Menu

సినీ‘మణిరత్నం’

 

జూన్ 2 మణిరత్నం 55 వ పుట్టినరోజు సందర్బం గా ..ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ..

పెద్ద పెద్ద దర్శకుల సైతం సినిమా ను ఓరల్ గా చెపుతున్న కాలమది..విజువల్ మీద దర్శకులు ఇంకా సరైన ద్రుష్టి సారించని రోజులవి. గొప్ప కథలు..కానీ విజువల్ లో చెప్పుకోదగ్గంత గొప్పతనం లేదు. కేవలం కథ ను చెప్పటానికి అవసరమైనంత కేర్ తప్ప ..ప్రతి ఫ్రేము నూ ఓ ఆర్ట్ లా తీర్చిదిద్దాలన్న ఉద్దేశానికి ఇంకా దర్శకులు రాలేదు.  ఇలాంటి పరిస్థితుల లో కథా విలువలు ,విజువల్‌  ఈ రెండింటి పై సమగ్ర అవగాహన వున్న ఓ దర్శకుడొచ్చాడు. ఎమ్.బి ఏ. చదివి సినిమా మీద గొప్ప ప్యాషన్‌ తో దర్శకుడయ్యాడు. ఎవరి దగ్గరా అసిస్టెంట్ గా చేయకుండా తానే సొంతంగా తన స్టైల్ లో సినిమాలు తీయటం ప్రారంభించాడు. మొదటి మూడు సినిమాలు ఫ్లాప్‌ అయినా వెనుతిరగలేదు. నాలుగో సినిమా ఓ మోస్తరు గా ఆడింది, ఇక ఐదవ సినిమా తో ఒక్క సారిగా భారతీయ సినిమా మేధావుల దృష్టిని ఆకర్షించటమే గాక ఈ జాబితా లో చేరిపోయాడు. ఆ సినిమా మౌనరాగం..ఆ దర్శకుడు మణిరత్నం.

