Menu

తెలుగు సినిమా బాగుపడదా! – 1

తెలుగు సినిమా గురించి వచ్చే చాలా వరకు విమర్శలలో (నవతరంగం తో సహా) అనేక చోట్ల మనకి తరచుగా వినిపించేవి వ్యంగ్య వ్యాఖ్యలు, సెటైర్లు కొండకచో తెలుగు సినిమా బాగుపడదు అనే నిరాశావాద నిస్పృహలు, నిట్టూర్పులు. సినిమా పరిశ్రమలో వున్న వారి సంగతి చూస్తే కూడా ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ కనపడదు. ఇక అన్నింటికన్నా ముఖ్యులైన ప్రేక్షకుల విషయానికి వస్తే గత మూడు సంవత్సరాలలో పట్టుమని పది హిట్టులు కూడా లేని తెలుగు సినిమా గురించి సదభిప్రాయం వుంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది. హిట్టులు కరువైన పరిశ్రమ ఎంత కాలం కుంటుతుంది? చూడటానికి సరైన సినిమా లేక ప్రేక్షకుడు ఎంతకాలం ఈ కుంటుతున్న తెలుగు సినిమాని భరిస్తాడు? లాంటి అనుమానలతో పాటు అసలు తెలుగు సినిమా వుంటుందా లేక అంతరించిపోతుందా అన్న అనుమానం రావడం సహజమే. ఆ దిశగా ఆలోచన చేస్తూ తెలుగు సినిమా ప్రస్తుత దశని, ముందుకు సాగడానికి ఒక దిశని వెతికే ప్రయత్నమే ఈ వ్యాసాల వుద్దేశ్యం. ఆ వెతుకాలటకి ఆధారంగా ఛేంజ్ మేనేజ్మెంట్ పాఠాలను తీసుకోని వాటిని తెలుగు సినిమాకు అన్వయిస్తూ వ్యాసాలుగా రాసే ప్రయత్నమిది.

ఛేంజ్ మేనేజ్మెంట్ గురించి చేప్పేటప్పుడు తప్పకుండా ప్రస్తావించేది రాక్షసబల్లుల (Dinosaurs)  గురించి. కాలం మారుతున్నప్పుడు నేను మారను, ఇలాగే వుంటాను అనుకున్న రాక్షసబల్లులు మార్పు ప్రాభవానికి మాడి మాయం అయిపోయాయి. దాదాపు రాక్షబల్లుల సమకాలికులైన బొద్దింకలు మాత్రం చెట్టు చాటునో, బండలచాటునో దాక్కొని బ్రతికి బట్టకట్టాయని సైన్స్ చెప్తోంది. పెను తుఫాను వచ్చినప్పుడు మహా వృక్షాలు కూలిపోతాయికాని గడ్డి పోచలు తలవంచి బ్రతికిపోతాయని తెలుగులో సామెత వుండనే వుంది. అదే విషయాన్ని మన తెలుగు సినిమాకి అన్వయిస్తే ప్రపంచవ్యాప్తంగా, కనీసం దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులని తెలుగు సినిమా ఎంతవరకు తెలుసుకుంటోంది, ఎంత వరకు అంది పుచ్చుకోని ముందుకు సాగుతోంది అని పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది. దేశంలోనే రెండొవ పెద్ద పరిశ్రమగా (హిందీ తరువాత) ఎదిగిన మనం ఇప్పుడు సరిగ్గా రాక్షసబల్లుల్లాగా, మహావృక్షాలాగా తయారయ్యాం. మరొ పక్క మరాఠీ, కన్నడ, మళయాలం లాంటి గడ్డిపోచల్లాంటి పరిశ్రమలు తెలివిగా మర్పుని ఆహ్వానించి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలుగు సినిమా పరిశ్రమ ఒకసారి నిలబడి సింహావలొకనం చేసుకోని దిశానిర్దేశ్యం చేసుకోవల్సిన అవసరం చాలా వుంది.

మార్పు సహజం – మారటం అవసరం

ప్రపంచంలో శాశ్వతమైనది మార్పే అన్న సిద్దాంతం విని వినీ విసుగెత్తినా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే మార్పు తప్పదు అని తెలిసినా ఆ మార్పుకి సిద్ధంగా వుండాలన్న ఆలొచన చాలామందికి రాకపోవటమే. ప్రపంచ సినిమా చరిత్ర పరిశీలిస్తే మూకీ మొదలైన మొదటి సినిమా నుంచి ఈ నాటి హై టెక్నాలజీ “అవతారా”ల వరకు సినిమా మార్పుకు గురౌతూనే వున్నది. ఎడిసన్ సినిమా రీల్ దగ్గర్నుంచి సినిమా తీయటానికీ, సినిమా ప్రదర్శించడానికి అవసరమైన పరికరాలదాకా అన్నింటి పేటంట్లని తన దగ్గర పెట్టుకోని సినిమా పైన గుత్తాధిపత్యం చేయాలనుకున్నప్పుడు డీ.డబ్లూ. గ్రిఫిత్ పుణ్యమా అని హాలివుడ్ అనే గ్రామం ద్వారా కొత్త మలుపు తిరిగింది. అదే హాలీవుడ్ లో స్టూడియోలు వెలిసి సినిమా స్థాయి పెరిగి, భారి బడ్జెట్లు ఫ్లాప్ అవుతుంటే మళ్ళీ అదే గ్రిఫిత్, చాప్లిన్ వంటి వారందరు కలిసి ఇండిపెండెంట్ సినిమాలకి ప్రాణం పోశారు. ఫ్రెంచ్ సినిమాలను విమర్శిస్తూ వ్యాసాలు రాసినవారు నడుం బిగించి సినిమా తీస్తే అది న్యూవేవ్ సినిమాలు అనే కొత్త ప్రక్రియకి నవతరంగమై లేచింది.

