలలు నిండిన కళ్ళు ఓరగ పైకెత్తి చూసిన చూపు — చురుక్కున గుచ్చుకున్న అనుభూతి కల్గి గుండె ఝల్లుమంటుంది… ఆయన పదాలు — తట్టు పునుగు పూతపూసినట్లు — బంగారం పోతపోసినట్లు — ఒక్కొక్కటిగా మన మనస్సులో ప్రాణంపోసుకుంటుంటే.

అనితరసాధ్యమయిన ఆయన సందర్భోచిత పద, వాక్య ప్రయోగాలకు (అర్ధం తెలియని వారికి అవి ప్రయోగాలు గానే కనిపించేవి) స్ఠాళీపులాక న్యాయంగా ఏ ఒక్క పాట/కథ చూసినా చాలు. కళ్ళు మెరిసిపోతాయి — మనసు తడిసి పోతుంది.

మచ్చుక్కి కాసిన్ని—

“సన్నజాజి తీవెలోయ్ — సంపంగి పువ్వొలోయ్ — చిలిపీ సింగారులోయ్ — పాపలు సిరులొలికే చిన్నారులోయ్…” భానుమతి గారాల గానలహరి కి మల్లాది వారి జానతెలుగు పదాల సిరి తోడై — బంగారానికి తావి అబ్బి — అనురూపా వారి అనురాగం లోని ఈ స్వర విరిఝరికి నయగారాలద్ది నిలిపింది.

“పసదేరు నెమ్మేను — అసియాడు కౌనూ — సరసాల కందోయి — విందోయి నీకు…” — విన్నా… చదివినా… గోరువెచ్చని చలిలో అచ్చతెలుగు ఆకుపచ్చ పచ్చిక పరిమళం సోకిన గమ్మత్తైన ఫీలింగ్! కదూ.

“చిటారు కొమ్మన మిఠయి పొట్లం చేతికందదేం గురుడా…” శిష్యుడికి పాఠం నేర్పే వంకన బుచ్చెమ్మొదినకు బీటు వేస్తున్న గిరీశం యొక్క మాటకారి మోసకారితనం కనిపించకుండా కనిపిస్తూ ఊరించే వీనులవిందు — శాస్త్రి గారి చలువే.

“చిలికింత చిగురు, సంపంగి గుబురు, చినదాని మనసు — చినదాని మీద మనసు…” తనకు మనసైన అమ్మయి మనసును తనకు మటుకే తెలిసిన భాషలో — ఊహకందని చోట ఊరించే కల్పనల సొగసులను — దోసిళ్ళతో కుమ్మరించి… వర్ణిస్తూ —మురిసిపోతున్న ఓ తరుణుడి ప్రేమను ఇలా తేట తెలుగు వెలుగుటద్దాల్లోనే చూపించడం శాస్త్రి గారికి మాత్రమే చేతనైన ప్రౌఢ చమత్కారం.

పల్నాటి యుద్ధం సినిమాలో బాలచంద్రుడి బాలసారె సీనుకోసం “దిగివచ్చెనే, దిగివచ్చెనే, తెలిజేజి సిగపువ్వు దిగివచ్చెనే…” అంటూ ఆయన వ్రాసిన పాట పల్లవి ఒక్కటి చాలదూ… ఆయన రచనా శిల్పం పరిణితి ఏమిటో తెలియడానికి?

తెలిజేజి అంటే శివుడు, ఆయన సిగపువ్వు నెలబాలుడు — అంటే బాలచంద్రుడే!

అర్ధంకాని వారు, ఆ పదగుంఫనపు సౌరభాలకు ఆనందిస్తారు — అర్ధంచేసుకున్నవారు, ఆయన కవితాసరస్వతికి కైమోడ్చి మ్రొక్కుతారు.

ఇంత అందమైన భాషతో పాటకు ప్రాణమూదగల శాస్త్రిగారు సినిమాలకోసం వ్రాసింది మాత్రం తక్కువే. వాటిలో మళ్ళీ తన పేరుతో కాక — స్నేహధర్మమో, మరేదన్నా ఇబ్బందో తెలియదు కానీ — ఇతరుల పేర్లతో వ్రాసినవే బోలెడు.

వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు

మానవత్వాన్నీ, జనజీవన హృదయస్పందనల్నీ, నిష్కల్మషత్వాన్నీ ఊతం చేసుకొని “అంబరచుంబి శిరస్సరఝ్ఝరీ” అన్నట్లు ఎదిగిన ఆయన కలంలో…

భక్తి పలికితే — తులసీదళమంత!

ప్రణయం పలికితే — మరువపు మొలకంత!

కొంటెతనానికి పోతే — కోటప్పకొండ తిరునాళ్ళంత!

ఆయన రచన చేసిన సినిమాల్లో ముఖ్యమైనవిగా ఎన్నదగ్గ ఓ మూడూ సినిమాల్ని గురించి ముచ్చటించుకుందాం.

జయభేరి

జయభేరిలోని “రసికరాజ తగువారము కామా…” పాట ఆయన “స్వర”చన!

కమ్మని రచనకు తోడుగా కన్నడ చక్రవాక రాగాల్ని కలిపి ఆయన సృష్టించిన “విజయరాగచంద్రిక” ఈ పాటకు రాగం ఆయన స్వయంగా కాచి పోసిన కలకంఠ రససారం — ఆరాగంలో తన పదాలకు ఆయనే జతకూర్చిన స్వరాలు — తెలుగుజాతి కొన్ని తరాల పాటు పాడుకుని పరవశించాలన్న అపేక్షతో ఆయనిచ్చిన అమూల్య వరాలు. ఈ “జోక్యాని”కి అంగీకరించిన పెండ్యాలవారూ, అనుసరించిన ఘంటసాల మేష్టారూ — ధన్యజీవులు, పూజనీయులు.

చిరంజీవులు

ఇక చిరంజీవులు విషయానికొస్తే మల్లాది వ్రాసిన అన్ని పాటలూ దేనికవే విలక్షణ సౌందర్య విలసితాలు… విరిసీ విరియని మల్లెల ముల్లెలు.

కానీ “తెల్లవారవచ్చె” మాత్రం ఒక అభినవ “శ్రీ వేంకటేశ్వరవిభో తవ” సుప్రభాతం. ఆ పాట విన్న సంతోషాన్నాపుకోలేని వారబ్బాయి తండ్రికి జాబు వ్రాశార్ట — ఆ పాటలోని సారస్వాన్నీ, సినిమాలో దాని సందర్భ శుద్ధినీ మెచ్చుకుంటూ.

జానతెలుక్కి నెరజాణ తనాన్ని మప్పిన ఆ మనస్వి — యశస్వి — బ్రహ్మవర్చస్వి — ఇచ్చిన సమధానం ఇలా వుందిట:

నాయనా, అది ఒక పాత మేలుకొలుపు పాట. పల్లవి, పాదాలు యధాతథంగా తీసుకొని వాడుకున్నను — పాత పాటలో “మరియాద కాదింక పోరా” ని మాత్రం నేను “మళ్ళీ పరుండేవు లేరా” అని మార్చి వ్రాశాను. కనుక ఇందులో సారస్వం అంటూ ఏమన్నా ఉంటే అదంతా ఆ అజ్ఞాత కవి ప్రతిభే. పాత పాట శృంగారరసప్రధానమైనది కనుక “నల్లనయ్యా రార… వెన్న తిందూగాని రారా” అన్న పదాలు మాత్రం నేను వేసి పాటను భక్తి పరంగ మలిచాను. ఇక సందర్భశుద్ది విషయానికి వస్తే ఈ పాట నిజానికి కొన్ని మాసాల క్రితం వేరే సినిమాకోసం రికార్డు చేయబడి — అందులో పనికి రాక ఇక్కడ చొప్పించబడినది — కనుక సందర్భశుద్ది పూజ్యం.

— ఎంత వినమ్రత, ఎంత నిజాయితీ!

రహస్యం

రహస్యం — లలితాశివజ్యోతి శంకర్రెడ్డిగారు, లవకుశ విజయం ఇచ్చిన ఊపులో… వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో… ఆరోజుల్లోనే లక్షలు ఖర్చుపెట్టి తీసిన సినిమా — భారీ అంచనాలతో విడుదలైన “రహస్యం”లోని రహస్యం మొదటి రోజే జనాలకు తెలిసిపోవడంతో సినిమా పోయినా — నేపధ్యంలో మట్టుకు ఇప్పటికీ వినిపిస్తూనేవున్నాయి ఆ పాత ఆపాత—మధుర గీతాలు.

