Menu

సినిమా జ్వరం 2 – చలం

మొదటి భాగం

క్షుద్ర నీతుల నుంచి ఉన్నతమైన నీతికి  కళ్ళు తెరవమనే చలం పుస్తకాలు చదవకుండా యువకులని అడ్డు పెడుతూనే ఉన్నారు.  గాని ..పోస్టులో పుస్తకాలు  పోస్టు నుంచి కాజేస్తున్నారు గాని.. నీతి అంటే ఇంతేనా అనిపించేట్టు  నీతిని  అతి చవక చేసే చిత్రాన్ని చూడకుండా ఆపగలుగుతున్నారా  ? చలం,  మీ నీతిని అవినీతి అంటే.. ఈ  చిత్రాలు  మీ అవినీతిని నీతి అంటున్నాయి. మీ అంతరాత్మలకి చక్కని Vaseline  పూస్తున్నాయి. కొన్ని ఏళ్ళు గడిస్తే గాని తెలియదు… చిత్రాలు తమని ఎక్కడికి తీసుకొచ్చి వదిలాయో, ప్రజలు కనుక్కోలేరు .

ఏ కళ కూడా కళాకారుడి  ఆత్మ influence  నుంచి తప్పుకోలేదు. మన సినిమా కళని కల్పిస్తున్న వాళ్ళ  అత్మాభివృద్ది,  నైతికౌన్నత్యం, కళా పరిణామం,  చిత్రాలలో .. కథల్లో.. మాటల్లో.. చూపులలో… చేష్టలలో .. సెట్టింగులలో వ్యక్తం కాకుండా ఎలా ఉంటుంది ?conscious  లెవల్లో గోచరించక పోయినా అంతకన్నా ముఖ్యమైన ,,బలీయమైన మన subconscious  తాగుతోంది  ఆ మురుగుని.

షేర్లు పోగుచేయ్యటం మొదలు.. ఆత్మవంచనా,  పరవంచనా,  competition ,  ఒకరిని ఒకరు   కిందకు తోక్కాలనే  ప్రయత్నం,   కీర్తి మీద, ధనం మీద అమితమైన కాంక్షా…    ధనం పోగు కావటమే ఆశయం.  ప్రజల్ని ఏ దేవుళ్ళ వల్ల,  ఏ దేశ భక్తి ద్వారా, (ఇంక ఎన్నో విధాల)    ద్వారా   కొల్ల గోడదామా  అనే యోచనే.  ఆ ధనమే వొస్తుందని రూడీ  అయితే  ఎటువంటి దాన్ని వెక్కిరించటానికి, ఆశయం చేయటానికి,  చవక చేయాటానికి సంకోచం లేకపోవటం.

యాచన .పొగడ్తలు. నాయికా,నాయకత్వాలు సంపాదించటానికి…

ఎలాంటి  విలువలనీ ద్వంసం చెయ్యటానికి  జంకకపోవటము.  పరస్పర ఈర్షలు..కుట్రలు.. ఇదీ  సినిమా వాతావరణం. అక్కడ ఆరునెలలు నాని తయారైన celluloid కి  ఆ గుణం పూర్తిగా ఇంకి ఉండదూ  ?

