Menu

తెలుగు సినిమా బాగుపడదా! – 2

ఒక రాజుగారు వున్నారు. ఆయన రాజ్యపాలన చేపట్టాక పూర్వికులు చేసిన ఒక్కొక్క చట్టాన్ని మార్పులు చేస్తూ వచ్చాడు. అయిన దానికి కానిదానికి పన్నులు విధించడం మొదలుపెట్టాడు. అక్కడక్కడ లేచిన నిరశన గళాల్ని అణకదొక్కుతూ వచ్చాడు. కొంతకాలానికి రాజ్యపాలన రూపురేఖలే మారిపోయాయి. ఆ సమయంలో రాజ్యంలో ప్రజలందరూ ఒక్కసారిగా ఒకటైయ్యారు. ఒక నాయకుడు వుధ్బవించాడు. అతని నేత్రుత్వంలొ ఆ రాజును, ఆ రాజ్యాన్ని కూలదోసి ప్రజారంజకమైన ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

ఒక మంచి జానపద సినిమా కథలా కనిపించే ఈ కథలో మార్పుకు సంబంధించిన గొప్ప పాఠముంది. మార్పు అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి అంతర్లీనంగా చిన్న చిన్న మార్పులు జరుగుతూ క్రమేణ ఒక రూపాంతరం చెందడం. ఇది డార్విన్ పరిణామక్రమం లాంటిది. పైన చెప్పిన కథలో రాజుగారు ఒక్కొక్కటే మార్చుకుంటూ రాజ్యపాలనలో తెచ్చిన మార్పు ఇలాంటిదే. రెండొవది విప్లవాత్మకమైన మర్పు. మన కథలో ప్రజానాయకుడు పుట్టుకొచ్చి సమూలంగా వ్యవస్థని మార్చేసిన సందర్భం అలాంటిది. జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండూ ఒకదాని తరువాత ఒకటి జరిగినట్లు అర్థం అవుతుంది. పరిణామక్రమం లాంటి మార్పు జరుగుతున్నప్పుడు ఆ మార్పు సకలజనామోదం కానప్పుడు విప్లవం వచ్చే అవకాశం వుంటుంది. అదీ ఈ కథలో సారాంశం.

ఇదే విషయాన్ని తెలుగు సినిమాకి అన్వయిస్తే తెలుగు సినిమా ప్రస్తుత దశకి అనేక కారణాలు అర్థం అవుతాయి. భారతీయ/తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ప్రపంచ సినిమా ప్రాభవం వాటిపైన వుండనే వుంది. లీమరీ సోదరులు తీసిన “ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్” సినిమా చూసిన దాదా సాహెబ్ ఫాల్కే “భారత పురాణాలలో వున్న కథలని కూడా ఇలా చూపించవచ్చు” అని అనుకొని మొదలుపెట్టిన చిత్రమే “రాజా హరిశ్చంద్ర”. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొదలైన ఏ సినిమా పరిశ్రమ అయినా తమ తమ సంస్కృతిలో భాగమై అప్పటికి ప్రాచుర్యంలో వున్న కళా రూపాలను ఆధారం చేసుకోని సొంత సినిమాలు మొదలుపెట్టాయి. అప్పటికి బ్రిటన్ లో ప్రాచుర్యంలో వున్న సంగీత రూపకాలను ఆధారం చేసుకోని మ్యూజికల్ సినిమాలు మొదలయ్యాయి. మన సినిమా విషయానికి వస్తే అప్పటికి తెలుగునాట ప్రాచుర్యంలో వున్న నాటకసమాజాలు (ప్రత్యేకించి సురభి) మన సినిమాలకి ముడి సరుకుని ఇచ్చాయి.

ఇదంతా బాగానే జరిగింది. అసలు సమస్య అక్కడి నుంచే మొదలైంది. ప్రపంచం మొత్తం అక్కడి నుంచి ఎదిగి ప్రయోగాల దారిలో పరిణితి చెందాయి. మొదటి ప్రపంచ యుద్ధం దాకా మ్యూజికల్ సినిమాలే నిర్మించిన బ్రిటన్ అక్కడి నుంచి సంగీతానికి ప్రాధాన్యత తగ్గిస్తూ కొత్త దారులు తొక్కింది. మన విషయంలో జరిగింది వేరే. నాటకాన్ని సినిమాగా మలుచుకున్నా మనవాళ్ళు అక్కడి నుంచీ ఇంకా ఎదగలేదనిపిస్తుంది. ఈ నాటికి మన సినిమాలలో గమనిస్తే ఇంటి నిండా ఫర్నీచర్ వున్నా పాత్రలు నిలబడే మాట్లాడుకుంటాయి. మన నిజ జీవితంలో మాట్లాడినట్లు అవసరాన్ని బట్టి గొంతు తగ్గించడం, పెంచడం మన పాత్రలకి చేతకాదు. ఈ రెండూ ఈ నాటికి మనల్ని వదిలిపెట్టని నాటకం తాలూకు వాసనలు. ఇలాంటి పరిస్థితిలో మన సినిమా పరిణామం చెందిదా అనే అనుమానం రావటం సహజమే కదా?

