Menu

“శుభలేఖ” రాసుకున్నా ఎదలో ఎపుడో!

కొన్ని సినిమాలతో ఏదో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. అవి గొప్ప సినిమాలు కాకపోవచ్చు, గొప్ప హిట్టూ కాకపోవచ్చు, కాని మనసులో వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతివారికీ ఇలాటి కొన్ని సినిమాలు ఉంటాయి. నాకు ఇలా నచ్చిన సినిమా – కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన “శుభలేఖ”. వరకట్న సమస్య గురించి తీసిన ఈ సినిమా నేను 10th class లో ఉన్నప్పుడు మొదటి సారి చూసినప్పుడే నాపై ఏదో తెలియని ముద్ర పడింది. అప్పట్నించీ చాలా సార్లు చూశాను. చూసిన ప్రతి సారీ నచ్చుతూనే ఉంది.

నా మనసు స్పందించి, నాలో మనిషితనం పలికి, కంటనీరు తిరిగిన అనుభవం కొన్ని సినిమాలు చూసినప్పుడు కలిగింది. వీటిలో విశ్వనాథ్ సినిమాలు చాలా ఉన్నాయ్. ఇప్పటికీ నాకూ బాగా గుర్తు – ఇంట్లో టీవీలో శృతిలయలు సినిమా చూస్తున్నప్పుడు క్లైమేక్స్ లో నాలో వచ్చిన స్పందనకి నేను చట్టుక్కున లేచి మేడ మీదకి పరిగెత్తి కొంత సేపు ఆకాశం కేసి చూసి ఆ శూన్యంలో నన్ను నేను దాచుకున్నాను! విశ్వనాథ్ సినిమాల్లో కథ మంచితనం, కథనం సంస్కారం. శుభలేఖలో చిరంజీవి కావొచ్చు, స్వాతిముత్యంలో కమల్ హాసన్ కావొచ్చు, స్వర్ణకమలంలో వెంకటేష్ కావొచ్చు – మూర్తీభవించిన మంచితనం నిండిన ప్రధాన పాత్రలు ఆయన సినిమాల్లో ఎన్నో. బాహ్యమైన మార్పు కంటే అంతర్గతమైన మార్పుని విశ్వనాథ్ తన సినిమాల్లో చూపిస్తారు. అందుకే ఆయన సినిమాలు ఆడంబరం లేకుండా, స్వచ్ఛంగా మననే మనం చూస్తున్నట్టు ఉంటాయ్.

సినిమా లక్ష్యం వరకట్నం దురాచారమనీ, దాన్ని వ్యతిరేకించాలనీ చెప్పడం. ఇది ప్రధానంగా హీరోయిన్ సుమలత ద్వారా చెప్పారు. హీరో చిరంజీవి అయినా నిజానికి ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. విశ్వనాథ్ సినిమాల్లో స్త్రీ పాత్రలు ఎంతో ఉదాత్తంగా ఉంటాయనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. చదువూ, సంస్కారం, ధైర్యం, ఆత్మగౌరవం కలిగిన అమ్మాయిగా సుమలత పాత్ర కనిపిస్తుంది. ఆమెకు ఒక చెల్లెలు (తులసి). అదే ఊరిలో కార్పరేటర్గా ఉన్న సత్యనారాయణకి కీర్తికాంక్షతో పాటూ డబ్బు ఆశ కూడా పుష్కలంగా ఉంటుంది. తన ఇద్దరు కొడుకులలో పెద్దవాడిని (గిరీష్) ఇంజనీర్, చిన్నవాడిని (శుభలేఖ సుధాకర్) డాక్టర్ చదివిస్తూ వారి పెళ్ళికి వారి “చదువుకి తగ్గ హోదా” (కట్నం!) దక్కుతుందని కలలు కంటూ ఉంటాడు. చిరంజీవి ఒక హోటల్‌లో వైటర్. గత వైభవాన్నే తలచుకుంటూ, తన మనవడు ఒక గొప్ప ఉద్యోగం చెయ్యాలనుకునే నాన్నమ్మ (నిర్మల) కి “పది మంది నా చేతుల మీద తింటూ ఉంటారు. అంతటి గొప్ప ఉద్యోగం” అని అబద్ధం చెప్పుకుంటూ వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా తన చదువుకి తగని ఉద్యోగమే అయినా స్వాభిమానంతో చేస్తూ ఉంటాడు. ఊర్లో బాబాయ్ కూతురు పెళ్ళైన సంవత్సరానికే వైధవ్యం పొందితే, ఆ చెల్లెలిని తాను చదివిస్తానని ఉన్నంతలో సాయపడే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడిగా చిరంజీవి కనిపిస్తారు. గిరీష్ తో సుమలతకి సంబంధం వస్తే పెళ్ళిచూపుల్లో కట్నం ఎందుకివ్వాలని సత్యనారాయణని సుమలత నిలదియ్యడం, తద్వారా సంబంధం తప్పిపోవడం జరుగుతుంది. మిగతా సినిమా అంతా రెండు పాయల్లో నడుస్తుంది –

