Menu

తెలుగు సినిమా బాగుపడదా! – 3

మార్పు గురించి శాస్త్రీయంగా ఎంతో విశ్లేషణ జరగటానికి కారణం ఏమిటంటే, సాధారణంగా మార్పుని ఆహ్వానించని సగటు మనిషి మనస్తత్వం. ఒకప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే సినిమా తీస్తాను అంటే విచిత్రంగా చూసి డబ్బులు పెట్టడానికి వెనకాడిన జనం దగ్గర్నుంచి, ఈ రోజు డిజిటల్ కెమెరాతో సినిమా తీయచ్చు అంటే ఎద్దేవా చేసే దర్శకులు నిర్మాతలదాకా అందరూ మార్పుకి భయపడేవాళ్ళే. ఇప్పటికి జరిగేదేదో జరుగుతోంది కదా, మళ్ళీ మార్చడం ఎందుకు అని లాజిక్కులు మాట్లాడే మనుషులు వీళ్ళంతా. తమిళ్ లొనో, హిందీలొనే హిట్టైన సినిమా రైట్స్ కొనుక్కోని, అది హిట్టవడానికి కారణం తెలియక ఏది మారిస్తే ఏమౌతుందో అనే భయంతో ఆ సినిమాని యధాతధంగా తీసి ఫ్లాపులు మూటకట్టుకునే దర్శకులు, నిర్మాతలు మనకి కొత్త కాదు. నేటివిటీకి తగ్గ మార్పులు అని ప్రకటించినా అవేంటో తెలియక ఒక “మాస్ మసాలా వ్యాంప్ సాంగ్” జోడించి అదే మార్పు అని భ్రమపడే అమాయకులు వీళ్ళు. ఇలాంటి దర్శక నిర్మాతలు వున్నంతకాలం మార్పు రాదు.

చెప్పొచ్చేదేమిటంటే మార్పు (ముఖ్యంగా విప్లవాత్మకమైన మార్పు) బయటనుంచే రావాలని చేంజ్ మేనేజ్మెంట్ పాఠాలు చెప్తున్నాయి. బయట ప్రపంచమంతా మారిపోయి కొత్త పంధాలోకి మారినప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితిలో మారటం ఒకటి. నిజానికి ఇది మార్పు కాదు – తప్పని పరిస్థితి (కంపల్షన్). సినిమా ప్రపంచమంతా కలర్ సినిమాలు తీసి వాటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు, నలుపు తెలుపులలో సినిమా తీసే దర్శకుడు ఆ ప్రయత్నం మానుకోని రంగులసినిమా తీయటం మార్పు కాదు, తప్పని పరిస్థితే కదా. ఇలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కోని నిలబడినవారు లేకపోలేదు. ఈ వ్యాసంలోనే ఎక్కడో ప్రస్తావించినట్లు, చార్లీ ఛాప్లిన్ 1930-36 ప్రాంతంలో అందరూ టాకీ సినిమాలు తీస్తున్నా తను మాత్రం మూకీ సినిమాలే తీస్తానని పట్టుపట్టి మరీ అలాంటి సినిమాలు తీశాడు. మోడర్న టైమ్స్, సిటీలైట్స్ లాంటి చిత్రాలు అప్పుడు నిర్మించినవే. అయితే అలా నిర్ణయించడానికి, మూకి సినిమాలపైన వున్న పట్టు, కళాత్మకంగా అలాంటి సినిమాలపైన వున్న మక్కువే కారణం. అంత నమ్మకం, ఒక కళా ప్రక్రియ పైన అంత పట్టు వున్న కళాకారులు ఇప్పుడు అరుదు కాబట్టి అలాంటి సమస్య ఇప్పుడు కలిగే అవకాశమే కనపడటంలేదు.

ఇప్పుడున్న దర్శకనిర్మాతలు ఇలాంటి మార్పుని ఆహ్వానిస్తారా? అని అనుమానం రావచ్చు. ఖచ్చితంగా రానివ్వరు. దానికి సహేతుకమైన కారణం లేకపోలేదు. ఒకసారి టాలీవుడ్ లో వస్తున్న సినిమాలను గమనిస్తే ఆ విషయం ఏమిటో అర్థం అవుతుంది. గత సంవత్సరం (2010) లో వచ్చిన తెలుగు, తమిళ, మళయాళ సినిమాలలో వాణిజ్యపరంగా (కమర్షియల్ గా) విజయవంతమైన సినిమాలను క్రింద పట్టిక వేశాను. ఆ సినిమాలను పరికిస్తే తెలుగు సినిమా ఏ చట్రంలో పడి ఇరుక్కుపోతోందో స్పష్టంగా అర్థం అవుతుంది.

