Menu

మనకెందుకు అవార్డులు రావబ్బా?

అది త్రి.సి.స (త్రిలింగ సినిమా సంఘం) ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్‌ఫరెన్స్. ఒక వైపు త్రిలింగ సినిమా ఇండస్ట్రీకి చెందిన హేమాహేమీలంతా విచ్చేస్తే, ఇంకో వైపు టీవీ-999 లాంటి చానెల్స్‌కి, ఛాఛీ లాంటి దిన పత్రికలకి, చెందిన విలేఖరులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు.

“చాలా ఘోరం జరిగిపోయింది, ఈ సారి కూడా మన త్రిలింగ సినిమాకి విపరీతమైన అన్యాయం జరిగింది,” గద్గద స్వరంతో అన్నాడు సొల్లూ అరవింద్. ఆయన పక్కనే ఉన్న రె.కాఘవేంద్ర రావు అంగీకార సూచకంగా తలూపాడు. ఆయన అంతే, సభా ముఖంగా మాట్లాడడు. గిట్టిన వాళ్ళు ఆయన్ని దర్శక మౌని అని పిలిస్తే, గిట్టని వాళ్ళు ఆయన తీసే చిత్రాల పట్ల సిగ్గు పడి మాట్లాడడని అంటారు.

“అసలు మన త్రిలింగ సినిమాలకి ఏం తక్కువయ్యింది? సెట్టింగ్స్ తక్కువా, ఫారిన్ లోకేషన్స్ తక్కువా, క్యామెడీ ట్రాకులు తక్కువా? ఈ నేషనల్ అవార్డ్స్ కమిటీకి ఏం కావాలో?” అక్కసుగా అన్నాడు నిల్ రాజు.

“”మన తెలుగు సినిమాల్లో కథల్లో వెరైటీ ఉండదని, అన్ని సినిమాలకి ఒకే కథ ఉంటుందని, ఒక అపవాదు ఉంది, మీరేమంటారు?” ప్రశ్నించాడు ఈ క్షణం దిన పత్రిక విలేఖరి.

“ఎవడా అన్న వెధవ? మనం మూడు కథలతో అన్ని సినిమాలూ తీస్తూంటే! వెరైటీకి మనం ఎప్పుడూ తీసిపోలేదు.”

“మూడు కథలా?”

అవును. ఒకటి ఫ్యాక్షనిస్టుల కథ, ఇంకోటి కాలేజీ ప్రేమ కథ. మూడోది మొదటి హాఫ్ కాలేజీ ప్రేమ కథ, రెండో హాఫ్ ఫ్యాక్షనిస్టుల కథ. ఇంతకంటే వెరైటీ ఎవరు మాత్రం ఏం చూపిస్తారు?”

“అదీ నిజమే, మరి మనకి అవార్డులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటారు?” అడిగాడు ఛాఛీ విలేఖరి.

“అసూయ, అక్కసు. ఉదాహరణకి ఆ ళమళాయం సినిమా వాళ్ళకి మనం వేసే పెద్ద సెట్స్ చూసి కుళ్ళు. పైగా మనమంతా చక్కగా మన పిల్లల్ని హీరోలుగా పెట్టి, మన తమ్ముళ్ళని డైరెక్టర్లుగా పెట్టి, ఒకే కుటుంబంలా కలసి మెలసి సినిమాలు తీస్తూంటే వాళ్ళకి కడుపు మంట. అందుకే లాబీయింగ్ చేసి మరీ మనకు అవార్డులు రాకుండా చూస్తున్నారు,” సమాధానంగా అనాడు జలుబుపాటి సురేష్.

“పైగా మన విశాల హృదయం వాళ్ళు అర్థం చేసుకోలేక పోతున్నారు. మనదెంత విశాల హృదయమంటే మన భాష మనమే సరిగ్గా మాట్లాడం. అందరికి అర్థమయ్యేలా ఎల్.కే.జీ చదువుకోనివాడికి కూడా నచ్చేలా, సింపుల్‌గా మాట్లాడతాం. మనకు అసలు అలాంటి పక్షపాతం లేదు. అసలు ఆ ఒక్క పాయింట్ మీదే మనకు అవార్డు ఇచ్చేయొచ్చు,” ఆవేశంగా అన్నాడు యువ హీరో కంచు మనోజ్.

“నటనకి సింహద్వారం మా వంశమే అని నేను అవకాశం దొరికినప్పుడల్లా చెప్తూనే ఉన్నా. మా నాన్న గారు అద్భుతమైన నటుడు కాబట్టి, మా వంశంలో అందరికీ ఆటొమేటిక్‌గా గొప్ప నటన వారసత్వంగా సంక్రమించిందని, మన త్రిలింగ దేశంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఈ అవార్డ్స్ కమిటీకి ఎందుకు అర్థం కావట్లేదో మరి?” బాధను వెలిబుచ్చాడు ప్రముఖ నటుడు బుజ్జి కృష్ణ.

“మన చిత్రాల్లో హీరోయిన్లకి పెద్దగా ఇంపార్టన్స్ ఉండదు అని కూడా విమర్శ ఉంది. దానిపై మీ స్పందన?” అడిగాడు టీవీ 999 జర్నలిస్ట్ వరిప్రకాష్.

