Menu

పవన్ కల్యాణ్ అభిమానులకి “తీన్ మార్”

జయంత్ పరాన్జీ దర్శకత్వంలో, గణేశ్ నిర్మించిన పవన్ కల్యాణ్ చిత్రం తీన్ మార్ ఈ రోజు విడుదలైంది. “కొమరంపులి”తో కుదేలైన పవన్ కల్యాణ్, “ఖలేజా”తో చతికిలపడ్డ త్రివిక్రమ్ శ్రీనివాస్ (మాటలు, స్క్రీన్ ప్లే) కొంచెం జాగ్రత్తగా పనిచేశారా అనిపించేట్టుగా వుంది “తీన్ మార్”. వీరిద్దరి కష్టం ఏమో కానీ “తీన్ మార్” సినిమా మాత్రం పవన్ కల్యాణ్ అభిమానుల్ని సినిమా హాల్లో తీన్ మార్ ఆడిస్తోంది. ఈ సినిమా హిందీ చిత్రం “లవ్ ఆజ్ కల్” కి రీమేక్ అని తెలిసినవాళ్ళు, ఆ సినిమా చూసినవాళ్ళు చూస్తే ఫర్వాలేదు అని తేల్చేయచ్చు కానీ, సాధారణ ప్రేక్షకులకి ఇది నచ్చే అవకాశమే ఎక్కువ వుంది.

కధ విషయానికి వస్తే – సౌత్ ఆఫ్రికాలో(?) ఇటాలియన్ రెస్టారెంట్ లో ఛెఫ్ గా పని చేస్తున్న మైకేల్ వేలాయుధం ఉరఫ్ మైక్ (పవన్ కల్యాణ్) అల్లరి చిల్లరిగా వుంటూ కనపడిన పది పదిహేను అమ్మాయిల్ని ప్రేమించేస్తుంటాడు. ఆ క్రమంలోనే పురాతన కట్టడాలను పునరుద్ధరించే వుద్యోగం చేసే మీరా శాస్త్రి (త్రిష) తో కూడా ప్రేమలో పడతాడు. ఆ ఇద్దరూ సరదాగా రెండు ముద్దులు, ఆరు పబ్బులు, తొమ్మిది పెగ్గులు అంటూ గడిపేస్తూ వుండగా మీరాకి ఇండియాలో కట్టడాల పునరుద్ధరణ చెయ్యాల్సి వస్తుంది. అప్పటికే తమ మధ్య ప్రేమ మాజిక్ లేదని గుర్తించిన ఇద్దరు యధాలాపంగా విడిపోవాలని నిర్ణయించుకుంటారు. వీరిద్దరు విడిపోవటం చూసిన ఒక రెస్టారెంట్ యజమాని – పేరు సేనాపతి (పరేష్ రావెల్) – మైక్ ని కూర్చోపెట్టి ముప్ఫై ఏళ్ళక్రితం జరిగిన ఒక ప్రేమ కథ చెప్తాడు. ఆ కథ ప్రకారం వారణాసిలో వున్న అర్జున్ పాల్వాయ్ (పవన్ కల్యాణ్), వసుమతి (కృతి కర్బందా) ప్రేమలో పడతాడు. ముప్ఫై ఏళ్ళ క్రితం పరిస్థితుల కారణంగా వారిద్దరి మధ్య పరిస్థితులు, తల్లిదండ్రులు అడ్డుగా నిలుస్తారు. ఈ రెండు కథలలో వున్న ఇద్దరు వ్యక్తులు (మైక్, అర్జున్) ప్రేమ పట్ల, ప్రేమించిన వ్యక్తులపట్ల ప్రవర్తించే విధానం ద్వారా, నాటి తరానికి నేటి తరానికి వున్న వ్యత్యాసాన్ని చూపిస్తారు. ఈ ఇద్దరు ప్రేమికులు ఎదురైన అవాంతరాల్ని ఎదుర్కోని ఎలా తమ ప్రేమని గెలిపించుకుంటారనేది మిగతా కథ.

