Menu

పట్టువదలని విక్రమార్కుడు

విక్రమార్కుడు నీరసంగా తలపట్టుకుని శక్తి సినిమా మొదటి షో నుండి బయటకువచ్చాడు. తన ఇంటి వరకు నడవాల్సిన దూరం తలచుకుని బాధపడ్డాడు. టికెట్ బ్లాకులో కొనటం వల్ల బస్ టికెట్ కి కూడా డబ్బుల్లేవ్. ఇంతలో తను మొయ్యాల్సిన భారం గుర్తుకు వచ్చింది. అటు ఇటు చూశాడు. ఎక్కడా కనబడలేదు. ఈసురోమంటూ బయటకు వచ్చాడు. అప్పుడతనికి శవం కనబడింది సినిమా హాల్ గుమ్మానికి వేలాడుతూ. శక్తిసినిమా శవం..అన్నిరకాల రిపోర్ట్ లతో తూట్లుపడిన శవం.. వాసనకి జనం భయపడి మ్యాటనీ కి  కాస్త పలచబడ్డారనిపించింది. తప్పదు కదా అని శవాన్ని దింపి భుజం మీద వేసుకుని ఇంటికి నడవసాగాడు.

పకపకా నవ్వాడు భేతాళుడు.. ఎన్నిసార్లు ఈ సినిమాలు చూసి మోసపోతావ్ రాజా.. ఇంటి కెళ్ళటానికి బస్సు కూడా ఎక్కలేవ్. సర్లే నీకు కష్టం తెలియకుండా ఈ సినిమా గురించి చర్చించుకుందాము. మోడరన్ రాజావి, భేతాళుడిని కనుక ఈ చర్చ ఇంటర్ యాక్టివ్..నేనడిగే ప్రతి ప్రశ్నకి నువ్వుజవాబు ఇయ్యాల్సిందే..తెలియకపోతే నేను చెప్తాను.. కాని తెలిసి నువ్వు చెప్పకపోతే.. హుష్ కాకీ.. నేను మాయం.. నువ్వు మరో సినిమాకి.. సరేనా అన్నాడు. చేసేది లేక సరేఅని తలూపాడు విక్రమ్.

శక్తి డైరెక్టర్ మెహర్ రమేష్ మీద నీ అబిప్రాయం చెప్పు.. ఏముంది బ్రహ్మండమైన బిల్డప్ ఇస్తాడు. మూడు సినిమాల్లో ఫెయిలయాడు. బహుశా ఓ వంద కోట్లకి టోపీలు పెట్టాడు జనాలకి. కానీ అతని స్టైలే వేరులే..కాని శక్తిలో అదీ కరువైనట్లుంది అన్నాడు విక్రమ్. లెస్స పలికితివి పద ముందుకు అన్నాడు భేతాళుడు.

సరే అశ్వనీ దత్ గురించి చెప్పగలవా అన్నాడు భేతాళుడు. ఓస్ ఏముంది.. చాలా భారీ చిత్రాల నిర్మాత. చాలా హిట్ సినిమాలు తీశాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి, చిరుత తీసిందీయనే. కూతుళ్ళతో కలసి టివి ప్రోగ్రామ్ లు తీస్తున్నాడు.

మరి తారక్ సంగతో..తాత పోలికలు బానే ఉన్న యువ హీరో. మూస సినిమాలలో కూరుకుపోయాడు. మంచి హిట్ సినిమాలో నటించి చాలా రోజులయ్యింది. మగధీర లాటి సినిమా చెయ్యాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. సర్లేకానీ శక్తి గురించి నీ స్టోరీ ఏమిటో చెప్పు భేతాళా ఈ షాక్ తట్టుకోలేకున్నాను.

ఏముంది రాజా నార్మల్ స్టోరీనే. తారక్ మగధీర లాటి సినిమా కోసం చూస్తున్నాడని విన్న మెహర్ మగధీర, అనగనగాఓ ధీరుడు, చేజింగ్ లిబర్టీ లతో ఓ కిచిడి తాయారు చేసి తారక్ కి వినిపించాడు. అది విన్న తారక్ ఎగిరి గంతేసి మగ ధీర లాగా రిచ్ గా తియ్యగల సత్తా ఉన్న అశ్వనీదత్ ని కలుపుకున్నాడు. కానీ మెహర్ మీద అనుమానంతో సత్యానంద్, యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్ లను కధ కి తళుకులు అద్దమన్నాడు. టూ మెనీ కుక్స్.. సామెతగా కధ కాస్తా మాడిపోయింది. అసలు 19వ శక్తి పీఠం అనే ఊహే జీర్ణించుకోలేక పోయారు జనం. ఇక ఇలియానా అనగానే దత్ గారు మెహర్ కి మరో కండిషన్ పెట్టాడు.. జగదేక వీరుడు అతిలోక సుందరి లో శ్రీదేవి కన్నా ఇలియానా అందంగా కనబడాలని. ఇంకేముంది మెహర్ మరీ రెచ్చిపోయి ఇలీయానా బొడ్డు,జఘన సౌందర్యాలపైనే గురి పెట్టి చివరికి వెగటు పుట్టించాడు. పవర్ ఫుల్ డైలాగు లు లేవు. ఎమోషన్లు కరువయ్యాయి. ఇక వైజయంతి వారి సినిమా కాబట్టి  ప్రభు, బాలసుబ్రమణ్యం, షాయాజీ షిండే, సోనూ సూద్, ఆలీ, క్రిష్ణభగవాన్, వేణుమాధవ్, జాకీష్రాఫ్, ఇక పూజాబేడీ, మంజరి.. ఎందుకు రాజా ఇంత భారీ తారాగణం. అవసరం అంటావా.

