స్ట్రోంబోలియన్ సినిమా

stromboli

ముందుమాట:

చాలా రోజుల తర్వాత ఈ మధ్యనొకసారి గిరీశ్ షంబు గారి బ్లాగ్ సందర్శించాను. అప్పుడే తెలిసింది ఈ స్ట్రోంబోలియన్ సినిమా గురించి. అసలేంటీ స్ట్రోంబోలియన్ సినిమా అని అర్జంటుగా తెలుసుకోవాలనుకుంటే గిరీశ్ గారి బ్లాగులోని ఈ పోస్టు చదవండి. అర్జంటేమీ లేదనుకున్న వాళ్ళు ఈ వ్యాసం తీరిగ్గా చదవొచ్చు. తీరిగ్గా ఎందుకన్నానంటే ఇక్కడ స్ట్రోంబోలియన్ సినిమాల గురించి కాకుండా చాలా విషయాలను చర్చిస్తూ, కొత్త విషయాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. అసలీ వ్యాసాన్ని నేను గతంలో ఎప్పుడో, అంటే ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికలో వ్యాసాలు ప్రచురించినప్పటినుంచీ అనుకుంటున్నాను. నిజానికి ఈ వ్యాసానికి ’బాబోయ్ అవార్డు సినిమాలు:ప్రశ్నలు-జవాబులు’ అనే టైటిల్ పెడదామనుకున్నాను. కానీ ఆ వ్యాసం వ్రాయాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా అలాంటి సమయమూ సందర్భం కోసం ఎదురుచూస్తూ వచ్చాను. ఇప్పుడు గిరీశ్ గారి వ్యాసం చదివాక నాకు తీగ దొరికినట్టనిపించింది. ఇంకేముంది డొంకంతా కదిలించాల్సిన సమయం వచ్చిందనిపించి ఈ వ్యాసం వ్రాయడం మొదలుపెట్టాను. ఇక అసలు విషయానికి వస్తే…

స్ట్రోంబోలియన్ సినిమా:

కొన్ని సినిమాలుంటాయి. ప్రపంచం వాటిని క్లాసిక్స్ అంటుంది. మాస్టర్ పీసెస్ అంటుంది. మనం చూడబోతే అందులో ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అర్థం పర్థం లేని ఈ సినిమాని ప్రపంచం ఎందుకిలా పొగుడుతుంది అని మనకి అనుమానమొస్తుంది. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఒక్కసారైనా ఎదురయ్యుండొచ్చు. అయితే అర్థం కాని ఆ సినిమాని మరో సారి చూడడం ద్వారా అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం అందరూ చెయ్యకపోవచ్చు. కాకపోతే అలా ప్రయత్నించి వున్న వాళ్ళకెవరికైనా ఒక విషయం అర్థమై ఉంటుంది; ఆయా సినిమాలు మనకు అర్థం కాకపోవడానికి కారణం ఆ సినిమాని అర్థం చేసుకునే పరిస్థితికానీ పరిజ్ఞానం కానీ ఒక్కోసారి మనకి ఉండి ఉండకపోవచ్చు. మనకు అర్థం కాని ఆ సినిమా గురించి మరిన్ని విషయాలు (అంటే ఆ సినిమా తీసిన సమయం-సందర్భం, అప్పటి పరిస్థుతులు మరియు సినిమా కథ యొక్క నేపథ్యం లాంటివి) తెలిసాక ఆ సినిమాని అర్థం చేసుకోవడమే కాక ఆనందించడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే చెప్పొచ్చేదేమిటంటే కొన్ని సినిమాలు మనకు అర్థం కాకపోవడంలో ఆయా సినిమాల దర్శకుడి తప్పిదం లేకపోగా ఆ సినిమాని ఆస్వాదించేటంతటి అనుభవం మరియు మెచ్యూరిటీ మనకి లేకపోవడమే అయ్యుండొచ్చు. ఇలాంటి సినిమాలనే స్ట్రోంబోలియన్ సినిమాలంటారట. Nicole Brenez ఆనే సినీ విమర్శకురాలు ఈ పదాన్ని మొదటి సారిగా వాడారట. ఇటాలియన్ సినిమా దర్శకుడు రోబర్ట్ రోసోలిని నిర్మించిన ‘స్ట్రోంబోలి ‘ అనే సినిమా తో ఆమెకు ఎదురయిన అనుభవం ద్వారా ఇలాంటి సినిమాలన్నింటినీ ఆవిడ ‘స్ట్రోంబోలియన్ సినిమా ‘ అని పేర్కొన్నారు.

