Menu

అబ్బురపరిచే ‘అరణ్యకాండం’

2010 మధ్యలో అనుకుంటా ఒక యుట్యూబ్ లో తమిళ్ షార్ట్ ఫిల్మ్ కొన్ని చూస్తూ ఒక సినిమా ప్రోమో ఒకటి చూశాను. చూడగానే “వావ్” అనిపించింది. ఆ సినిమా పేరు ‘అరణ్యకాండం’. ఆ తరువాత సినిమా అగిపోయిందనో, పూర్తవలేదనో, కేవలం ఫిల్మ్ ఫెస్టిల్స్ కోసం తీశారనో ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత ఏమీ న్యూస్ లేదు. మధ్యలో ఎప్పుడో South Asian International Film Festival లో Grand Jury Award for Best Film వచ్చిందని తెలిశాక, ఓహో మొత్తానికి సినిమా పూర్తయ్యిందన్నమాట, ఎప్పొడో ఒకప్పుడు చూసెయ్యొచ్చు అనే నమ్మకమొచ్చింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ సెన్సార్ బోర్డుతో సుదీర్ఘమైన పోరాటం జరిపి ఎట్టకేలకు గతవారం సినిమా రిలీజయ్యింది. సెన్సార్ 52 విజువల్ కట్స్, ఎన్నో ఆడియో కట్స్ చెప్పిన ఈ సినిమా నిర్మాత SP బాలబ్రమణ్యం కొడుకు SP చరణ్. దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా.

సింగపెరుమాళ్ (జాకీ ష్రాఫ్) అనే ఒక రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్న గ్యాంగ్ స్టర్  జీవితాన్ని మార్చేసిన ఒకరోజు కథ సినిమా.  సింగపెరుమాళ్ నుంచీ గ్యాంగ్ పై అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నప సుపతి (సంపత్ రాజ్) ఒకవైపు, రైవల్ డ్రగ్ డీలర్ నుంచీ సరుకు కొట్టేసి సింపెరుమాళ్ కు అమ్మే ప్లాన్ లో అకస్మాత్తుగా చచ్చిపోయిన డీలర్ నుంచీ ఆ డ్రగ్స్ చేతులు మారి ప్రమాదవశాత్తూ చేరుకునే కోడిపందాల కాలయన్ (సోమసుందరమ్) వాడి కొడుకు కొడుక్కపులి (మాస్టర్ వసంత్) ఇంకోవైపు, ఎప్పడెప్పుడు ముసలి సింగపెరుమాళ్ నుంచీ తప్పించుకుని పారిపోదామని చూస్తూ అక్కడున్న అమాయకుడు సప్పై(రవి కృష్ణ) ని అంతే అమాయకంగా ప్రేమించే పడుచుపెళ్ళాం సుబ్బు(యాస్మిన్ పొన్నప్ప) మరోవైపు. ఇలా ఈ మూడు ఉద్దేశాలు, ఘటనలు, యాదృచ్చికాలూ ఒకేరోజన ప్రాణంపోసుకుంటే ఏమవుతుందనేదే దాదపు 120 నిమిషాల రోలర్ కోస్టర్ రైడ్ “అరణ్యకాండమ్”.

http://youtu.be/qBJ_UpyQw_s

కాల్పనిక సహజత్వాన్ని అద్భుతంగా సృష్టించి, ఇప్పటిరకూ వచ్చిన అన్ని భారతీయ గ్యాంగ్ స్టర్ చిత్రాలకన్నా భిన్నంగా ఉందనిపించేలా ఈ చిత్రం ఉందంటే అతిశయోక్తి కాదు. ఇదేదో గొప్ప కళాఖండం అని చెప్పడం నా ఉద్దేశం కాదుగానీ, కమర్షియల్ చిత్రాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించే చిత్రం అవుతుందనడంలో నాకైతే సందేహం లేదు. కథన పరంగా దర్శకుడు అవలంభించిన విధానాలు ప్రపంచ సినిమాని చూసేవాళ్ళకు కొత్తకాకపోయినా, వాటిని తమిళ సినిమా పరిభాషలో కూర్చిన విధానం కొత్తగా అనిపించడం ఖాయం. నటీనటుల పాత్రపోషణ (నటన అనడంలేదు) అంతర్జాతీయస్థయిని తలిపిస్తుంది. భాష రాకుండా నటించడానికి జాకీ ష్రాఫ్ ఎక్కడైనా ఇబ్బంది పడ్డాడేమో చూద్దాం అనుకుంటే నిరాశే మిగిలింది. మిగతా నటుల్లో చెప్పుకోవలసింది సంపత్ రాజ్, యాస్మిన్ పొన్నప్ప గురించి. సంపత్ రాజ్ కు అలవాటైన పాత్రే అయినా, దానిలో వైవిధ్యంతో పాటూ దర్శకుడి భావుకతకు అద్దంపెట్టే కొన్ని సన్నివేశాల్లో ప్రతిభావంతంగా చేశాడు. నూతన నటి యాస్మిన్ పొన్నప్ప కు మంచిభవిష్యత్తు ఉంది. సోమసుందరమ్, సోమసుందరమ్ నటన చాలా సన్నివేశాల్లో ఆనందాన్ని, ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది. రవి కృష్ణ కు తగ్గపాత్ర దొరికింది.

ఈ సినిమాలో మామూలు మనుషులు వాడే పచ్చి ఊరబూతులు, కొన్ని నగ్నదృశ్యాలు ఉన్నాయి. బహుశా అదే సెన్సార్ సమస్యలకు కారణాలేమో. అవిలేకున్నా సినిమాకి వచ్చే తీరని నష్టం లేదుగానీ కొంత సహజత్వం చెడే అవకాశం మాత్రం ఉండేదేమో అంతే. యువన్ శంకర్ రాజా సంగీతం యూరోపియన్ చిత్రాల సంగీతాన్ని తలపించినా, చాలా ఆకర్షణీయంగా ఉంది. వినోద్ ఛాయాగ్రహణం సినిమాకే ఒక అస్సెట్. ప్రవీణ్ – శ్రీకాంత్ ల ఎడిటింగ్  ప్రభావవంతంగా ఉంది.

ఇలాంటి సినిమాని తియ్యాలని అనుకోవడంతో పాటూ కష్టనష్టాలకోర్చి నిర్మించిన నిర్మాత ఎస్.పి. చరణ్ అభినందనీయుడైతే, ఈ విజన్ ను తెరపైకి అనువదించిన దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా ప్రశంశనీయుడు.తప్పకుండా చూడవలసిన చిత్రం.DON’T MISS IT.

17 Comments
 1. గీతాచార్య June 22, 2011 /
  • అరిపిరాల June 23, 2011 /
 2. rahul June 23, 2011 /
   • rahul June 24, 2011 /
 3. sasank June 23, 2011 /
   • sasank June 25, 2011 /
 4. గీత June 24, 2011 /
  • rahul June 24, 2011 /
 5. Hari June 24, 2011 /
 6. Hari June 24, 2011 /
  • rahul June 24, 2011 /
 7. kondaveeti nani July 22, 2011 /
 8. సురేష్ June 19, 2017 /