Menu

తెలుగు సినిమాలో అమితాబ్ బచ్చన్ : బుడ్డా హోగా తేరా బాప్

ఇంత వరకూ తెలుగులో అమితాబ్ బచ్చన్ నటించలేదని ఎవరికైనా కొరతగా వుంటే ఆ ముచ్చట ఈ సినిమాతో తీరిపోయింది. కాకపోతే ఈ సినిమాలో అంతా హిందీలో మాట్లాడుతారు. అంతే తేడా..!!

వరస ఫ్లాపులతో సరిపెట్టుకుంటున్న పూరి జగన్నాధ్ తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకోడానికి అమితాబచ్చన్ పూర్వవైభవాన్ని అస్త్రంగా ఎంచుకున్నాడు. అమితాబ్ వయసులో వున్నప్పుడు “ఏంగ్రీ ఎంగ్ మాన్” చిత్రాలను చేసి, కొంత వయసొచ్చాక అవి అంతగా ఆడకపోవడంతో, పంధా మార్చి తనకంటూ ఒక సరికొత్త ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. అయితే మళ్ళీ అమితాబ్ ని అలా చూడాలన్ని కోరిక చాలా మంది అభిమానుల్లొ వుండి వుండచ్చు. పూరి జగన్నాధ్ కూడా అలాంటి ఆశతోనే ఈ సినిమా తీసినట్టు చెప్పుకున్నాడు. ఆ ఆశ అడియాశ కాలేదు. ఈ సినిమాలో అమితాబ్ ని అలాంటి పాత్రలో చూసిన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.

కథ: ముంబయి నగరాన్ని శాసించే డాన్ కబీర్ (ప్రకాష్ రాజ్) తనకి అడ్డుగా వున్న ఏ.సీ.పీ. కరణ్ మల్హోత్రా (సోనూ సూద్)ని చంపించడానికి పథకం వేస్తాడు. అప్పటికే గ్యాంగ్ స్టర్ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించి, ప్యారిస్ లో పబ్ నడుపుకుంటున్న విజ్జూ (అమితాబ్ బచ్చన్) ముంబై తిరిగి వచ్చి, ఆ పథకాన్ని వమ్ము చేస్తాడు. కబీర్ పథకాన్ని విజ్జూ ఎందుకు ఎదుర్కుంటాడు? ఎలా ఎదుర్కుంటాడు? అనేదే ఈ సినిమా కథ.

కథ విషయాన్ని పక్కన పెడితే, రిటైర్మెంట్ ప్రకటించిన గ్యాంగ్ స్టర్ తిరిగి తుపాకి పట్టుకోవడం కన్నా “ఏంగ్రీ ఎంగ్ మాన్” కి రిటైర్మెంట్ ప్రకటించిన అమితాబ్ తిరిగి “ఏంగ్రీ ఓల్డ్ మాన్” గా కనిపించడమే ఈ సినిమాకి హైలైట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా అమితాబ్ బచ్చన్ నటించిన అనాటి చిత్రాల పాటలు, డైలాగులు తిరిగి చెప్పించడం వల్ల అమితాబ్ అభిమానులకు ఈ సినిమా మరింత చేరువయ్యింది. అమితాబ్ ఎంట్రీలోనే “హమ్ జహా ఖడే హోతే హై, లైన్ వహీ సే షురూ హోతా హై” (కాలియా, 1981) డైలాగు చెప్పడంతోనే అమితాబ్ తన పాత బిరుదుని రీక్లెయిమ్ చెయ్యడానికి సిద్ధమయ్యాడని అర్థం అవుతుంది. ఆ తరువాత వచ్చే పాట (అమితాబ్ పాపులర్ పాటల మెడ్లే కి రీమిక్స్) ముందు కూడా అమితాబ్ ఆ విషయాన్ని ధ్రువపరుస్తాడు. ఇక అక్కడి నుంచి వున్నదంతా పూరి మార్కు డైలాగులకి అమితాబ్ గొంతు, తెలుగువారికి సుపరిచితమైన పంచ్ డైలాగుల హీరో పాత్రలో అమితాబ్. చాలా సన్నివేశాలు కూడా తెలుగులో (పూరి సినిమాలలో) చూసినవే కావడం, ముఖ్యపాత్రలలో ప్రకాష్ రాజ్, ఛార్మీ, సుబ్బరాజు వంటి దక్షిణాది నటులు, మనకి బాగా పరిచయమున్న సోనూ సూద్, రవీనా టాండన్ వంటి నటులు వుండటంతో మధ్యలో తెలుగు సినిమా చూస్తున్నామా అన్న అనుమానం వచ్చినా రావచ్చు.

