Menu

డిస్టింక్షన్లో పాస్ : 100 % లవ్

అనగనగా ఒక ఎమ్సెట్ ఫస్ట్ ర్యాంకర్. ఇప్పుడు ఫ్రెష్ గా కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థి. అనగా నాగచైతన్య, సినిమాలో బాలు. అప్పుడే పల్లెటూరు నుంచీ దిగి, బావని అడ్మైరింగ్ గా చూసే లాస్ట్ ర్యాంకర్ మహాలక్ష్మి(తమన్నా). తనూ బాలు కాలేజిలోనే చేరింది. అసలే ఫస్ట్ ర్యాంకర్ పైగా మందిలో మంచి డిమాండ్ ఉన్న బాలు అటు కాలేజిలోనూ, ఇటు ఇంట్లోనూ కింగే. చుట్టుపక్కల వాళ్ళు ఉంటే బాలులా ఉండాలని, తయారైతే అలాంటి ర్యాంకర్ గానే తయారవ్వలని, ఒక బుడత గ్యాంగుని బాలుతో పాటే అతని రూములో పెట్టేస్తారు. (a+b)2 వాళ్లకు భోజనానికి ముందు పాడే మంత్రం, బాలు టైంటేబుల్ ప్రకారం, డైట్ చార్ట్ ప్రకారం నడవడం వాళ్ల దినచర్య.

ఇలాంటి చదువుల జైలులోకి ర్యాంకుల పందాల గురించి పెద్దగా తెలీని పల్లెటూరి మరదలు వచ్చి చేరింది. అసలే తెలుగు మీడియం చదువు. పైగా పట్నవాసం కొత్త. చికెన్ పిచ్చి. బాలుకి నాన్ వెజ్ తింటే మొదడు మొద్దుబారి పోతుందని ఒక నమ్మకం. ఇలా వ్యతిరేకపు  అలవాట్లు, అలవాటులేని గ్రహపాట్ల మధ్య పాట్లు పడుతూ, మహాలక్ష్మి బాలు చెప్పిన చదువుతోనే బాలుకి ఎసరెట్టి, తనే కాలేజిలో ఫస్ట్ ర్యాంకర్ అయిపోతుంది. బాలు ఇగోకి గుదిబండై కూర్చుంటుంది. ఆ తరువాత వాళ్ల మధ్యసాగే టామ్ అన్డ్ జర్రీ గేమ్ ఏంటి? ఇలాంటి ఎలుకా పిల్లి మధ్యలో ప్రేమ ఎలా చిగురించింది? రోలర్ కోస్టర్ రైడ్ లాంటి వీళ్ళ ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగి సేఫ్ గా ల్యాండ్ అయ్యింది అనే “100 % లవ్”  కథ.

ఆసక్తి కలిగించే కథ. ఇంకా ఆసక్తికరమైన సన్నివేశ సమాహారాలతో సినిమాను అందంగా మలచడంలో దర్శకులు సుకుమార్ విజయం సాధించారు. ఆర్య సినిమాలో అన్ కండిషనల్ లవ్,  ఆర్య 2 లో శాడిస్టిక్ లవ్ అంటూ ఏవో కొత్త ప్రేమపాఠాలు తెలుగు ప్రేక్షకులకు చెప్పి, తెలివితో  పాటూ కొంత పైత్యం కూడా ఉందేమో అని అనుమానం తెచ్చిపెట్టిన సుకుమార్, ఈ చిత్రంతో ప్రేమంటే ఇద్దరు ఆపోజిట్ పాత్రలు ఒకరికొకరు పూరకాలని తెలియకనే తెలుసుకోవడం అని తేల్చి, మళ్ళీ గాడిలో పడ్డాడనే చెప్పొచ్చు.