అయితే తెలుగు సినిమా ఏ మాత్రం మారలేదా అంటే మారిందనే చెప్పాలి. అయితే ఆ మార్పు ఎలాంటిదని గమనిస్తే మారిందన్న సంతోషం ఆవిరైపోతుంది. తెలుగు సినిమాలో కథాంశాలు మారాయి – అవి అన్ని పాత్రలకు సమానమైన విలువ, వ్యక్తిత్వం వున్న కథల నుంచి, కేవలం హీరో మాత్రం సర్వశక్తిమంతుడు అనే కథలలోకి మారాయి. హీరోయిన్ పాటలకి మాత్రమే పరిమితమైన సినిమాల జాబితా వేస్తే అది ఇక్కడి నుంచి చంద్రమండలం దాకా పోతుందేమో. హీరో ఒకడితో కత్తి యుద్ధాలు చేసే కథల నుంచి, వందలమందిని ఒక్క చేత్తో పడగొట్టే హీరోలదాకా ఈ పరిణామం సాగింది. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు లేని సినిమా సినిమానే కాదు అనే స్థితికి వచ్చింది. ఆ పాటలలో కూడా హీరో హీరోయిన్లు ఏంకాంతంగా చెప్పుకోవాల్సిన విషయాలు పాడుకుంటుంటే వెనకాల గెంతులు వేసే గుంపు లేకుండా మనకి నచ్చని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు హీరోని కాళ్ళ దగ్గర కెమెరా పెట్టి క్రమంగా చూపించకపోతే ఆయన హీరో అన్న సంగతి మనకి అర్థంకాదు. హీరోయిన ముక్కు ఒకసారి, పెదాలు ఒకసారి, ఇతర శరీరభాగాలన్నీ ఒక్కొక్కసారిగా చూపించకపోతే ఆమె హీరోయిన్ అని తెలియనే తెలియదు. ఇవన్నీ మన అందరికి తెలిసినవి, ఒక స్లో పాయిజన్ లాగా మనలో ఇంకి పోయి “తెలుగు సినిమా అంటే అంతేరా భై” అని మనం సర్ది చెప్పుకునేస్థాయికి తీసుకొచ్చిన విషయాలు. ఇవి కాకుండా కథ చెప్పే విధానంలోనూ, దర్శకత్వంలోనూ, ఎడిటింగ్ లోనూ, ఆఖరికి రీ రికార్డింగ్ లోనూ మనకి తెలియని మూసలలో మనం పడిపోయాం. కాదు, పడేశారు. దీనికి ఒకరని కారణం కాదు కానీ, దాదాపు మన దర్శక, నిర్మాత, నట విదషకాది సమస్త చిత్ర జాతులు అన్నీ కారణమయ్యాయి.  ఇదంతా ఇందాకటి కథలో చెప్పుకున్నట్లు నెమ్మది నెమ్మదిగా మార్పులు చేసుకుంటూ ఈ స్థితికి తీసుకొచ్చారు. ఎన్టీరామారావు అయిదుగ్గురితో ఫైట్ చేస్తే, గ్యాంగ్ లీడర్ చిరంజీవి లారీ జనంతో చెలరేగాడు, ఇప్పుడు మగధీర చరణ్ వంద మందిని ఒక్కసారి ఎదుర్కుంటానంటూ ప్రేక్షకుడి మీదకే సవాల్ విసురుతున్నాడు. ప్రేక్షకులు చూస్తున్నారని దర్శకులు, వాళ్ళు తీస్తున్నారని ప్రేక్షకులు కలిసి మన సినిమా స్థాయిని నానాటి తీసికట్టు చేసి ఈ రోజు “తెలుగు సినిమా” అంటే అస్థిత్వం లేకుండా అస్థికలు మాత్రం మిగిల్చారు.

ఇందాక కథలో చెప్పినట్లు కొంచెం కొంచెం మార్పు ఎలాగూ సంభవించింది కాబట్టి ఇక మనం చెయ్యాల్సింది విప్లవాత్మకమైన మార్పు కోసం ఎదురుచూడటం…!  దానికోసం సన్నధ్ధంగా వుండటం…!!

 

(ఇంకావుంది)

7 Comments
  1. Hari May 18, 2011 /
    • chakri May 18, 2011 /
  2. vinod May 19, 2011 /
  3. V.V.Satyanarayana Setty May 19, 2011 /
  4. నాయకుడు May 20, 2011 /
  5. Srinu Pandranki May 20, 2011 /