Menu

రమణీయ కథ – 2

ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011 చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు.

మొదటి భాగం తరువాయి.

బుడుగు కాక, పాఠకుల మనస్సులలో కలకాలం నిలిచిపోయే పాత్రలను ఇంకా ఎన్నిటినో ముళ్లపూడి సృష్టించారు. రాధ, గోపాలం, (అప్పుల) అప్పారావు, వరహాల రాజు (సినేమియా వ్యాధిపీడితుడు), రెండు జెళ్ల సీత, బుడుగు బాబాయ్, లావుపాటి పక్కింటి పిన్నిగారు, సీగాన పెసూనంబ – ఇలా ఎందరో తెలుగు పాఠకుల నిత్య వ్యవహారంలో అభిమాన పాత్రలుగా నిలిచిపోయారు.

ముళ్లపూడి వారి అత్యుత్తమ కథగా “కానుక” ను పలువురు పేర్కొంటారు. అది గోపన్న అనే అమాయకుడైన ఒక ఆల కాపరి కథ. శ్రీ కృష్ణుని మీద అపార ప్రేమతో అతని పుట్టిన రోజు కానుకగా ఒక మంచి పిల్లన గ్రోవిని బహుకరించాలని గోపన్న తలపోస్తాడు. ఒక దాని తర్వాత ఒకటిగా పిల్లన గ్రోవులు తయారుచేస్తాడు. ఏదీ సంతృప్తికరంగా రాలేదు. ఎక్కడో ఏదో లోపం ప్రతిదానిలోను. సాక్షాత్తు అవతార పురుషుడైన శ్రీ కృష్ణునికి అలా అపశ్రుతులు పలికే పిల్లనగ్రోవి ని ఎలా బహుకరిస్తాడు? సంవత్సరాలు దొర్లిపోయాయి. గోపన్నకు వార్థక్యం వచ్చేస్తోంది. సత్తువ ఊడిగిపోతుంది. చివరికి నిస్సహాయుడై పోయి, ఏమీ చేయలేక, ఆఖరిసారిగా చేసిన పిల్లనగ్రోవిని కృష్ణుడికి కానుకగా పంపిస్తాడు. కృష్ణుడు ఆ కానుకను స్వీకరించి పిల్లనగ్రోవిని ఊదుతాడు. అతిలోక మనోహరమైన సంగీతం వెలువడుతుంది. ఆ సంగీత స్వరాలను అందుకుని, గోపన్న అంతవరకు ఏళ్ల తరబడిగా చెక్కి, అపశ్రుతులు పలుకుతున్నాయని పారేసిన వందలాది వేణువులన్నీ ఒక్కసారిగా శ్రుతిబద్ధంగా, సుస్వరాలను పలికించడం మొదలెడతాయి. చక్కగా ఒకదానితో ఒకటి సమన్వయమై అధ్బుతమైన దివ్య సంగీతాన్ని వినిపిస్తాయి. మానవునిలో ఎప్పుడైతే తనే కర్తననే అహంకారం నశించి, భగవంతుని పట్ల ప్రపత్తి పెరుగుతుందో అప్పుడు అతడి భక్తిని భగవంతుడు ఆమోదిస్తాడన్నమాట.