పైన చెప్పిన గిరీష్ శంబు గారి బ్లాగులో ఇలాంటి సినిమాల గురించి పెద్ద చర్చే జరుగుతోంది. వాంగ్ కర్ వై రూపొందించిన Chungking Express సినిమా మొదటి సారి చూసినప్పుడు చిరాకేసి టివి స్క్రీన్ కేసి తలగడ విసిరికొట్టిన ఆయన కొన్నేళ్ళ తర్వాత ఆ సినిమాని అలాగే ఆ సినిమాలో అర్థం కాని విషయాల్ని ఎలా అర్థం చేసుకుని ఆనందించగలిగారో చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే…

గతంలో బాబోయ్ అవార్డు సినిమాలు అంటూ ఒక వెబ్ సైట్లో వచ్చిన వ్యాసాలను విమర్శిస్తూ నేను వ్రాసిన వ్యాస పరంపరకు వచ్చిన వ్యాఖ్యల్లో ‘ఆర్ట్ సినిమాల్లో పాత్రలు నిమిషాలకొద్దీ శూన్యంలోకి చూస్తూనో, సిగరెట్టు కాలుస్తూనో సమయం వృధా చేస్తారని’, ‘అవార్డు సినిమాల్లో కాఫీ కలిపిన దగ్గరనుండి చివరిచుక్క తాగేంతవరకూ చూపించి విసిగిస్తారనీ’, ‘అవార్డు సినిమాలంటే అర్థం కాని సినిమాలనీ’ పాఠకులు అభిప్రాయపడ్డారు. అవార్డు సినిమాలంటే బాబోయ్ అని పారిపోవాల్సిన అవసరం లేదు అలా అని వాటిని అందరూ చూసి తరించాల్సిన అవసరం కూడా లేదని అప్పుడు చెప్పాను. ఇప్పుడూ అదే చెప్తున్నాను. కాకపోతే పైన వచ్చిన వ్యాఖ్యలకు గతంలో వచ్చిన వ్యాసంలో వివరణ ఇవ్వలేకపోయాను. అదీకాక ఈ మధ్య ఒక సినిమాతో నాకు ఎదురైన అనుభవం నాకు కొత్త విషయాలు తెలిసొచ్చాయి. అందుకే ఈ స్ట్రోంబోలియన్ అనే తీగ దొరగ్గానే నాకు మళ్ళీ ఈ విషయం గురించి బోలెడన్ని విషయాలు చెప్పొచ్చని అనిపించింది.

ఎలిపత్తాయం:కొన్నేళ్ళ  క్రితం అడూర్ గోపాల్ కృష్ణన్ రూపొందించిన ఎలిపత్తాయం (Rat Trap) అనే సినిమా చూసాను. సినిమాలో ఒక పెద్దాయన ఒక లంకంత ఇంట్లో ఉంటాడు. ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు. ఒకావిడ పెళ్ళి వయసు దాటిపోయింటుంది. అయినా ఆ అన్న గారు పెళ్ళి సంబంధాలు చూడరు సరికదా వచ్చిన సంబంధాలనీ పట్టించుకోడు. ఇక మరో చెల్లెలు కాలేజీకి వెళ్ళే వయసు. ఆ వయసు వాళ్ళకు లాగే కలల లోకంలో విహరిస్తుంటుంది. ఈ ముగ్గురూ సినిమాలో ముఖ్యపాత్రలు. ఇక కథేంటంటే….ఏమీ లేదనే చెప్పాలి. ఇంట్లో ఎలుకులుంటాయి, అప్పుడప్పుడూ బోను లో ఎలుకలని పడ్తుంటారు. మధ్యలో వీళ్ళందరికంటే పెద్దదైన అక్కగారు ఆ సంవత్సరం పండిన పంటలో తన వాటా కావాలంటూ వస్తుంది. ఎవరేమన్నా మాటా పలుకూ లేకుండా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ కూర్చునే ఆ ఇంటాయన ఈవిడ మాటల్నీ పట్టించుకోడు. ఇలాంటి మరికొన్ని సన్నివేశాలుంటాయి. మొత్తానికి చాలా ఆర్ట్ సినిమాల్లాగే చివరికి ఏమీ తేల్చకుండానే సినిమా ముగుస్తుంది. కథ లేదు. పోనీ ఏదైనా సందేశం ఉందా అంటే అదీ లేదు. ఇక ఏమిటీ సినిమా? అసలెందుకు చూడాలి? అన్నంతగా విరక్తి కలగకపోయినా ఏమిటో ఈ అవార్డు సినిమాలు ఒక పట్టాన అర్థం కావనుకున్నాను.