అనుకున్న కథ ను తెరమీద కు నూటికి నూరు పాళ్ళ న్యాయం చేస్తూ.. తెరకెక్కించగల సామర్థ్యం వున్న దర్శకుడు మణిరత్నం. ఆయన సినిమా చూసినంత సేపూ ,మనసు లోపలి సున్నిత భావాలను అందంగా, గొప్పగా ,లోతుగా చూస్తున్న అనుభూతి కి లోనవుతాం. హ్యూమన్‌ ఎమౌషన్ ని విజువల్ గా చెప్పగలగటం లో యూరోపియన్‌ దర్శకుల కు ఏ మాత్రం తీసిపోని దర్శకుడు మణిరత్నం.  పుస్తక రూపంలో మాత్రమే చెప్పటానికి సాధ్యమయ్యే మానవ భావోద్వేగాలను గొప్పగా తెరపైకి ఎక్కించగలిగిన భారతీయ దర్శకుల లో మణిరత్నం ఖచ్చితంగా ఒకరు.ఆయన సినిమాలు మౌనంగా సహజంగా హ్రుదయాల లోపలకు వెళ్ళగలిగే  సామర్థ్యం కలవి. సినిమా భిన్న కళల సమాహారం అన్నదానికి నిదర్శనాలుగా మణిరత్నం సినిమాలను ఉదాహరించవచ్చు . సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ,ఆర్ట్ డైరెక్షన్ ,మ్యూజిక్, యాక్టింగ్ ..ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతీ శాఖ వర్క్ అద్బుతం అనిపిస్తుంది. అంత గొప్ప గా క్రాఫ్ట్ చేస్తారు ఆయన. ప్రతి ఫ్రేమ్ మీదా అత్యంత శ్రద్ద కనపరచటం ఒక్క మణిరత్నానికే చెల్లింది. మణిరత్నం కొన్ని సార్లు కథ పరంగా ఫెయిల్ అయ్యారేమో కానీ క్రాఫ్ట్ పరంగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఎప్పటికప్పుడు కొత్త గా చిత్రీకరించటానికి పెద్ద పీట వేసారు. పాత్రల మాట తీరు దగ్గర నుండి ఆ పాత్ర చూపు వరకూ ఎంతో కేర్ తీసుకుంటారు మణిరత్నం.’’గీతాంజలి”సినిమా లో గీతాంజలి మాట తీరు..ఆ శబ్దం మనలని ఎంతగా ఆకట్టుకుంటుందో వేరే చెప్పనవసరం లేదు.’ఇద్దరు’ సినిమా లో ప్రకాష్ రాజ్ ఎప్పుడూ అందరినీ తల పై కెత్తి రెప్పలు కిందికి వాల్చి చూస్తుంటాడు. అలాగే మోహన్ లాల్ పాత్ర ఎప్పుడూ తల కిందికి వుంచి పైకి చూస్తున్నట్టు గా వుంటుంది. ’అమృత’ సినిమా లోని చిన్న పాప చూపు చాలా సూటిగా వుంటుంది. మాట తీరు కొంచెం కర్కశం గా వుంటుంది. ఆయా పాత్రల స్వభావాలని వారి చూపులు, మాట తీరుల ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేసారు మణిరత్నం.
మణిరత్నం విజువల్ స్టామినా గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు ముచ్చటించాలి.’ ఘర్షణ”సినిమా లో బ్యాక్ లైటింగ్ తో ఆకట్టుకున్న విధానం అద్బుతం..ముఖ్యంగా పాట ల చిత్రీకరణలో నూతనత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది..’ గీతాంజలి”సినిమా వచ్చిన రోజుల్లో అందరూ మాట్లాడుకున్న ముఖ్యమైన అంశం..”ఓ నమహా.’.పాట చిత్రీకరణ. రౌండ్ ట్రాలీ తో…కెమెరా ను గుండ్రంగా తిప్పుతూ ..వాళ్ళిద్దరి మధ్యా ఆ ఎమోషన్ ను క్యారీ చేయెచ్చు అన్న ఆ ఐడియా అభినందించదగినది. ఆ ప్రేమికుల మధ్య ఎమోషన్ నూ.. ఆ ద్రుశ్యమాలిక తో పాటు.. ఇళయరాజా సంగీతం తోడవటం తో అత్యాద్బుతం అనిపిస్తుంది. ’ఇద్దరు’సినిమా లో ’ఉన్నాను నీకు తోడు గా ఒక్కొక్క మధురక్షణం’ అనే ఓ కవితను మణిరత్నం విజువలైజ్ చేసిన తీరు హ్యాట్సాఫ్ అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్, టబుల మధ్య ఓ తెలియని అనుబంధం.. వారి వారి హ్రుదయాలకు మాత్రమే అర్థమయ్యే ఓ గొప్ప అనుభూతి..  ఆ గాడానుబంధాన్ని చూపించిన తీరు..నాకు ఓ చలం పుస్తకాన్ని విజువల్ గా చుస్తున్నానా..అన్న ఫీలింగ్ కలిగించింది. నిజంగా అద్బుతమైన విజువలైజేషన్. ’అమృత’ సినిమా లో”ఏంత చెక్కిలి గిల్ గిల్ ’పాట క్రియేటివిటీ అన్న పదానికి సరైన నిర్వచనం గా చెప్పుకోవచ్చు. ఓ నది.. ఇసుక.. ఓ పాప.. పాప తల్లి..  వాళ్ళిద్దరినీ చూపిస్తూ.. విజువల్ గా చాలా గొప్పగా తీసారు మణిరత్నం.”సఖి ’సినిమా లో పచ్చదనమే..పచ్చదనమే పాట చూస్తున్నంత సేపు ఓ గొప్ప చిత్రకారుడి పెయిటింగ్స్ ను వరుసగా చూస్తున్నానా అన్న ఫీలింగ్ కలిగింది. ఒక్కో షాట్ ఒక్కో పెయిటింగ్..  ఈ సినిమా లో నే విషాద పాట.. ’కలలై పోయెను నా ప్రేమలూ.,.” ఈ పాట లో వర్షం కురుస్తున్నట్టు అట్మాస్పియర్ ను క్రియేట్ చేసిన దాంట్లో వున్న సహజత్వం..మరే ఇతర సినిమాల్లో నూ నేను చూడలేదు.. ఆ గాలి.,.,ఆ గాలికి అన్నీ అటూ ఇటూ ఊగటం.. ఓ షాట్ లో డేరాల్లాగా వేసివున్న తెర దగ్గర ఓ చిన్న కర్ర పట్టుకొని నుంచొని పరథ్యానం లో వున్న హీరోయిన్ ఇమేజ్ ఈ సినిమా పేరు చెప్పగానే నా కళ్ల ముందు కదులుతుంది. ఇదే సినిమా లో ’కాయ్ లవ్ చెడుగుడు’ పాట లో రివర్స్ షాట్ ను చాలా బాగా వాడారు. ఈ పాట లోని విజువల్స్ సైతం గొప్పగా వుంటాయి.’బొంబాయి”సినిమా లో ’కన్నాను లే”పాట… ’ఉరికే చిలక” పాట ల ను ఎన్నిసార్లయినా చూడొచ్చు. అంత గొప్ప విజువల్ బ్యూటీ వుంది వాటిల్లో.

