Menu

దృశ్యమేతప్ప కావ్యంలేని ప్రేమకథ : 180 (ఈ వయసిక రాదు)

నటీనటుల కాంబినేషన్ నుంచీ టైటిల్ డిజైన్, ప్రోమోలవరకూ విపరీతమైన ఆశల్ని, క్రేజ్ ని ఈ మధ్యకాలంలో సంపాదించుకున్న చిత్రం  180 (ఈ వయసిక రాదు). ముఖ్యంగా ప్రోమోలు, పాటల్లోని దృశ్యాల పొందిక టివిల్లోచూసిన ఎవరైనా ఖచ్చితంగా ఇదొక దృశ్యకావ్యమని నిర్ణయించుకోవడంలో ఎలాంటి తప్పూలేదనుకుంటాను. ఇదొక గొప్ప ప్రేమకథ అని సిద్దార్థ పదేపదే చెప్పడం, ఇద్దరు అందమైన హీరోయిన్లూ తమ చిలక పలుకులతో ఆ విషయాన్ని నొక్కివక్కాణించడంతో ఒక దృశ్యకావ్యాన్ని చూద్దామన్న ఆశతో వెళ్ళిన ప్రేక్షకుడికి కొంత నిరాశ తప్పదు. దృశ్యపరంగా బ్రహ్మాండంగా ఉన్నా, ప్రేమకథలో ఉండాల్సిన ఆద్రత,ఘాఢత,సాంద్రతలు కరువై కథాపరంగా నీరసంగా ఉండి రసాత్మకమైన కావ్యం కాలేకపోయిన సినిమాగా మిగిలింది.

ఏదో భారమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లుగా సిద్దార్థ (అజయ్, మనో) కాశీలో ప్రత్యక్షమై అక్కడ ఒక చిన్నపిల్లాడి ఘటన ద్వారా కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుని హైదరాబాద్ కు వస్తాడు. అక్కడ అందరికీ ఆరునెలలు మాత్రమే ఉండటానికి వచ్చానని ఒక టైంపీరియడ్ సెట్ చేస్తాడు.  అక్కడి నుంచీ కనపడిన అందరికీ ఆనందాన్ని, సలహాల్నీ, ఉత్సాహాన్నీ, సహాయాన్నీ ఫ్రీగా పంచుకుంటూ “చక్రం”(కృష్ణవంశీ సినిమా) లా తిరిగేస్తూ ఉంటాడు. ఇతగాడి సహృదయాన్ని కెమెరాతో బంధించే ప్రక్రియలో ఆసక్తి, అనురక్తి ఆపైన ప్రేమలో పడిపోతుంది విద్య(నిత్యా మీనన్) అనే ఫోటో జర్నలిస్టు. మధ్యమధ్యలో అక్కడక్కడా వచ్చే ఫ్లాష్ బ్యాక్ అమెరికాలో జరిగిన ప్రియా ఆనంద్ తో సిద్దార్థ ప్రేమ సంగతి ప్రేక్షకుడికి తెలుస్తుంది. ఈ మెలికల మధ్యలో అసలు ప్రియా ఆనంద్ కు ఏమయ్యింది? సిద్దార్థ హఠాత్తుగా ఇండియాకి వచ్చి మనోగా ఎందుకిలా సమాజసేవ చేస్తున్నాడు? నిత్యా మీనన్ ప్రేమకు పర్యవసానం ఏమిటి అనే ప్రశ్నలకు దర్శకుడు ఇచ్చే సమాధానాలకోసం ఎదురుచూస్తూ ప్రేక్షకుడు ఎదురుచూస్తూ సినిమా చూస్తాడు.

అసలు సమస్య ఇక్కడే మొదలౌతుంది. ప్రేమకథ అనుకుని ఆశగా వచ్చిన ప్రేక్షకుడికి ఇది చావుకథ అని చల్లగా చెప్పాడు దర్శకుడు. అదీ ఏమాత్రం లోతులేని భావనతో, కేవలం దృశ్యపరమైన అందంతో. స్క్రీన్ మీద అందంగా కనిపిస్తున్న దృశ్యాల్ని చూసి మురిసిపోవాలా, కథ ఏమాత్రం పట్టుబిగువులతో నడవక బోర్ గా ఫీలవ్వాలో తెలీని తికమకలో ప్రేక్షకుడిని పడేస్తాడు. కథ మీద క్లారిటీ దర్శకుడికైనా ఉందా అనే సందేహాన్ని చిత్రం చివరకొచ్చేసరికీ, అచ్చంగా తనకే ఈ విషయం అర్థంకాలేదన్న విషయాన్ని కొత్త దర్శకుడు జయేంద్ర విజయవంతంగా ప్రదర్శించగలిగాడు.

