Menu

నవతరంగం ఫిల్మ్ స్కూల్ launched

గత కొద్ది రోజులుగా నవతరంగంలో ఫిల్మ్ స్టడీస్, ఫిల్మ్ అప్రిషియేషన్ మరియు ఫిల్మ్ టెక్నిక్ మీద కొన్ని వ్యాసాలు ప్రచురించబడ్డాయన్న సంగతి మీకు తెలిసిన విషయమే. తెలుగు సినిమా అబివృద్ధి చెందాలంటే మనకి ఫిల్మ్ స్టడీస్ ఎంతో అవసరమని ఆ వ్యాసాల ద్వారా తెలియచేయడం జరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా నేటి పరిస్థుతుల్లో ఫిల్మ్ స్టడీస్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఫిల్మ్ స్కూల్స్ లో తప్పితే ఇంకెక్కడా సినిమా ని ఒక సబ్జెక్ట్ గా చదివి అర్థం చేసుకునే అవకాశం అంతగా లేదన్నది నిజం. సినిమా పరిశ్రమకు, ప్రేక్షకులకు ఒక వంతెన లాంటి ఫిల్మ్ స్టడీస్ విభాగాన్ని ఎన్నో ఏళ్ళుగా మనం విస్మరిస్తూ వస్తున్నాం. ఆ కొరత తీర్చే ప్రయత్నమే మా ఈ నవతరంగం ఫిల్మ్ స్కూల్ యొక్క లక్ష్యం.

నవతరంగం ఫిల్మ్ స్కూల్ అంటే ఏమిటి?

నవతరంగం ఫిల్మ్ స్కూల్ అంటే ఒక ఆన్ లైన ఫిల్మ్ స్కూల్ అన్నమాట. ఈ ఫిల్మ్ స్కూల్ లో సినిమాకి సంబంధించిన వ్యాసాలను రెగ్యులర్ గా ప్రచురించడం ద్వారా అటు సినిమా తీయాలనుకునే ఔత్సాహికులకు, ఇది వరకే సినిమా పరిశ్రమలో పని చేస్తున్న టెక్నీషియన్స్ కూ మరియు ప్రేక్షకులకు సినిమా అనే ప్రక్రియ లోని వివిధ అంశాలను పరిచయం చేయదలిచాము. ఈ ఫిల్మ్ స్కూల్ లో అందరూ విద్యార్థులే. నిజానికి నవతరంగం స్థాపించినప్పుడు చెప్పిన మాటే ఇప్పుడు మేము మరో సారి చెప్పదలిచాము. ఈ వ్యాసాలన్నీ తెలిసి రాస్తున్నామని అనడం కంటే తెలుసుకోవడానికి రాస్తున్నవి గా పాఠకులు గమనించగలరు. గత కొన్నేళ్ళుగా సినిమా నే జీవితంగా పరిగణించి పగలూ రాత్రీ సినిమా పరిశ్రమలోనే కాలం గడుపుతున్న కొంత మంది ఔత్సాహికులు ఈ నవతరంగం ఫిల్మ్ స్కూల్ స్థాపించడానికి పూనుకున్నారు.

ఫిల్మ్ స్కూల్ అనగానే ఇక్కడ ఏమేం సబ్జెక్ట్స్ బోధిస్తారనే అనుమానం రావొచ్చు. మా దృష్టిలో సినిమాకి సంబంధించిన అన్ని విషయాల గురించి ఇక్కడ చర్చింపబడతాయి. ఈ ఫిల్మ్ స్కూల్ ని మూడు డిపార్టెమెంట్స్ గా విభజించవచ్చు.