మౌనం ఎంత గొప్పగా ఎదుటివారిని ప్రభావితం చేస్తుందో’ మౌనరాగం”లో చూపించాడు మణిరత్నం.

వ్యవస్థ లోని అన్యాయాలను తట్టుకొని కష్టాలను అనుభవించిన వ్యక్తి ’నాయకుడు”గా ఎలా ఎదిగాడో చూపిన గ్రేట్ డైరెక్టర్‌ మణిరత్నం. ’రోజా’ లో దేశభక్తి ని చూపే ప్రయత్నం చేసారు.
’బొంబాయి”లోని హిందూ, ముస్లింల గొడవని, బాబ్రీ మసీదు కూల్చివేత నూ సినిమా లో ఎంతో సున్నితంగా డీల్‌ చేసి అందరి చేతా గ్రేట్‌ అనిపించుకున్నాడు మణిరత్నం.

మానసిక సమస్య తో వున్న ఓ చిన్నారి పాప చుట్టూ అల్లిన కథ తో తీసిన ’అంజలి ’ చూసిన ప్రతి ఒక్కరికీ కంట నీరు పెట్టిస్తోంది. చిల్లర దొంగతనాలు చేసే ఇద్దరు వ్యక్తుల కథ ’దొంగ దొంగ ’ సరదా గా సాగినా, ఈ సినిమా లో నూ మణిరత్నం మార్క్ లోతైన సన్నివేశాలు కొన్ని  కనిపిస్తాయి.
చనిపోబోతున్న ప్రేమికుల కథ ను ఓ గొప్ప కావ్యంలా ’గీతాంజలి ’ గా మలిచిన దర్శకుడు మణిరత్నం.
స్నేహం విలువను చాటి చెప్పే’దళపతి’అయినా… ఒకప్పటి స్నేహితులు రాజకీయంగా ఎదిగే క్రమంలో  విడిపోయిన వైనాన్ని”ఇద్దరు ’ సినిమా లో ఎంతో కన్విన్సింగ్‌ చెప్పినా .. ఓ అమ్మాయి పెరిగిన నేపథ్యం ప్రేమకు అడ్దొస్తుంటే ..ఆ సంఘర్షణ ను అందంగా , గొప్పగా దిల్ సే గా మలిచినా.. పెళ్లి కి ముందు , పెళ్లయిన తర్వాత ప్రేమ లొ వచ్చే వ్యత్యాసాన్ని చాలా సున్నితంగా సఖి లో చెప్పినా..యువకులు పాలిటిక్స్ లోకి రావాలన్న ఆలోచనతో ’యువ ’  తీసినా.. ఓ చిన్న పాప పాయింట్ ఆఫ్‌ వ్యూలో  ఎల్‌.టి.టి  సమస్య మీద ’అమృత’ సినిమా చేసినా… ధీరుభాయ్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్త జీవితం ఆధారంగా’గురు”తెరకెక్కించినా,… రామాయణాన్ని మరో కోణం లో చూపే ప్రయత్నంగా ’రావణ్  ’తీసినా .. ఇలా ఏ కథా వస్తువు నైనా తనదైన శైలి లో హృదయానికి హత్తుకొనేలా చెప్పగల నైపుణ్యం మణిరత్నం ను ఆయన్ని గొప్ప దర్శకుడిగా నిలబెట్టింది.
మణిరత్నం తొలి సినిమా ఓ కన్నడ సినిమా .అనిల్ కపూర్‌ ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమా పేరు పల్లవి అనుపల్లవి. తొలి సినిమా లో నే మణి రత్నం ఒక యువకుడి కీ, వయసు రీత్యా తనకంటే పెద్దదైన ఓ ఆమెకు మధ్య రిలేషన్‌ షిప్‌ ను చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా ఫ్లాప్‌ అయినా ఇళయరాజా అందించిన పాటలు సూపర్‌ హిట్ అయ్యాయి.ఈ సినిమా కు అప్పటికే దర్శకుడి గా మారిన సినిమాటోగ్రాఫర్ బాలూ మహేంద్ర అందించిన ఫొటోగ్రఫీ అత్యాద్బుతంగా వుంటుంది.  ఈ సినిమా తర్వాత బాలూ మహేంద్ర మణిరత్నం సినిమా లకు పనిచేయలేదు. అప్పటికే గొప్ప సినిమాటోగ్రాఫర్ గా, గ్రేట్ డైరెక్టర్‌ గా పేరు సంపాదించుకున్న బాలూమహేంద్ర ఎవరి దగ్గరా అసిస్టెంట్ గా చేయని మణిరత్నం తో కలిసి పనిచేయటానికి ఆసక్తి చూపలేదు. ఈ సినిమా లో కనులు కనులు పాట ట్యూన్ నే తర్వాత ఐడియా మొబైల్ యాడ్ కు వాడటం మనం గమనించవచ్చు.

