Menu

రియలిస్టిక్ థ్రిల్లర్-నో వన్ కిల్డ్ జెస్సికా

ఇన్నాళ్లకి బాలీవుడ్‌లో కొత్త సంవత్సరం నిజంగానే ‘కొత్త’ ఫీలింగ్‌ను తెచ్చింది. ప్రతీసారీ కొత్తసంవత్సరం ఆరంభంలో కూడా పాత కథలను, తిరగరాసిన కథలనే తెరమీద చూసే పాతదానికి అలవాటుపడిన ప్రేక్షకులకి నిఖార్సయిన ‘కొత్త’దనాన్ని సినిమాపరంగా ఆవిష్కరించిన సినిమా – ‘నోవన్ కిల్‌డ్ జెస్సికా’! బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా కథలను అల్లుకునే ట్రెండ్ పెరిగిపోతోంది. ఇది సినిమాటిక్ గ్రామర్‌లో ఓ అద్భుతమైన ధోరణే! అయితే నిజజీవిత సంఘటనలకు ఇన్‌స్పైర్ అయి తీసిన సినిమాలలో అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా అంటే గ్యారంటీ ఇవ్వలేం. కథ, కథనం, నటీనటులు, నటన, సీన్లలో కథలో ఎమోషన్స్‌ని క్యారీ చేసిన విధానం -ఇవన్నీ బాగున్న రియలిస్టిక్ కథలు మాత్రమే జనాల్ని ఆకట్టుకోగలుగుతున్నాయి. అలా 2011 కొత్త సంవత్సర ఆరంభంలో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకోవడమే కాక ఆలోచింపచేసే కథగా తెరకెక్కిన సినిమా-‘నోవన్ కిల్‌డ్ జెసికా’!

మనం ఏదైనా సందర్భంలో తరచు వాడే పదాలు కొన్ని ఉన్నాయి-గుడ్లప్పగించి చూడడం..చెవులు రిక్కించి వినడం..సీటుకు అతుక్కుపోయి మైమరిచిపోవడం…ఈ మాటలన్నింటినీ కానీ, ఏ ఒక్క మాటనీ కానీ వాడే అవకాశాన్ని ఈ మధ్య వస్తున్న ఏ సినిమాలూ మనకివ్వడంలేదు. ఆ లోటును మీకు ‘నోవన్ కిల్‌డ్ జెస్సికా’ సెంట్‌పర్సంట్ తీరుస్తుంది. గుడ్లప్పగించి తెరమీద దృశ్యాలను చూడాలంటే ‘అవతార్’లాంటి గ్రాఫిక్స్ అక్కర్లేదు…చెవులు రిక్కించి సౌండ్స్ వినడానికి ‘హ్యారీపోటర్’ లాంటి రీ రికార్డింగ్సే అక్కర్లేదు. సీటుకు అతుక్కుపోయి మైమరిచిపోవడానికి ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి సీనిక్ రిచ్‌నెస్ అక్కర్లేదు..! గుండెల్లోకి సూటిగా వెళ్లే మానవీయ కోణం ఉంటే చాలు! ఏడేడు లోకాల దిగువన మనం పాతేసిన మన హృదయాలలోని ‘చెమ్మ’ని సున్నితంగా స్పృశించగలిగే ఒక్క దృశ్య స్పర్శ చాలు! బ్రెయిన్‌నీ-హార్ట్‌నీ టచ్ చేయగలిగిన ఒక్క హ్యూమన్ డ్రామా చాలు! ఇవన్నింటినీ థియేటర్‌లో ఉన్న మనలో కలిగించడంలో సక్సెస్ అయిన అత్యంత సాదా సీదా సినిమా ఇది.