అది జరిగి చాలా రోజులయింది. ఈ మధ్య నవతరంగంలో అడూర్ గోపాలకృష్ణన్ పై ఫోకస్ శీర్షిక నిర్వహిస్తూ ఆయన ఇంటర్వ్యూలు కూడా ప్రచురించారు. ఆ వ్యాసాలు చదివాక మళ్ళీ ఒకసారి ఎలిపత్తయం చూడాలనిపించింది. ముఖ్యంగా అడూర్ తన సినిమాల్లో ఉపయోగించిన వివిధ టెక్నిక్స్ ని గమనిద్దామనే ఆలోచనతోనే ఈ సినిమా చూడ్డం మొదలుపెట్టాను.వారం క్రితం చూడడం మొదలుపెట్టిన ఈ సినిమా ఈ రోజుకీ పూర్తి కాలేదు. అంటే సినిమా అంత బోర్ కొట్టించిందనుకోకండి. చూసిన సీనే మళ్ళీ మళ్ళీ చూడడం వల్ల జరిగిన ఆలస్యం ఇది. ఒకప్పుడు ఏమీ అర్థం కాలేదనుకున్న ఈ సినిమాని నేను ఈ రోజు మళ్ళీ మళ్ళీ చూస్తున్నానంటే, ఒక సినిమా ఎలా చూడాలి అనే విషయం మీద అప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పు ఏర్పడింది.ఏమిటా మార్పు అంటే చెప్పడం కష్టం అది అనుభవమైతే కానీ తెలియదు.

నాలో అంతగా ఏర్పడిన ఆ మార్పు ఏంటో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. మొదట్లో ఎలిపత్తాయం చూసే టైంకి ఆర్ట్ సినిమాలంటే అర్థం కాని సినిమాలు, నిదానంగా ఉంటాయి, కథ ఉండదు అనే ఒక  అభిప్రాయం నాలో బలంగానే నాటుకుంది. అది చిన్నప్పటినుంచీ మనమీద  వివిధ రకాలుగా మనమీద రుద్దబడిన ఒక అభిప్రాయం. అయినా సరే ప్రపంచ చిత్రోత్సవాల్లో అవార్డులందుకున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దామనే కుతూహలం తప్ప ఆ సినిమా ని పూర్తిగా ఆస్వాదిద్దామనే ఆలోచనే లేదు.

మొన్న ఎలిపత్తాయం చూసినప్పుడు పరిస్థితి వేరు. చిన్నప్పుడు క్లాసులో టీచర్ చెప్పిన ఒక పాఠం ఇంటికొచ్చాక సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చదివైనా అర్థం చేసుకోవాలనే తపన కలిగిన విద్యార్థ లాంటి పరిస్థితి నాది.ఐక్కడ టీచర్ ఎవరంటే అడూర్. ఆయన చెప్పిన పాఠాలు ఆయన ఇంటర్వ్యూలు. ఇక సినిమా చూడడం మొదలుపెడితే….

అడూర్ ఇంటర్వ్యూలో తన సినిమాల్లో పక్షులు, పశువులను ఎలా ఉపయోగించుకుంటారో చదివాక, ఎలిపత్తాయం సినిమాలో, ఎటువంటి వారైనా, తప్పక గమనించే ఒక విషయం సౌండ్ డిజైన్. ఎలిపత్తాయంలో అడూర్ ప్రతి సీన్లో పక్షుల అరుపులను (కొన్ని సార్లు ఆంబియన్స్ కోసం, మరికొన్ని సార్లు సిట్యుయేషనల్ గా) ఎలా ఉపయోగించుకున్నారో చూడడానికి మాత్రమే ఈ సినిమా ఒకసారి చూడొచ్చంటే అతిశయోక్తి కాదు.

ఉదాహరణకు, ఈ సినిమాలో ఒక సీన్లో రాత్రి సమయంలో బోన్లో ఎలుక పడుతుంది. ఈ సీన్లో ఎలుకబోను క్లోజప్ లో ఉంటుంది. ఆ ఎలుకను ఉద్దేశిస్తూ “తెల్లవారనీ నీ పని పడుతానంటుంది” అంటుంది ఒకావిడ. ఇక్కడ సీన్ కట్ అవుతుంది.తిరిగి క్లోజప్ లో ఉన్న బోన్ మీదే సీన్ ఓపెన్ అవుతుంది. అయితే సాధారణం ఎటువంటి దర్శకుడు/ఎడిటర్ అయినా కూడా ఒకే వస్తువు మీద కట్ చేసి మళ్ళీ అదే సీన్తో మొదలుపెట్టరు. అదీ కూడా కొన్ని గంటలు గడిచిపోయిన తర్వాత జరిగే సీన్. ఇక్కడ రాత్రి నుంచి పగలు అవుతున్నట్టుగా సూచించడానికి అక్కడ గ్యారంటీగా ఒక insert షాట్ ఉంటుంది….అంటే సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా లేదా మరో విధంగా. అయితే అడూర్ ఇక్కడ కాలగమనాన్ని సూచించడానికి ’కొక్కొరొక్కో’ అనే శబ్దం ద్వారా మాత్రమే సూచిస్తారు.