“మళ్ళీ నాకు బూతులు వస్తాయి. ఇంపార్టన్స్ లేకపోవడమేంటి? గత పదేళ్ళుగా, మన సినిమాల్లో హీరోయిన్లు, ఎంతో విజయవంతంగా అదనపు బాధ్యత, వాళ్ళ స్లీవ్‌లెస్ భుజాల మీద, వేసుకుని వ్యాంప్ రోల్స్ కూడా వేస్తున్నారు. హీరోయిన్ కాస్ట్యూంస్ మార్చే విషయం తీసుకున్నా త్రిలింగ సినిమాలదే అగ్ర తాంబూలం. హీరోయిన్లని ఆదరించాలనే ఉద్దేశంతోనే ఒక్కో సారి రోల్ లేకపోయినా, వాళ్ళకి ఐటం సాంగ్స్ ఇచ్చి ఆదరించే పెద్ద మనసు కూడా మనమే ఎక్కువ చూపిస్తాం,” కోపంగా చెప్పాడు తాతాసాహెబ్ అవార్డ్ గ్రహీత జలుబుపాటి రామానాయుడు.

“బాగా చెప్పారు. అసలు మన సినిమాల్లో మెయిన్ రోల్ హీరోయిన్‌దే. హీరోయిన్‌తో స్టెప్పులు గట్రా వేసే అవకాశం కోసమే కద, హీరో అంతమందిని చితక తన్నేది,” బలపరిచాడు సొల్లూ అరవింద్.

“అంటే హీరోలు ఎప్పుడూ ఒకే రకం పాత్రల్లో కనిపిస్తారు. కాబట్టి ప్రయోగాలు జరిగే అవకాశం తక్కువ అని ఒక వాదన,” నసిగాడు ఈ క్షణం విలేఖరి.

“ఒకే రకం పాత్రల్లోనా? హవ్వ, హవ్వ! అసలు ఒక సినిమాలోనే మన హీరోలు పలు పాత్రలు పోషిస్తారు. మొదటి హాఫ్‌లో స్తూడెంట్‌లా, ఒక అన్నయ్యలా, ఒక బాయ్ ఫ్రెండ్‌లా, సెకండ్ హాఫ్‌లో ఒక ఫ్యాక్షనిస్టులా, లేదా ఒక పోలీస్ ఆఫీసర్‌లా, వందల మందిని నరికి పారేసే హంతకుడిలా, ఇలా బహు పాత్రాభినయం చేయడం మన హీరోలకే చెల్లు,” జవాబిచ్చాడు నిల్ రాజు. అందరూ చప్పట్లు కొట్టారు.

“మన సినిమాల్లో పరస్పర గౌరవం లోపించిది, ఎందుకంటారు?” ఈ సారి ఛాఛీ విలేఖరి కలగజేసుకున్నాడు.

“ఆ అబద్ధపు గౌరవం ఎవరికి కావాలండి? హీరోయిన్ హీరోని ఒరే అని పిలిచిహినా, హీరో హీరోయిన్‌ని ఒసే అని పిలిచినా, ఆ ప్రేమే వేరు. అలాగే అమ్మమ్మ అనకుండా ఒసే ముసిలీ అని మనమడు సంబోధించడం ఆ వృద్ధురాలి పట్ల ఆ పిల్లవాడి అప్యాయత చాటుతుంది. ఇక విలన్లు ఎలాగూ ఆడ పాత్రలను నీచంగా సంబోధించడం అనాదిగా వస్తున్న ఆచారమే కద!” వివరించాడు జలుబుపాటి సురేష్.

అప్పుడు కీసర బాసర నారాయణ రావు లేచి మైక్ అందుకున్నాడు.

“అందరికి తెలుసు, మనం పరమ ఉత్తమ చిత్రాలని మాత్రమే నేషనల్ అవార్డ్స్‌కి పంపిస్తాం. ఆ సంప్రదాయాన్ని మన్నిస్తూనే నా కళాఖండం పరమ ఘోర చక్ర పంపడం జరిగింది. కానీ ఆ అవార్డ్ కమిటీ జడ్జులు ఎంత నీచులంటే, ఆ సినిమా చూశాక, మిగతా నాలుగు త్రిలింగ సినిమాలను చూడం కాక చూడం అని మొండికేశారంట. ఈ అన్యాయలకు హద్దే లేదా?” బొంగురు గొంతుతో అన్నాడు ఆయన. అందరూ అప్రయత్నంగానే హాహాకారాలు చేశారు.

అంత డిస్కషన్ చేసినా ఎవరికీ సమాధానం మాత్రం దొరకలేదు. “మనకెందుకు అవార్డులు రావబ్బా?” అన్న సందేహం మటుకు తీరలేదు.

‘తేటగీతి’ మురళి

http://tetageeti.wordpress.com/

11 Comments
  1. తెలుగు అభిమాని May 26, 2011 /
  2. ravi May 26, 2011 /
  3. శివరామప్రసాద్ కప్పగంతు May 26, 2011 /
  4. nikithachandrasena May 27, 2011 /
  5. phaneendra May 31, 2011 /
  6. telugu vadu June 9, 2011 /
  7. stigmata June 14, 2011 /
  8. sreenu June 28, 2011 /
  9. p.srikanth March 5, 2012 /
  10. SaiLalithaa January 27, 2017 /