 • ఫిల్మ్ స్టడీస్
 • ఫిల్మ్ అప్రిషియేషన్
 • ఫిల్మ్ మేకింగ్

ఉండడానికి మూడు విభాగాలైనా ఈ మూడింటిలోనూ వ్యాసాలు overlap అయ్యే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు “టెక్నిక్ ఆఫ్ ఫిల్మ్ ఎడిటింగ్” గురించి వ్యాసాలు ప్రచురించినప్పుడూ అవి ముఖ్యంగా ఫిల్మ్ మేకింగ్ విభాగానికి సంబంధించనవి అయినప్పటికీ ఎడిటింగ్ లోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా ఫిల్మ్ అప్రిషియేషన్ విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాసాలు అటు సాధారణ ప్రేక్షకులకు, సినిమా తీయాలనుకునే వారికి, ఫిల్మ్ మేకింగ్ లో అనుభవం ఉన్న టెక్నీషియన్స్ కీ అందరికీ అర్థమయ్యేలా సులభమైన భాషలో ఆడియోవిజువల్ క్లిప్పింగ్స్ సహాయంతో తీర్చిదిద్దబడతాయి.

ఫిల్మ్ స్టడీస్ విభాగం లో ముఖ్యంగా సినిమా యొక్క ఆవిర్భావం, అబివృద్ధి మరియు చరిత్ర గురించి వ్యాసాలు ఉంటాయి. దీన్నే ఫిల్మ్ హిస్టరీ అని కూడా చెప్పవచ్చు. ఇదే విభాగంలో సినిమా అనే కళ లో వివిధ ప్రక్రియలు, వాటి ఆవిర్భావం, వాటి సృష్టి కర్తల వివరాలతో కూడిన వ్యాసాలు ఉంటాయి. దీన్నే ఫిల్మ్ థియరీ అని కూడా అనవొచ్చు. ఇక ఈ విభాగంలో చివరిగా సినిమా విమర్శ మరియు విశ్లేషణలతో కూడిన వ్యాసాలు చోటు చేసుకుంటాయి. దీన్నే ఫిల్మ్ క్రిటిసిజం అని కూడా అనొచ్చు.

ఇక ఫిల్మ్ అప్రిషియేషన్ విభాగంలో సాధారణ ప్రేక్షకులకు సినిమా చూసే విధానం గురించి వ్యాసాలు ప్రచురింపబడతాయి. ఇప్పటికే అవార్డ్ సినిమాలనీ, ఆర్ట్ సినిమాలనీ, చీకటి సినిమాలనీ ట్యాగులు తగిలించి సాధారణ ప్రేక్షకులకు దూరం చేసిన కళాత్మక సినిమాలకు సంబంధించి పరిచయ వ్యాసాలతో పాటు, విశ్లేషణాత్మకమైన వ్యాసాలు కూడా ఈ విభాగంలో ప్రచురింపబడతాయి.

ఇక ఫిల్మ్ మేకింగ్ విభాగంలో సినిమా కి సంబంధించిన వివిధ టెక్నికల్ విషయాల గురించి వ్యాసాలు ఉంటాయి. సినిమా తీయడాన్ని ప్రీప్రొడక్షన్, ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ గా మూడు దశలుగా విభజిస్తారు. ఈ మూడు దశల్లోనూ జరిగే వివిధ అంశాల గురించి అనగా, స్క్రిప్ట్ డెవలెప్మంట్, బడ్జెటింగ్, షెడ్యూలింగ్, కాస్టింగ్, షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ ఇలా సినిమా తీసే ప్రయత్నంలో చెయ్యాల్సిన అన్ని విషయాల గురించి ఈ విభాగంలో వ్యాసాలు ప్రచురింపబడతాయి.

అలాగే నవతరంగం ఫిల్మ్ స్కూల్ కేవలం ఆన్లైన్ కి మాత్రమే పరిమితం కాదు. ఈ మూడు విభాగాల్లో కేవలం వ్యాసాలు ప్రచురణ మాత్రమే కాకుండా “నవతరంగం ఫిల్మ్ స్టడీస్” సమర్పణలో వీలైనప్పుడల్లా పుస్తకాలు కూడా ప్రచురించాలన్నది మా లక్ష్యం.

ఈ కార్యక్రమంలో భాగంగా మేము చేపట్టిన మొదటి ప్రయత్నమే “సినిమాలు-మనవీ,వాళ్లవీ”.