బాలీవుడ్ సినిమాలంటేనే వినోదం…హృదయోల్లాసం సామాజిక బాధ్యత…సందేశం…మానవీయ చైతన్యం మన కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్ సినిమా దర్శకులకు అనవసరం! కానీ కొంత మందికి ఆలోచనా స్ఫోరక కొత్తదనం…సామాజిక చైతన్యం జీవన లక్ష్యం! కానీ ఈ రెండింటినీ సమన్వయం చేయగలిగిన దర్శకులు బాలీవుడ్‌లో అతి తక్కువమంది…అలాంటి రేర్ బ్రీడ్ ఆఫ్ డైరక్టర్స్‌లో తాజాగా చేరిన పేరు-రాజ్‌కుమార్ గుప్తా, ది డైరక్టర్ ఆఫ్ ‘నో వన్…’’ మూవీ! ఈ మూవీలోకి వెళ్లడానికి ముందు ఈ కథకు మూలమైన వాస్తవిక సంఘటనని ఓసారి చూడాలి. 1999 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ…్ఢల్లీ నగర శివారుల్లోని ఓ రిచ్ పబ్! ఆ పబ్‌లో జరుగుతున్న ఓ సోషలైట్ సెలిబ్రిటీ పార్టీకి హర్యానా మంత్రి వినోద్‌శర్మ కుమారుడు మనుశర్మ వచ్చాడు. ఆ బార్‌లో బార్ టెండర్‌గా పనిచేస్తున్న మోడల్-జెస్సికాలాల్! మను అప్పటికే పీకలవరకు తాగాడు. మరో పెగ్ అడిగాడు. జెస్సికా వారించింది. మను తన దగ్గరున్న రివాల్వర్ తీసి జెస్సికాని కాల్చాడు. జెస్సికా అక్కడికక్కడే మరణించింది. కేసు దిగువకోర్టుకెళ్లింది. దిగువ కోర్టు మనుశర్మ నిర్దోషి అని తేల్చి 21 ఫిబ్రవరి 2006న విడుదల చేసింది. దాంతో జెస్సికా సోదరి సత్రీనా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 25రోజులపాటు వరసగా జరిగిన హియరింగ్స్‌తో ఢిల్లీ హైకోర్టు 20 డిసెంబర్ 2006 నాడు మనుశర్మను దోషిగా నిర్థారిస్తూ జీవిత ఖైదు విధించింది. మనుశర్మ తండ్రి రామ్‌జఠ్మలానీని అప్రోచ్ అయి తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసారు. 19 ఏప్రిల్ 2010నాడు సుప్రీంకోర్టు కూడా మనుశర్మను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదును ఖాయం చేసింది. మన దేశ నేర చరిత్రలో దాదాపు 11 ఏళ్లపాటు వివిధ స్థాయి కోర్టులలో సుదీర్ఘంగా నడిచిన క్రైమ్ కేసు ఇది.

ఇంతా తెలిసినా నిజంగా జరిగిన వాస్తవం…దీన్ని సినిమా కథగా మలచడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ అసాధ్యమైన విషయాన్ని ఎంతో సున్నితమైన మానవ భావోద్వేగాలను మేళవించి మంచి సినిమాగా మలిచిన క్రెడిట్ రాజ్‌కుమార్ గుప్తాదే! ఇంకా చెప్పాలంటే కథాగమనంలో జేస్సికాకేం జరిగిందో తెలిసిందే. మనుశర్మ ఏం చేశాడు..చివరికి ఏం జరిగిందీ అ విషయాలన్నీ తెలిసినవే! కానీ ఈ ‘తెలిసిన’ విషయాలనే ఎంతో ఆసక్తిదాయకంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో ‘నోవన్…’ సూపర్ సక్సెస్! ఇంకా చెప్పాలంటే ఈ సినిమా స్ర్తిల రక్షణకోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం మరో ఇద్దరు స్ర్తిల పోరాటమే!