అలాగే ఈ సినిమాలో ఎలుకబోను చాలా ప్రధానంగా చూపిస్తారు(మరి సినిమా పేరే అది కదా మరి). సినిమాలో ఈ బోను చూపించినప్పుడు, దాన్ని వాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ బోను తలుపులు చేసే శబ్దాల సౌండ్ డిజైన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాకపోతే దానికంటే ముందు…

అసలీ సినిమాకి ’ఎలుకలబోను’ అని పేరెందుకంటే…ఈ సినిమా కేరళ లోని ఒక భూస్వామి బంగ్లాలో జరుగుతుంది. అడూర్ ఈ సినిమా ద్వారా ఫ్యూడల్ వ్యవస్థ పతనమైపోతున్న చివరిరోజుల్లో ఆ వ్యవస్థకు చెందిన ఒక కుటుంబాన్ని, వారి జీవన విధానాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఆయన దృష్టిలో ఆ ఇల్లు ఒక ఎలుకలబోను.ఆ వ్యవస్థ నుంచి బయటకు రాలేక ఆ ఇంట్లో చిక్కుకున్న ఎలుకలు ఈ సినిమాలోని మూడు ప్రధాన పాత్రలు. ఈ విషయాన్ని చెప్పడానికే ఈ సినిమాలో మూడు ఎలుకలు బోనులో చిక్కుకోవడం మెటపారికల్ గా చూపిస్తారు అడూర్. కానీ ఈ పోలికని హైలైట్ చెయ్యడానికి విజువల్ గా ఆ విధంగా చూపెడ్తే పైన చెప్పినట్టు సౌండ్ డిజైన్ ద్వారా ఈ విషయాన్ని ఎలా emphasize చేసారో తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాను.

ఈ సినిమాలో ఉపయోగించిన బోను తలుపులు తెరుస్తుంటే ఒక వింత శబ్దం వినిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ శబ్దాలు కాస్త ఓవర్ గా అనిపిస్తాయి. ఇంతోటి బోనుకు అంత సౌండా? అనిపిస్తుంది. ఈ విషయం గురించే అడూర్ ఒక ఇంటర్వ్యూలో “ఆ ఇంటి తలుపులు తెరుచుకుంటున్నప్పుడ ఎలాంటి శబ్దాలు వినవస్తాయో అవే శబ్దాలు ఈ ఎలుకలబోను కి కూడా ఉపయోగించడం ద్వారా ఆ ఇల్లూ ఒక బోనే అని మెటఫారికల్ గా చెప్పాలనే ప్రయత్నం చేసాం” అన్నారు.

అలాగే ఈ సినిమాలోని మరికొన్ని విషయాలు. సినిమాలో మొత్తం ముగ్గులు అక్కచెల్లెల్లు మరియు ఒక అన్న ప్రధాన పాత్రధారులు. అయితే ఈ అక్కచెల్లెళ్ళలో పెద్దామె వేసుకున్న దుస్తులు గమనించినట్టయితే ఆమె ఎప్పుడూ ఆకుపచ్చ రంగు బట్టలు ధరించి వుంటుంది. ఆకుపచ్చ అంటే stability, settledness అనే ఫీలింగ్ కలుగచేస్తుంది కాబట్టి (ఆమె పెళ్ళయిపోయి వేరే దగ్గర నివసిస్తూ పని మీద ఈ ఇంటికి తిరిగొస్తుంది) ఆమె దుస్తులు ఆ రంగులో ఉండేలా ఎన్నుకున్నారట. ఇక పోతే రెండో ఆమె దుస్తులు గమనించినట్టయితే ఆమెప్పుడూ నీలం రంగు బట్టలు ధరించివుంటుంది (పాత్ర పరంగా ఆమె పెళ్ళీడు దాటిపోయి జీవితం మీద వైరాగ్యంతో ఉంటుంది).ఇక ఆమె దుస్తులు రంగులాగే I am feeling blue అన్నట్టుగానే ఉంటుంది సినిమా మొత్తం. ఇక ఆఖరు ఆమె టీనేజ్ యువతి. కాలేజీ లో కొత్తగా చేరిన లెక్చరర్ గురించి కలలు కంటూ ఉంటుంది. ఇంట్లో కూడా రొమాంటిక్ నవలలు చదువుతూ ఉంటుంది. ఇక ఆమె ఫీలింగ్స్ కి తగ్గట్టే ఆమె ఎరుపు రంగు దుస్తులు ఎక్కువగా ధరిస్తుంది (సినిమాలో ఈమెది తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయే పాత్ర). ఇక ఈ నీలం, పచ్చ, ఎరుపు కలిపితే వచ్చే తెల్లరంగు దుస్తుల్లో ఆ అన్న గారు కనిపిస్తారు. తెలుపు రంగు స్వఛ్చతకు మారుపేరు అయితే అయ్యుండొచ్చు కానీ అడూర్ ఆ కోణంలో ఆయనకి తెల్ల రంగు దుస్తులు తగలించలేదు.కాలుకదపకుండానే అన్నీ తన కాళ్ళ దగ్గరకొస్తుంటే ఇక హాయిగా కాలు మీదా కాలేసుకుని కూర్చుని జీవితాన్ని అనుభవించే వ్యక్తిగా ఆయన దుస్తులు తెల్లరంగులో ఉండేలా అడూర్ ఎన్నుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా నిండా ఎన్నో విశేషాలు. ఇలాంటి ఎన్నో విషయాలు మనం బాబోయ్ అవార్డు సినిమాలని పారిపోవడం వల్ల తెలుసుకోలేకపోతాము. అయితే ఇక్కడో ప్రశ్న. మన జీవిత కాలంలో ఎలాగూ మనం ప్రపంచంలోని అన్నీ సినిమాలు చూడలేము. అలాంటప్పుడు ఇలాంటి అర్థం కాని సినిమాల గురించి ఎక్కడో చదివి, ఇంటర్వూలు చూసి మరీ తెలుసుకోవడం అవసరమా?