తొలిసారిగా ద్విపాత్రాభినయనం చేసిన పవన్ కల్యాణ్ అర్జున్ పాత్ర పోషణ లొ మంచిమార్కులు కొట్టేసినా, మైక్ పాత్రతో ఇప్పటికే ఎన్నో సినిమాలలో చూసేసిన పవన్ కల్యాణ్ మళ్ళీ చూపించాడు. అయితే కథపరంగా రెండు కథలు ఒకదాని తరువాత ఒకటి వస్తాయి కాబట్టి, మైక్ బోరు కొట్టినప్పుడల్లా అర్జున్ పాత్ర కనిపించి మన వుత్సాహాన్ని నీరుకార్చకుండా నిలుపుతుంది. ఎమోషనల్ సీన్లలో మాత్రం పవన్ మైక్ పాత్రలో కూడా మంచి నటనే కనబరిచాడు. ఫైట్లకి పెద్దగా ఆస్కారం లేకపోయినా వున్న ఒకటి రెండు చోట్ల పవన్ అలరిస్తాడు. త్రిష మోడ్రన్ భావాలు వున్న ప్రొఫెషనల్ గా బాగానే చేసింది. కురచ బట్టలు, లిప్ లాకులు వున్నా పెద్దగా ఇబ్బంది పడలేదు. కృతి కర్బందా బొమ్మలా వున్నదే కానీ పెద్ద నటించే అవకాశమూ లేదు, అలాంటి ప్రయత్నమూ చేసినట్లు లేదు. పరేష్ రావెల్, తనికెళ్ళ భరణి, సుధ, ముకేష్ రుషి పాత్ర పరిధిలో ఇరుక్కోని నటించారు.

పవన్ మొదట్ ఇటాలియన్ మాట్లాడే సన్నివేశాలు, పవన్, మీరా, ఆలీ తాగి హోటల్ కి వచ్చే సన్నివేశాలు, ద్వితీయార్థంలో చాలా సన్నివేశాలు సాగినట్లు అనిపించినా మిగతా సినిమాలో కొట్టుకుపోతాయి.

సంగీతం బాగున్నా కొరియోగ్రఫీ తగినంత లేదనిపించింది. ముఖ్యంగా మొదటి పాటలో విదేశీవనితల అంగాంగ ప్రదర్శన మీద వున్న శ్రద్ధ పవన్ డాన్స్ మీద పెట్టివుంటే బాగుండేది. ఇక ఫ్లాష్ బాక్ సీన్లల విషయంలో కూడా శ్రద్ధ లొపించినట్లు అనిపిస్తుంది. దర్శకత్వంలో ఈ లొపాలు మినహాయిస్తే మిగతా అంతా బాగానే సాగింది. ఫోటోగ్రఫీ బాగుంది. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగులకి పవన్ మాడ్యులేషన్ తోడై బాగానే పేలాయి. అయితే చాలా చోట్ల పవన్ కల్యాణ్ డబ్బింగ్ అసలు చెయ్యలేదా అన్నంత అస్పష్టంగా వున్నాయి.

ఏది ఏమైనా “కొమరం పులి” చూసి నిరాశ పడ్డ అభిమానులకి, భయపడ్డ ప్రేక్షకులకి “తీన్ మార్” విజయం ఒక ఓదార్పు కావచ్చు.

27 Comments
 1. Ram April 14, 2011 /
 2. రాజశేఖర్ April 15, 2011 /
 3. krishnapriya April 16, 2011 /
  • రాజ April 18, 2011 /
 4. Ram April 16, 2011 /
  • krishnapriya April 17, 2011 /
 5. raghu April 16, 2011 /
 6. రాజశేఖర్ April 16, 2011 /
  • krishnapriya April 17, 2011 /
 7. కమల్ April 17, 2011 /
  • శంకర్ April 17, 2011 /
   • కమల్ April 17, 2011 /
   • శంకర్ April 18, 2011 /
 8. msr April 18, 2011 /
 9. రాజశేఖర్ April 18, 2011 /
 10. రాజశేఖర్ April 18, 2011 /
 11. Priyavardhanababu Patnam April 19, 2011 /
 12. Sambi Reddy April 24, 2011 /
 13. దర్శకులం April 24, 2011 /
 14. రవి April 25, 2011 /
 15. vinay April 29, 2011 /
 16. dvrao April 30, 2011 /
 17. శ్రీనివాస్ కొమనపల్లి May 1, 2011 /
 18. శ్రీనివాస్ కొమనాపల్లి May 1, 2011 /
 19. kavitha May 1, 2011 /
 20. kavitha May 1, 2011 /