Menu

ఒక కవిత్వ ప్రేమికుడి ఉద్విగ్న గాథ – ద పోస్ట్ మాన్

ఆంటోనియో స్కార్మెటా స్పానిష్ నవల ఎల్ కార్టెరో డి నెరూడా కు ఇంగ్లిషు అనువాదం ద పోస్ట్ మాన్.

ఈ ఆత్మీయ పుస్తకం గురించి రాయాలంటే అందులోని ఇతివృత్తం నాకు పరిచయమయిన దగ్గర మొదలుపెట్టాలి. అసలు అలాంటి పుస్తకం ఒకటి ఉన్నదని తెలియడానికి చాలముందే ఆ ఇతివృత్తంతో నా ప్రేమ మొదలయింది గనుక ఆ ఎనిమిదేళ్ల కథ చెప్పాలి.

నేనప్పుడు హైదరాబాదు ఎకనమిక్ టైమ్స్ లో పని చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఆయన వెంట వెళ్లిన ప్రతినిధి బృందంలో మా బ్యూరో చీఫ్ బి కె సుధాకర రెడ్డి కూడ ఉన్నారు. ఆయన ఆ పర్యటన మధ్యలో హఠాత్తుగా ఒకరోజు అమెరికా నుంచి ఫోన్ చేసి (అప్పటికి మాకింకా ఈమెయిలూ ఇంటర్ నెట్టూ ఇప్పటంతగా పరిచయం కాలేదు) ‘అమెరికా నుంచి నీకేం కావాలి’ అని అడిగారు. నేను మొహమాటపడి ‘ఏమీవద్దు సార్’ అన్నాను. ‘ఏవయినా పుస్తకాలు కావాలంటే చెప్పు’ అన్నారాయన. ఇంకా మొహమాటంతోనే ఏమీ వద్దనే అన్నాను. కాని వారం పదిరోజులతర్వాత ఆయన తిరిగి రాగానే అప్పుడప్పుడే మైక్రోసాఫ్ట్ తయారుచేసిన ఎన్ కార్టా అనే మల్టీమీడియా ఎన్ సైక్లోపీడియా ఇచ్చారు.
కొన్ని నెలలపాటు ఆ ఎన్ కార్టా ఒక ఆట వస్తువు అయిపోయింది. ఇరవైనాలుగు గంటలూ దాన్ని తెరిచి దానిలోని వింతలూ విశేషాలూ చూస్తూ గంటలు గంటలు గడుపుతుండేవాళ్లం. దాంట్లో లెనిన్ గొంతు, మావో గొంతు, మార్టిన్ లూథర్ కింగ్ గొంతు, మాల్కం ఎక్స్ గొంతు, అనేక స్థలాల 360 డిగ్రీల దృశ్యాలు, అనేక ఫొటోలు, దాదాపు ప్రతి విషయం మీదా పేజీల కొద్దీ సమాచారం చూస్తూ, మిత్రులకు చూపుతూ వారాలకు వారాలు గడిచిపోయాయి.
ఆ ఎన్ కార్టా లోనే మొదటిసారి పాబ్లో నెరూడా కవిత్వం స్పానిష్ లో విన్నాను. అప్పటికి దాదాపు పదిహేను సంవత్సరాలుగా కవిత్వంలో ఆరాధ్య దైవంగా ఉన్న నెరూడా గొంతులో కవిత్వం చదివిన కాసెట్లు ఎక్కడయినా దొరుకుతాయా అని అంతకు ముందు ఎందరో మిత్రులను అడిగినవాణ్ని హఠాత్తుగా ఈ ఎన్ కార్టాలో నెరూడా కవితలు స్పానిష్ లో విని పరవశించాను.