పల్లవి అనుపల్లవి ఫ్లాప్ అయినా మణిరత్నం ఏ మాత్రం నిరాశ పడలేదు. వెంటనే పాగల్ నిలవు, ఉనరు అనే రెండు తమిళ సినిమా లనూ. మోహన్ లాల్‌ తో ఓ మళయాళవ సినిమా ను చేశారు. అయితే ఈ సినిమాలు కూడా మణిరత్నం కు సరైన గుర్తింపును తీసుకు రాలేదు. ఈ మూడు సినిమాలకు ఇళయ రాజా అందించిన సంగీతం ఇప్పటికీ బెస్ట్ మ్యూజిక్ గా మన్ననలు పొందుతోంది.
మణిరత్నం కు గొప్ప పేరు ను తీసుకు వచ్చిన సినిమా మౌనరాగం. ఇప్పటికీ సినిమా పరిశ్రమ లో కొందరు ఆయన్ని మౌనరాగం మణిరత్నం అనే పిలుస్తారు. ఈ సినిమాతో భారతీయ సినిమా మేధావుల దృష్టి  లో పడ్డారు మణిరత్నం.  స్క్రిప్ట్‌ మీదా, క్యారెక్టర్స్‌ మీద మణిరత్నం కు వున్న కమాండ్ ఏంటనేది తెలియాలంటే ఈ సినిమా చూడవలసిందే.