ఈ కథ గొప్పదే. కాని, నా దష్టిలో ముళ్లపూడి కథలన్నిటికి మకుటాయమైనది “మహారాజు-యువరాజు”. ఇందులో మహారాజు వివాహితుడు, నడి వయస్కుడు, చిరుద్యోగి. యువరాజు యువకుడు, అవివాహితుడు, నిరుద్యోగి. ఇరువురూ ఒక వృద్ధురాలి వద్దకు అప్పుకోసం వెడతారు. (ఆమె దాస్తొయేవెస్కీ “క్రైం అండ్ పనిష్‍మెంట్” లో రాస్కోల్నికోవ్ హత్య చేసిన తాకట్టు వ్యాపారస్తురాలి పాత్రను జ్ఞాపకం చేస్తుంది.) ఒకడు తన ఫౌంటెన్ పెన్ తాకట్టు పెడతాడు. రెండో వాడు ఒక ఇత్తడి పాత్రను తాకట్టు పెడతాడు. ఇద్దరికీ చెరొక రూపాయిన్నరా చేతిలో పెడుతుంది. చాలా రోజులుగా నిర్బధ నిరాహార దీక్షలో ఉన్న యువరాజు కడుపునిండా భోజనం చేయాలనుకుంటాడు. మహరాజు తనలాగే ఒక పూట తినీ, ఒక పూట తినకా, పస్తులుంటున్నభార్యాబిడ్డల కోసం కాస్త బియ్యం, ఉప్పు, పప్పులూ కొని ఇంటికి తీసుకుపోదామనుకుంటాడు. కాని చేతికందిన డబ్బుకాస్తా (యూజీన్ ఓనీల్ “లాంగ్ వాయేజ్ హోమ్” నాటకంలో నావికునికి జరిగినట్టు) అనవసరంగా, వృథాగా ఖర్చు అయిపోతుంది. పెద్ద పాము నోటిలో పడి మొదట బయలుదేరిన గడిలోకే ఇద్దరూ వస్తారు. యువకుడు తన గదికి పోయి, నడి వయస్కుడిని తలచుకుని “అతనికేం మహరాజు! ఇంటికెళ్ళే సరికి ఆప్యాయంగా స్వాగతం చెప్పడానికి పెళ్లాం బిడ్డలున్నారు. నాకెవరున్నారు?” అని అసూయపడతాడు. నడి వయస్కుడు చిన్నవాడిని తలచుకుని “అతనికేం బ్రహ్మచారి! ఉద్యోగం లేకపోయినా, డబ్బు లేకపోయినా పెళ్లాం బిడ్డల బాదరబందీ ఏం లేదు. హాయిగా ముసుగుపెట్టుకుని ముడుచుకుని పడుకుంటాడు” అని ఈర్ష్య పడతాడు. నిరుద్యోగి హాయిగా ఉన్నాడని చిరుద్యోగి, వివాతుడిదే సుఖమంటే అని బ్రహ్మచారీ భావిస్తారు. ఆ నిర్భాగ్యులిద్దరి ధౌర్భాగ్యపు బ్రతుకల్ని రచయిత ముళ్లపూడి ఎంతో హృదయంగమంగా చిత్రిస్తారు.

ఇలాంటి రచనలతో మన గొప్ప కథా రచయితల శ్రేణిలో సముచిత స్థానం సంపాదించుకున్న ముళ్లపూడి చలనచిత్ర రచనలోను, చిత్ర పరిశ్రమలోను కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకున్నారు. జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన ముళ్లపూడి జర్నలిస్టుగానే కొనసాగి ఉంటే, బహుశా ఏ అత్యధిక ప్రచారం గల వార పత్రికకో సంపాదకుడిగా పేరు తెచ్చుకుని ఊరుకునే వారు. కానీ 1960 లో ఆయన జీవితపథం ఒక మలుపు తిరిగింది. జర్నలిజం కంటే ఆకర్షణీయమైన సినిమారంగంలో ఆయన ప్రవేశించారు. మొదటగా డి.బి.నారాయణ గారు తమ “దాగుడు మూతలు” సినిమాకు సంభాషణల రచయితగా ముళ్లపూడిన బుక్ చేశారు. కాని ఆ తర్వాత ఆయన్ని చేసిన డూండి “రక్తసంబంధం” చిత్రం ముందుగా విడుదల అయింది. ఈ రెండు చిత్రాల తర్వాత ముళ్లపూడి ఇక వెనుదిరిగి చూడలేదు. ఒక దశలో కథ, సంభాషణల రచయితగా ముళ్లపూడి పట్ల నిర్మాతల మోజు ఇంతింతని చెప్పవీలులేనంతగా ఉండేది. అయితే ఆయన ఎప్పుడూ రెండు మూడు చిత్రాల కంటె ఎక్కువ ఒప్పుకునే వారు కాదు. వాటికి కూడా తీరుబడిగా పని చేసేవారు తప్ప హడావుడిగా గిలికెయ్యడం ఆయనకు చేతనయ్యేది కాదు. జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి స్క్రిప్టు ని చిత్రిక పట్టడం ఆయన పద్ధతి. అందుకే సంభాషణల రచయితగా అరడజనుకు పైగా అవార్డులు సంపాదించుకున్నారు ఇన్నేళ్లలోను.

రచయితగా చిత్రరంగంలో ప్రవేశించిన కొద్ది సంవత్సరాలకే ముళ్లపూడి చిత్ర నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. ఆ రంగంలోకి ఆయనతోపాటు చిన్ననాటి స్నేహితుడు బాపు కూడా వచ్చి కలిశారు. వారి మొదటి చిత్రం “సాక్షి”. ఆ చిత్రంతో ప్రారంభించి చలన చిత్ర దర్శకుడుగా బాపు ప్రతిభా పారమ్యాన్ని ప్రదర్శించారు.