నాకైతే అది పర్సనల్ ఛాయిస్. ఈ సంవత్సరంలో వచ్చిన 200 బాలీవుడ్ సినిమాలు మిస్సయినా నాకు దిగుల్లేదు కానీ మొన్నెక్కడో టివిలో వచ్చిన ’సిద్ధార్థ్-ది ప్రిసనర్’ అనే ట్రైలర్ చూసాక, ఆల్రెడీ అన్ని వెబ్ సైట్ల వాళ్ళు ఈ సినిమా డాంప్ స్క్విబ్ అని రాసేసాక కూడా, ఈ సినిమా ఎలా ఐనా చూడాలని నిర్ణయించుకున్నాను. ఫ్లాప్ సినిమా కదా ఎందుకు చూడడం అనొచ్చు. కానీ ట్రైలర్ చూసాక అందులో నాకు నచ్చేది ఏదో ఉండొచ్చనిపించింది. అందుకే ఈ కోరిక. అదే సూపర్ హిట్ అయిందని ఎంత మంది చెప్పనీ గజనీ సినిమా మాత్రం చూడను గాక చూడను. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అవార్డు సినిమాలని జనాలని జడిపించే వాళ్ళు ఎక్కువయిపోయారు గనుక వాటిల్లో అంత భయపడాల్సిందేమీలేదు. కాకపోతే ఒక మంచి సోకాల్డ్ అవార్డు సినిమాని అస్వాదించడానికి, మీ టికెట్టు డబ్బులు కాకుండా, మీరు ఇంకేమిచ్చారనే దానిబట్టే మీరు ఆయా సినిమాల్ని అంతగా ఆనందించగలిగినవారవుతారు.

అందుకే ఈ సారేదైనా అర్థం కాని అవార్డు సినిమా చూస్తే వావ్ మనకొక స్ట్రోంబోలియన్ సినిమా దొరికందని ఆనందపడిపోయి ఆ సినిమా గురించి వీలైనంత సమాచారం సేకరించి కేవలం చూసి వదిలెయ్యడం కాకుండా కాస్తంత స్టడీ చెయ్యడానికి ప్రయత్నించండి. వెతుక్కోవడంలోనూ, కనిపెట్టడంలోనూ ఉండే ఎక్స్పీరియన్స్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో మీకే తెలుస్తుంది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

28 Comments to “స్ట్రోంబోలియన్ సినిమా”

  • చాలా బాగా వివరించారు. ఇక నుంచి నేను కూడ art films తప్ప్కుంద చూస్తాను. ఒక మంచి భానన కలిగించినందుకు కృతజ్ఞతలు!
    -Suresh

  • స్ట్రోంబోలియన్ సినిమా చాలా బావుందండీ… మన విశ్వనాధ్ గారి సినిమాల్లో చాలా వరకూ ఈ తర్హాకు చెందినవే. చిన్నప్పుడు అస్సలు నచ్చేవి కాదు. ఇప్పుడు తెలుగులో మంచి సినిమా చూడాలనిపిస్తే ఎన్నిసార్లు చూసేసినా అవే దిక్కు.

    • శంకర్ గారూ.. ‘విశ్వనాధ్ గారి సినిమాలు ఈ తరహాకు చెందినవే’ అన్నారు కదా. ఆది ఎలాగో వివరిస్తారా ?? అంటే ఓ వ్యాసం రాస్తే బావుంటుంది. :)

      • వ్యాసం వ్రాయాల్సినంత విషయమ్ ఏంలేదండీ. చిన్నప్పుడు మెచ్యూరిటీ తక్కువ కాబట్టి విశ్వనాధ్ గారి సినిమాలు అసలు ఎందుకు తీసారా అని అనుకునేవాడిని. ఆయన కధలేవీ నన్ను ఆకట్టుకునేవికాదు. అప్పుడు డాన్సులు ఫైట్లు లేనిది సినిమానే కాదనే అభిప్రాయం ఉండేది.

