Menu

సహన “శక్తి”కి పరీక్ష

తెలుగు సినిమా చరిత్ర లోనే అత్యంత భారీ చిత్రంగా, అత్యధిక బడ్జెట్ తో తయారైన సినిమా ప్రచారం సాగిన “శక్తి” సినిమా కోసం జూనియర్ ఎన్టీయార్ అభిమానులే కాకుండా, చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అయితే ఈ రోజు (ఏప్రిల్ ఒకటిన) విడుదలైన సినిమా, ఆ ప్రచారమంతా ఊకదంపుడే అని తేల్చేసింది. తద్వారా ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్ని ఏప్రిల్ ఫూల్స్ చేసింది.

సినిమా నిర్మాణంలో వున్నప్పుడే దాదాపు ఎనిమిది మంది రచయితల చేతులు మారిన ఈ కథ, చివరికి వూహించినట్టుగానే అతుకుల బొంతలా తయారయ్యి, ప్రేక్షకుల సహన “శక్తి” కి పరీక్షగా తయారయ్యింది. ఈ సినిమా తీసేందుకు సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఎందుకు సాహసించారో, ఎటు పోతోందో తెలియని కథతో సినిమా తీయాలని దర్శకుడు మెహర్ రమేష్ ఎందుకు ప్రయత్నించాడో, అదీ అలాంటి సినిమాకు ఏభై కోట్లు ఎందుకు కుమ్మరించారో (అసలు ఎక్కడ కుమ్మరించారో) అర్థంకాని విషయంగా మిగిలింది.

సినిమా చూసిచ్చిన పాపానికి కథ చెప్పాలి కాబట్టి ఇదిగో ఇదీ కథ – దేశంలో వున్న అష్టాదశ శక్తి పీఠాలు కాకుండా వాటన్నింటికి అధిష్టాన పీఠం ఒకటి ఒక రాచకుటుంబానికి మినహా ఎవరికీ తెలియని రహస్య స్థావరంలో వుంటుంది. దాన్ని కొల్లకొడితే పద్దెనిమిది పీఠాల శక్తి పోయి, దేశం నాశనం అవుతుంది కాబట్టి అదే పనిలో వున్న ఒక ఈజిప్షియన్ తెగ ప్రయత్నిస్తుంటుంది. ఈ పీఠం రహస్యం తెలిసిన కుటుంబం ఒక రాచ కుటుంబం అయితే (యస్.పీ.బాలు, ఆయన కొడుకుగా ప్రభు, ఆయన కూతురుగా ఇలియానా), దాన్ని కాపాడే బాధ్యత ఒక రక్షక వంశానిది (ఎన్టీయార్, మళ్ళీ ఎన్టీయార్). ఈజిప్షియన్ దుష్టశక్తులు (సోనూసూద్, పూజాబేడి వగైరా), ఇక్కడ దైవశక్తి అంశతో పోరాడే హీరో, వెన్నుపోట్లకి, సహాయ సహకారాలకి వినోద్ కుమార్, జాకి షరాఫ్, ఇక కామెడీకి ఆలీ, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణుమాధవ్ వగైరాలు.

కథ అంతా చదివి ఇదేదో బాగుందే అనుకుంటే పప్పులో కాలేసినట్లే… ఎందుకంటే నేను చెప్పిందంతా ద్వితీయార్థం మాత్రమే. మరి మొదటి సగం అంటారా – హోమ్ మినిస్టర్ కూతురు (ఇలియానా) ఇంట్లో నించి పారిపోయి (ఫ్రీడం వెతుక్కుంటూ..), ఆలీ తదితర మిత్రబృందంతో తిరుగుతుంటుంది. కళ్ళు మూసుకోని మ్యాప్ పైన ఎక్కడ వేలు పెడితే అక్కడికి వెళ్ళడం ఆమె హాబీ/స్టైల్. అందులో భాగంగా మొదట జైపూర్ వెళితే అక్కడ హీరో శక్తి (జూ.ఎన్టీయార్) తారసపడతాడు. ఇక అక్కడినుంచి ఆమె ఎక్కడ వేలు పెట్టి (మ్యాప్ పైన) వెళ్ళాలంటే అక్కడికి వెళ్తూ వుంటాడు.. వెళ్తూ వుంటాడు.. వెళ్తూ వుంటాడు.. వెళ్తూ… అదండీ మొదటి సగం.