రహస్యం అనగానే ప్రతి తెలుగు సినిమా “పాట”కుడికీ మొదట గుర్తొచ్చేది గిరిజా కళ్యణం.

ఎప్పుడో ఎవరో తీద్దామనుకొని, తీయబోయి, తీయలేక ఆగిపోయిన “ఉషా పరిణయమ”నే ఒక సినిమాకు, కధానుసారం మల్లాది వారు మిక్కిలి మక్కువతో వ్రాసిచ్చిన యక్షగానం, దరిమిలా “కేళీగోపాల”మై ఒక కృష్ణాష్టమి నాడు “జ్యోతి” మాసపత్రికలో తటిల్లతలా తళుక్కున మిరుమిట్లు గొల్పుతూ మెరిసి — తదనంతరం వేదాంతం వారి పుణ్యాన తెలుగు సినిమా తెరపై ఒక జగజ్జేయమానమైన వెలుగై వెల్గి కొన్ని యుగాలవరకూ ఆంధ్రుల హృదయాల్లో నిలిచిపోయే సంగీత సాహిత్య సంయోగమై రససిద్ధావిష్కారమై నిలిచింది, ఈ గిరిజాకళ్యాణం!

ఇది కవితామాతకు శాస్త్రిగారు చేసిన నిత్య కళ్యణం, తెలుగు వాకిట స్వయానా కట్టిన పచ్చతోరణం.

నాబోటి నిరక్షరకుక్షులు సైతమూ ఇందులోని ఒక్క వాక్యాన్ని తీసుకొని దాని గురించి ఒక పేద్ద వ్యాసమే వ్రాయగలరు అంటే అది అతిశయోక్తి కాదు, మాబోంట్ల ప్రతిభ అంతకన్నా కాదు.

బృహద్ గ్రంధాల్లో సామాన్యులకు అందక అర్ధం కాక దాగి ఉండిపోయిన శాస్త్ర సారాన్ని జానపదాల్లో, జాణపదాల్లో — విడమరిచి, వెలయించి, వెలిగించిన ఈ యక్షగానపు ఇక్షురసాన్ని గ్రోలనిష్టపడని ఆంధ్రుడెవ్వడు?

శంకరాభరణం, ఆనందభైరవి, హంసధ్వని, మధ్యమావతి, కాంభోజి, ఆఠన, వసంత, శ్రీ, బేగడ, కేదారగౌళ,దురితం, సరస్వతి, నాదరామక్రియ, సౌరాష్ఠ్ర, రీతిగౌళ, సావేరి, శహన, సామ, హిందోళ రాగవిభవాల్లో భావావినోద విహారంచేసిన మల్లాది గారి కలం బలం, ఘంటసాల మేష్టారి సంగీత గాన పరిమళం, వెంపటి వారి నృత్య ప్రాభవం, వేదాంతం వారి దార్శనిక కౌశలం — సమ్మోహనం. అజరామరం. అనితరసాధ్యం. ఇది తెలుగువాడు ఏనాడో తెలియక చేసుకున్న అదృష్టం!

ఇక ఇందులోదే “లలిత భావ నిలయా…” పాటకు శ్రీ శాస్త్రి గారి సూచనను అనుసరించి లలితాదేవి ని ఉద్దేశించి ఉన్న పలుకులకు “లలిత” రాగంలోనూ, శారదాదేవి ని గురించి వ్రాసిన వాక్యాలకు “సరస్వతి” రాగంలోనూ, సిరి దేవి చరణాలకు “శ్రీ” రాగంలోనూ ఘంటసాల ఈ పాటకు సంగీతం చేశారు.

ఎన్ని ఉపనిషత్తుల సారమో ఈ గీతము!

డొక్కశుద్ధి గల శాస్త్రి గారు, చిన్న చిన్న మాటల్లో అఖండ శాస్త్ర సారాన్ని గ్రుమ్మరించి దానికి రాగనిర్ణయం కూడా చేస్తే — ఆ పుంభావసరస్వతి ఆదేశానుసారము, ఆయన సూచించిన రాగాల్లోనే సందర్భ శుద్ది గల వరుసలు ఏర్పరచి, తన మధుర గానంతో, తెలుగు భాషలోని తియ్యదనాన్నంతా నింపుకున్న ఈ మృదుల పదజాలాన్ని శ్రవణానందకరంగా ఆవిష్కరించిన ఘనత మాత్రం ఘంటసాల మేష్టారుదే!