మళయాళం

తమిళ్

తెలుగు

సినిమా

జాన్రా

సినిమా

జాన్రా

సినిమా

జాన్రా

పోక్కిరి రాజా 

 

ఏక్షన్ కామెడీ (మసాలా) ఎన్థిరన్ సైన్స్ ఫిక్షన్ సింహా ఏక్షన్ డ్రామా (మసాలా)
షిక్కర్ సస్పెన్స్ థ్రిల్లర్ సింగం మసాలా బృందావనం ఫామిలీ, కామెడీ
ప్రన్చెయట్టన్ అండ్ ద సైంట్ సెటైర్, కామెడీ పైయ్యా ఏక్షన్ రొమాన్స్ మర్యాద రామన్న కామెడీ
మర్యక్కుందోరు కుంజాడు కామెడీ బాస్ ఎంగిర భాస్కరన్ రొమాంటిక్ కామెడీ అదుర్స్ కామెడీ, ఏక్షన్
కార్యస్థాన్ కామెడి విన్నైతాండి వరువాయా రొమాన్స్ డ్రామా డార్లింగ్ రొమాన్స్, కామెడీ
హాపీ హస్బెండ్స్ కామెడీ (రీమేక్) మద్రాసపట్టిణం పీరియడ్ డ్రామా ఖలేజా ఏక్షన్
బెస్ట్ యాక్టర్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా మైనా డ్రామా బెట్టింగ్ బంగార్రాజు కామెడీ
ఎల్సమ్మ ఎన్న ఆనకుట్టు ఫ్యామిలీ తమిళ్ పడం పేరడీ లీడర్ పొలిటికల్
ఇన్ ఘోస్ట్ హౌస్ ఇన్ హారర్ కామెడీ అంగాడి తెరు డ్రామా ఝుమ్మంది నాదం మ్యూజికల్ రొమాన్స్
ప్యాపీ అప్పచ్చా ఏక్షన్ కామెడీ కలవాణి రొమాన్స్ రక్త చరిత్ర బయోగ్రఫిక్

గమనిక: తెలుగు హిట్టైన రోబో (సైన్స్ ఫిక్షన్), ఏ మాయ చేశావే (రొమాన్స్ డ్రామా) సినిమాలు ప్రధానంగా తమిళ సినిమాలు కాబట్టి ఈ తెలుగు లిస్టులో చేర్చలేదు. తెలుగులో ఇవ్వబడిన పది సినిమాలు అన్నీ కమర్షయల్ గా విజయం సాధించినవి కావు.

ఇవి కేవలం వాణిజ్యపరంగా విజయవంతమైన సినిమాల విశ్లేషణ. ఇదే విశ్లేషణ విడుదలైన సినిమాలన్నింటికి చేస్తే ఇతర భాషల్లో వస్తున్న వైవిధ్యభరిత సినిమాలు తేటతెల్లం అవుతాయి. మన సినిమా రొమాన్స్, కామెడీ, మసాలా చట్రాలలో పడి కొట్టుకుంటున్న సంగతి అర్థం అవుతుంది. ఇదే విశ్లేషణ ఏ ఇతర భాషా చిత్రాలతో చేసినా, లేదా వేరే ఏ సంవత్సరానికి చేసినా ఫలితంలో పెద్ద మార్పు వుండదు. (ఈ సినిమాల వివరాలు సెకరించిన వికీ పీడియాలో చాలా తెలుగు సినిమాలకి జాన్రా రాయలేదు. మన సినిమాకి జాన్రా లేకపోవటమో, మరి మన సినిమా ఏ జాన్రాకు సంబంధించినదో అర్థం కాని పరిస్థితి వల్లో తెలియలేదు.)

మరో ముఖ్యమైన విషయం మనం గమనించాలి. గత మూడు సంవత్సరాలుగా హిట్టు లేక కొట్టు మిట్టాడుతున్న తెలుగు సినిమా పరిస్థితి ఏమిటో మన సినిమా పెద్దలకి బాగా అర్థం అయినట్లే వుంది. తెలుగు సినిమా పెద్ద దిక్కులైన సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణా, ఉషాకిరణ్ తదితర పెద్ద నిర్మాతలు దాదాపుగా సినిమాలు తీయటం మానేసారు. సినిమాని ఫక్తు వ్యాపారంగా భావించే సినీ నిర్మాతలు సినిమా తీయడం వెనకాడుతూ, కేవలం ఇంకెవరో తీసిన సినిమాల డబ్బింగ్ రీరికార్డింగ్ మాత్రం తమ స్టూడియోలలో చేయిస్తూ, లేదా డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చేస్తూ సినీ వ్యాపారానికి దూరంగా వున్నారు. అంటే తెలుగు సినిమా బాగుపడేందుకు ఏమన్నా చేద్దామని కానీ, అలాంటి అవకాశం ఒకటి వుందని కానీ వీళ్ళు భావించడంలేదు. మన (సోకాల్డ్) సినిమా పెద్దలు తెలుగులో సినిమా తీసి హిట్టు కొట్టడం వల్లకాదని తీర్మానించుకున్నట్లు గత కొంతకాలంగా వారి సినిమా నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి మార్పు అంతర్గతంగా వచ్చే అవకాశమే లేదన్నమాట.

ఇక మిగిలింది బయటి నుంచి వచ్చే మార్పు సంగతి – ఇది జరగాలంటే నిజంగా విప్లవాత్మకమైన విజన్ వున్నవారు రావాలి. ఇప్పుడు సినిమా పరిశ్రమలో వున్న దర్శకనిర్మాతలను, రచయితలను పరిశీలిస్తే ఎంత మంది ఉన్నతవిద్య కలిగి వుంటారు అన్న పెద్ద ప్రశ్న. చదువు వల్ల ఒరిగేదేమిటి అని అడగవచ్చు కానీ, చదువుతో పాటు వచ్చే విజ్ఞానం, వివిధ పుస్తకాలను చదవడం ద్వారా ఎర్పడే దృష్టికోణాలు చదువులేకుండా కలగడం చాలా అరుదు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులు (ముఖ్యంగా సాంకేతికమైనవి) తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అలాంటి మార్పులని కలుపుకునే ఓపెన్ మెంటాలిటీ వస్తుంది. అందుకే చదువుకున్న వాళ్ళు సినిమా పరిశ్రమలోకి రావాలి. మేనేజ్మంట్, సాఫ్ట్ వేర్ నిపుణులు, సాహిత్యంలో విద్యాధికులు ఇలాంటివారు సినిమా పరిశ్రమలో రావాల్సిన అవసరం, అత్యవసరంగా కనిపిస్తోంది.

ఇప్పటికే దేశవిదేశాల్లో చదువుకోని, వుద్యాగలు చేసుకోని సినిమా తీద్దాం అంటూ ఇబ్బడిముబ్బడిగా వలస వస్తున్నవారు కనపడతున్నారు. అంతవరకూ బాగానే వుంది. సమస్యల్లా ఎక్కడ వస్తుందంటే ఆ వచ్చే వారు కూడా ఇప్పుడు టాలీవుడ్ సినిమాలను చూసి, సరిగ్గా అలాంటి సినిమాలే తీద్దాం (నిర్మాతగానైనా, దర్శకుడిగానైనా) అనుకొని ఇక్కడ దిగడం వల్ల వస్తుంది. లేదా అక్కడక్కడా వేరే రకం సినిమాలు తీద్దాం అనుకొని వచ్చి ఇక్కడ పరిచయమయ్యే సినీమేధావుల వల్ల “ఫలానా రకం సినిమాలు ఇక్కడ ఎక్కవు”, “తెలుగులో ఆడవు”, “తీస్తే డబ్బాల్లో మిగిలిపోవాల్సిందే” అని బెదిరింపులకు లొంగి మళ్ళీ అదే మూస సినిమాలు తీసు పడేస్తున్నారు. ఫారిన్ రిటర్న్డ్ నిర్మాతలు, దర్శకులు ఒకటో అరో సినిమా తీసి తిరిగి వుద్యోగాలు వెతుక్కుంటూ తిరుగు టపా కట్టేయడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అయితే అలా వెళ్తున్నవారు కూడా మళ్ళీ సంపాదించుకోని, మరో సినిమా తీయడానికి వస్తామని చెప్పడమూ మరో కొసమెరుపు.

నేను చెప్తున్న మార్పు తెచ్చే కొత్తవారు వీళ్ళు కాదు. సినిమాని క్షుణ్ణంగా తెలుసుకొని, వీలైతే చదువుకొని, ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల లో లోపాలను ఎరిగి, “ఇండిపెండెంట్ సినిమా” తరహాలో ఎవ్వరెదురైనా నేను తీయాలనుకున్నది తీస్తాను అని ధైర్యంగా నిలబడగలిగే సాహసి మాత్రమే మార్పు తేగలడని నమ్ముతున్నాను.

(ఇంకావుంది)

11 Comments
 1. challa May 21, 2011 /
 2. ramana May 22, 2011 /
   • నాయకుడు May 22, 2011 /
   • ramana May 22, 2011 /
 3. Ram May 24, 2011 /
  • అరిపిరాల May 24, 2011 /
 4. holyman May 24, 2011 /
 5. verghese May 27, 2011 /
 6. Sriram August 30, 2013 /
 7. Hari venkat May 18, 2017 /