చిరకాలం జ్ఞాపకం పెట్టుకోదగిన మంచి చిత్రాలనేకం బాపు, రమణ నిర్మించారు. అన్నీ బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టాయని కాదు. ఆర్థికంగా విజయం పొందినవి, పొందనవి కూడా వారి చిత్రాల జాబితాలో ఉన్నాయి. కాని, ఎక్కువ భాగం చిత్రాలు వారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. వాటిలో “బుద్ధిమంతుడు” ఒకటి. ఆర్థిక విజం సంగతి ఎలా ఉన్నా వారి చిత్రాలలో పెక్కింటికి ప్రభుత్వ బహుమతో, ఆభిమానుల ఆదరణో విధిగా లభించింది. వారి “సీతా కళ్యాణం” చిత్రాన్ని సెల్యులాయిడ్ కవిత్వంగా పలువురు పరిగణించారు. లండన్ లో దాన్ని ప్రదర్శించినప్పుడు, సినీ క్రిటిక్స్ బహుధా మెచ్చుకున్నారు.

కాగా, దర్శకునిగా బాపు, రచయితగా రమణ అగ్రతమశ్రేణిని అందుకున్న చిత్రం “ముత్యాలముగ్గు”. ముఖ్యంగా ముళ్లపూడి సినీ జీవితంలో అదొక సువర్ణ ఘట్టం. ఎంతో భావుకత్వంతో కూడిన బాపు దర్శకత్వం, ముళ్లపూడి రసవంతమైన సంభాణలు దాన్ని తెలుగులోని అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా తీర్చిదిద్దాయి. కామెడీ, విలనీ కలగలిసిన కంట్రాక్టరు పాత్రలో ముళ్లపూడి సృజనాత్మకత పరవళ్ళు తొక్కింది. రావుగోపాలరావు ఆ పాత్రలో చూపిన నటనా ప్రతిభతో మన చిరస్మరణీయులైన చలనచిత్ర నటులలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.

’పెళ్ళి పుస్తకం’, ’మిస్టర్ పెళ్ళాం’ వారి పూర్వ చిత్రాల కంటె భిన్నమైనవి. అవి ప్రేక్షకుల హృదయాలలో నవ్వుల పంట పండించిన చక్కని కామెడీలు. దర్శకత్వంలోను, రచనలోను ఒక సారళ్యం, సినీ మీడియం పై ఒక మాస్టరీ, పరవళ్ళు తొక్కే హాస్యం ఆ చిత్రాలలోని విశిష్ట లక్షణాలు. ఆ రెండింటికి రాష్ట్రంలోను, కేంద్రంలోను అవార్డులు లభించాయి.

బాపు, రమణల మైత్రి చిత్రమైనది. ఆరవై ఏళ్ళ పాటు సాగిన అవిచ్చిన్న స్రవంతి. ఒకరు మాటలతో ఇంద్రజాలం చేస్తే మరొకరు బొమ్మలతో మంత్రనగరం సృష్టిస్తారు. ఒకరు తన జీవితానుభవాల నుంచి మానవతావాదాన్ని కాచి వడబోసి అందించారు. రెండవవారు కొద్ది పాటి సుతారపు గీతలతో అతిలోక సౌందర్యం పండిస్తారు. ప్రవృత్తులలో వారు భిన్నధ్రువాలు. ఒకరిది జలపాతంలా హోరెత్తే ఉద్విగ్న ప్రకృతి. రెండవవారిది మైదానంలో ప్రశాంతంగా, గంభీరంగా ప్రవహించే నదిలాంటి స్వభావం. ఒకరిది తనకు నచ్చని వాటితో రాజీ పడలేని మనస్తత్వం. రెండవవారిది మానవుల ఔన్నత్యాలను. బలహీనతలను ఒకే విధంగా సాక్షి మాత్రంగా పరికించే సమ్యక దృష్టి. ఈ భిన్నత్వమే వారి చిరమైత్రిలోని ఏకత్వానికి ప్రాతిపదిక అయింది.

 

నండూరి రాంమోహన్ రావు గారి ’అక్షరయాత్ర’ వ్యాసమాలిక నుంచి