అన్నమయ్య… క్షేత్రయ్య… వీరి పదకవితల్లో కనిపించే మధుర శృంగారపు తళుకులద్దిన వేదాంతం శాస్త్రిగారి కవితల్లో కూడా కనిపించకుండా కనిపించి, వినిపించకుండా వినిపించి — ఈ వాక్యాలు ఎవరో మహానుభావుడు సామాన్యులకోసం వ్రాసిచ్చిన సకలవేదాంతసారం అనిపిస్తుంది.

ఆంధ్రుల ఇష్టదైవం శ్రీ వేంకటేశ్వరుడు. ఆ గోవిందాస్తుతిని, ప్రత్యేకంచి ఆంధ్రులకు మాత్రమే చేతనైన నిందాస్తుతిలో వ్రాసిన జిలిబిలిపలుకుల పదకవితా మహామహుడి జాణతనాన్ని ఏమని పొగడను?

“తిరుమల గిరి వాసా…” పాటలో “మమ్మేల సిగపాయ చేనంది చిడిముడిజేసేవా” అంటూ.. వెక్కిరింపు, వేడికోలు కలగలిపి అచ్చ తెలుగు మాటల్లో కమ్మగా కుమ్మరించగల విద్వత్తు, విద్యుత్తు ఒక్క శాస్త్రిగారికి తప్ప అన్యులకందునా?

చూడండి ఆ శ్లేషావాగ్విలాసపు ఆశ్లేషపు బిగియింపు…

మమ్మేల = మమ్మల్ని ఏల (ఏలుకో)

మమ్మేల = మమ్మల్ని ఏల (ఎందుకు)

సిగపాయ చేనంది = జుట్టు పట్టుకొని (చీకాకులకు గురిచేసి)

సిగపాయ చేనంది = తల నీలాలు అందుకొని (మొక్కులు తీర్చి)

నీ దరిచేరినాక కూడా చీకాకులెందు పెడ్తావ్ — అన్న సరసపు శ్లేషార్ధకమైన మందలింపు — నీ దరిచేరిన వారి మొక్కులు వెంటనే తీర్చేస్తావ్ — అన్న భక్తిపూర్వకమైన భావంపు ఇంపు — ఈలాంటి ప్రయోగింపు — ఒక్క శాస్త్రి గారి రచనల్లో మాత్రమే కనిపించే సొంపు.

మోహన రాగం — సమ్మోహన గానం. మా మది లో కలకాలం నిలిచిపోయేలా నిలిపిన పాటలయ్యలు — మల్లాది మేష్టారూ, ఘంటసాల వారూ! మీకిద్దరికీ మా జోహారు!

ఇలా శారదా వారి జయభేరి, వినోదా వారి చిరంజీవులు, లలితాశివజ్యోతివారి రహస్యం — ఈ మూడు సినిమాలతో, సినీరచనాధిపత్యపు పట్టు చిక్కిన త్రివిక్రముడై కూడా పరుగులు తియ్యక… “ఆనందమె జీవిత మకరందం” అంటూ రిలాక్సయ్యారు కీట్సు కవితల్లోని కమ్మదన్నంతా రెండు వాక్యాల్లో కమనీయంగా నిక్షేపించగల నిష్ణాతుడైన… ఆ నిక్షేపరాయుడు.

పేరుకనా డబ్బుకన్నా మనస్సంస్కారానికే ప్రాధాన్యతనిచ్చి — పట్టుదలతో — తమ పరిశోధనల రసపట్టుదలలకే ప్రాముఖ్యతనిచ్చిన యక్షగానాల ముఖ్తకారుడు — “ముంగిటపొలసిన మోహనమాత్మల పొంగించి”న వాగ్గేయకారుడు — శాస్త్రి గారు.

