Menu

దమ్ము లేని దమ్ మారో దమ్

అభిషేక్ బచ్చన్, బిపాషా బసు, ప్రతీక్ బబ్బర్, రానా ప్రధాన పాత్రధారులుగా రమేశ్ సిప్పీ దర్శకత్వంలో నిర్మాణమైన “దమ్ మారో దమ్” గురువారం విడుదలైంది. మొదటి నుంచి భూలోక స్వర్గమైన గోవాలో చిత్రీకరించిన చిత్రంగా, బిపాషా అందాల ఆరబోత విషయంలో అట్టే మొహమాట పడని క్రేజీ చిత్రంగా ప్రచారం పొందింది. తెలుగులో “లీడర్” చిత్రం ద్వారా ఆరంగేట్రం చేసిన రానాకి ఇది రెండో చిత్రం కావటం, అదీ హిందీ చిత్రం కావడంతో ఈ సినిమాకి తెలుగునాట కూడా కొంత క్రేజ్ ఏర్పడింది. అయితే విడుదల తరువాత ఏ మాత్రం దమ్ము లేని చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశ పరిచిందనే చెప్పాలి.

అందమైన బీచ్ లకి, అందాల విదేశీ భామలకి ఆలవాలమైన గోవా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అదే గోవాలో అంతర్లీనంగా సాగే డ్రగ్ మాఫీయా ఈ సినిమాకి మూలవస్తువు. అమెరికాలో చదువుకోవాలని ప్రయతించే లారీ (ప్రతీక్ బబ్బర్) డ్రగ్ మాఫీయా వలలో చిక్కి తనతో అమెరికాకి డ్రగ్స్ చేరేవేసేందుకు సిద్ధపడతాడు. డ్రగ్ మాఫియానిని వేటాడే ఏ.సీ.పీ కామత్ (అభిషేక్ బచ్చన్)కి అతను దొరకడంతో కథ మలుపు తిరుగుతుంది. అప్పటిదాకా మౌనంగా వుండే డీ.జే. జోకీ ఫర్నాండెజ్ (రానా) లారీని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఈ రాకెట్ నడుపుతున్న లార్సా బిస్కెటా/బిస్కెట్ (ఆదిత్య పాంచోలి) అప్పటికే రానా ప్రియురాలు జో (బిపాషా)ని డ్రగ్స్ కేరియర్ గా వాడి, ఆమెను లొంగదీసుకోని జోకీకి దూరం చేస్తాడు. మరొకరు అలా బలికాకూడదన్న జోకి ప్రయత్నం, అటు మాఫీయాలోనూ ఇటు పోలీస్ శాఖలోనూ శత్రువుల వున్న కామత్ ఆశయం ఎలా ఫలించాయన్నది మిగతా సినిమా.

సినిమా మొదటి సగం ఒక కొత్త స్టైల్లో, మల్టిపుల్ నరేటివ్ విధానంలో నడపటం వల్ల అంత గొప్ప కథ కాకపోయినా ఫర్వాలేదు అనిపిస్తుంది. అయితే మూడు ముఖ్యపాత్రలూ (అభిషేక్, ప్రతీక్, రానా) ఎయిర్ పోర్ట్ లో కలవడంతో ఆ స్టైల్ ఆగిపోతుంది. రెండో సగానికి వచ్చేసరికల్లా అదే సినిమా చూస్తున్నామా లేక పొరపాటున వేరే సినిమా చూస్తున్నామా అని అనుమానం వచ్చేంతలా పూర్తిగా మారిపోయింది. మొదటి సగం అభిషేక్ హీరో లా అనిపించినా, ద్వితీయార్థంలో రానా హీరోగా మరటంతో కథ ఎటుపోతోందో తెలియని అయోమయం మొదలౌతుంది. ఏ మాత్రం లాజిక్/ఆలోచన లేని సీన్లు, హీరో అవసరానికి తగ్గట్టు సమయానికి అమరే క్లూ లతో థ్రిల్లర్ సినిమా కావాల్సింది డ్రామా సినిమాగా ముగుస్తుంది. సినిమాకు ముఖ్యపాత్రలు (తారలుకూడా) అయిన అభిషేక్, బిపాషా చనిపోవడం, ఆ చావు అనవసరమైంది కావటం వల్ల అది ప్రేక్షకులకి నచ్చే అవకాశాలు తక్కువ. విద్యాబాలన్ అతిధి పాత్ర, దీపికా పడుకోనే అతిధి పాట వల్ల సినిమాకి పెద్ద వుపయోగం ఏమీ వున్నట్టు కపడదు.

మొదట్లో కేరక్టరైజేషన్, డైలాగులు బాగున్నా రాను రాను అవన్నీ దర్శకుడు మర్చిపోయాడా అనిపిస్తుంది. పాటలలో అభిషేక్ బచ్చన్ పాట, దీపికా పడుకోనే (గెస్ట్) పాట మినహా వేరే ఏవీ గుర్తుండవు. కెమెరా పనితనం గోవా అందాలని బాగా చూపిస్తుంది.

ఈ సినిమా థియేటర్ కి వెళ్ళి చూడటం కన్నా టీవీలో వచ్చేదాకో, డీవీడీ వచ్చేదాకో ఎదురుచూడటం మేలు.

17 Comments
 1. Siva Cheruvu April 23, 2011 /
 2. sasank April 24, 2011 /
  • venkata Krishna, suddapalli April 26, 2011 /
 3. phaneendra April 25, 2011 /
 4. venkata Krishna, suddapalli April 26, 2011 /
   • venkata Krishna, suddapalli April 27, 2011 /
  • అరిపిరాల April 27, 2011 /
 5. mr.v April 27, 2011 /
  • sahithi, nellore April 28, 2011 /
   • Santha Laxmi, Ongole April 28, 2011 /
 6. santoshkrishna April 28, 2011 /
 7. santoshkrishna April 28, 2011 /
 8. mr.v April 28, 2011 /
  • Santha Laxmi, Ongole April 28, 2011 /
 9. HemaLatha, Gudur April 28, 2011 /
 10. d c s reddy May 12, 2011 /