“సినిమాలు-మనవీ,వాళ్లవీ”

చలనచిత్ర ఔత్సాహికులు తప్పక చదవాల్సిన పుస్తకాల్లో ఒకటిగా  “Our Films, Their Films”  ని పేర్కొంటారు.భారతదేశం గర్వించదగ్గ సినిమా దర్శకుల్లో ఒకరయిన సత్యజిత్ రే రచించిన ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయడమే మా ఈ నవతరం ఫిల్మ్ స్టడీస్ యొక్క మొదటి ప్రయత్నం. నవతరంగం సభ్యులైన విబి సౌమ్య గారు ఈ పుస్తకాని తెలుగులోకి అనువదించారు. నవతరంగం పాఠకులు, అభిమానులు, సభ్యుల సహాయ సహకారాలతో ప్రచురింపబడ్డ ఈ పుస్తకం మరో వారం పది రోజుల్లో మార్కెట్ లకి రానుందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము.

ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాల కొరకు ఇక్కడ చూడండి.

భవిశ్యత్ ప్రణాళిక

నవతరంగం ఫిల్మ్ స్కూల్, అందులో ఫిల్మ్ స్టడీస్,ఫిల్మ్ అప్రిషియేషన్, ఫిల్మ్ మేకింగ్ అంటూ ప్రకటన చేసెయ్యడం సులభమే కానీ భవిష్యత్ ప్రణాళిక లేకుండా ఇది ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమే అని మాకు తెలుసు. అందుకే ప్రస్తుతానికి మాకంటూ ఈ ప్రణాళిక తయారు చేసుకున్నాము.

 • ముందుగా “సినిమాలు-మనవీ, వాళ్ళవీ” పుస్తకాన్ని మార్కెట్ లోకి తీసుకెళ్ళడం
 • నవతరంగం ని ఒక పబ్లిషింగ్ హౌస్ గా రిజిస్టర్ చెయ్యడం
 • మరో నాలుగు నెలల్లోగా మరో మూడు పుస్తకాలు ప్రచురించడం (ఆంద్రే టార్కోవ్స్కీ, రిత్విక్ ఘటక్, స్టాన్లీ కూబ్రిక్ ల సినిమాలు, మరియు ఆయా దర్శకుల ప్రత్యేకత లతో కూడిన సమాచారంతో ఈ పుస్తకాలు ప్రచురింపబడతాయి)
 • నవతరంగం ఫిల్మ్ స్కూల్ లో వారానికి కనీసం ఒక వ్యాసం చొప్పున వచ్చే సంవత్సరం నవంబర్ కల్లా మొత్తం వంద వ్యాసాలు ప్రచురించడం (“చలనచిత్రాల్లో ఎడిటింగ్” అనే అంశం ద్వారా ఈ వ్యాసాలు మొదలుపెట్టాలన్నది మా ఆలోచన)
 • వీలైతే బయట కూడా నవతరంగం ఫిల్మ్ స్కూల్ క్లాసులు నిర్వహించడం

మా ఈ ప్రయత్నంలో మీ సహాయ సహకారాలు సదా ఉంటాయని ఆశిస్తూ…

సంపాదకులు

నవతరంగం ఫిల్మ్ స్టడీస్

16 Comments
 1. Srinu Pandranki June 1, 2011 /
 2. rahul June 1, 2011 /
 3. NNMuralidhar June 1, 2011 /
  • venkat June 1, 2011 /
   • sreenivas ittam June 14, 2011 /
 4. రాచమల్ల శశిపాల్ రెడ్డి June 3, 2011 /
 5. Srinivas June 5, 2011 /
 6. సివ.కె June 5, 2011 /
 7. సివ.కె June 5, 2011 /
 8. chakri June 5, 2011 /
 9. avula srihari June 9, 2011 /
 10. avula srihari June 9, 2011 /
 11. srikanth June 9, 2011 /
 12. DURGESWARA June 13, 2011 /
 13. damodara. November 15, 2011 /
 14. కృష్ణ చైతన్య October 2, 2013 /