  • ఆర్ట్ సినిమాలని, పారలల్ సినిమాలని చివరికి బోరు సినిమాలని మన దేశం లో నిర్మించిన ఎన్నో అద్భుతమైన సినిమాలని చిన్న చూపు చూసారు. ఆ అభిప్రాయంతో ఉండే చాలా మందికి మంచి కనువిప్పు ఇట్లాంటి వ్యాసాలు! ఎలిప్పాతయం ఎప్పుడొ చిన్నప్పుడు చూసినట్టు గుర్తు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందదీ? దయ చేసి చెప్పరూ? అట్లే ఆదూర్ ‘ముఖాముఖం’ , ‘స్యయంవరం’ అరవిందన్ సినిమాలు, షాజీ కరుణ్ ‘పిరవి’ , జాన్ అబ్రహాం ‘అగ్రహారత్తిల్ కళిదై’ లాంటి ఆణిముత్యాలు ఎక్కడైనా దొరికే అవకాశం ఉంటే చెప్పరూ దయచేసి!

    • నా దగ్గర మీరడిగిన కొన్ని సినిమాలున్నాయండీ.నేను ఇండీయా వచ్చినప్పుడు (మరో రెండు నెలల్లో) మీకు ఇవ్వగలను.

      • శిద్ధ్హారెడ్డి గారు – నేను అమెరికాలో ఉంటున్నానండీ – మీరెక్కడ ఉండడం? ప్రింస్ టన్ న్యూ జెర్సి నా నివాసం. నా మేల్ ఐ డి ఇచ్చాను, దయచేసి మేల్ పంపరూ! మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. మంచి సినిమాల పట్ల ఆసక్తి ఉన్న మీలాంటి వారితో స్నేహం పట్ల ఉత్సుకతతో ఉన్నాను.

  • చాలా హృద్యమైన విశ్లేషణ. ఇలాంటి సినిమాల్ని ఎలా చూడాలో “educate” చేస్తేతప్ప ఆస్వాదించలేమేమో! అందుకే ఫిల్మక్లబ్ కల్చర్ ఒక అవసరం. స్కూళ్ళలో,కాలేజిల్లో, యూనివర్సిటీల్లో సినిమా ఎడ్యుకేషన్ మొదలెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    • ఆనంద్ వారాల గారు కరీంనగర్ పరిసరప్రాంతాల్లో ఫిల్మ్ ఎప్రిషియేషన్ వర్క్ షాపులు నిర్వహిస్తూ ఈ దిశగా ఎంతో కృషిచేస్తున్నారు. మనం కూడా ఆయనతో కలిసి కృషిచెయ్యవచ్చు.

  • అన్వేషి గారూ, మీ వ్యాసం చాలా మంచి ప్రయత్నం. నాది కూడా మీ ఆలోచనా విధానమే. ‘సూపర్ డూపర్’ హిట్ అని పేరుబడ్డ సినిమాలను పోలోమని వెళ్లి చూసే వాళ్ళను చూస్తే, ఒక దాని వెంట ఒకటి ఏమాత్రం ఆలోచన లేకుండా వెళ్ళే, గొర్రెల మందలు గుర్తొచ్చి చాలా జాలి కలుగుతుంది. ఉలిపికట్టెలా ఉండటమే నాకూ ఆనందం. నా వాసనలను కొద్ది కొద్దిగా మా కుటుంబ సభ్యులకు అంటించటానికి ప్రయత్నిస్తున్నాను. సినిమాలు చూసే అలవాట్లు మారనంతవరకూ, తీసే అలవాట్లు మారవని నా నమ్మకం. ‘ఇప్పుడంతా చెత్త సినిమాలు వస్తున్నాయి’ అని వాటిని తిట్టుకుంటూ కూర్చునే బదులు, మంచి సినిమాలు ఎక్కడున్నాయో వెదికి చూడటం మంచిది. మీనుంచి అరుదుగానైనా ఇలాంటి మంచి వ్యాసాలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

    • Very well said !

  • మీరు చెప్తుంది నా గురించెనెమొ అనిపించింది చదువుతుంటె… అప్పుడెప్పుడొ చిన్నప్పుడు ఊర్వసి శారద నటించిన ‘నిమజ్జనం’ చూసి ‘ఇదేమి సినెమా రా బాబు అలా గంటల కొద్ది ఆ బండి లొ అలా పోతు ఉంటారు, ఇది తప్ప ఇంకేముంది ఇందులో అనుకున్నను, అదే ఇప్పుడు చూసి ‘అబ్బ ఏమి తీసారు, శారద ఎమి నటించిందీ అనుకుంటున్నాను.