1. కన్న తల్లిదండ్రులే వేసిన కొన్ని నిందలని తప్పని నిరూపించడం కోసం సుమలత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చిరంజీవి సాయంతో సమాజానికి ఎదురొడ్డి, మంచి ఉద్యోగం సంపాయించి, తల్లిదండ్రులలో మార్పు తేవడం.

2. తులసి శుభలేఖ సుధాకర్ ని ప్రేమించి, చాకచక్యంగా సత్యనారాయణనే కాళ్ళబేరానికి రప్పించి పెళ్ళికి ఒప్పుకునేలా చెయ్యడం.

సినిమాలో పాత్రలు అన్నీ గొప్పగా మలచడంలో, కథనాన్ని నడిపించడంలో విశ్వనాథ్ ప్రతిభ కనిపిస్తుంది. సత్యనారాయణ అద్భుతంగా నటించారు. చిరంజీవి సహజంగా నటించారు. టైటిల్స్ లోనే “మీ చిరంజీవి”, “మా సత్యనారాయణ” అని వేసి చిన్న చమత్కారం చేశారు.  మిగతా నటీనటులు కూడా పాత్రోచితంగా నటన పండించడం ఈ సినిమాకి శోభని చేకూర్చింది.

మాటలూ పాటల గురించి కొంత చెప్పుకోవాలి. విశ్వనాథ్ సినిమాలకి మాటలు జంధ్యాలైతే ది బెస్టని నాకనిపిస్తుంది.  అయితే ఈ సినిమాకి గొల్లపూడి రాసిన మాటలు నాకు బాగా నచ్చాయ్. హాస్యభరితంగా సాగూతునే గొప్ప సందేశాన్ని ఇముడ్చుకున్న ఈ చిత్రానికి గొల్లపూడి పూర్తి న్యాయం చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక పాటల విషయానికి వస్తే మహదేవన్ బాణీలకి వేటూరి అతి సరళమైన సాహిత్యం పొదిగారు. “రాగాల పల్లకిలో” పాట పాపులర్. “నెయ్యములల్లో నేరేళ్ళో” అన్న అన్నమాచార్య కీర్తన కూడా ఈ సినిమాలో ఉంది.

సినిమాల వల్ల జనాలు మారతారా? సంఘంలోని కల్మషాలు మాసిపోతాయా? విప్లవాలు పుడతాయా? ఈ ప్రశ్నలకి సమాధానం – కాదు. సినిమా కేవలం వర్తమాన పరిస్థితులకి అద్దం చూపెడుతుంది. ఒక బీజం నాటగలుగుతుందేమో కాని, ఒక వృక్షాన్ని సృష్టించలేదు. సినీ దర్శకుడు “కృష్ణ వంశీ” ఈ సినిమా గురించి ఒకసారిలా చెప్పారు – “మిత్రులమంతా కలిసి సెకెండ్ షో కి శుభలేఖ సినిమాకి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు ఎవరూ మాట్లాడలేదు. దారిలో ఒక దగ్గర ఆగి ఈ సినిమా గురించి చర్చించుకున్నాం. ఈ సినిమా మాలో ఎంత స్పందన కలిగించింది అంటే అప్పటికప్పుడే మేమంతా కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకుంటామని ప్రతిన బూనాం. చాలా మంది పాటించారు కూడా”. లేత వయసులో నాపై కూడా ఈ సినిమా చెరగని ముద్ర వేసింది, అందుకే నేను కూడా పట్టుబట్టి కట్నం లేకుండా పెళ్ళి చేసుకున్నాను.

ఫణీంద్ర KSM

8 Comments
  1. వనమాలి March 14, 2011 /
  2. subhadra March 15, 2011 /
  3. Venkat Konda March 15, 2011 /
  4. Anil March 16, 2011 /
  5. vamsi March 16, 2011 /
  6. Pappu Sitaram March 18, 2011 /
  7. aditya March 19, 2011 /
  8. శ్రీకాంత్ March 23, 2011 /