ఆ పురి బాయకుండు…

మల్లాది రామకృష్ణ శాస్త్రి అంతటి వారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారే. అంతటి మహానుభావుడ్ని గురించి మూడే ముక్కల్లో చెప్పాలంటే… మచిలీపట్నం — తంజావూరు — చెన్నపట్టణం… అంతే!

బందర్లో మొదలైన వారి సాహితీ యాత్ర — తంజావూరుచేరి తళుకులీని — చివరకు చెన్నపట్టణంలో చదువుల తల్లి చెట్టునీడన ఇల్లు కట్టుకుంది.

టీ.నగర్‌లో గుడి — పానగల్‌పార్కులో బడి — రసికజన హృదయాల్లో విడిది… ఇదీ శాస్త్రిగారి చిరునామా.

ఎంత చదివినా… ఎంత దూరానున్నా… బందరు మాత్రం ఆయన గుండెల్లో ఉండేది. ఆ ప్రేమే ఆయన్ని “శృంగార కావ్య గ్రంథ మండలి”కి మహారాజపోషకుడ్ని చేసింది. ఆ చేతి చలువనే… హంసవింశతి వెలుగు చూసింది — రాధికా స్వాంతనం వెలుతురులోకొచ్చింది — రంగాజీ, క్షేత్రయ్య, అన్నమయ్య పదాల తియ్యందనం పామరజనావళికి చేరువయ్యింది.

ఆయన బడి — పలుకుబడి

మధ్యవేలికీ ఉంగరంవేలికీ నడుమన సిగిరెట్ ఉంచి, పిడికిలి శంఖంలా బిగించి, బొటనవేలి దగ్గర ఖాళీలోంచి “జివ్వ్…”మని నోట్లోకి పొగలాగటం — పల్చటి మణికట్టును సుతారంగా త్రిప్పి, చిటిక వేసి నుసి రాల్పడం — ఇదీ ఆయన స్టైల్.

అదే స్టైలు తరువాత్తరువాత ఆయన ఏకలవ్య శిష్యప్రశిష్యులు కొందరు కొనసాగించి పెంపుచేయడం విజ్ఞులకెరుకే.

ప్రతి సాయంత్రం పానగల్ పార్కులోని సిమెంటు బెంచీ మీదనో, తిన్నెమీదనో, చెట్టునీడనో కూర్చుని, ఆయన చెప్పే “కాలక్షేపం చదువులు” విని — చదివి — “రససార”స్వతులు, సాక్షాత్సరస్వతులు అయినవారెందరో.

అదొక భువనవిజయం!

పెద్దనామాత్యులూ వీరే! రామకృష్ణ—దేవరాయలూ వీరే!

శ్రీ పింగళి నాగేంద్రరావు, శ్రీ దాట్ల వెంకటనరసరాజు — వీరు సభాపెద్దలు, అంతేవాసులు.

భాగవతుల సుబ్రహ్మణ్యం, శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీరంగం నారాయణబాబు, మద్దిపట్ల సూరి, జలసూత్రం రుక్మిణినాథశాస్త్రి — ఇత్యాదులు… నిత్య సన్నిహితులు, శిష్యులు.

వీరుకాక చందమామ కోసం ఎదురుచూసే చకోరాల్లా శాస్త్రిగారి రాక కోసం ఎదురు చూ…స్తూ కూర్చునే (అప్పటికింకా స్వంత పేరు తెచ్చుకోని) ఏకలవ్యులు మరి కొందరు.

మొత్తానికి సాయంకాలం వేళ చెట్టుచేరుకునే పక్షుల్లా అందరూ ఆ పార్కులోకి చేరాల్సిందే — ఆ సాహితీ భారతిని దర్శించుకోవాల్సిందే.

ఆయన సాన్నిధ్యం — అదొక గురుకులం.

నడిచే సరస్వతీ గ్రంథాలయంలా ఆయన కదిలి వచ్చి కొలువుదీరితే పామరులక్కూడా పాండిత్యం ఒంటబట్టేలా గోష్ఠి సాగేదిట.

రసవత్తరమైన సహజ “ధిషణ”ధోరణిలో ఆయన ధృతి సాగిస్తుంటే, కూర్చున్న చోటికే కాఫీఫలహారాదులు సరఫరా చేసేవాళ్ళుట ఆ చుట్టుపక్కల హోటళ్ళవాళ్ళు… శాస్త్రిగారికీ — వారితోపాటు గోష్ఠిలో కూర్చున్న వారికి కూడా!

ఖర్చంతా అఖాతంలాంటి శాస్త్రిగారి ఖాతాలోనే.

సమావేశం ముగిసేదాకా వేచివుండి — ముగిశాక ఆయన వెనుకే కదిలేది — ఆయన రథం — ఓ రిక్షా.

జీవితాంతం అదే రిక్షా — ఒకడే సారథి — పేరు చెల్లం.

ఇంటిదాక రిక్షా తోసుకొని నడిచొచ్చిన చెల్లానికి — ఏ రోజుకా రోజు కూలీ చెల్లించకుండా లోనికి కదిలేవారు కారుట శాస్త్రిగారు.

రొజూ ఇదే తంతు.

అదొక నిత్యోత్సవం! సాహిత్యోత్సవం!

ఆ మృదువచనామృతవాగ్విభూతి…

— విన నోచుకున్న ప్రతి శ్రోతా, ఓ శిష్యుడు!

— ప్రతి శిష్యుడూ, ఓ భవభూతి!!

మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి

దస్తూరి గుణాల కస్తూరి అంటారు ముళ్ళపూడి వెంకట్రమణులు. బహుశా ఈయన్ని చూసే కాబోలు.

ఆయన మనసంత తెల్లనైన బాండు కాగితంపై ఆకుపచ్చ సిరాతో, ధీటైన తలకట్లతో, లేత కొతిమీర ఆకుల్లా నేవళంగా హుందాగ ఉండేవిట శాస్త్రిగారి అక్షరాలు.

మనమేనాడో చేసుకున్న పుణ్యం — అవి నిజంగా అ—క్షరాలై మనకు దక్కాయి! తెలుగు సినిమాల సాహిత్యాల పుణ్యమాని ఇంకా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి — విన్నవారినీ, చదివినవారినీ కదిలిస్తున్నాయి.

ఖగోళ, జ్యోతిష, గణిత, తర్క, వేదాంత, సంగీత, అలంకార, వ్యాకరణ, మీమాంసాది శాస్త్రాలు — పురాణ, ఉపనిషత్తులు — ఇన్ని చదువుకున్న విజ్ఞానసముద్రులైనా — బందరులోని పసిరోజుల్లోని కరుణార్ద్రతల్నీ, హృదయ వైశాల్యాన్నీ చివరికంటా నిలుపుకున్నారు.

అరవయ్యేళ్ళ అతి చిన్న జీవితాన్ని, సంతోషంగా, సంపూర్ణంగా, సావధానంగా గడిపిన స్వాప్నికుడు — నిత్యసాహితీయాజ్ఞికుడు — నిరాడంబరుడు — శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి.

శాస్త్రిగారు అర్ధం కావాలంటే ఆయన వ్రాసిన కథలూ నవల్లూ చదవాలి — ఆ చిన్న కథల్లోని తాతయ్య, కృష్ణాతీరం నవల్లోని అన్నప్ప పంతులు — ఆయన చేతుల్లో ప్రాణంపోసుకున్న ఈ పాత్రలు ఆయనలోని భావాలు — పార్శ్వాలు — కూడా స్వంతం చేసుకున్నయి.

ఆయన లక్షణాలు — సౌమ్యత, సహృదయత, అపారమైన — అనాయాసమైన పాండిత్యం, నిరాడంబరత, భోజన ప్రియత్వం, వ్యంగ్యం, హాస్య ప్రియత్వం, సంభాషణా చాతుర్యం, అన్యోన్య దాంపత్యం పట్ల అవగాహన, స్త్రీలపట్ల గౌరవం, అభ్యుదయ భావాలు, కుల మత వర్ణ జాతి వివక్షతారాహిత్యం, సమన్వయశీలత, హద్దుల్లేని మానవత్వం, చిన్నవారిని సైతం గౌరవించగల వినమ్రత, ఎదుటి వ్యక్తిని లోపాలతో సహా అంగీకరించి అభిమానించగలిగిన వ్యక్తిత్వం — ఆయన పాత్రల్లో, ఆయన కథల్లో, ఆయన పాటల్లో, ఆయన ఆశీఃక్షతలకు నోచుకున్న శిష్యుల్లో — ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుంటాయి. అవే లక్షణాలు తెలుగువాడి మనసులో ఆయన్ను శాశ్వతంగా సచేతనంగా నిలిపాయి.