మొదటి సగం చాలా చోట్ల నవ్వించాలని బలంగా ప్రయత్నించినా, అది సాధ్యం కాలేదు. ధర్మవరపు, ఆలీ, కృష్ణభగవాన్, వేణుమాధవ్ అంతా వృధా ప్రయాసలు చేశారు. మొదటి సగం ఇలా బోరెత్తించినా, కనీసం కథలో దిగినప్పుడు వుండాల్సిన నిబద్ధత మచ్చుకైనా కనిపించదు. ఫ్లాష్ బ్యాక్ సీన్ లో, హీరోని ఆకాశానికి ఎత్తేసి ప్రేక్షకుల్ని ఉద్రేక పరచాల్సింది పోయి, చప్పగా సాగే కథనంతో, బాలు అనవసరమైన నరేషన్ తో విసిగించారు. ఆఖరుకు ఈ ప్లాష్ బ్యాక్ మొత్తం అయ్యాక, హీరో “ఇప్పుడు నేనేం చెయ్యాలి?” అని అడగటంతో ప్రేక్షకులు హీరో పైన సానుభూతి చూపిస్తారు. సరే ఇక క్లైమాక్స్ అయినా వుత్కంఠ భరితంగా వుండబోతోంది అను వూహిస్తే సరిగ్గా అప్పుడే అనవసరమైన బ్రహ్మానందం కామెడీ సీను, తర్వాత వెంటనే పాట రావడంతో సహనపరీక్ష పరాకాష్టకు చేరుతుంది.

అసలు ఇదంతా ఒక ఎత్తైతే, 1985-90లలో ఈజిప్షియన్లు మమ్మీ సినిమాల్లో లాగే బట్టలు వేసుకోవడం, తుపాకులు, విమానాలు వచ్చేసినా కత్తులు, గుర్రాలు వాడటం, ఆ విలన్లలో అత్యంత బలశాలి (ఒక సుమో వేగంగా వచ్చి అతన్ని గుద్దితే తునాతునకలౌతుంది) అంత బలశాలి హీరోగారి ఒక్క గుద్దుకే నేలకూలటం లాంటి అర్థం పర్థం లేని సన్నివేశాలు బాగా ఇరిటేట్ చేస్తాయి. అర్థం లేని బిల్డప్పులు, మనకి కథ ఎక్కడ అర్థం కాదు అనో, లేకపోతే ఇక్కడ చెప్పకపోతే దొరికిపోతామనో అనవసరమైన డైలాగులతో కథ చెప్పడం, ఘోరంగా విఫలమైన కంటిన్యూటిలను చూస్తే ఈ సినిమాకి ముందు జరగాల్సిన (ప్రీ ప్రొడక్షన్) పనులు అసలు జరగలేదేమో అనిపిస్తుంది. చివరికి అష్టాదశ పీఠాలకు వెళ్ళి తీసామని చెప్పుకున్న సీన్లు కూడా స్టాక్ షాట్లని (హ్యాండీ కామ్) చూస్తే అర్థం అవుతుంది.దాని బట్టి తెలుస్తుంది ఈ సినిమా తీయటంలో ఎంత సిన్సియారిటీ వుందో..!!

ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే, కథ అతుకులబొంత – ఎక్కడ ఏ సీను రావాలో అది రాకుండా అనవసరమైన చోట వచ్చి విసిగిస్తుంది. పాటలలో ఒకటి మాత్రం రచన బాగుందనిపించినా, ఆకట్టుకోని నృత్యాలు, అనవసర సందర్భాలతో తేలిపోతాయి. “ఈ సినిమా ఎందుకు చూస్తున్నాను భగవంతుడా” అని ప్రేక్షకుడు అనుకుంటే, “ఈ సినిమా ఎందుకు చేస్తున్నానురా భగవంతుడా” అన్నట్టు వుంది జూ.ఎన్టీయార్ నటన, నర్తన. ఇలియానా హీరోయిన్ వుండాలి కాబట్టి వుంది. మిగిలిన వారంతా పేరుకి భారితారాగణమే కానీ, ఏ రకంగానూ సినిమాని నిలబట్టలేకపోయారు. కామెడీ నటులది అందరికన్నా ట్రాజెడీ పరిస్థితి.

వెరిసి ఈ సినిమా పేక్షకుడికి సహన పరీక్ష… “అష్టాదశ” రీళ్ళ వృధాప్రయాస.

24 Comments
 1. raju April 1, 2011 /
 2. venkat April 1, 2011 /
  • k. Shiva April 2, 2011 /
 3. venkat April 1, 2011 /
 4. Sharath Chandra April 1, 2011 /
 5. challa April 1, 2011 /
 6. srikanth April 1, 2011 /
 7. అరిపిరాల April 1, 2011 /
  • suresh April 1, 2011 /
  • శ్రీ April 2, 2011 /
 8. Rajesh April 1, 2011 /
 9. sravanthi April 1, 2011 /
 10. kalyaaN April 2, 2011 /
 11. j.surya prakash April 2, 2011 /
 12. kish April 2, 2011 /
 13. శుభకరుడు April 3, 2011 /
  • అరిపిరాల April 3, 2011 /
   • శుభకరుడు April 3, 2011 /
 14. shiva April 4, 2011 /
 15. SKJ April 4, 2011 /
 16. msk April 4, 2011 /
 17. Balaji sanala April 5, 2011 /
 18. kvk April 5, 2011 /
 19. vasu April 19, 2011 /