  • హెంత అమాయకులండీ అన్వేషి గారూ, సింబాలిజం ముందు పుట్టి తరవాతే మన తెలుగు దర్శకులు పుట్టారు కాదుటండీ? కావాలంటే ఈ కింది జాబితాని గమనించండి
    ఒక స్త్రీ బలాత్కరించబడింది = కుక్కలు చింపిన విస్తరి
    ఒక స్త్రీ తనకి తెలీకుండా విలన్ స్థావరంలోకి వెళ్తోంది = ముందు గదిలో లేడిని వేటాడుతున్న పులి బొమ్మ ఉంటుంది.
    ఒక ప్రేమ భగ్నమైంది = గాజుగ్లాసు కిందపడి పగిలింది
    ఒక పాత్ర మరణించింది = దీపం కొండెక్కింది
    :)
    హాస్యం అలాగుంచితే, మొత్తానికి మీ కాలికి గిరీష్ గారి తీగ తగిలి డొంకని కదిల్చినందుకు చాలా సంతోషం. మాకు మంచి వ్యాసం దొరికింది.

    పైన కామెంటిన నారాయణస్వామి మంచి కవి. సందూక అనే కవితా సంపుటి ప్రచురించారు. ప్రాణహిత జాలపత్రిక సంపాదకుల్లో ఒకరు.

    రోజెల్లినీ సినిమాలో ఏముందో తెలియదు గానీ స్త్రోంబోలి అనేది ఒక ఇటాలియను వంటకం. పిజ్జాని మధ్యకి మడిచి వొండినట్టుగా ఉంటుంది.

    మనం సినిమాకెళ్ళినా, ఒక పుస్తకం తెరిచినా .. మనలో అస్పష్టంగానైనా ఒక ఎదురుచూపు ఉంటుంది, ఆ అనుభవాన్నించి మనం ఏం ఆశిస్తున్నామో. అది దొరికినప్పుడు తృప్తిగా అనిపిస్తుంది. అద్ దొరకనప్పుడు చెత్తగా చీదరగా అనిపిస్తుంది. నాలుగు పాటలు, నాలుగున్నర ఫైటులు, ఒక అర్ధనగ్న డాన్సూ, ఒకటిన్నర రేపూ ఉంటేనేకానీ సినిమా గిట్టుబాటు కాదు అనుకునేవారికి ఇళాంటి వ్యాసాలు ఉపదేశాలు ఎన్ని చెప్పినా వ్యర్ధమే. ఐతే వచ్చిన గొడవేంటంటే, వ్యక్తులూ, వ్యవస్థా, మాధ్యమాలూ .. అందరూ కూడగట్టుకుని, ఒక పరమ చవకబారు థర్డ్ రేట్ కన్నా దిగజారిన సినిమా టేస్టుని ఇదే అసలు సినిమా అని ప్రచారం చేసేసి ముద్ర వేసేటప్పటికి, కాస్త బుర్రంటూ ఉన్నవాళ్ళ కెవరికైనా కడుపు కాల్తుంది.

  • mee nijayiti stright forwardness nachindi.thanks

  • pretty interesting one sirji!! one of the best I ever read!!

  • This is one of the best articles in NT

    • ‘ ఎలిపత్తాయం ‘చూసాను..ఎందుకోబాగా నచ్చింది..మీదగ్గర ఆ సినిమా ఉంటే.. మళ్ళీ చూడాలని ఉంది.

  • వెంకట్ గారు,

    మంచి వ్యాసం అందించినందుకు థాంక్స్. ఇది చదివాక, నాకు ఇదివరకు చూసిన రెండు సినిమాలు గుర్తొచ్చాయి. న్యాయంగా అయితే మీరన్నట్టు మళ్ళీ ఆ సినిమాలు చూసి నాకు ఎందుకు అర్థం కాలేదో అర్థం చేసుకోవాలి కాని The wounds are too fresh still. కొన్ని రోజులాగి మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇవి చూసిన వారెవరయినా వీటి గురించి కాస్త చర్చించగలిగితే, చాలా బావుంటుంది. వాటి లింక్స్.

    http://www.imdb.com/title/tt0068361/

    http://www.imdb.com/title/tt0166924/

    • two of my fav films…!!
      wounds????? :-)
      I can understand.Infact Mullholland drive was one of those films which pushed me in to film criticism and that and few other films in late 90s made me rethink about the way we watch films…
      It is another long story about DCOB.
      Will wrote soon about those films too.

