Menu

దైవతిరుమగన్ (నాన్న)

అప్పుడే అస్తమించిన సూర్యుడి చివరి కిరణాల జాడ నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారుతూ….ఆకాశంలో కలిసిపోతూ ఉన్నది. మరో వైపు నుంచి దట్టమైన మేఘాలు నెమ్మదిగా ఆ వైపు నుంచి ఈ వైపుకి విస్తరిస్తున్నాయి. సాయంత్రమై చాలా సేపయిందనుకుంటా….రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఒక్కొక్కొటి head lights on చేస్తున్నాయి. అప్పుడే సినిమా చూసి బయటకొచ్చిన నేను, బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాను. బైక్ రైడ్ చేస్తుండగా…..చల్లని గాలి సర్రున ముఖానికి రాసుకుంటూ వెళుతుంటే ఎంతో హాయిగా అనిపించింది. నేను చూసిన సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని నెమరు వేసుకుంటుంటే ఇంకా హాయిగా అనిపించింది. బైక్ మీద వెళుతున్నానన్న మాటే గాని, ఆ సినిమా గురించిన ఆలోచనలు మాత్రం బుర్రని వదలటం లేదు. ఇలాగే వెళ్తే బైక్ తో దేనికైనా ముద్దెట్టడం తప్పదని చెప్పి, ఆ దారి ప్రక్కనే ఉన్న ఓ పార్కులో బైక్ ఆపి, నా కోసమే నిరీక్షిస్తున్నట్టుగా ఉన్న ఓ సిమెంట్ బెంచ్ మీద కూర్చొని…..నన్ను ఇంతగా ఆకట్టుకున్న ఆ సినిమాలో ఏముందా అని ఆలోచించడం మొదలుపెట్టా…..

బాగాలేని సినిమాలను మనం అసలు పట్టించుకోం, ఆ అవసరం కూడా లేదు. కాని బాగున్న సినిమాలలో రెండు రకాలుంటాయి. మొదటివి సినిమా చూస్తున్నంతసేపు మాత్రం గుర్తుంటాయి, వినోదాన్నిస్తాయి. రెండోవి సినిమా పూర్తయ్యి ధియేటర్ బయటకొచ్చిన తరువాత కూడా మనల్ని వెంటాడుతుంటాయి. ఆ వెంటడేవి ఆ సినిమా యొక్క కథ, కథనం కావచ్చు, నటీనటుల నటన కావచ్చు, నేపథ్య సంగీతం కావచ్చు, సినిమాటోగ్రఫి కావచ్చు. మాటలు కావచ్చు. కాని ఈ సినిమాలో ఇవన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా విక్రమ్, బేబి సారా నటన.

ఈ సినిమాకి మూలం “ I am sam “ అనే ఓ ఆంగ్ల చిత్రం. అయినప్పటికీ రీమేక్ లా కాకుండా కొంచెం కొత్తగా మన నేటీవిటీకి తగ్గట్టుగా చిత్రీకరించారు. కథలో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసారు.

అసలు కథలోకి వెళితే…వయసుకి తగ్గ మానసిక పరిపక్వత లేని వాడు విక్రమ్. పురిటిలో తల్లిని పోగొట్టుకున్న బేబి సారాని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతాడు. పాపకు ఐదేళ్ళ వయసులో స్కూల్లో చేరిపిస్తాడు. అనుకోకుండా సారా పిన్ని అదే స్కూల్ కి కరస్పాండెంట్ గా వస్తుంది. తరువాత సారా ఎక్కడున్నది, వాళ్ళ తాతయ్యకి తెలుస్తుంది. తన మనవరాలను విక్రమ్ దగ్గర ఉంచడం ఇష్టం లేక…..బలవంతంగా విక్రమ్ ని మోసం చేసి సారాని తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు సారా వాళ్ళ తాతయ్య,

అసలే మహానగరం, తనకేమో….మానసిక పరిపక్వత లేదు. అతని మావయ్య సిటీలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. చివరికి విక్రమ్ తన కూతుర్ని చేరుకోగలిగాడా? ఇందులో అనుష్క పాత్రేంటి? చివరికి ఏమయింది? ఇదంతా తెలుసుకోవాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే!

ఒక మామూలు కథను ఇంత హృద్యంగా చెప్పగలిగినందుకు దర్శకుడు విజయ్ ని అభినందించి తీరాల్సిందే. రెండో సగంలో సినిమా కోర్టురూముకే పరిమితమైనా…ఎక్కడా గాడి తప్పలేదు.కథ పట్టు జారలేదు. సినిమాటోగ్రఫి చాలా బావుంది. కోర్టు సీన్స్ లో మాత్రం కొంచెం lighting ఎక్కువయినట్టు అనిపించింది. సహజత్వం తగ్గింది. Expressions catch చేయాలని దర్శకుడి ఉద్ధేశ్యం కావచ్చు. జి.వి.ప్రకాశ్ ఈ చిత్రానికి అందించిన నేపథ్య సంగీతం బహుశా ఇంతవరకు అతను చేసిన సినిమాలలోకెల్లా ఉత్తమం అనుకోవచ్చు. అలాగే మాటలు కూడా తగ్గట్టుగా ఉన్నాయి. మచ్చుకి,

సారా వాళ్ళ పిన్ని: మేమందరం నీ దగ్గరే ఉన్నాం కదమ్మా…..happy గా ఉండొచ్చుగా…..?

సారా (అమాయకంగా): మరి నాన్నా……!

ఈ డైలాగ్ తరువాత వచ్చే నిశ్శబ్ధాన్ని, ప్రకాశ్ తన అద్భుతమైన సంగీతం తో కవర్ చేయటం ఆ సన్నివేశానికే హైలైట్ అవుతుంది.

అలాగే విక్రమ్ సారాకి కథ చెప్పే విధానం….దానిని దర్శకుడి చిత్రీకరించిన  విధానం. ఇలా చెప్పుకుంటూ పోతే  చాలా ఉన్నాయి ఈ సినిమాలో.

ఏది ఏమైనా…..నాకు మాత్రం ఈ సినిమా ఓ మంచి అనుభూతినిచ్చింది.

4 Comments
  1. brahmam July 23, 2011 /
  2. రమణ మూర్తి July 25, 2011 /
  3. Venkat .Balusupati July 29, 2011 /
  4. krshany August 21, 2011 /