అక్కడి మనుష్యులు మనకన్నా  దుర్మార్గులనటం లేదు.. మన అందరిలోనూ ఎక్కువ తక్కువలు ఉన్న క్షుద్రత్వాన్ని  బయటికి లాగి వృద్ది చేసే గుణం సినిమా వాతావరణం లో విజ్రుభించి ఉంది  అంటున్నాను.  ఎంత రంగుల కింద, బట్టల కింద, మంచి మాటల కింద  సినిమా పత్రికలో ఆదర్శ వ్యాసాల కింద దాచినా  ప్రకటన కాక మానదు. సినిమా జ్వరం లేని మనుషుల కన్నా ఎంత ఉన్నతమైన ప్రేమ చూపటానికి ప్రయత్నిస్తేనేం  ఆది ఆదర్శమే కావొచ్చు. తీరా పాత్రలని  కల్పించి,  మాట్లాడించేటప్పటికి  రాసేవాడి మనసు లెవెల్ నే అందుకుంటారు పాత్రలు. పైగా ఆ కథ సినిమా అధికార్లకి నచ్చాలి. అణాకాని వాళ్ళకీ అర్థం కావలి. ఆ కథ మీద డైరక్టర్లు .. అతని మిత్రులు..కొంత అత్మకళని వోలకపోస్తారు. దాన్ని అభినయం పట్టి మాటలు హృదయం లో నానేసి  తెప్పిస్తారు .. నటకులు. ప్రేమని  గురించి పాతివ్రత్యాన్ని  గురించి  వీళ్ళకి ఉన్న అనుభవము..ఆదర్శము   అన్ని చక్కగా వ్యక్తం అవుతాయి ప్రజలకి.  ఆది పురాణ కథల రూపంగా మధ్య మధ్య విష్ణు మహేశ్వరుల రూపాలని ప్ర్యత్యక్షం చేస్తే… దేవముని నారదుని చేత వ్యాక్యానం  చేయించటం వల్ల,   స్త్రీల శీలము.. పాతివ్రత్యము.అంటే ఏమిటో ఇదివరకు ఎన్నడూ  అర్థం కానట్టు అర్థం అవుతున్నాయి. దేశ భక్తి ఏ కోశాన లేని వాడు ఎన్ని పద్యాలు పాడినా దేశ భక్తి పుట్టించ గలడా  చుసేవాళ్ళలో ? చివరికి ఉత్త వార్తలు రాయనీ,   సంస్కారం  ఉన్నవాళ్ళు రాసిన దానికీ, అర్ధణా కూలి యాచకులు రాసే మాటలకీ ఎంతో బేధం కనపడుతుంది.

ఫోటోలు, శబ్దం, నటన, అందం, direction, కథ, మాటలు, పాటలు అన్ని బాగున్న  చిత్రాన్ని చూసి హలులోంచి బయటికి రాగానే ఏదో మనసంత అసహ్యంఅయినట్టు  తోస్తోంది. సాధారణంగా  లేని వికారాలు తోస్తాయి.బతుకు  విలువ మీదే  సందేహం కలుగుతుంది. ఇది సోదరుల శ్వాస వాయువులు పీల్చటం  వల్లనే కాదు. ప్రధానం ఆ చిత్ర నిర్మాతల ఆత్మ వాయువులు చిత్రంలో  నుంచి పీల్చటం వల్ల కలుగుతుంది. copy right చిక్కకుండా భద్రంగా పాటలనీ.. కవిత్వాన్ని దొంగిలించటం లో,  తారల కాళ్ళు  పట్టటం లో తర్ఫీదయిన ఈ మహా పురుషులు సృజిస్తున్నారు,  ప్రజ ఆప్యాయంగా తాగే ధర్మ బోధని.

రాత.. చిత్రము… గానమూ..మొదలైన కళలు అట్టే ఖర్చు  లేనివి కనక-  మొండికెత్తి  బీదతనం లో కళని సేవిస్తూ మనుషులు  బ్రతకడమూ…ఆదర్శాలు చూపడమూ .. కొంత  ఔన్నత్యం  సాధించి ప్రజలని ముందుకు నడపడమూ సాధ్యం  అయేవి.

కాని సినిమా లక్షలతో పని. experiment లు  ఏమాత్రం వీలులేదు. ప్రజల మంచికాదు…ప్రజల కళాభిరుచి కాదు… ప్రజల జేబుల మీదే  దృష్టి .

లక్షలు ఖర్చు  పెట్టె ఈ కంపినీల  దృష్టి అంతా  రూపాయి మీద.  నీ రూపాయి  నాకు కావలి.. నీ రూపాయి  కోసం చూడు ఎన్ని తమాషాలు చేస్తానో.. కెమెరాని చంకల కింది నుంచి తీస్తాను.. మంచి ఆపరేషన్  గది చూపుతాను.. పెద్ద పొట్టగల వాళ్ళని  గంతులేయిస్తాను. కొండ మీద నుంచి దూకిస్తాను,  రైళ్ళని డీ  కొట్టిస్తాను,   అడవిలో మోటారుని  ఇరికించి నాయికా నాయకులని చీకట్లో వొదిలి వాళ్ళ మీద పెద్ద వెలుతురు  వేస్తాను.సైకిల్  మీద పాటలు.పాడిస్తాను,  కుచ్చిల్లు ఎగరవేయిస్తాను.. ఇంకా ఏం కావలో చెప్పు అవన్నీ ఈ సారి చేయిస్తాగా..రూపాయి  ఎత్తి నాకు చూపితే చాలు.. ముద్దులు కావాలా,  కురిపిస్తాను..పెళ్లి చెయ్యమంటారా  మంత్రాలతో సహా చేస్తాను.. బామ్హలకీ,  హరిజనులకే పెళ్లి చెయ్యమంటారా చేయిస్తాను. హిందూ మహామ్మదీయులకి పెళ్లి చెయ్య వద్దంటారా ? మానేసి వాళ్ళ కర్మానికి వోదులుతాను. ఏదైనా కులాన్ని హేళన చేస్తే నీ కడుపు నిండుతుందా ?  సరే కానీ… వేదం వినాలని ఉందా.. తయారు. అంటున్నట్టు ఉంటుంది చిత్రం చూస్తున్నంత సేపు..  చిత్రం చూస్తున్నాం అన్న ధ్యాస మాత్రం మానిపించలేరు. (ఒక్క బారవా తప్ప  ఇంకెవరూ –  అంటుంది సౌరిస్ )