  • దాదాపు 20ఏళ్ళ క్రితం మా మామయ్యతో సినిమాకి వస్తానని గొడవ చేస్తే నా గోల తట్టుకోలేక ఆయన వెళ్తున్న సినిమాకి నన్ను కూడా తీసుకెళ్ళాడు.. ఆ సినిమా – “అంతులేనికథ” (అప్పటికే అది రీరిలీజు). సినిమా అయిపోయిన తరువాత ఇలాంటి సినిమాకి తీసుకొస్తావా అని ఇంకో గొడవ…. కట్ చేస్తే నా ఫేవరెట్ సినిమాల జాబితాలో అది ఒకటి… అలా అదే సినిమాని మళ్ళీ చూసి ఆ సినిమా గొప్పదనాన్ని తెలుసుకోగలడం ఒక థ్రిల్ మాత్రమే కాదు… మనం పరిణితి చెందామన్న గొప్ప తృప్తి కూడా..!!

  • Hi Venkat,

    Its a nice article.

    Telugu n tamil lo super duper hit ayina Chandramukhi ni hindi lo Bhoolbhulayya ga teesaru.
    Adi oka mostaru hit ani chepochu.
    Kaani veetannitiki base story (This film has been dubbed into telugu as Aatma ragam) malayalam oka movie.
    Shobana, Mohan Lal act chesina ee movie ki best comedy film award section lo national award vachindi.
    Ade cinema almost 15years taruvata stardom image to teeste block buster ayyindi.
    Kani inta varaku artham kani vishayam aa cinemaku comedy category lo award ravatamemita ani.

    But meeru computer keyboard ki manchi srujanatmakata vundane cheppali.
    Prati vishyanni vishadikarinchantamlo naadi mee shali.
    School lo master cheppina patalu anna example prati situationki suit avtundi.
    Oka vishayanni artham chesukovataniki manaku kontavaraku dani pi avagahana avasram.
    Vishaya avagahanaki toduga manalo paripakvata avasaram.
    Simple ga cheppalante 5 class vadiki 10th class pustkalu arthamkanatte!

    • బెస్ట్ కామెడీ ఫిల్మ్ అంటూ నేషనల్ అవార్డ్స్ లో ఒక కేటగిరీ ఉందా?
      ఏమో నాకైతే తెలియదు.
      ఇక పోతే ఈ సినిమా పేరి మణిచిత్రతాళు. ఇది ఒక థ్రిల్లర్…ఈ సినిమా కి కామెడీ అవార్డు ఇచ్చారనుకోవడమే కామెడీ గా ఉంది. ఈ సినిమా లో నటించిన శొభనకి ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది.

  • Avnu mmeerannattu shobanaki adi first best actress awarad.
    rendavadi mitr ki vachindi.
    Of course she deserves it for her dedication towards the art.

    Ika pote ee cinemaki teesukelle mundu maa friend cheppadu deeniki best comedy movie award vachindani. nenu cinema chusaka chala alochincha best comedy movie award endukicharu ani, taruvata asalu alanti award anedi vunda ani.
    Kani ee madhya release aina RGV’s KSD Appal Raju lo Sunil teese nayaki ane kalakandaniki best comedy film ga award vachinattu chupincharu.

    But nakithe exactga telidu elanti award vundo ledo.

  • In my opinion cinema is a mass medium for story telling. Plain and simple. How creative are you visually and aurally in telling your story to your audience makes a movie a great one or an an absolute agony.
    I think a director has to tread a fine line between his creative urges and his story telling abilities in order to create a really great movie.
    On one extreme is – You can have arresting visuals with a very obtuse or garbled message/story in your movie, where the director is trying to take you on a ego trip (Look how creative I am in this movie! you need to have similar creative abilities to understand what i am saying.. kind of a trip) . The director would probably be better off creating a visually arresting slide show with his voice over telling the story in the background.
    Whereas at the other end of the spectrum, (unfortunately where a lot of our directors seem to work) is the one where the director basically insults your intelligence with inane symbolisms and metaphors and formulaic concoctions or sometimes even tries to cheat you with pseudo-artistic abilities, with no story to tell.
    Any one who can find that narrow corridor between these two extremes where great movies exist, is a great director.
    BTW, Sidda Reddy gaaru.. when did you pass out from the school? I too am a Saikorian from the 74-82 batch.

    • 88-95 batch ….royal red (Mourya-Gajapathi)
      Brandy whisky soda pop Gajapati house on the top :-)

  • One such movie is “Taste of cherry”. I still consider it as a bad movie by a great director.

    (I am huge fan of Michael Haneke, and he is a huge fan of Abbas. But still I cannot accept “Taste of cherry” as a good movie). I always thought I did not understand the movie. But, even after reading so much about that movie and watching it again did not convince me.( I was very happy that Ebert also never liked it. I was rubbing shoulders with a giant).

  • This is my first visit to this site. Just now read profile of venkat and came to know taste of cherry is his fav. movie. No offense. After reading your post that movie just struck me and wrote a hasty comment.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories