Menu

హృద్యంగా…చలో దిల్లీ

జీవితాన్ని జీవించడం మానేసి, జీవితం గురించి వర్రీ అవుతూ బ్రతకడమే జీవితమైపోయిన లోకానికి “కష్టాలొచ్చినా వాటిని చూసి నవ్వేసెయ్ ! అవే అలిగి వెళ్ళిపోతాయ్” అనుకుంటూ హాయిగా బ్రతికేసే మరో లోకం ఎదురైతే… “చలో దిల్లీ” అవుతుంది.

మిహికా బెనర్జీ (లారా దత్తా) ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. క్లీన్లినెస్ ఫ్రీక్, సీరియస్ బాస్. జీవితంలోని ప్రతొక్క విషయమూ పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే ఒక కార్పొరేట్ మహిళ. అనుభంధాలూ, ప్రేమల కన్నా కెరీర్ ముఖ్యమనుకునే ఒక obsessed స్త్రీ. అలాంటి వ్యక్తి వీటన్నిటికీ పూర్తి వ్యతిరేకంగా, కనపడిన అందరితో మనస్ఫూర్తిగా స్నేహంచేసి, చిన్నచిన్న విషయాలలో ఆనందాన్ని చూసుకుంటూ, ఏ కష్టం ఏ నష్టం జరిగినా “మరీ ఘోరమేం జరిగిపోలేదుగా” అని హాయిగా సర్ధిచెప్పుకుంటూ వెళ్ళిపోయే  మనుగుప్తా(వినయ్ పాఠక్) తో ప్రమాదవశాత్తూ ఒకరోజు గడపాల్సివస్తే ఏమౌతుంది అనేది కథ.

ముంబై నుంచీ ఢిల్లీ వెళ్ళాల్సిన విమానం, జైపూర్ లో అర్థరాత్రి ఆగిపోతే కొన్ని పరిస్థితుల కారణంగా ట్యాక్సీలో ఢిల్లీ కలిసి వెళ్ళాల్సిన మిహికా, మను అనే రెండు కాంట్రాస్టింగ్ పాత్రల యాక్సిడెంటల్ కలయికలో జరిగే హాస్యంతో పాటూ అలాంటి కలయికతెచ్చే మానసిక మార్పుని వీలైనంత నర్మగర్భంగా, హృద్యంగా చెప్పడానికి ప్రయత్నించిన చిత్రం “చలొ దిల్లీ”.

వినయ్ పాఠక్ అద్భుతమైన నటన (నిజానికి పాత్రలో జీవించాడు), లారాదత్తా తనూ నటించగలదని నీరూపించే ప్రయత్నం రెండూ  అర్షద్ సయ్యద్ రచనాబలాన్ని నిలబెట్టాయి. ప్రాత్రల రూపకల్పనద్వారా కథను నడిపే సినిమాలు తక్కువగానే వస్తున్న ఈ సమయంలో ఇది నిజంగా అభినందనీయమైన ప్రయత్నం. గొప్పగొప్ప జీవనసిద్ధాంతాల్ని చిన్నచిన్న మాటలతో అత్యంత సాధారణంగా చెప్పించిన రచయిత సామర్థ్యం అప్పుడప్పుడూ ఆశ్చర్యాన్ని, చాలావరకూ ఆనందాన్ని కలిగిస్తుంది. మైనర్ పాత్రలను కూడా కూలంకషంగా స్టడీచేసి రాసిన తీరు అమోఘం.

సినిమా గతి నిదానంగా ఉండటంతో అక్కడక్కడా కొంత బోర్ కొట్టినా, ప్రత్యేకపాత్రకోసం వచ్చిన అక్షయ్ కుమార్ కొంత out of place అనిపించినా, ప్రధానపాత్రల సునిసిత భౌతిక,మానసిక ప్రయాణం చివరికి మంచి సినిమాచూసిన అనుభూతిని మిగులుస్తుంది. కత్తిమీద సాములాంటి ఇలాంటి సినిమాకి దర్శకత్వం వహించిన శశాంత్ షా కు మంచి భవిష్యత్తు ఉంది. నటి లారాదత్తా కూడా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరవడం ముదావహం.

హడావిడి జీవితాల్లో ప్రశాంతంగా రెడున్నరగంట గడపాలంటే ఈ సినిమాకు వెళ్ళండి. పాత్రలతో కలిసి మనమూ ఆ మానసిక ప్రయాణానికీ సిద్దపడితే వెళ్ళండి. లేకపోతే ప్లీజ్… వెళ్ళకండి !

5 Comments
  1. balaji May 2, 2011 /
  2. Santha Laxmi, Ongole May 2, 2011 /
  3. Apparao Sastri May 3, 2011 /
  4. Surya May 15, 2011 /
  5. Sanjeev June 10, 2011 /