ఇంతకూ అది నెరూడా సొంత గొంతు కాదనీ, నెరూడాగా నటించిన వ్యక్తిదనీ, అది ఇల్ పొస్తినొ అనే ఇటాలియన్ సినిమాలోనిదనీ జాగ్రత్తగా చదివితే అర్థమయింది. ఇక అప్పటినుంచీ ఇల్ పొస్తినొ సినిమా సంపాదించడానికి ప్రయత్నం. ఆ ఇటాలియన్ సినిమా, బహుశా ఇంగ్లిషు సబ్ టైటిల్స్ తో ఎక్కడో వచ్చే ఉంటుంది. కాని హైదరాబాదులో ఆ సినిమా ఎక్కడ దొరుకుతుంది? అప్పటికి హైదరాబాదుకూ అమెరికాకూ సంబంధ బాంధవ్యాలు పెరిగిపోయాయి గనుక హైదరాబాదు నుంచి అమెరికా వెళ్లిన మిత్రులందరినీ ఇల్ పోస్తినొ తెచ్చిపెట్టగలరా, పంపించగలరా అని అడగడం ఒక ఆనవాయితీ అయిపోయింది. అలా అడగగా అడగగా మిత్రులొకరు ఇల్ పోస్తినో వీడియో సీడీ పట్టుకొచ్చారు.

ఆ సినిమాలో నెరూడా పాత్రతో, పోస్ట్ మాన్ పాత్రతో మమేకమవుతూ, ‘కవిత్వం రాసినవాళ్లది కాదు, ఉపయోగించుకునే వాళ్లదే’ అని పోస్ట్ మాన్ అన్న చిరస్మరణీయమైన మాటతో తన్మయమవుతూ కూడ ఆ సినిమాకు మూలం ఏమిటనే సంగతి గ్రహించనేలేదు. నెరూడా క్రియాశీల రాజకీయాల నుంచి కాస్త దూరం జరగదలచి, కవిత్వం రాసుకోదలచి ఏకాంత సముద్రతీరగ్రామం ఇస్లా నెగ్రాలో ఉన్నప్పుడు అక్కడ ఆయనకు విరివిగా వచ్చే ఉత్తరాలు అందించడంకోసం ప్రత్యేకంగా ఒక పోస్ట్ మాన్ ను ఏర్పాటు చేశారు. నెరూడాతో పరిచయంలో ఆ యువకుడూ కవిత్వ అభిమాని అయి, తన నెచ్చెలిని ఆకర్షించడానికి కవిత్వాన్ని వాడుకున్నాడని నెరూడా మెమొయిర్స్ లో ఎక్కడో ఉన్న ఒక చిన్న ప్రస్తావనను తీసుకుని ఈ సినిమా కథ అల్లారని అనుకున్నాను.

బర్కిలీకి రావడానికి కొద్ది రోజుల ముందు కొత్తగా ఆడం ఫెయిన్ స్టీన్ రాసిన నెరూడా జీవితచరిత్ర చదువుతూ నెరూడాలో, నెరూడా కవిత్వంలో తలమునకలయి ఉన్నాను. లాటిన్ అమెరికా గురించీ, ప్రజా పోరాటాలకూ సాహిత్యానికీ ఉండే సంబంధం గురించీ, ప్రపంచంలోని ఇతరదేశాల మార్క్సిస్టులకు భారతీయ మార్క్సిస్టులకు ఉన్నట్టుగా “నైతిక” బంధనాల భారం లేకపోవడం గురించీ చాల ఆలోచిస్తూ ఉన్నాను. నెరూడా జీవితానుభవాల విస్తృతీ, నెరూడా ప్రేమ వ్యవహారాలూ, ఆయన రాసిన శృంగార కవిత్వాన్ని కమ్యూనిస్టు పార్టీ అచ్చువేయడమూ చదువుతూ ఆశ్చర్యపోయాను. అసలు భారతీయ, తెలుగు మార్క్సిస్టు సంప్రదాయంలో “నైతిక వ్యవహారాలు”గా చూడబడేవి హిందూ, బ్రాహ్మణ, గాంధీవాద, మడి-వెలి వాద చిహ్నాలా, మానవ సహజమైనవేనా అని తర్కించుకుంటూ ఉన్నాను.