వారే ఎక్కడో చెప్పుకున్నట్లు, ఆయన ఏనాడూ “కథ”ను వ్రాసింది లేదు — కథల్లోని పాత్రలు ప్రాణంపోసుకోని వాటంతకవే కలాన్ని నడిపించేవట! అందుకే ఈనాటికీ అవి సజీవంగా ఉన్నాయి — “గురువు ఎదుట ఉన్నట్టు, గురి కుదిరినట్టూ, నేర్వని విద్య నేర్చినట్టు” — చదివిన వారికి వేయిజన్మలకు సరిపడిన చదువు ఇప్పటికీ చెబుతున్నాయి.

అంతా మన అదృష్టం!

నిజం!

చివరిగా

వాక్యం రసాత్మకం కావ్యం అంటారు. “మధుర”సాత్మకమైన శాస్త్రి గారి అలవోక కలం గిలికింపుల్లోని అపూర్వ కవిత్వపు మత్తును మహత్తును మీకందించే ఈ ప్రయత్నంలో అక్కడక్కడా అనాగరి”కపి”త్వం — నా స్వంతపైత్యం — ఏ మూలైనా కనిపిస్తే — ఉడుత భక్తి ఉడుతది అనుకొని — దయతో మన్నించండి.

ఇది ఆ మహానుభావుడి గురించి నేను కన్నవీ, విన్నవీ, చదివినవీ — ఏదో నాకు తెలిసినంత, గుర్తున్నంత — మీతో పంచుకోవాలన్న ఒక చిన్ని ప్రయత్నం మాత్రమే. ఇందులో కొంత పునరుక్తి. ఈ సంగతులు కొన్ని — నేనిదివర్లో ఇంకో చోట మరో పేరుతో ప్రస్తావించడం జరిగింది.

పోతే, మల్లాది వారిని గురించిన విశేషాలన్నీ ఒక్క వ్యాసంలో వ్రాయబూనుకోవడం ఎంత దుస్సాహసమో — అలా వ్రాసే లోతు, ఎత్తు, తాహత్తు మనకు — ముఖ్యంగా నాకు — ఉన్నాయనుకోవడం అంతే అహంకారం, అపచారం, అపరాధం! అందుకే నాకు నేను చెప్పుకుంటూ… ఈ చివరి వాక్యం.

దీనిపై మీ అభిప్రాయాలు సూటిగా తెలియజేస్తే సంతోషిస్తాను.

భవదీయుడు.

—శ్రీరామగిరి సుబ్బారావు వ్రాలు.

43 Comments
 1. వీబీ November 17, 2008 /
 2. nietzsche niche November 18, 2008 /
 3. nietzsche niche November 18, 2008 /
 4. వీబీ November 18, 2008 /
 5. మురళి November 18, 2008 /
 6. వీబీ November 18, 2008 /
 7. నీషీ నిష్ November 18, 2008 /
 8. వీబీ November 18, 2008 /
 9. Sreenivas Paruchuri November 18, 2008 /
 10. గీతాచార్య November 19, 2008 /
 11. గీతాచార్య November 19, 2008 /
 12. గీతాచార్య November 19, 2008 /
 13. గీతాచార్య November 19, 2008 /
 14. పరుచూరి శ్రీనివాస్ November 19, 2008 /
 15. సుబ్బారావు November 20, 2008 /
 16. కొత్తపాళీ November 21, 2008 /
 17. Sreenivas Paruchuri November 21, 2008 /
 18. Sowmya November 22, 2008 /
 19. శ్రీ లక్ష్మీ కళ December 1, 2008 /
 20. pappu December 2, 2008 /
 21. రమేష్ పంచకర్ల January 17, 2009 /
 22. రమేష్ పంచకర్ల January 17, 2009 /
 23. రాజేష్ దేవభక్తుని. July 12, 2011 /
 24. అప్పారావు July 12, 2011 /
 25. Rohiniprasad July 13, 2011 /
 26. Venu July 13, 2011 /
 27. రామ July 20, 2011 /
 28. Phanindra July 23, 2011 /
 29. adi ganesh August 26, 2011 /