మొగ్గలు వేస్తూ… రైలు కింద చస్తూ.. ఘోర యుద్ధం చేస్తూ.. పాటలు పాడటం, అరణ్యాలలో మహా సముద్రాల మధ్య ఆర్కెస్ట్రా పలికిస్తాం…  దేవతలని అద్భుతంగా ఎగిరిస్తాం… ముక్కోటి దేవతలని ముక్కుకి  తాడేసి లాగి మీ ముందు నుంచో  బెడతాం.. చచ్చిన వాళ్ళని బ్రతికిస్తాం … మనుషులని మృగాలుగా మారుస్తాం… పిట్టల చేత మాట్లాడిస్తాం….అన్ని చేస్తాం, మాకు అసాధ్యమైంది లేదు. మేము కొత్త సృష్టి  చేస్తున్నాం, అంటున్నారు డైరెక్టర్లు.

(ఎంతటి మహా నటి అవనీ… నటన తరవాత, ముందు బట్టలూడ దియ్యి  ..బట్టలూడ తీయించే దాకా వోదలలేదు మన డైరెక్టర్లు. ఎంత అందం ఉంటే అంత చిన్న బట్టలు.అ ఉన్న  చిన్న గుడ్డ కూడా ఎప్పుడు లాగి  అవతల పారేద్దమనే  ఆశ.. దానికోసం అన్ని.. అలాంటి  ఒళ్ళు చూపించే సన్నివేశాలు రాసారు. వాన పాటల్లో.. జుట్టు లేని హీరో కి ముద్దులు పెట్టించారు.అతనితో  హీరోయిన్ ల పిర్రల మీద దరువులు వేయించారు. ఇక మిగిలిందొక్కటి తప్ప  ఆ  అర్థం వోచ్చేట్టుగా పాటలు రాసారు  గెంతులు వేశారు. జనాలు  ఈ హీరోయిన్ ని కలల్లో ..కళ్ళలో కాపురం చేయించుకొని  సంసారాలు చేసారు.. జనాభా పెంచేశారు. ఇదంతా తెలిసిన నవీన కథా నాయికలు.. ముందుగానే తామెంత వరకూ ఊడ తీయగలరో ఫోటోలు తీయించుకొని  వస్తున్నారు డైరెక్టర్లల దగ్గరికి – చక్రి- మధ్యలో నేనెందుకు అంటారా? 🙂

ఈ సినిమా ఝాడ్యం  పసి పిల్లల దగ్గరినుంచి,  ముసలివాళ్ళ దాకా  గట్టిగా పట్టుకుంది. ఇకముందు అమితంగా వ్యాపించ బోతోంది  ప్రతి మొహానికి సినిమా కళ పడుతోంది. పూర్వం యోగుల దగ్గర కటాక్షం కోసం ఏళ్ల కొలదీ శుశ్రుశలు చెసినట్టు .. యువకులు, యువతులు  డైరెక్టర్ల సేవ చేస్తున్నారు  ఛాన్స్ కోసం. ఎట్లాగో ఒకసారి  రికమండు చేసి  చేర్పిద్దురూ… నేను పైకి పోతాను అనే ప్రార్థనలు  అమితమైపోయినాయి. సినిమా చూసి రాగానే  బయలు దేరుతుంది గావును పెద్ద అశాంతి పట్టుకుంటుంది. బ్రాంది మల్లేనే,  మళ్లీ మళ్లీ వెళ్ళవలసిందే సినిమాకి. వెళ్లి ..వెళ్లి అనుకరించి ఎప్పటికో స్టూడియో గమ్య స్థానానికి చేరగలమనే ఆశ,