నటీనటుల నటన చాలా బాగుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రేమకథలలో జీవించగలిగే సత్తా సిద్దార్థకు ఉందని మళ్ళీ చాటాడు. నిత్యామీనన్ పాత్రోచితంగా ఉంది. అలా మొదలైంది సినిమాలోకన్నా కొంచెం ఒళ్ళుచేసినట్టు అనిపిస్తోంది. అసలే హైటు తక్కువ, ఇలా శరీరం మీద శ్రద్దపెట్టకపోతే మంచి పొటెన్షియల్ ఉన్న నటిని త్వరగా కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే లీడర్ తో పాటూ మరో సినిమాలో నటించినా  ప్రియా ఆనంద్ ఈ సినిమాతో మంచి ఈజ్ ఉన్న నటి దాగుందనిపించేలా చక్కగా నటించింది. గీత, మౌళి, తనికెళ్ళభరణి వంటి సీనియర్ నటులు తమకు తగ్గ పాత్రల్లో ఒదిగారు.

 

ఈ చిత్రంలో చెప్పుకోవలసినవి రెండు విషయాలు. గొప్పగా చెప్పాల్సింది బాలసుబ్రమణ్యన్ ఛాయాగ్రహణం (సినెమాటోగ్రఫీ) గురించి. మొత్తంగా డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి తీసిన ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్, ప్రతిషాట్, ప్రతి కదలికా అద్భుతంగా దృశ్యీకరించడంలో అతను విజయం సాధించాడు. అభినందనలు. చెప్పాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం మాటల రచయిత ఉమర్జీ అనురాధ గురించి. ఈ మధ్యకాలంలో ఇంత అపభ్రంశపు, అర్థరహిత తెలుగు నేను ఏ సినిమాలోనూ చూడలేదు. అసలు ఈ రచయిత ఎవరో, తనకు అసలు తెలుగు వచ్చోరాదో కనుక్కోవాలి.

శరత్ అందించిన సంగీతం పాటల్లో ఫరవాలేదనిపించినా, నేపధ్యసంగీతం విషయంలో చాలా లోటుపాట్లు కనిపిస్తాయి. వాయిద్యాల ఎంపిక విషయంలో, మూడ్ ఎలివేట్ చెయ్యడంలో నిశ్శబ్ధం పాత్రను అర్థం చేసుకోవడంలో చాలావరకూ ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. కిషోర్ కత్తెర మరికొంత పదునుగా ఉంటే సినిమా నిడివి కనీసం 20 నిమిషాలు త్రగ్గుండేది. కాబట్టి ఎడిటింగ్ విషయంలో పాస్ మార్కులు వెయ్యొచ్చు.

నిర్మాతలుగా సత్యం సినిమాస్ కిరణ్, స్వరూప్, శ్రీకాంత్ ల నిర్మాణ విలువలు చాలా బాగున్నా, చిత్రం ఒక మీడియోకర్ చిత్రంగా మిగిలిపోవడానికి ముఖ్యకారణాలు, కథ- కథనం- దర్శకత్వం. ఈ మూడూ జయేంద్ర వే.

మొత్తం సినిమాచూసి బయటికి వచ్చేప్పుడు ఒక మిత్రుడిని అసలు సినిమాకి 180 అని పేరెందుకు పెట్టారంటే, “108” అని పెట్టబోయి 180 అన్నారేమో అని హాస్యానికి అన్నాడు. 108 కు కాల్ చేసి ఆంబులెన్సుని పిలిచేంత ప్రమాదకరంగా ఈ సినిమా లేకపోయినా, ఆశించినంత బాగా లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సమీక్ష చదివి, మీ అంచనాల్ని కొంచెం నేలకు దించుకుని వెళ్తే, దృశ్యపరంగా, సాంకేతిక పరంగా బాగుంటుంది కాబట్టి “ఫరవాలేదే” అనుకుంటూ థియేటర్ నుంచీ బయటికి రావొచ్చు.

చివరగరా…ఈ చిత్రానికి ఉపశీర్షిక “ఈ వయసిక రాదు” అని ఉంటుంది. దానికి అర్థం ఈ సినిమా కాంటెక్స్ట్ లో ఏమిటో సినిమా చూసొచ్చిన ఎవరైనా టైటిల్ అర్థంతోపాటూ చెప్పరూ ప్లీజ్? ఇది కూడా తెలుగు రచయిత ఉమర్జీ అనురాధ మహత్యమైతే మాత్రం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

5 Comments
  1. గీతాచార్య June 25, 2011 /
  2. ravi June 25, 2011 /
  3. rahul June 25, 2011 /
  4. kondaveeti nani July 22, 2011 /