Menu

“విశ్వనాథుడు”

” ఆ పాత మధురము సంగీతము ..అంచిత సంగాతము ..సంచిత సంకేతము !
శ్రీ భారతి క్షీరసంప్రాప్తము… అమృత సంపాతము.. సుకృత సంపాకము !!

ఆలోచనామృతము సాహిత్యము ..సహిత హిత సత్యము ..శారదా స్తన్యము !
సారస్వతాక్షర సారధ్యము …జ్ఞాన సామ్రాజ్యము …జన్మ సాఫల్యము!! “

కళామతల్లి శ్రీభారతీదేవి స్తన్యామృతమయిన సంగీత సాహిత్యాల మాధుర్యాన్ని పండితులకే కాక పామరులకి కూడా రుచిచూపించాలని తాపత్రయపడిన కళా బంధువు.శాస్త్రీయ నృత్య రీతులయిన కూచిపూడి,భరత నాట్యాలని కథా వస్తువులుగా,వాటి మీద సామాన్య జనాలకి కూడ ఒక అవగాహన కల్పిస్తూ.. ఆ రసానందాన్ని పంచిపెట్టిన కళారంతి దేవుడు.భారతీయకళల్లో ఉన్నఅందాన్ని,ఆకర్షణనీ..తెలియజేస్తూ..ఆ సాధనలో రసానందం అనుభవిస్తూ.. అధ్యాత్మికతలోని అత్యున్నతమైన నిర్వాణస్థితిని చేరుకోవోచ్చని సినిమా కళ ద్వారా ప్రపంచానికి చాటిన కళోద్దారకుడు.కథా సందర్భాను సారంగా అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, వంటి మహా కవుల వాజ్మయాన్ని సంపూర్తిగా వినియోగించుకొని భాషా తేనియని రుచి చూపించిన కళాపిపాసి.భారతీయ సినిమా చరిత్రలో ‘తెలుగు సినిమా’ కి ఒక ఉనికిని ఏర్పరచిన కళాతపస్వి కే విశ్వనాధ్ గారు.

కే.విశ్వనాధ్ గారు మన తెలుగు వారు గర్వించదగ్గ ఏకైక డైరెక్టర్. బాపు, జంధ్యాల, వంశీ వంటి వారు ఉన్నా కే.విశ్వనాధ్ గారు ఒక్కరే “ప్రపంచ సినిమా” కి పోటి కి రాదగ్గ సినిమాలని అందించారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

శంకరాభరణం,సాగరసంగమం, సిరివెన్నెల,స్వాతి ముత్యం, స్వాతికిరణం,స్వయంకృషి స్వర్ణకమలం వంటి ఎన్నో సినిమాలు ఆయన కళాతృష్ణ కి తార్కాణాలు.ఆయన సినిమాల్లోని సంగీతం అజరామరం. ఎన్ని పాటలున్నా,ఎన్నిపాటలు విన్నా ఆయన సినిమాల్లోని పాటలు వింటేనే మనసుకి ఆహ్లాదం, శాంతి.సంగీత నృత్యాల నేపథ్యం తీసుకొన్నా ప్రతిచిత్రం ఒక భిన్నమైన చిత్రమే.

వరకట్న దురాచారాని ఎద్దేవా చేస్తూ ‘శుభలేక’ ..మానవ సమూహంలోని కుల మత భేదాలని ఎండగడుతూ ‘సప్త పది’,

సంగీతం ఒక జీవ రసామృత ధార, కుల మత భేదాలేకుండా ఎవ్వరైనా తమ ఆర్తికొద్దీ తాగొచ్చు. సంగీత సాధన భగవంతుని చేరే ఓ త్రోవ . ఆ బాటలో ఎవరైనా వెళ్ళవచ్చు అని ‘శంకరా భరణం’,

ఒక బీద కళాకారుని తపనగా,స్నేహభంధం అంతర్లీనంగా చూపిస్తూ కళలో ఉన్నతి సాధించిన మనిషి అమరుడు అని  ‘సాగరసంగమం’,

మనిషి మనసులోకి అసూయాద్వేషాలు చేరితే ఎంతటి మహానుభావులకీ అధోగతి తప్పదు అని ‘స్వాతి కిరణం’,

స్త్రీ వల్ల… అదీ వెల కాంత వల్ల పురుషుడు తన ధర్మాన్నీ, ఉనికినీ మరిచిపోకూడదనీ ‘శృతి లయలు’,

ఎదిగిన మనిషి లోని…ఎదగని మనసు …స్వచ్చమైన ముత్యం వంటిదని,   “స్వాతిముత్యం”,

రాముని మదిలో విరహ సముద్రాన్ని తెలుసుకొని..సముద్రాలని లంఘించి.. సీత రాములని ఒకటి చేసిన బంటు కథ రామాయణం అయితే.. బంటుకి కలిగిన ప్రేమ వియోగ బాధని తనదిగా చేసుకున్న రాముడి కథగా ‘శుభ సంకల్పం’,..

