Menu

తొణకని కుండ కు తింగరి బుచ్చికీ పెళ్ళి : తను వెడ్స్ మను

‘హమ్ ఆప్కే కౌన్’ లాంటి సూరజ్ భరజాత్య పెళ్ళి వీడియో లాంటి సినిమాను భారీసెట్టింగుల్లో కాకుండా మధ్యతరగతి ఇళ్ళల్లో, పెళ్ళివిడిదిగా R&B గెస్ట్ హౌసుల్లో తీస్తే ! అదీ ఆ సినిమాలో ‘జబ్ వుయ్ మెట్’ తరహా ఇంతియాల్ అలీ సినిమాలోని పాత్రల్ని ప్రవేశపెట్టి ఉత్తరప్రదేశ్, పంజాబ్ చిన్నచిన్న పట్టణాల సంస్కృతిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది “తను వెడ్స్ మను”.

లండన్ లో పదిసంవత్సరాలుగా ఒక ఫార్మా కంపెనీలో రీసెర్చ్ చేస్తున్న డాక్టర్ ‘మనుశర్మ’ (మాధవన్) ఢిల్లీ రాగానే తల్లీతండ్రీ ప్రోద్బలంతో కాన్పూర్ కు ఒక అమ్మాయిని చూడ్డానికి వెళ్తాడు. ఆ అమ్మాయే ‘తను త్రివేది’(కంగనా రనౌత్). ‘తను’ అయినదానికీ కానిదానికీ తిరుగుబాటు బావుటా ఎగరవేసే తింగరబుచ్చి స్వభావం కలిగిన అమ్మాయి. మను “ఇంతమంచివాడు లోకంలో ఉంటాడా!” అనిపించే తొణకని కుండలాంటి అబ్బాయి. బలవంతంగా పెళ్ళిచూపులు ఏర్పాటుచేశారని ఒక క్వార్టర్ ఖాళీచేసి మత్తులోకి జోగిన తను ని వాళ్ల అమ్మ “వైరల్ ఫీవర్ వస్తే  డాక్టర్ నిద్రమాత్రలు ఇచ్చాడు అందుకే మత్తుగా ఉంది” అని ముసుగేసి మను ముందు పెళ్ళిచూపులకు కూర్చోబెడుతుంది. మత్తుగా నిద్రపోతున్న తను ని చూసి ప్రేమలో పడతాడు మను. పెళ్ళికి ఓకే అనేస్తాడు. ఇక్కడ్నుంచీ మొదలౌతుంది అసలు కథ.

నాకు అల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడూ నువ్వు గెట్లాస్ట్ అయిపొమ్మంటుంది తను. ఆ సంబంధం కాదుకున్నా, తను ప్రేమలోంచీ బయటపడలేకపోతాడు మను. మళ్ళీవాళ్ళిద్దరూ పంజాబ్ లో మను స్నేహితుడు జస్సీ పెళ్ళిలో ఎలా కలుసుకున్నారు? ఆతరవాత ఏమయ్యింది?  చివరికి ఇద్దరూ కలిసారా అనేది సినిమా.

సాధారణంగా బాలీవుడ్ లో చూపించే మెట్రోసిటీ తరహా కాకుండా, చాలా సహజంగా ఉన్న పరిస్థితులూ, లొకేషన్లు, పాత్రలతో హృద్యంగా ప్రభావవంతంగా సున్నితంగా కథను, పాత్రలను వాటి తీరులనూ వాటిమధ్య ఘర్షణనూ చూపించిన తీరు ఈ సినిమాని ప్రత్యేకంగా నిలుపుతుంది. బహుశా మల్టిప్లెక్స్ ప్రభావం తరువాత వస్తున్న middle of the read సినిమాలకు ప్రత్యామ్న్యాయంగా కొంత స్థానిక సంస్కృతిని కలగలిపి neo-urban పోకడల్ని షోకేస్ చేసే ఒక ధోరణి మొదలైనట్టుంది. మొన్నమొన్న వచ్చిన  సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ కూడా ఇదే దారిలో ఉంటూ సూపర్ హిట్ అవడం ఒక ఉదాహరణ మాత్రమే.

