Menu

తడబాటు మాటల నుంచి ప్రభావంతమైన ప్రసంగం వరకు :The King’s Speech

అప్పటికి ఆయన ఒక యువరాజు. అదష్టం కలిసొస్తే మహరాజయ్యే అవకాశం వుంది. అడుగులో అడుగేసుకుంటూ ముందుకు వచ్చాడు. ఎదురుగా అశషంగా కనిపిస్తున్నప్రేక్షకులు, ప్రజలు. అతని వెనుకే నేను తోడున్నానని కళ్ళతోనే చెప్తున్నభార్య. తడబడుతూనే ముందుకు వచ్చాడు. అతను పలకబోయే ప్రతి మాటకోసం అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రసంగం మొదలైంది. మాటమాటకి తడబడుతున్నాడు, నత్తితో పొడిగా పొడిగా అక్షరాలు పలుకుతున్నాడు. మాటపెగలని ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తోంది. ప్రజల్లో అసహనం పెరుగుతోంది. యువరాజు ఓడిపోయాడు.

***

అప్పుడు ఆయన ఒక మహారాజు. ఒకవైపు ప్రపంచ యుద్దం అనివార్యమనిపిస్తోంది. శత్రురాజులు చేస్తున్న ప్రసంగాలు శత్రు సైనికుల్లో ఉత్తేజాన్ని, ఈ దేశ ప్రజల్లోభయాన్ని నింపుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం. అప్పటికే ప్రసారమధ్యమంగా ప్రసిద్దమైన రేడియోలో ప్రసంగం. మహరాజు చిన్న గదిలా వున్న బ్రాడ్ కాస్టింగ్ రూం లోనించి మాట్లాడాడు. ఆ ప్రసంగం విన్న ప్రతి వొక్కరిలో పౌరషాన్ని రగిల్చింది, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, యుద్దానికి సన్నద్దులను చేసింది. మహారాజు బయటికి వచ్చి చూసే సరికి కోట ముందు వేల సంఖ్యలో ప్రజలు తమ హర్షధ్వానాలు తెలియజేస్తూ నిల్చున్నారు. మహరాజు గెలిచాడు.

***

ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న “ది కింగ్స్ స్పీచ్” అనే చిత్రంలో తొలి, చివరి సీన్లు ఇవి. ఒక యువరాజుగా వోడిపోయి, మహరాజుగా గెలిచే దాకా జరిగిన పోరాటమే ఈ చిత్ర కథ. ఈ పోరాటంలో వున్న బ్రిటిష్ దేశ యువరాజు/మహరాజు కింగ్ జార్జి (VI) (Colin Firth)అయితే, ఈ పోరాటంలో అతనికి సహాయపడేది అతని గురువు, మిత్రుడు లాయనల్ లోగ్ (Geoffrey Rush)మరియు మహారాణి ఎలిజబెత్ (Helena Bonham Carter). కేవలం నత్తిని అధిగమించి విశ్వాసంతో ప్రసంగించే స్థాయికి ఎదిగే ఒక రాచకరికపు పాత్ర కథ తో ఒక అద్భుతమైన సినిమా తీయగలగడం నిజంగా గొప్ప విషయమే. అయితే కేవలం ఆ పాత్ర వాక్కులో వచ్చే మార్పు గురించే కాక, రాచరికపు కట్టుబాట్లు ఎంత అవివేకమైనవో తెలుసుకుంటూ అతని వ్యక్తిత్వంలో వచ్చే మార్పుని కూడా చూపించడంతో ఈ కథ అంతర్జాతీయ ఖ్యాతిని, ప్రేక్షకుల ఆదరణని అందుకుంది.