బాలు మహాలక్ష్మి పాత్రల వైవిధ్యమన రూపకల్పన అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువయ్యిందని అనిపించినా, దృశ్యాల అల్లకంలోని సమయస్ఫూర్తి, అందం ఆ ప్రశ్నల్ని పక్కనపెట్టేలా చేస్తుంది. నాగచైతన్య, తమన్నాలు పాత్రోచితంగా ఉన్నారు. ఇద్దరూ అందమైన జంట. ప్రేమకథకు చాలా అవసరమైన సరంజామా అదే కాబట్టి సినిమా సక్సెస్ లో ఈ జంట భాగం చాలా ఉంటుంది. నటన పరంగా నాగచైతన్య కొత్తగా ఏమీ నిరూపించకపోయినా, దర్శకుడి ప్రతిభమాటున రాణించాడనే చెప్పాలి. తమన్నా చాలా అందంగా ఉంది. బుంగమూతి పెడితే ఈ అమ్మాయి అందంగా ఉంటుంది. కానీ, మాటిమాటికీ అలా ముద్దుముఖం పెడితే కాస్త ఇరిటేషన్ కూడా వస్తుందని ఎవరైనా చెబితే బాగుండును. ఇతర పాత్రల్లో నరేష్, కె.ఆర్.విజయలు బాగా చేశారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాత్ర ఫరవాలేదు. అతిధిపాత్రలో కనిపించిన విజయ్ కుమార్ సినిమా లో కొంచెం ఔటాఫ్ ప్లేస్ అనిపించినా, అవసరమైన హడావిడిని సినిమాకు జోడించారు.

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది రచయితల గురించి. కథ దర్శకుడు సుకుమార్ ది అయినా, ఈ సింగిల్ లైన్ కథను ఆసక్తికరంగా మలచడంలో రమేశ్, చంద్రశేఖర్, హరి ప్రసాద్ ల పాత్ర తెరమీద కనిపిస్తుంది. చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, శ్రీరమణి పాటల్లోని సాహిత్యం దేవిశ్రీప్రసాద్ చేసిన శబ్దకాలుష్యాన్ని తప్పించుకుని, భాషరాని గాయకుల గజిబిజి యాసల్ని చీల్చుకుని అప్పుడప్పుడూ చెవినపడి రంజింపజేయడం మరో చెప్పుకోదగ్గ విషయం. దృశ్యపరంగా కూడా సాహిత్యానికి ఊతనిచ్చే మాంటాజ్ లు ఇవ్వడంలో దర్శకుడు సఫలమయ్యాడు. దీనితో పాటలకు తెరపై మరింత అందం చేకూరింది.

ప్రధమార్థంలో దర్శకుడు చూపించిన నూతనత్వం, ద్వితీయార్థంలోని డ్రామాకొచ్చేరికీ కొరవడి కొంత నిరాశకలిగించక మానదు. అయినా, ప్రధమార్థానికి 45 % , ద్వితీయార్థానికి 30% కలుపుకున్నా, ఈ సినిమా 75% అంటే డిస్టింక్షన్ లో పాసవడం ఖాయం. హాయిగా, సమ్మర్ లో చల్లగా చూసెయ్యొచ్చు.

23 Comments
 1. satya May 6, 2011 /
 2. rahul May 6, 2011 /
 3. Faustin Donnegal May 6, 2011 /
 4. siri May 6, 2011 /
 5. సుజాత May 6, 2011 /
  • Ravi May 9, 2011 /
 6. farook May 6, 2011 /
 7. RG May 7, 2011 /
  • k.mahesh kumar May 8, 2011 /
   • rahul May 8, 2011 /
   • RG May 10, 2011 /
 8. pani May 9, 2011 /
  • Faustin Donnegal May 9, 2011 /
 9. msr May 10, 2011 /
 10. naresh May 11, 2011 /
 11. challa May 13, 2011 /
 12. supergoodmovies May 13, 2011 /
 13. Bhanu May 13, 2011 /
 14. dvrao May 20, 2011 /
 15. Vinay May 21, 2011 /
  • రాజశేఖర్ May 22, 2011 /
 16. Adithya Sastrulavari May 24, 2011 /
  • vamshi June 1, 2011 /