ఆ ఆలోచనలు ఇంకా తెగకముందే బర్కిలీకి చేరాను. మాకు ఇల్లు అద్దెకు ఇచ్చి సెలవుమీద భారతదేశానికి వెళ్లిన బెంగాలీబాబు అమృత్ చౌధురి దగ్గర విచిత్రమైన విస్తృతిలో పుస్తకాలున్నాయి. ఆ పఠన, లేదా సేకరణ వైశాల్యానికి ఆశ్చర్యపోతూ ఒక్కొక్క పుస్తకమూ చూస్తూ ఉంటే, హఠాత్తుగా కళ్లు ఒక పుస్తకం మీద నిలిచిపోయాయి.

ద పోస్ట్ మాన్.

రచయిత ఆంటోనియో స్కార్మెటా.

స్పానిష్ నుంచి ఇంగ్లిషులోకి అనువాదం కాథరిన్ సిల్వర్.

నూటపదహారు పేజీల చిన్న పుస్తకం. నెరూడా చనిపోయిన తర్వాత పన్నెండు సంవత్సరాలకు 1985లో మొదట స్పానిష్ లో అచ్చయి, 1993లో ఈ అనువాదం ఇంగ్లిషులో వెలువడింది.

సినిమా కోసం నవలలో జరిగిన కథాకాలాన్నీ, స్థలాన్నీ, చివరికి కథలోని ప్రధానాంశాలనూ, పాత్రల పేర్లనూ కూడ మార్చినప్పటికీ, ఇల్ పోస్తినో కు మూలాధారమైన నవల అది.

చిలీ లో నైరుతి భాగంలో వాల్పారైసో నుంచి నూరు మైళ్ల దూరంలోని చిన్న మత్స్యకారుల పల్లె ఇస్లా నెగ్రా. నల్లని ద్వీపం అనే పేరున్న ఈ చిన్న ఊరు నల్లనిదీ కాదు, ద్వీపమూ కాదు. 1930లలో ఆ ఊరు చూసిన నెరూడా చనిపోవడానికి వారం ముందువరకూ ఆ ఊళ్లో ఎన్నో ఏళ్లు గడిపాడు. ఆ ఊరిమీదా, ఆ ఊరి సముద్ర తీరం మీదా ఎన్నో కవితలు రాశాడు. ఆ ఊళ్లో సముద్ర తీరంలో ఒక ఇల్లు కట్టుకున్నాడు. అది చిన్న నిరక్షరాస్య స్పానిష్ జాలరుల గ్రామం గనుక, అక్కడ ఎవరికీ ఉత్తరాలు రావు గనుక అక్కడ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉందిగాని పోస్ట్ మాన్ ఉద్యోగం లేదు. నెరూడా వచ్చి అక్కడ ఉన్నప్పుడు మాత్రం ఆయనకు వచ్చే కట్టల కట్టల ఉత్తరాలు, పుస్తకాలు తెచ్చి ఇవ్వడానికి తాత్కాలికంగా ఒక పోస్ట్ మాన్ ను నియమించేవారు.

అలాంటి తాత్కాలిక పోస్ట్ మాన్ ఉద్యోగం కోసం టెలిగ్రాఫ్ ఆఫీసు తలుపు మీద ప్రకటనతో ఈ నవల మొదలవుతుంది. చేపలవేటకు వెళ్లడం ఇష్టంలేని మారియో జిమేనెజ్ అనే పదిహేడేళ్ల యువకుడు ఆ ప్రకటన చూసి, సొంత సైకిలు ఉంటే చాలు ఆ ఉద్యోగం వస్తుందని తెలుసుకుని ఆ ఉద్యోగంలో కుదురుకుంటాడు. ఇక అక్కడినుంచి చివరిదాకా ఆ నవలంతా ఒక ఉద్విగ్న ప్రణయగాథ. మానవజీవితం నిండా పరచుకుని ఉన్న ప్రేమ పొరలు పొరలుగా ప్రతి పాత్రలోనూ ప్రతి సన్నివేశంలోనూ పువ్వు విచ్చుకున్నట్టుగా పాఠకుల కళ్లముందర విచ్చుకుంటుంది. ఎంత అందమైన పూలయినా రాలిపోక తప్పని భయానక రాజకీయ సామాజిక వాతావరణంలో ఆ అనురాగపుష్పాలు ఏ కర్కోటక సైనిక ఉక్కుపాదాల కింద ఎట్లా నలిగిపోతాయో చెపుతూ నవల ముగుస్తుంది.