అబ్బే అవసరంలేదు భేతాళా..ఏదో దత్ గారి సొమ్మేగదా.. ఎలాగూ ఆయన ప్రజల మీద రుద్దుతాడు కదా అని ఇరికించినట్టున్నారు.

 మరోమాట నీకేమయినా కామెడీ సీన్స్ నచ్చాయా రాజా. అస్సలు నవ్వురాలేదు భేతాళా.. మర్చిపోయాను ఈజిప్ట్ వాసులు తెలుగులో మాట్లాడుతూంటే మటుకు నవ్వుఆగలేదు. 1984 లో పాపం ఈజిప్ట్ వాసులు గుర్రాల మీద తిరగటం, అప్పటికే అణు సంపన్నమైన మనదేశాన్ని జయించాలనుకోం బాగా నవ్వు తెప్పించాయి.

ఇక తారక్ సంగతి.. అవేహావభావాలు..ఓ ఐదారు డాన్స్ స్టెప్పులు.. నాకు నచ్చలేదు రాజా.. మరీ ఫ్లాష్ బాక్ లో ఆజుట్టేమిటి.. ఆపిచ్చిడ్రస్సులేమిటి..అవును భేతాళా అవి ఎవ్వరు డిజైన్ చేశారో తెలుసా.

య్యోరాజా అవి బాబాయ్ బాలయ్య దగ్గరుండి తయారు చేయించాడట. కాలాలు మారాయని బాబాయ్ మర్చిపోయినట్లున్నాడు. ఇంకా నీకు ఏమి నచ్చాయి రాజా.

 తాళా నాకు కాస్త పాటలు ఫర్వాలేదనిపించింది. మణిశర్మ కాస్తయినా బతికించాడు. సినిమాటోగ్రఫీ, కొరియొగ్రఫి పర్వాలేదనిపించాయి. ఆర్ట్ వర్క్ బాగా నచ్చింది. ఏతావాతా స్టోరీ, డైరక్షన్ తప్ప మిగతావన్నీ ఓ మోస్తరుగా బెటరేలే..

మరి లాస్ట్ బట్ వన్ ప్రశ్న రాజా. అశ్వనీ దత్ ఎన్నో సినిమాలు తీశాడు. అయినా ఎందుకు ఫ్లాప్ డైరక్టర్ మెహర్ తో  యాభైకోట్ల కి రిస్క్ తీసుకున్నాడు. అంత తెలివితక్కువ పని ఎందుకుచేశాడు.

లేదు భేతాళా అశ్వనీ దత్ కాలుక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నాడు. వచ్చిందా సూపర్ హిట్ లేదా మరో అజాద్(నాగార్జున, సౌందర్య) అనుకుని ఉంటాడు. ఎలాగూ జిల్లాల వారి, ఊర్లవారి, ధియేటర్ వారి, సందుల వారి, గొందుల వారి కొనుక్కోటానికి బయ్యర్లు ఉన్నారు. ప్లాప్ అయితే తర్వాత సినిమా ఈజీగా వీళ్లకే బంపర్ ఆఫర్ గా అమ్మేయచ్చు. అయినా ప్రేక్షకులు అనే వెర్రిజనాలుండనే ఉన్నారు ఎగబడి సినిమా చూడటానికి. మొదటి వారంలోనే రికార్డులు తిరగరాయటానికి,

అంటే ప్రేక్షకులు వెర్రిజనాలంటావు. వారిలో నువ్వుకూడా ఉన్నావుకదా. రాజా తడబడిపోయాడు. వెర్రివాడని ఒప్పుకోటానికి అహం అడ్డొచ్చింది. కాదు భేతాళా..అశ్వనీ దత్ సినిమాకదా అని..

పకపకా నవ్వాడు భేతాళుడు.. ఓడిపోయావ్ రాజా నీకు తెలిసిన నిజం ఒప్పుకోలేకపోయావు. ప్రేక్షకులు మారితేగానీ మంచి సినిమాలు రావు. మీరు సింహ, పోకిరీ, దేవదాసు(రామ్), దబాంగ్ లాటి సినిమాలను సూపర్ హిట్ చేస్తున్నారు. మంచి సినిమాలని చూడటానికి ముందుకు రావటం లేదు. మీరు వెర్రివాళ్ళుకాక మరేమిటి. నేను నాదారిన పోతున్నాను. కావాలంటే తీన్ మార్ ధియేటర్ కి మొదటి ఆటకు రా. నీ కోసం ఎదురుచూస్తాను.. బైబై..