మనుగా చాలా పాసివ్ గా అనిపించినా బలమైన పాత్రలో మాధవన్ నటన సున్నితంగా ఉంది. కొన్ని expressions లో ఎంతో పరిణితిని చూపిస్తాడు. తను గా కంగనా రనౌత్ ది చాలా complex పాత్ర. మొదటిసినిమా గ్యాంగ్ స్టర్ లోనే ఎంతో variation ని చూపించగలిగిన ఈ నటికి కష్టతరమైన పాత్ర కాకపోయినా, ఒక ruff and tough small town girl గా నటించడంలో అక్కడక్కడా కొంత ఇబ్బంది కరంగా అనిపించినా మొత్తానికి బాగానే చేసింది. ‘జబ్ వుయ్ మెట్’ ప్రభావమో ఏమోకానీ అక్కడక్కడా “ఈ సీన్లో కరీనా కపూర్ ఉంటే ఎలా చేసేదో” అనే అలోచన రాక మానదు. మొత్తానికి ఈ జంట ఒక మిస్ మ్యాచ్ జంటగా బాగా ఆకట్టుకుంటారు. మిగతా నటీ నటుల్లో ప్రముఖంగా చెప్పుకోవలసింది మను స్నేహితుడిగా నటించిన దీపక్ ధోబ్రియాల్ నటన. “జై మాతాదీ” సీన్లో ఈ నటుడు తన వాచకంలో చూపించిన ప్రతిభ డైలాగ్ డెలివరీలో చూపించే వైవిధ్యం ముచ్చటేస్తాయి. ఒక ప్రత్యేకపాత్రలో జిమ్మీ షేర్ గిల్ తన ప్రత్యేకతను చాటుకుంటాడు. కంగనా స్నేహితురాలిగా నటించిన స్వరా భాస్కర్ చాలా బాగుంది. నటనతో ఆకట్టుకుంది. దక్షిణాది సినిమాల్లో ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. మను – తను ల తండ్రులుగా చేసిన సీనియర్ నటులు పాత్రోచితంగా ఉన్నారు.

సంభాషణలు, దృశ్యాల పరంగా ఉన్ననేటివిటీ, సాంకేతికపరంగా ఉన్న క్లారిటీ ఈ సినిమాను ఇటు మల్టిప్లెక్స్ ప్రేక్షకులకూ అటు సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులకూ దగ్గరచేసే అవకాశం ఎక్కువుంది. హిమాన్షు శర్మ రచన, రాజశేఖర్ సాహిత్యం, కృష్ణ సంగీత దర్కత్వం ఆకట్టుకుంటాయి. ప్రత్యేకంగా చెప్పుకోవలసింది చిరంతన్ దాస్ సినెమాటోగ్రఫీ ముఖ్యంగా చిన్నపట్టణాల దృశ్యాలను బంధించడంలో, లిమిటెడ్ లైటింగ్ తో impact-full గా తీసిన దృశ్యాలలో అతని ప్రతిభ కనిపిస్తుంది. అరనిమిషంలో ఆరు కట్స్ ఉన్నా స్మూత్ రన్నింగ్ ను దెబ్బతియ్యని హేమల్ కొఠారీ ఎడిటింగ్ ఒక హైలైట్. ఇలాంటి సినిమాని ప్రతిభావంతంగా తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ రాయ్ కి ఇది మొదటి సినిమా కావడం మరిన్ని మంచి సినిమాలకు అందివచ్చే ఉజ్వలమైన భవిష్యత్తుకు సంకేతం కావచ్చు.

ద్వితీయార్థంలో కంగనా రనౌత్ పాత్ర కొంచెం తింగరితింగరిగా అనిపించినా సీన్లవేగం ఒక ఇరవై నిమిషాలపాటూ తగ్గి కన్ని ఆవులింతలు వచ్చినా, చివరికొచ్చేసరికీ మంచి రొమాంటిక్ కామెడీ చూశామనే తృప్తితో బయటికి రావడం ఖాయం. So…GO FOR IT.

2 Comments
  1. j.surya prakash March 12, 2011 /
  2. jagaddhatri March 12, 2011 /