నవలలోని ప్రేమ రూపాలకు లెక్కలేదు. అది అనురాగం, వాత్సల్యం, అభిమానం, ప్రేమ, ఆప్యాయత, ప్రణయం, కామం, విరహం…అన్ని రూపాలలోనూ వ్యక్తమవుతుంది. తొలియవ్వనంలో ప్రవేశిస్తున్న ఒక పల్లెటూరి కుర్రవాడికీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనుభవజ్ఞుడైన వృద్ధ కవికీ మధ్య ప్రేమ. కవిత్వమంటే అప్పటిదాకా ఏమీ తెలియని ఒక అమాయక యువకుడు ఉపమానం అంటే ఏమిటో అడగడంతో మొదలుపెట్టి, కవిత్వాభిమాని అయి, చివరికి తానే కవి అయిన దాకా మనిషికీ కవిత్వానికీ మధ్య ప్రేమ. ఆ పల్లెటూరిలో పానశాల నడుపుతూ లోకం పోకడతెలుసుకుని తెలివిగా ఇల్లుగడుపుతూ అప్పుడప్పుడే ఈడేరుతున్న తన కూతురిని జాగ్రత్తగా కాపాడుతున్న నడివయసు స్త్రీ కళ్లు కప్పి ఆ కూతురితో ఆ యువకుడు మొదలుపెట్టిన ప్రేమ. ఆ నవయవ్వన ప్రేమకు ప్రేరణగా ఉద్దీపనగా అవసరమయినంతమేర కవిత్వం మీద ప్రేమ. మధ్యతరగతి పవిత్ర భావనల నేపథ్యం నుంచి చూస్తే పచ్చి శృంగారం అనిపించేలా ఆ యువతీయువకుల మధ్య అవ్యాజ, నిసర్గ, మానవీయ, దైహిక వ్యక్తీకరణ పొందే ప్రేమ. సముద్రం మీదా, సాగరఘోషమీదా, పర్వత సానువుల మీదా, పక్షుల కిలకిలారావాలమీదా, తీరం మీది ఇసుకమీదా, ఆ ఇసుకలో పరుగెత్తే పీతల పాదధ్వనులమీదా, నెరూడా కోసం రాజకీయాలమీదా, నోబెల్ బహుమతిమీదా, అధ్యక్ష ఎన్నికలమీదా… నూటపదహారు పేజీల్లో ఎటుచూస్తే అటు వెల్లివిరిసే ప్రేమ.

చిట్టచివరికి అటువంటి అమాయకమైన, స్వచ్ఛమైన ప్రేమానురాగాలన్నిటినీ నిర్దాక్షిణ్యంగా తొక్కివేసే సైనిక పదఘట్టనలు. సైనిక కుట్ర. అలెండీ హత్య. వేలాదిమంది సోషలిస్టుల, సోషలిస్టు సానుభూతిపరుల ఊచకోత. నెరూడా మరణం. నెరూడా కోసం మారియో సాహసం. చివరికి నెరూడా స్నేహితుడనే అభియోగంతో మారియో కోసమే వచ్చి మారియోను మాయం చేసిన సైనికులు.

ఒక అద్భుత ప్రేమమయగాథ విషాదంగా అంతమవడం…
తప్పనిసరిగా తెలుగు పాఠకులకు చేరవలసిన ఉద్వేగభరిత గాథ ఇది.

– ఎన్ వేణుగోపాల్
మార్చ్ 14, 2008

8 Comments
  1. rahul June 19, 2011 /
    • rahul June 20, 2011 /
  2. N Venugopal June 20, 2011 /
    • rahul June 20, 2011 /
  3. vamshi June 21, 2011 /
  4. sairupa July 7, 2015 /