ఇలా ప్రపంచ సినిమాలలో ఏ పరిశ్రమను చూసినా మార్పుకు గురౌతూ కొత్త పంధాలకి తెర తీస్తూనే వచ్చాయి. భారతీయ సినిమాలలో కూడా ప్రతి భాషలో రకరకాలు ప్రయోగాలు జరిగితేనే ఈ నాటి సినిమా పుట్టింది. ఈ సినిమా ఇక్కడినుంచి మరో దిశగా మారటం కూడా సహజమైంది, తప్పనిది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. ఈ మార్పులు సినిమాలోని అనేక ప్రక్రియలలో వేటిలోనైనా సంభవించవచ్చు. మూకీ సినిమాకు కొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల జోడింపు అయిన శబ్దం వల్ల కానీ, 70 ఎం.ఎం లైనా, స్కోపు సినిమాలైనా, రంగుల నిగారింపులైనా, చివరికి డిజిటల్ టెక్నాలజి వల్ల అయినా మర్పులు రావచ్చు. మరో రకం మార్పులు కథ చెప్పే విధానంలో (రచన), సినిమా తీసే విధానంలో (కెమెరా, డైరెక్షన్), సినిమా చూపించే విధానంలో (ఎడిటింగ్, పబ్లిసిటీ) ఇలాంటివి కావచ్చు. స్థూలంగా సాంకేతికత ప్రాతిపదికన జరిగే మార్పులు, కళాత్మకంగా జరిగే మార్పులు అని చెప్పవచ్చు. ఈ రెండు రకాలుగా జరిగే మార్పులను స్వీకరించాలా లేదా అనే నిర్ణయం పరిశ్రమ తీసుకోడానికి రెండు కారణాలు వుంటాయి. మొదటిది ఖర్చు తగ్గించడం, రెండొవది ఆ మార్పువల్ల తయారయ్యే సినిమా ఎక్కువమందికి నచ్చుతుందా లేదా అని. ఈ రెండొవ కారణం వెనక మళ్ళీ రెండు రకాలు వున్నాయి – ఎక్కువమందికి నచ్చడం వల్ల ఎక్కువ లాభాలు రావటం, రెండొవది ఎక్కువ మందికి నచ్చడంవల్ల కళాత్మకంగా ఏదో సాధించగలిగామన్న తృప్తి. ఈ వ్యాసాన్ని ఒక మేనేజ్మెంట్ దృక్కోణంలొ వ్రాస్తున్నాం కాబట్టి – కళాత్మకంగా, అవార్డులకోసం తీసే సినిమాలను పక్కనపెట్టి కేవలం లాభాపేక్ష వున్న సినిమాలకే ఈ వ్యాసం పరిధిని పరిమితం చేద్దాం.

పైన చెప్పిన మార్పు ఏదైనా అది ప్రేక్షకులకి నచ్చటం, తద్వారా పేరు లేదా డబ్బు రావటం అనే ప్రతిఫలం కారణంగా ఆయా మార్పులు శాశ్వతంగా వుండిపొయాయి. అలాంటి మార్పుని ఆహ్వానించని వ్యక్తులు అరుదుగా మాత్రమే తమ అస్థిత్వాన్ని నిలుపుకోగలిగారు. సినిమాకు శబ్దం జోడించనే కూడదని, దానివల్ల ప్రేక్షకులకి ఇబ్బంది కలుగుతుందని వాదించిన గ్రిఫిత్ తరువాత తరువాత ఆ మార్పుని అంగీకరించక తప్పలేదు. మూకీ సినిమాలు మాత్రమే తీస్తానని ఆఖరి మూకీ సినిమా తీసిన ఛాప్లిన్ కూడా తరువాత టాకి సినిమా తీసాడు. నేను పేటంట్లను వదులుకోను, మరొకరిని సినిమా తీయనివ్వను అంటూ మోనొపలీ ప్రకటించిన ఎడిసన్ అంతటివాడే వుప్పనలా దూసుకొచ్చిన సినిమా విప్లవంలో కొట్టుకుపోయాడు. ఆఖరుకు చిన్న సినిమాలు మాత్రమే ప్రదర్శిస్తామని ప్రకటించుకున్న నికలోడియన్ సినిమాహాళ్ళు పూర్తి నిడివి సినిమాలు ప్రదర్శించే సినిమాహాళ్ళ ధాటికి మూత పడి మళ్ళీ మనసు మార్చుకొని లేచి నిలబడ్డాయి. ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే మార్పు తప్పదు. మార్పు సిద్ధంగా లేకపోతే కొట్టుకుపోక తప్పదు. కనీసం కొట్టుకుపోయినా మళ్ళీ కోలుకోని నిలబడే శక్తిని కూడకట్టుకొని వుండటం అవసరం. తెలుగు సినిమాకి అది అత్యవసరం.

 

(ఇంకా వుంది)

One Response
  1. శంకర్ May 17, 2011 /