‘నోవన్…’ సినిమాలో మొదటగా చెప్పుకోవాల్సిన ప్లస్ స్క్రీన్‌ప్లే! సినిమా ఓపెనింగ్ షాట్‌నుండి మొదలుకుని ఇంటర్వెల్‌బ్యాంగ్…ఆ తర్వాత కోర్టు సీన్లు…అన్నీ ఎంతో గ్రిప్పింగ్‌గా…చక్కగా అల్లుకుంటూ వెళ్లిన తీరు సూపర్బ్ అనిపిస్తుంది. జెస్సికా హత్య విషయం ఆమె అక్క సబ్రీనా (విద్యాబాలన్)కు తెలిసినప్పటి సీన్‌నుండి ఈ సినిమాలో స్పీడ్ పెరిగి అలా వెడుతు వెడుతూ పోలీస్ వ్యవస్థనీ, న్యాయవ్యవస్థనీ…ప్రత్యక్ష సాక్షులలోని వంచనా శిల్పాన్ని తెరై ‘పోర్‌ట్రే’ చేసిన తీరుకు మనం అలా చూస్తూ ఉండిపోతాం. ఇక జెస్సికా హత్యను ‘మినిట్

టు మినిట్’ ఫార్మట్‌లో చిత్రించిన విధానం కథన నైపుణ్యానికి ఓ ఉదాహరణ. ఇక విద్యాబాలన్ దుఃఖభరిత నిస్సహాయతలోంచి రాణీముఖర్జీ ‘నో వన్ కిల్‌డ్ జెస్సికా’ అని టైప్ చేస్తూ కనిపించే సీన్ దగ్గర ఇంటర్వెల్ వేయడం సినిమాటిక్ గ్రామర్‌కి ఓ వెరైటీ ట్విస్ట్! సెకండాఫ్‌లో జర్నలిస్టు రాణీముఖర్జీ ఇనె్వస్టిగేషన్ చేసే తీరు…దేశవ్యాప్త నిరసనలు..సాక్షులు ప్లేట్ మార్చడం వంటి సీన్లన్నీ ఎంతో హృదయవిదారక దృశ్యాలకు తెరఎత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఇక ఈ సినిమాలో విద్యాబాలన్ నటన. ముఖంలో, బాడీ లాంగ్వేజ్‌లో పాత్ర స్వభావాన్ని చెప్పే తీరు గ్రేట్ అనిపిస్తాయి. రాణీముఖర్జీ ఓకె. జెస్సికాపాత్రలో నూతన నటి ‘మైరా’ బెస్ట్..

ఈ సినిమాలో టెక్నికల్ ప్లస్‌పాయింట్లు చాలా ఉన్నాయి. అమిత్ త్రివేది మ్యూజిక్..బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ప్రతీ సీన్‌లోని గాఢతని, మూడ్‌ని చాలా ఎలివేట్ చేసాయి. ఇక ‘్ఢల్లీ’ సాంగ్ అయితే ఇప్పటికే ఛార్ట్‌బస్టర్ అయింది. రియాలిటీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ అనయ్‌గోస్వామి, ఫ్రేమింగ్ సెన్స్…లైటింగ్ ఎఫెక్ట్స్…షాట్ డివిజన్ స్టయిల్ గొప్ప యెసెట్! ఇక ఆర్తి బజాజ్ ఎడిటింగ్ స్కిల్స్ మనం కళ్లు తెరుచుకుని స్క్రీన్ వంకే చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు

మొత్తం మీద ఈ కొత్త సంవత్సరంలో ‘నోవన్ కిల్‌డ్ జెస్సికా’ సినిమా భారీ బడ్జెట్‌లతో తీస్తున్న బిగ్ సినిమాలకు ఓ సవాలు విసిరిందనే చెప్పాలి. 9 కోట్ల బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా అన్నిరకాలుగా ఓ కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను మిగల్చడమే కాక ప్రేక్షకుల గుండెల్ని కూడా తట్టగలిగిది. ఓ సామాన్యురాలికి జరిగిన అన్యాయానికి తెరఎత్తు నీరాజనమై నిలిచింది…రండి, మనలోని మానవీయతను ఒక్కసారి కనుక్కుందాం!

కర్టేసీ: ఆంధ్రభూమి

–మామిడి హరికృష్ణ

One Response
  1. rajender masani March 19, 2011 /