సరే సినిమాలు ఇంత ఘోరంగా ఉన్నయనే అనుకుందాం.సినిమాలో చేరే వారందరూ విపరీతంగా ఈ అధోగతిలో పడుతున్నాయనే అనుకుందాం. ఏం చెయ్యమంటావు ఇప్పుడు ? అని రాసిన వాడిని అడగటం సమంజసం.కాని ఏం చెయ్యాలో నాకు తెలియదు. నాకంటే చాల బుద్దిమంతులకి కూడా తెలీటం లేదు. సినిమాలు పోవాలని నా ఉద్దేశ్యం కాదు. నేను సినిమాలు చూడకపోయినా సినిమాలు లేకపోతే నాకేమి తోచదు ముందు. నేను ఇంకా  కొన్ని కోట్ల మంది వాటిని పోవాలన్నా అవి పోవు –  పోనివ్వరు. పోయిన లాభం లేదు. ఇట్లాంటి ఈవిల్స్  లోంచి మానవ జాతి నడిచి వాటిని గుర్తించి మార్చి ఉత్తమంగా చేసుకోవాలి గాని,  బలవంతంగా తాగుడు మాన్పించి లాభం లేదు. వేశ్యల మీద కత్తి  కట్టి ప్రయోజనం లేదు.

కాని సినిమాల నిజ స్థితి ప్రజలకి విరివిగా తెలియ జేయ్యాలి. స్త్రీలు నాటక రంగం మీద శీలాన్ని వదులు కోరనీ, సంసార స్త్రీలని వేషాలు ధరించమని ప్రభోదాలు చేసినట్టే…. శీలం అంటే అర్థం తెలీని నటులు పోవటానికి,  అసలు శీలం లేని స్త్రీలు  సినిమా కళ అపవిత్రమనీ దొంగ రాతలు రాస్తున్నారు.

శీలం తో ప్రసక్తి ఏమిటి అన్నా ?? శీలం ఏమి మహా గొప్ప అన్నా.. శీలం పోగొట్టుకోవటం చాల ఉదార కార్యం అని రాసినా నాకు అర్థం అవుతుంది,  కానీ శీలం చాల ఘనమైన పదార్ధం, ఆది సినిమాలల్లో బద్రంగా ఉంటుంది అని ప్రజలని మోసపుచ్చటం  చూస్తే ఆది చాల ఘాతుకం అంటాను .అడవిలో పాములు, పులులు ఉన్నాయి, – జాగ్రత్త అనటం న్యాయం.జాగ్రత్త పడి – ఫో … ప్రాణాల మీద తీపి లేకపోతే  వెళ్ళు అనటం అన్యాయం. కాని నీ హృదయం లో దౌర్జన్యం  లేకపోతే పులిని బ్రహ్మ  స్వరూపంగా చూసుకుంటూ వెళ్ళు. నీకేం భయం లేదు అని ప్రతివారిని ఉద్భోదించటం మూర్ఖం . పులులు ఏమి లేవు చాల హాయిగా ఉంటుంది అడవుల్లో అనటం మోసం.

నిజ స్థితి తెలుసుకొని, ప్రతి సంగతి వాస్తవమైన పేరుతో పిలిస్తే సగం చికిత్స జరిగిందన్న మాటే. ప్రపంచం లో సగం మోసం అబద్దపు పేర్ల వల్ల జరుగుతోంది. కనక సినిమాలో చేరనన్నాళ్ళు చేరాలని ఆశ పడటమే గాని చేరిన వాళ్ళందరూ, సినిమాలో ధనం సంపాదించుకున్న దరిద్రులు. వాళ్ళు కూడా సినిమా వాతావరణాన్ని తిట్టే వాళ్ళే.  కాని ఒకసారి ప్రవేశించిన తరవాత వదల లేరు. సినిమా వాతావరణము వాస్తవము, ప్రపంచం మాయగా తోస్తుంది. నీడలకి నిజమైన వస్తు గుణం వొస్తుంది వాళ్ళ కళ్ళకి, తాగుబోతు మనిషికి మల్లె.

