Menu

నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం: “సినిమాలు – మనవీ, వాళ్ళవీ-సత్యజిత్ రే “

సినిమా అంటే ఇష్టం వున్న ఎవరికైనా సత్యజిత్ రేని పరిచయం చెయ్యాలని ప్రయత్నించడం దుస్సాహసం అవుతుంది. ప్రపంచ సినిమా కాన్వాస్ పై మువ్వన్నెల రంగులద్దిన తొలి భారతీయ దర్శకుడిగా రే అందరికీ సుపరిచితుడు. అప్పటి సినిమాలకు భిన్నంగా, వాస్తవికతే ప్రధాన మాధ్యమంగా మన సినిమాకి ఒక పరిభాషని ఏర్పరిచి, ముందు తరాలలో ఎందరికో దిశానిర్దేశ్యం చేసిన మహానుభావుడాయన. అలాంటి దర్శకుడు దార్శనికుడు వ్రాసిన  “Our Films – Their Films”  అనే పుస్తకాన్ని తెలుగులో “సినిమాలు: మనవీ, వాళ్ళవీ” అనే పేరుతో మీముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది నవతరంగం.

పుస్తకం శీర్షికలో చెప్పినట్లు, ఈ పుస్తకంలోని వ్యాసాలు, రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో రే అప్పటి భారత దేశ సినిమా పరిస్థితిని, సినిమా తీయటంలో దర్శకుడిగా తన అనుభవాలని, కష్టాలని వెల్లడి చేస్తాడు. రెండో భాగంలో ప్రపంచ సినిమా పోకడలని, ఆయన సమకాలికులైన కురొసవ, చాప్లిన్ వంటి ప్రముఖుల గురించి తన అభిప్రాయాలనీ వివరిస్తాడు. మొదటి సగంలో ఎంతో అనుభవంతో విశ్లేషించే గురువులా కనిపిస్తే, రెండొవ సగంలో ఎంతో వినమ్రుడైన విద్యార్థిలా అగుపిస్తాడు. ఇదే ఆయన రచన శైలిలో వున్న ప్రత్యేకత. ఎంతటి గొప్పవాళ్ళైనా నిష్కర్షగా విమర్శిస్తూ, సినిమా చరిత్రలో మైలు రాళ్ళు అనదగిన వ్యక్తులను, సంఘటనలు వివరిస్తూ సాగుతుందీ పుస్తకం.

సత్యజిత్ రే స్వతహాగా దర్శకుడే కాక కథకుడు, సంగీతజ్ఞుడు, చిత్రకారుడు కావటం వల్ల ఆయన చెప్పే ప్రతి విషయం ఇట్టే చదివించేస్తుంది. చాప్లిన్ ని మొజార్ట్ తో పొల్చడం, జాన్ ఫోర్డ్ ని బీథోవెన్ తో పోల్చడం చూస్తే సత్యజిత్ రేకి వివిధ సృజనాత్మక కళల గురించి వున్న అవగాహన బోధపడుతుంది. ఒక కొత్త దృక్కోణంలో చూసే అవకాశమూ కలుగుతుంది. సినిమా తీయాలని అనుకునేవారికే కాకుండా, సినిమాని ఇష్టపడేవారికి కూడా ఉపయోగపడే అంశాలు ఎన్నో వున్నాయి. ఇదంతా ఆయన రచనా వైశిష్ట్యం గురించి.

ఎప్పుడో అరవై డెబ్భై ఏళ్ళ క్రితం వ్రాసిన ఈ వ్యాసాలలో చిత్ర నిర్మాణ పరిస్థితులను, సినిమా పరిభాషను గురించి ఆయన చేసే వ్యాఖ్యలను గమనిస్తే, ఈ నాటికీ సినిమా వ్యవస్థ ఏ మాత్రం మారలేదని అర్థం అవుతుంది. మూకీ చిత్రాల నుంచి శబ్దచిత్రాలకు జరిగిన మార్పులలో శబ్దప్రాధాన్యత పెరిగి, దృశ్య ప్రాధాన్యత తగ్గిందని వాపోయినా, “స్టార్” నటులకోసం కథలలో మార్పులు చేస్తున్నారని బాధపడినా, యూనియన్ విధానం పై వ్యంగాస్త్రాలు వేసినా, స్టూడియో భారీ బడ్జెట్ సినిమాల పరాజయాల గురింఛి మాట్లాడినా, అన్నీ ఈ నాటికీ వాస్తవాలుగా కనిపించి ఆశ్చర్యపరుస్తాయి. ఆలోచింపజేస్తాయి.

సినిమాను ఒక కళగానే కాక ఒక సబ్జెక్ట్ గా చదవాలనుకునే వారికి తెలుగు పుస్తకాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగులో సినిమా గురించి వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా వచ్చిన పుస్తకాలు చాలా అరుదు. సత్యజిత్ రే ఈ పుస్తకం మొదట్లోనే చెప్పినట్లు – “సాధారణంగా ఒక దర్శకుడు తన సినిమాల గురించి రాయడం చాలా అరుదు” అనేది మిగతా సాంకేతిక నిపుణులందరి విషయంలోనూ నిజం కావడమే కారణం కావచ్చు. కానీ అలా చెప్పిన ఆయనే వివిధ పత్రికలలో వ్యాసాలను రాసి, వాటిని ఒక పుస్తకంగా తేవడం సినీప్రేమికుల అదృష్టమనే చెప్పాలి. అలాంటి అదృష్టాన్ని తెలుగు వారికి కూడా అందజేయాలన్న అభిమతమే మా ఈ తొలి ప్రయత్నానికి కారణం. మీ ఆదరణే ఇలాంటి మరెన్నో ప్రయత్నాలకు ప్రోతాహకం కాగలదని మా నమ్మకం.

సంపాదకులు

నవతరంగం ఫిల్మ్ స్టడీస్

5 Comments
  1. rahul June 2, 2011 /
  2. Sripal Sama June 5, 2011 /
  3. venkata kumar February 23, 2012 /