ఈ సినిమా లో మౌనానికి రిప్రజెంటేషన్ మోహన్‌ క్యారెక్టర్‌. ఈ క్యారెక్టర్‌ ను క్రియేట్ చేసిన మణి రత్నం కు చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. అంత గొప్ప క్యారెక్టర్‌ అది. నెమ్మది, ఓపిక, ఏ విషయాన్నైనా అర్ధం చేసుకోగల మెచ్యూరిటీ, మంచితనం కలగలిసిన పాత్ర అది. సినిమా ప్రారంభం లో నే ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని ఓ సన్నివేశం ద్వారా చాలా స్పష్టంగా చెపుతాడు మణి రత్నం. మౌనరాగం లో రేవతి పాత్రలో క్రమ క్రమం గా వచ్చిన మార్పుకు కేవలం మోహన్‌ మౌనం, మంచితనాలే కారణం. ఈ సినిమా లో మరో ప్రధాన పాత్ర ను కార్తీక్‌ పోషించాడు. కార్తీక్‌ తో వున్న ప్రేమ సన్నివేశాలు చూడటానికి బావుంటాయి. నిజానికి ఈ లవ్‌ ట్రాక్‌ కు దగ్గర దగ్గర గా వుండే సన్నివేశాలు కొన్ని పల్లవి అను పల్లవి లో అప్పటికే మణి రత్నం చేసారు. అయితే వాటిని ఇంకా బాగా చేశారు మౌనరాగం లో.. మౌనరాగం సినిమా గురించి ముఖ్యంగా చెప్పకోవలసింది మ్యూజిక్‌ మెస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం. ఈ సినిమా పాటలను ప్రాణం పోసి చేశారా ఇళయరాజా అన్నంత గొప్ప గా వుంటాయి. హృదయాలను కదిలించే సంగీతం మౌనరాగం లో వుంది. ఈ సినిమా అకాడమీ అవార్డ్‌ కు ఇండియా తరపున నామినేట్ అవటం విశేషం.
మౌనరాగం తర్వాత మణి రత్నం చేసిన సినిమా నాయకుడు.  సినిమా అనేది ఎలా వుండాలి అనే దానికి ఓ నిదర్శనం ఈ సినిమా..ఈ తరం దర్శకులల్లో చాలామందిని ఎంతగానో ప్రభావితం చేసిన సినిమా ఇది.  ఈ సినిమా తో అంతర్జాతీయ స్థాయి లో గొప్ప దర్శకుడి గా గుర్తింపు పొందారు మణిరత్నం. టైమ్ మ్యాగజైన్‌ రిలీజ్‌ చేసిన ఆల్‌ టైమ్ 100 బెస్ట్‌ ఫిల్మ్స్‌ లో స్థానం లబించిన మూడు సినిమాల్లో నాయకుడు ఒకటి కావటం విశేషం. చిన్నతనం నుండి ఈ వ్యవస్థ చేత అనేక రకాలు గా అన్యాయంగా హింసకు గురైన ఓ మామూలు వ్యక్తి క్రమ క్రమంగా నాయకుడు గా ఎదుగుతాడు. ఈ ఎదిగిన క్రమాన్ని మణిరత్నం చూపిన తీరు రియల్లీ హ్యాట్సాఫ్‌ అనిపిస్తుంది. నాయకుడు సినిమా లో ఒక్కో సన్నివేశం రాసిన తీరు, దానిని చిత్రీకరించిన తీరు చూస్తే మణిరత్నం కు స్క్రిప్ట్‌ మీదా, టెక్నికల్ వాల్యూస్‌ మీద వున్న కమాండ్ ఏమిటనేది అర్థమవుతుంది. ఈ సినిమా లో సీన్ అనేది ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనాలు గా చెప్పుకోదగ్గ సీన్ లు అనేకం వున్నాయి.

నాయకుడు సినిమాలో కమలహాసన్‌ పాత్ర కు జీవం పోశాడు అని చెప్పాలి. ఈ సినిమా లో కమలహాసన్‌ వయసు రీత్యా వచ్చే శారీరక మార్పులకు తగ్గట్లు పొట్ట పెరగటం, మొహం మీద మడతలు, మాట తీరులో మార్పు ..ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఆ పాత్ర ను పోషించాడు.

ఈ సినిమా కు కథా పరంగా హాలీవుడ్ సినిమా గాడ్‌ ఫాదర్‌ కూ కొన్ని పోలికలు కనిపిస్తాయి. మణిరత్నం ఈ సినిమా కథ ను అప్పటి ముంబాయ్‌ అండర్ వాల్డ్‌ డాన్‌  వరద రాజన్‌ ముదలియార్‌ జీవితాన్ని ఆధారంగా చేసానని చెప్పారు. ఈ సినిమా ను రిలీజ్‌ కి ముందే ఆయనకు ఓ స్పషల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు . సినిమా చూసిన ఆయన నువ్వు సినిమాలో చూపినంత మంచి వాడిని కాను నేను అని అన్నారట.

ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఇళయరాజా సంగీతం. ’నీ గూడు చెదిరింది ’  అన్న థీమ్ సాంగ్‌ సినిమా లో అప్పుడనప్పుడు అక్కడక్కడా వస్తూంటుంది.ఇది సూటిగా హ్రుదయాన్ని తాకి అప్పటికప్పుడే ఓ తెలియని భావోద్వేగానికి గురిచేసి, మళ్లీ మళ్లీ ఆ ఫీలింగ్ ను మన కు గుర్తు చేసేంత గొప్పగా వుంటుంది. రియల్లీ హ్యాట్సాఫ్ టు ఇళయరాజా.  ఈ పాట ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే వుంది. ఇండియా లో ది బెస్ట్‌ ట్యూన్స్ గా ఓ పదింటిని సెలెక్ట్‌ చేస్తే దాంట్లో ఈ ట్యూన్‌ నెంబర్‌ వన్‌ గా నిలిచింది.గొప్పవి ఎన్నేళ్ళయినా విలువ తగ్గకుండా అలాగే వుంటాయి అన్నదానికి నిదర్శనం ఈ నాయకుడు.
ఈ సినిమా కు పి.సి. శ్రీ రామ్ అందించి సినిమాటోగ్రఫీ సైతం గొప్పగా వుంటుంది. ఈ సినిమా కు మూడు నేషనల్ అవార్డ్‌ లు లభించాయి. ఉత్తమ నటుడు గా కమలహాసన్‌, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా పి.సి. శ్రీరామ్. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌ గా తోట తరణిలు నేషనల్ అవార్డులను అందుకున్నారు.

 

మణిరత్నం కార్తీక్‌ – ప్రభు కాంబినేషన్ లో తీసిన సినిమా ఘర్షణ. ఒకే తండ్రి కి పుట్టిన  ఇద్దరు కొడుకుల మధ్య ఘర్షణ ను చూపే ప్రయత్నం చేశాడు మణిరత్నం. ఈ సినిమా కు పి.సి. శ్రీరామ్ అందించిన ఫోటోగ్రఫీ ఇండియన్ సినిమాటోగ్రఫీ చరిత్రలో ఓ ల్యాండ్ మార్క్‌ గా చెప్పుకోవాలి. లైటింగ్‌ ప్యాట్రెన్ లో ఓ సరికొత్త సంచలనం ఈ సినిమా. ఈ సినిమా కు ఇళయరాజా అందించిన సంగీతం అప్పటికీ. ఇప్పటికీ , ఎప్పటికీ విలువ తగ్గని గొప్ప సంగీతం.

మణిరత్నం తమిళ్‌ లో తీసిన అగ్నినక్షత్రం సినిమా ను సి.ఎల్‌.నరసారెడ్డి తెలుగు లో వెంకటేష్‌ నాగార్జున కాంబినేషన్ లో పునర్నిర్మాద్దామనుకున్నారు. అయితు అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చివరకు ఆ సినిమా ను ’ఘర్షణ ’ గా తెలుగులో కి డబ్ చేసారు.

మణిరత్నం తీసిన సుమధుర వెండితెర దృశ్య కావ్యం ’గీతాంజలి ’. ఈ సినిమా సెల్యులాయిడ్ పై విజువల్‌ పొయిట్రీ లా వుంటుంది. మణిరత్నం స్ట్రయిట్‌ గా తెలుగు లో తీసిన ఒకే ఒక సినిమా ఇది. హృదయాలను హత్తుకొనే కథ, గొప్ప పెయింటింగ్ లా కదిలే దృశ్యాలు , మనసు లోతట్టు భావాలను కదిలించే సంగీతం ,  ఇవన్నీ గీతాంజలిని కాలం అనే కొలమానం తో సంబంధం లేని ఎప్పటికీ వన్నెతగ్గని విలువైన సినిమాగా భారతీయ సినీ చరిత్రలో గుర్తుండిపోయేలా చేశాయి. ఈ సినిమా గొప్పతనం లో సగభాగం సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీ రామ్ కు,సంగేత దర్శకుడు ఇళయరాజా కు ఇవ్వాలి.

గీతాంజలి గురించీ, మిగిలిన సినిమాల గురించీ విపులంగా ….

తర్వాత భాగం  త్వరలో..

(ఈ వ్యాసం దర్శకుడు మణిరత్నం మీద నాకు గల అభిమానం తో రాసినది మాత్రమే. ఇది విశ్లేషణ కాదు. గమనించగలరు. ..)

—-సౌమ్య మోహన్ .

7 Comments
  1. రాజశేఖర్ June 1, 2011 /
  2. Balaji Sanala June 1, 2011 /
  3. msk June 1, 2011 /
  4. rateeshbabuvarigeti June 1, 2011 /
  5. Sripal Sama June 5, 2011 /
  6. RAJA December 21, 2012 /