Menu

పుస్తకావిష్కరణ

అనుకున్నరోజు రానేవచ్చింది…
సంవత్సరకాలపు స్వప్నం…దాదాపు మూడు నెలల కష్టం. చివరి క్షణంవరకూ సాగిన టెన్షన్…
5.00 గంటల నుంచీ వెయిట్ చేస్తుంటే దాదాపు 5.45 కి థియేటర్ ఖాళీ అయ్యి, ఫంక్షన్ కోసం హ్యాండోవర్ చేశారు.
ఆరయ్యింది. స్టేజి ఏర్పాట్లు ఇంకా జరుగుతున్నాయ. బయట కేవలం పదిపదిహేను మంది మాత్రమే ఉన్నారు.
చాలా మందిని ఆహ్వానించాం. పుస్తకావిష్కరణ అంటే ఎంత చిన్నచూపైనా, మరీ ఇంత మందేనా అనుకున్నా.
ఏర్పాట్లు పూర్తిచేసుకుని బయటొచ్చేసరికీ గుంపు కాస్తా జనమయ్యారు దాదాపు యాభైఅరవై మంది.
వెంకట్ – సత్యప్రసాద్ – నేనూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. It was a great relief.

హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సభ్యులకు సభాసారధ్యాన్ని అప్పగించి. బయట నిల్చున్నాం.
అతిధులు రామానాయుడు ఫిల్మ్ స్కూల్ డీన్ వెంకటేష్ చక్రవర్తి గారు తమ విద్యార్థి బృందంతో సహా ముందేవచ్చారు.
ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ సినిమా క్లాసే…
జాతీయఅవార్డు గ్రహీత ఇంద్రగంటి మోహనకృష్ణ వచ్చారు. నవతరంగంతో తనకున్న అనుబంధాన్ని గురించి సెంట్రల్ యూనివర్సిటీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ హెడ్ వినోద్ గారితో చర్చిస్తూ నవతరంగం టీం ని పరిచయం చేశారు.

ఇంకా ఎందరో నవతరంగం పాఠకులు, సాహితీ మితృలు, సినీమితృలు, ఫేస్ బుక్ నేస్తాలు అప్పటికే అక్కడికి చేరారు. సంఖ్య దాదాపు వంద మార్కు చేరింది. ఇంతలో ముఖ్య అతిధి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు గారు వెన్యూకి వచ్చేశారు.

హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ తరఫున్నుంచీ KL ప్రసాద్ గారు వ్యాఖ్యాతగా  “తెలుగు సినిమాలో సైలెంటుగా ఏదో జరుగుతోంది. మార్పు వస్తుంది. అది ఇలాంటి ప్రయత్నాలవల్లే జరుగుతుంది” అనే మాటలతో కార్యక్రమం మొదలయ్యింది.

అప్పటిదాకా అప్పుడప్పుడు మాత్రమే మ్రోగిన నా ఫోన్, వెన్యూ లొకేషన్ కనక్కోవడానికి ప్రయత్నిస్తున్న మిత్రులతో మళ్ళీమళ్ళీ మ్రోగడం మొదలయ్యింది.అర్జంటుగా దాన్ని సైలెంట్ మోడ్ లో పెట్టి, అప్పుడప్పుడూ బయటికొచ్చి మరీ దారి డైరెక్షన్లు ఇస్తూ వచ్చేసరికీ, ఆడిటోరియం నిండి, ప్రత్యేకంగా వేయించి చైర్లు కూడా ఫుల్లై పాఠకప్రేక్షక అతిధులు వెనకాలా పక్కనా నిల్చోవాల్సినంతగా కిక్కిరిసింది. ఈ పుస్తకం అనుదించిన వి.బి.సౌమ్య గారి తల్లిగారు, భర్త శ్రీరాం కూడా సభకు రావడంతో ఒక నిండుదనం సమకూరింది.