ధనము కీర్తి రెండే ముఖ్య సూత్రాలు. getting on … climbing on …. అదే జీవిత పరమావధి. ఆ దేవత ముందు బలికి పనికి రాని ఆదర్శం లేదు. చాల వృత్తులలో ఉంది  ఈ గుణం,  కాని సినిమాలో అమితంగా వ్యాపించింది. దేవతలతో, పతివ్రతలతో .. మునులతో,  హీరోలతో సమీప పరిచయం వాళ్ళ వాళ్ళ నిజ తత్వం తెలుసుకొని అందరూ సినిక్ష్ అయినారు. ధనం పోగు చేసే   శక్తి ఉన్నంత మాత్రాన  పెట్టుబడి దార్లని మాటలతో మోసం చేసే ప్రజ్ఞ ఉండే మనిషి డైరెక్టర్ అయ్యి కళ అంటే ఏమిటో, సంగీతం అంటే ఏమిటో తెలీక,  acting   అంటే ఏమిటో తెలీక .. వీటన్నింటినీ  నిరంకుశ ప్రభువై శాశిస్తున్నాడు. చా  ఇదేమి?  కథా?? ఇక్కడ ..ఇక్కడ.. మార్చు అని కథకుణ్ణి శాశిస్తున్నాడు. కథ అంటే ముక్కు మొహం ఎరుగని ధనవంతుడు.

గొప్పగా ఎవరికీ కనపడక interview లకన్నా  దొరకని ఈ దర్శకులు  ఈ గొప్పతనము లేని adventurers   అని వాళ్ళ స్వభాల్లోని నీచత్వమే caddishness  యే వాళ్ళని పైకేత్తిందనీ, స్వభావం లో  ప్లీడర్ల కన్నా అధములై పోయారనీ , వాళ్ళని యాచించటం కన్నా అధమ దశ ఇంకోటి లేదనీ, ఈ నటీ  నటులు పడే యాతన విరోదులకి కూడా కోర తగనిదనీ, ధనం కోసం పేరు కోసం వాళ్ళు చెల్లించిన విషయాలు అన్నివిలువలనూ  మించినవనీ.. వీళ్ళందరూ  సైతాను ఆత్మల నమ్ముకుని ఘనత సంపాదిస్తున్నరనీ విరివిగా యువకులలో ప్రచారం చేయాలి.

ఆ మనుషులలో లేని గొప్పతనం,  ఈ ఆశ్రయింపుల వల్లా, వాళ్ళ glamor   వల్లా, పిచ్చి ప్రజలు వాళ్ళకి ఆరోపించి ..గౌరవము భక్తి చూపటం వల్ల,  తమ సినిమాలకి కాక తమకే గొప్పతనం వున్నదనీ వాళ్లే నమ్మటం మొదలు పెట్టారు. రామాయణం తీసి వాల్మీకికి కీర్తి తెచ్చామనే స్థితి కి వొచ్చారు. అనేక వాటికి చాల నిదానంగా విలువలు కట్టే ఈ తెలుగువాళ్ళు కూడా,  మనుషులని వెర్రి గా పూజించని ఈ దేశం మనుషులు కూడా సినిమా ధాటికి తాళలేక తబ్బుబ్బులై.. సినిమా స్టార్ల పేరు అతి భక్తి తో వుచ్చరించుకొంటున్నారు. సినిమాని మనుషులనే విడతీసి చూసుకోగల విచక్షణ లేదు ఇంకా.. అందంగా ఉన్న మనిషి పాడింది కనక సంగీతం శ్యావ్యంగా ఉందని ఆత్మ వంచన చేసుకోడం నుంచి ఇంకా తెప్పరిల్ల లేదు ప్రజ. ఈ స్టార్స్ చాల దురాన ఉండటం అంతః మంచి విషయం కాదు. వాళ్లే కనపడి పరిచయమైతే చిత్రాలు చూడటం మానేస్తారు ప్రజలు.

డైరెక్టర్ , నటీ నటకులు ఉన్నతులయితే తప్ప చిత్రాలు  ప్రజలకి ఉపకరించవు.కళా ప్రియుడు గొప్ప dreamer. ప్రజల మీద ప్రేమ కలవాడు,  ఉన్నతమైన ఆత్మ కలవాడు (అలాంటి వాళ్ళు దేశానికి నలుగురుఉంటారా? )ఇలాంటి ఉన్నతులు ఏ ప్రోడుసరో  …దర్శకుడో  అయ్యి సినిమాలు తీస్తే మారుతాయేమో  పరిస్థితులు.. కాని అట్లాంటి వాళ్ళకి ధనం ఉండదు. వాళ్ళని –  ధనవంతు లూ , బీదవాళ్ళు  కూడా నమ్మరు. వాళ్ళు  తీసే చిత్రాలు ప్రజలకు నచ్చవు. – చలం

One Response
  1. Praveen Sarma April 5, 2011 /