ఇక కథ విషయానికి వస్తే – తన నత్తిని పోగొట్టుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన కింగ్ జార్జి చివరి ప్రయత్నంగా ఎలిజబెత్ రాణి సూచించిన లాయనల్ లోగ్ దగ్గరకు వెళ్తాడు. అతని ప్రవర్తన, ముఖ్యంగా తనని యువరాజుగా కాక ఒక పేషంట్ గా మాత్రమే చూడటం, బ్రెట్టీ(రాచమహలులో అతని ముద్దుపేరు) అనే పేరుతోనే సంభోదిస్తాననడం, నత్తిని నయం చెయ్యడానికి అతను వాడే అశాస్త్రీయమైన పద్ధతులు చూసి జార్జి తిరిగివెళ్ళిపోతాడు. అయితే అతను తిరిగి రావడం, మాట్లాడేటప్పుడు తడబాటుని అధిగమించడం మొదలౌతుంది.  జార్జి అలా అవడానికి కారణమైన అతని చిన్నప్పటి సంఘటనలను తెలుసుకుంటూ, అశాస్త్రీయమైన పద్ధతులతో మార్పు తెస్తాడు. ఈ లోగా జరిగిన రాజకీయ మార్పుల కారణంగా జార్జికి మహరాజు అయ్యే అవకాశం వస్తే అది అందుకోమని చెప్పిన లోగ్ కి అతనికి చిన్న వాగ్వివాదం జరుగుతుంది. తప్పక మహరాజు అయ్యాక మహారాణి రాయబారంతో మళ్ళీ ప్రసంగ పాఠాలు ప్రారంభమౌతాయి. అప్పుడే లోగ్ ఏ అర్హతలు లేని “స్పీచ్ థెరపిస్ట్” అని తెలుసుకోని మహరాజు లోగ్ పై ఆగ్రహిస్తాడు. ప్రపంచ యుద్ధం మొదలయ్యే పరిస్థితిలో మహరాజు జార్జికి మళ్ళీ లోగ్ ని కలుసుకోవాల్సిన అవసరం వస్తుంది. చివరికి కింగ్ జార్జి తనకున్న లోపాన్ని ఎలా అధిగమించాడు అన్నది క్లైమాక్స్.

కథగా వింటే ఇది సినిమాగా సాధ్యమా అన్నట్లు అనిపిస్తుంది కానీ కథనంలో వున్న పట్టు, దర్శకత్వ ప్రతిభ, నటీనటుల అద్భుత నటన ఈ సినిమాని ఆస్కార్ దాకా తీసుకెళ్ళాయి. చాలా మంది వూహించినట్లుగానే ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడుతో సహా ఏడు ఆస్కార్లు అవార్డులే కాకుండా, ఏడు బాఫ్తా అవార్డులు  (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సహాయనటి తో సహా), నాలుగు ఎకాడమీ అవార్డులు ఇంకా ఎన్నే గెల్చుకుంది.

కావటానికి ఇది చారిత్రక సినిమా అయినా మైమరపించే కట్టడాలు, రాచరికపు హంగులు, ఆర్భాటాలు వంటి వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టకుండా పాత్రల మీద, వారి వారి మధ్య వుండే సంబంధ బాంధవ్యాలమీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఈ సినిమా ఇంతటి విజయాన్ని, ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందింది.

మంచి నటన, మంచి సినిమా ముఖ్యంగా చారిత్రాత్మక డ్రామా చూడటానికి ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన సినిమా

 

***

సినిమా: ది కింగ్స్ స్పీచ్ (The King’s Speech) (ఇంగ్లిష్)

దర్శకత్వం: Tom Hooper

నిర్మాతలు: Iain Canning, Emile Sherman, Gareth Unwin, Geoffrey Rush

రచన David Seidler

నటీనటులు: Colin Firth, Geoffrey Rush, Helena Bonham Carter, Guy Pearce, Timothy Spall

సంగీతం: Alexandre Desplat

సినిమాటోగ్రఫి: Danny Cohen

ఎడిటింగ్: Tariq Anwar

4 Comments
  1. j.surya prakash March 4, 2011 /
  2. Manjula March 4, 2011 /
  3. balaji December 21, 2011 /