ఈ సినిమా పూరి జగన్నధ్ తొలి హిందీ చిత్రమని ప్రచారం జరిగినా నిజానికి ఇది పూరి రెండొవ హిందీ చిత్రం. అప్పట్లో వచ్చిన “షర్త్” అనే (బద్రి రీమేక్) చిత్రం వచ్చిన విషయం, వెళ్ళిన విషయం ఎవరికీ అంతగా గుర్తులేదు. అయితే పూరికి “బుడ్డా..” చిత్రం బాలీవుడ్ లోకి రాచమార్గం ఏర్పరిచినట్లే. ఇప్పటికే “దబాంగ్” చిత్ర విజయాన్ని చూసిన బాలీవుడ్ వాళ్ళు, అదే రకంగా తయారయ్యే దక్షిణాది చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలుగు “విక్రమార్కుడు”, తమిళ “సింగం” ఇప్పటికే హిందీలోకి తర్జుమా అవుతున్నాయి. ఇప్పుడు “బుడ్డా..” చిత్రం కూడా విజయ మార్గం పట్టింది కాబట్టి ఇంక కొంతకాలం ఇలాంటి బాలీవుడ్ సినిమాలనీ, బాలీవుడ్ లో అరంగేట్రం చేయబోయే తెలుగు దర్శకుల్ని చూసే అవకాశం వుంది.

సినిమా అంతా అమితాబ్ మహిమలే కాబట్టి వంక పెట్టాడానికి ఏమీ లేదు. అమితాబ్ చెప్పే పొడవైన డైలాగులు, చిన్న విషయానికి పెద్ద కథలు చెప్తూ పంచ్ వదలడం కొంచెం బోరు కొట్టించే అంశం. మిగతా పాత్రలలో నటులు అంతా అమితాబ్ కి సహకరించారు. ముఖ్యంగా సోనూ సూద్, ప్రకాష్ రాజ్, ఛార్మీల నటన బాగుంది. హేమామాలినీ హుందాగా నటించింది. అక్కడక్కడ రవీనా టాండన్ శ్రుతి తప్పినా, సుబ్బరాజు హిందీ డైలాగుల్ని తెలుగు డైలాగుల్లా పలికినా అవి కొట్టుకుపోతాయి. టేకింగ్, ఎడిటింగ్ వగైరా పూరీ స్టైల్ లో క్రిస్ప్ గా వున్నాయి. పాటలు (అన్ని మగ గొంతులు అమితాబ్ బచ్చన్) అలరిస్తాయి.

ఇప్పటికే ఈ చిత్రం విజయవంతమని అంతా చెప్పేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడితే, పూరీ సాధించిన మరో విజయం గురించి చెప్పాలి. గత కొంత కాలంగా హిందీ సినిమా ఏక్షన్ సినిమాలను వదిలిపెట్టి రొమాంటిక్, కామెడీ సినిమాలకి పరిమితమై పోయింది. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి ఏక్షన్ హీరోలు సయితం కామెడీ సినిమాలు ప్రయత్నించి చేతులు కాల్చుకుంటున్నారు. ఇలాంటి సినిమాలతో వారికి చేతినిండా పని దొరికే అవకశం వుంది. ఇక బిజినెస్ పరంగా చూస్తే, సంవత్సరాల తరబడి సినిమాలు తీస్తూ కోట్లకి కోట్లు ఖర్చు పెడుతున్న బాలీవుడ్ జనాలకి నాలుగు నెలల్లో, కేవలం పది కోట్లతో సినిమా తీయచ్చని నిరూపించాడు పూరి. సాటిలైట్ రైట్స్ పదమూడు కోట్లకి అమ్మి సినిమా విడుదలకి ముందే ఆర్థిక విజయాన్ని పొందేలా చెయ్యడం, ఒక సినిమా మేకింగ్ మోడల్ గా అనుసరణీయం.

మొత్తంగా చూస్తే ఒక మాస్ ఎంటర్టైనర్. ఒకనాటి అమితాబ్ అభిమానులకి కన్నులపండుగ. పూరి అభిమానులకి మరో తెలుగు సినిమా. హిందీ ప్రేక్షకులకి అమితాబ్ నటించిన దబాంగ్.

“బుడ్డా హోగా తేరా బాప్” చూడండి… కేవలం అమితాబ్ కోసమే అని అనుకోని వెళ్ళండి. మీరు నిరాశపడరు.

 

బుడ్డా హోగా తేరా బాప్ (2011),( హిందీ)

నటీనటులు: అమితాబ్ బచ్చన్, హేమామాలిని, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, సోనూ సూద్, ఛార్మీ, మనీషా లాంబా, సుబ్బరాజు తదితరులు

కథ, దర్శకత్వం: పూరీ జగన్నాధ్

సంగీతం: విశాల్ – శేఖర్

సినిమాటోగ్రఫీ: అమోల్ రాథోడ్

నిర్మాతలు: ఏ.బీ.సీ, వయాకాం 18

 

8 Comments
  1. Alag Niranjan July 4, 2011 /
  2. shankar Gongati July 4, 2011 /
  3. శంకర్ గొంగటి July 4, 2011 /
  4. Venkat July 14, 2011 /
  5. రవి July 14, 2011 /
  6. SHAFI July 16, 2011 /
  7. kondaveeti nani July 21, 2011 /