కృషి తో నాస్తి దుర్భిక్షం…  కృషి ని నమ్మిన వాడికి ఓటమి అనేది ఉండదు అని  ‘స్వయం కృషి’ ..,

ఆత్మీయత గలవాడే ‘ఆపద్భాదవుడు’  అని ఇంకో కథ.,

ఏ కళ అయిన సాధన సాగిస్తుంటే… ఆ కళా యోగసాధనలో రాసానందం శత దళ సువర్ణ కమలంలా వికసించి..బ్రతుకు సార్థకం అవుతుంది అని ‘స్వర్ణకమలం’.

అలా ప్రతి చిత్రం ఒక కళా విచిత్రం. దేనికదే సాటి.మన హృదయాంతరాలాల్లో ఉన్న సునిశిత భావాల్నిమీటగలిగే  శక్తి ఒక్క విశ్వనాధ్ గారి సినిమాలకే ఉంది.

రాళ్ళుఅంతటా ఉన్నాయి….. కాని శిల్పి ఉన్నపుడే కదా రాయి శిల్పంగా మారేది. కొన్నిశిల్పాలుగా ఉన్నప్పటికీ… గుళ్ళోప్రతిష్ట చేసినపుడే కదా దేవతామూర్తిగా మారి అందరి పూజలు అందుకునేది. అలా ఎంతో మంది లో దాగున్న ప్రతిభా పాటవాలని ప్రేకకుల గుండెల్లో ప్రతిష్టించి..పట్టం కట్టే విధంగా పది మందికీ పరిచయం చేసిన కళాశిల్పి విశ్వనాథ్ గారు.

శంకరాభరణంలో సోమయాజులు,.. సాగర సంగమం, స్వాతి ముత్యం..శుభ సంకల్పంలలో కమల్ హాసన్,…స్వాతి కిరణంలో మమ్ముట్టి, స్వర్ణకమలం లో భాను ప్రియ,..శుభలేఖ,స్వయం కృషి,ఆపద్భాధవుడు సినిమాల్లో చిరంజీవి గార్ల “అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేలన”ని మరిచిపోగాలమా  !!

స్త్రీ అందం అంటే, అంటే కళ్ళు,ముక్కు తీరూ,ముఖ వర్చస్సు,శరీర సౌష్టవం మాత్రమే కాదు..చూసే చూపులో,మాట తీరులో..నడకల్లో.. నవ్వుల్లో.. నిలబడే భంగిమల్లో.. హృదయ విశాలత్వంలో ఉంటుందనీ, ఆ అందాన్ని చిత్రాద్దంలో పట్టి చూపించగల సామర్యం విశ్వనాధ్ గారి కే చెల్లు.

K.Vమహదేవన్, ఇళయ రాజా..సినీ సంగీత విద్వాంసులని.. వేటూరి..సిరివెన్నెల లాంటి మహా రచయితల్నీవాణీ జయరాం, జానకి, బాలు వంటి గాయనీ గాయకులనీ తమ ఉన్నతోన్నతమైన కళని అందుకునేలా ప్రోత్శాహించింది చాల వరకు విశ్వనాధ్ గారి సినిమాలే.కేవలం సినిమా రంగానికి చెందినవారినే కాకుండా, మనదేశం లో వివిధ రంగాలకు చెందిన ఎందఱో సుప్రసిద్ద కళాకారులు, సంగీత విద్వాంసులు..నాట్యకారుల కళా ప్రాభవం విశ్వనాధ్ గారి సినిమాలలో మనకి దర్శనం ఇస్తుంది. సినిమా అంటే సకల కళల సమాహారం అని రుజువు చేస్తుంది.

డాన్సులు..రోమాన్సులు రాజ్యం ఏలుతున్న సమయం లో..సినిమా కళాత్మక కోణాన్ని ఆవిష్కరించిన ఆ మహా దర్శకునికి అభివందనం చేస్తూ, ఆయన కళాదృష్టిని, రసస్పూర్తిని పుణికి పుచ్చుకుని నవ దర్శకులు తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో గౌరవం కలిగిస్తారని ఆశిస్తూ..

33 Comments
 1. రాజశేఖర్ May 5, 2011 /
 2. k.mahesh kumar May 6, 2011 /
  • chakradhar May 25, 2011 /
   • Raj April 25, 2017 /
 3. vinay May 6, 2011 /
 4. Rajesh Devabhaktuni May 7, 2011 /
 5. ramana May 22, 2011 /
  • chakradhar May 25, 2011 /
  • Vasu May 22, 2011 /
  • ramana May 23, 2011 /
   • chakradhar May 25, 2011 /
 6. srikanth May 23, 2011 /
 7. రమణ May 23, 2011 /
 8. రాణి May 24, 2011 /
  • శంకర్ May 25, 2011 /
 9. srikanth May 24, 2011 /
 10. రాణి May 24, 2011 /
 11. holyman May 24, 2011 /
  • రమణ May 24, 2011 /
 12. sunanda May 25, 2011 /
 13. రాణి May 25, 2011 /
 14. రమణ May 25, 2011 /
 15. రాణి May 26, 2011 /
 16. pothukuchi February 6, 2012 /
 17. చక్రి September 8, 2015 /