దేశంలో హిందీ తరువాత అత్యధిక సంఖ్యలో సినిమాలు వచ్చిన ఘనత తెలుగు సినిమా రంగానికి ఉంది. భక్త ప్రహ్లాదతో మద్రాసులో వేళ్ళూనుకుని ఉన్న తెలుగు సినిమాను మాతృభాషాభిమానం తదితర కారణాలతో హైదరాబాద్ తరలించేందుకు అనేక మంది మఖ్యమంత్రులు కృషి చేశారు. సినిమా వాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి స్టూడియోలు కట్టుకోవడానికి, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లు నిర్మించుకోవడానికి రాయితీలు, రుణాలు ఇంకా ఎన్నో వసతులు కల్పించారు. వేలాది ఎకరాల హైదరాబాద్ భూములను అప్పగించారు. తెలుగు సినీ ప్రముఖులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందుకుని సినిమా వ్యాపారం చేసుకుంటూ, హైదరాబాద్ కు, తెలుగు భాషకు ఎంతో సేవ చేశామని, అసలు మాద్రాసు వదిలి హైదరాబాద్ కు రావడమే పెద్ద త్యాగమన్నట్టు ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమను మళ్ళీ మద్రాసుకు తరలిస్తామని దబాయింపు ప్రకటనలు చేసిన సందర్భాన్ని గమనించాం.
ఈ నేపథ్యంలో ఒక్కసారి ‘సినిమా’ హైదరాబాద్ కు తరలిరావడం వల్ల ఒనగూడిన ఫలితాలను గమనించాల్సిన అవసరం ఉంది. నాణ్యతాపరంగా కానీ, కళాత్మక దృష్ట్యా కానీ జరిగిన సినిమా అభివృద్ధి కన్నా సినిమా పెద్దల ఎదుగుదలే స్పష్టంగా కనిపిస్తుంది. అర్థవంతమైన తెలుగు సినిమా రూపొందడంలో వైఫల్యం చెందిందనే చెప్పుకోవచ్చు. జాతీయ స్ధాయి ఉత్తమ చిత్రంగా ఒక్క సినిమా కూడా నిలువకపోవడమూ, కనీసం ఒక్క తెలుగు నటుడికైనా జాతీయ స్థాయి ఉత్తమ నటుడి పురస్కారం అందకపోవడం అత్యంత విషాదకరం. ఒక్క శారదకు మాత్రమే రెండు సార్లు జాతీయ అవార్డు దక్కింది. అవి కూడా మళయాళంలో స్వయం వరానికి,తెలుగులో బి.ఎస్.నారాయణ తీసిన నిమజ్జనానికి లభించాయి. జాతీయ స్థాయి ఇలా ఉంటే అంతర్జాతీయ స్థాయి గురించి ఆలోచించలేం.
తెలుగు సినిమా రంగంలో పెద్ద నిర్మాణాలు జరిగాయి కానీ సినిమా నిర్మాణ స్థాయిని పెంచే కృషి మాత్రం జరగలేదనే చెప్పాలి. కాలం చెల్లిన ఫార్ములాలను దాటి ‘నవ్య సినిమా’ నిర్మాణం వైపు గానీ, నూతన తరాన్ని రూపుదిద్దడంలో కానీ, ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. వారి వారి వారసత్వ సామ్రాజ్యాలను నిర్మించుకునే పనిలో పడ్డారే తప్ప తెలుగులో అర్థవంతమైన సినిమా రూపొందించడంలో కృషి మొదలు పెట్టలేక పోయారు.
ప్రభుత్వంవైపు నుంచి రాయితీలు, అప్పులు, అవార్డులు అభినందనలు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించారే తప్ప సినిమా కళను అభివృద్ధి పరిచే కృషి చేపట్టలేక పోయారు. నిజానికి సినిమా వ్యాపారం మాత్రమే కాదు, సర్వకళా సమ్మిశ్రిత కళారూపం. దాని నిర్మాణానికి కళాత్మక ఎదుగుదలకు ఎంతో కృషి చేయాల్సింది. సినిమా నిర్మాణ కోర్సులకు సంబంధించి ఫిలిం ఇన్ స్టిట్యూట్, సినిమాలను భద్రపరిచే ఫిలిం ఆర్కైవ్స్ ఏర్పాటు చేయలేకపోయారు. సనాతన కోర్సులకు సంబంధించి, ఐటికి సంబంధించి అనేక కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం సినిమాను అధ్యయనాంశంగా ఒక ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయలేదు.
మనరాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా సాహిత్య, సంగీత అకాడమీల మాదిరిగా సినిమా అకాడమీ లేదా ఫిలిం కౌన్సిల్ ను ఏర్పాటుచేయలేదు. ప్రధాని నెహ్రూ సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి 1951లోనే ఫిలిం ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఎస్.కె.పాటిల్ కమిటీ నివేదిక ఆధారంగానే – కేంద్రం జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా అవార్డులు ఇవ్వడం, పూనాలో ఫిలిం ఇనిస్టిట్యూట్ ను, మంచి సినిమాలకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు ఫిలిం ఫైనాన్ప్ కార్పొరేషన్, బాలల కోసం చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీని, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ, ఫిలిం ఆర్కైవ్స్ ఏర్పాటు వంటి చర్యలను చేపట్టింది. అయితే జాతీయ ఫిలిం కౌన్సిల్ లేదా అకాడమీని ఏర్పాటు చేయాలనే ప్రధాన సూచనను మాత్రం అమలు పరచలేదు. ఈ అకాడమీ ప్రభుత్వాలకు సినిమా నిర్మాణ, పంపిణీ, ప్రదర్శనలకు సంబంధించి సూచనలు ఇస్తుందని, సినిమా రంగంలో ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పేందుకు, వృత్తిపరమైన నిబద్ధత క్రమశిక్షణ ఉండేందుకు, నాణ్యతను కాపాడేందుకు దోహదపడాలని పాటిల్ కమిటీ సూచించింది. దీనిని పాటించకపోవడం వల్ల జాతీయ, రాష్ట్ర స్థాయిలలో సినిమా రంగానికి ఉపయుక్తమైన వ్యవప్థ రూపుదిద్దుకోలేదు. ఫిలిం కౌన్సిల్ ఏర్పాటు అవసరమని ఆ తరువాత కూడా ఎన్ని సూచనలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
చలన చిత్ర అకాడమీ భావనను స్ఫూర్తిగా తీసుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1985లో కలకత్తాలో ‘నందన్’ సినిమా కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసింది. దీనిలోని నాలుగు థియేటర్లను ప్రదర్శనలకే కాకుండా, ప్రొడక్షన్ తప్ప మిగతా అన్ని కార్యక్రమాలకు వేదికగా మార్చారు. కేరళ 1998లో, కర్ణాటక 2009లో చలన చిత్ర అకాడమీలను ఏర్పాటు చేసుకున్నాయి. వీటి ద్వారా ఉత్తమ సినిమా ఉద్యమాలను ముందుకు తెస్తున్నాయి. మంచి సినిమా సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా పరివ్యాప్తం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలలో సినిమా రంగం తెలుగు చిత్ర రంగంతో పోలిస్తే చిన్నవే. అయినా అర్థవంతమైన సినిమాకు తెలుగులో స్థానం లేదు. ఇప్పటికైనా తెలుగు చలన చిత్ర అకాడమీ స్థాపించి సినిమా రంగాన్ని బాగు చేయడానికి పూసుకోవాలి. తద్వారా ఫిలిం ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, ఆర్కైవ్స్, అంతర్జాతీయ చిత్రోత్సవాలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ఫిలింక్లబ్ లు ఏర్పాటే చేసి తెలుగు సినిమాకు కొత్తచూపు ఇవ్వాల్సి ఉంది.
చక్రి says:
ప్రభుత్వం చలన చిత్ర అకాడమి ఇంతవరకు ఎందుకు పెట్టబడలేదో ?.దానికి కారణం ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకున్నపెద్ద మనుషులే అనుకుంటా . ఎక్కడ జనాలు విద్యావంతులైతే తమ కోటలకి భంగం వాటిల్లుతుందో అని ఇంతకాలం ఆపినట్టున్నారు . కాని ఎప్పుడయితే సుభాష్ ఘై వచ్చి నేను film institute పెట్టుకుంటా స్థలం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగాడో అదుగో అప్పుడు .. అన్ని స్టూడియోలు..తమ తమ ఫిలిం ఇన్స్టిట్యూట్ ని స్థాపించటం ప్రారంభించాయి.సురేష్ productions వాళ్ళది ముందే ఉండొచ్చేమో… రామోజీఫిలిం సిటీ లో ఈ మధ్యే స్టార్ట్ చేసారు. అన్నపూర్ణ studios అలాంటి ఆలోచన ఉన్నట్టు ప్రకటించింది.