మొదటగా వెంకటేష్ చక్రవర్తి, ప్రస్తుతం సినిమాల్లో వస్తున్న మూసల్ని నిరసిస్తూ “కథను హృద్యంగా చెప్పడం మర్చిపోతే, మంచి సినిమాలు ఎక్కడి నుంచీ వస్తాయి” అని ప్రశ్నించారు. తొలితరం దర్శకుల తరువాత తెలుగులో అలాంటి సినిమాలు రావడం తగ్గిపోయిందని ఇప్పుడైతే పరిస్థితి మరీ దయనీయంగా తయారయ్యిందని, ఇలాంటి సమయంలో సత్యజిత్ రే వంటి ఫిల్మ్ మేకర్స్ వ్యాసాల రూపంలో చెప్పిన పాఠాలు చాలా అవసరం అన్నారు. సత్యజిత్ రే తన పుస్తకంలో భాతీయసినిమాకున్న సమస్యల గురించి చెప్పిన విషయాల్ని ఉటంకిస్తూ “మనకంటూ ఒక ముద్ర,జాతీయశైలి” అవసరమన్న నిజాన్ని గుర్తుచేశారు.

వెంకటేష్ చక్రవర్తి తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ చెసిన ప్రసంగం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సత్యజిత్ రే తన సినిమా ద్వారా భారతదేశంలోని  పేదరికాన్ని ప్యాకేజ్ చేసి విదేశాలకు అమ్ముకున్న అపవాదు ఎంత అసంబద్దమో నిగ్గుతేలుస్తూ మొదలైన ప్రసంగం పాఠం, తెలుగు సినిమాల ప్రస్తుత భావారిద్ర్యానికి కారణాలతో పాటూ రసహృదయులైన ప్రేక్షకుల్ని తయారు చెయ్యడంలో సినీపరిశ్రమ, ఫిల్మ్ మేకర్స్ ఎలా ఫెయిలయ్యాని చాలా తార్కికంగా వివరించిన తీరుకి ఆడిటోరియం కరతాళధ్వనులతో మారుమ్రోగింది.

ముఖ్యఅతిథి డి.సురేష్ బాబు చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగన తరువాత ప్రతులను స్టేజిమీదనున్న అతిథులతోపాటూ, నవతరంగం నిర్వాహకులకు అనువాదకురాలు వి.బి.సౌమ్య గారి తల్లి, భర్త శ్రీరాం కు కాపీలు అందజేసారు.

పుస్తకావిష్కరణ అనంతరం  డి.సురేష్ బాబు ఇలాంటి అనువాదాలు, ఫిల్మ్ ఎడ్యుకేషన్ అవసరమని, తన తరఫున ఇలాంటి అనువాదాలను ప్రోత్సహించడానికి రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో ఒక సీడ్ మనీ ఏర్పాటుచేస్తానని చెప్పారు.

 

 

 

 

 

 

(ప్రసంగం పూర్తి వీడియోలు త్వరలో నవతరంగంలో పెడతాము.)

అతిధులకు జ్ఞాపికల బహుకరణ తరువాత సత్యప్రసాద్ వందన సమర్పణతో సభాకార్యక్రమం ముగిసింది.
ఆ తరువాత లఘుచిత్రాల ప్రదర్శన జరిగింది.

ఒక ఆలోచనగా మొదలై  కార్యరూపం దాల్చి, ఒక సంవత్సరకాలంలో ఒక పూర్ణరూపాన్ని సంతరించుకుని అందరి ముందుకూ వచ్చింది ఈ పుస్తకం. ఈ పుస్తకం బాటలో సహాయపడిన అందరిదీ ఈ విజయం.

(ఫోటోలు : ఎమ్.రఘు)

13 Comments
 1. గీతాచార్య June 14, 2011 /
 2. గీతాచార్య June 14, 2011 /
 3. రాజశేఖర్ June 14, 2011 /
 4. soorampoodi pavan santhosh June 14, 2011 /
 5. sreenivas ittam June 14, 2011 /
 6. కొత్తపాళీ June 14, 2011 /
 7. V Chowdary Jampala June 14, 2011 /
 8. j_ June 15, 2011 /
 9. Shiva ki June 15, 2011 /
 10. వీరశంకర్...దర్శకుడు. June 16, 2011 /
 11. harikrishna mamidi June 17, 2011 /
 12. srikanth June 27, 2011 /