ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు ఫిబ్రవరి 23, 2011 చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. నవతరంగంలో చాలా రోజుల పాటు ఆగిపోయిన ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనుకున్నాము. రమణ గారి స్మృత్యర్థం ఆయనతోనే ఈ ’ఫోకస్’ శీర్షిక ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనతో వ్యాసాలను ప్రచురించడం జరుగుతోంది. రమణ గారి గురించి మీరు కూడా వ్యాసాలు పంపించవచ్చు. మీ వ్యాసాలు venkat at navatarangam dot com కి పంపించగలరు.
చాలా దశాబ్దాల నాటి సంగతి. ముళ్ళపూడి వెంకటరమణ అనే ఒకానొక రచయిత ఉన్నట్టుండి ఆశేష పాఠక హృదయాల్లోకి ఝామ్మని దూసుకుపోయి తిష్ఠవేసుకుని కూర్చున్నాడు. హాస్యం ఆయన వచన శైలి చేత మనోహర లాస్యం చేయించింది; అది సెటైరును ఒక ఆయుధంగా ప్రయోగించింది. మధ్య తరగతి మనుషుల లేనిపోని భేషజాలను తన కథలలో ఆయన వేళాకోళం చేశాడు. మాటలతో గారడీ చేశాడు. కలాన్ని మంత్రదండంలో ప్రయోగించాడు. పేదరికంతో చెట్టాపట్టాలు వేసుకుని అరకప్పుటీ కోసం, ఒక ప్లేటు సానుభూతి కోసం వీథుల వెంట వెదుకుతూ తిరిగే నిరుద్యోగ యువకులతోను, తమ క్లాసు అమ్మాయిల మీద మధుబాలను, సావిత్రిని సూపర్ ఇంపోజ్ చేసుకుని, వేడి నిట్టూర్పులు విడుస్తూ విరహవీణలు వాయించుకుంటూ తిరిగే అపర దిలీప్‍కుమార్లతోను, అభినవ నాగేశ్వరరావులతోను కిటకిటలాడే ఒక కొత్త ప్రపంచాన్ని ఆ మంత్రదండంతో ఆమంత్రించాడు.
ఆయన మొదటి కథలలో రెండోదో, నాలుగోదో “ఆకలి ఆనందరావు”. అది ఆంధ్రప్రభ వార పత్రికలో అచ్చు అయింది. బహుశా 1953 లో. కథా సాహిత్య భవనం బాల్కనీలో కాలరెత్తుకుని నిలబడిన ఆ కథ చదివిన పాఠకులు “ఎవరా రైటరు, ఏమా స్టోరీ” అని చాలాసేపు ఆశ్చర్యపోయారు, వెనక్కి తిరిగొచ్చారు; ఆనందపడ్డారు, లేచి కూర్చున్నారు.
ఒకానొక వేసవి రోజున మండుటెండలో మద్రాసు నగర వీధులలో ఒకానొక నిరుద్యోగ యువకుడు కప్పెడు వేశి తేనీరు కోసం, వేడకపోయినా దొరికే నీరు కోసం లోపలా బయటా చేసే సాహసాల ఇతివృత్తం అది. వాక్యాలు కొత్తరకంగా ఉన్నాయి. ఇదివరకు ఎక్కడా ఎవరూ రాయని శైలిలో ఉన్నాయి. హాస్య తరంగాల వేషం ధరించినా, జీవిత గాంభీర్యాన్ని, విషాదాన్ని అంతర్వాహినిగా దాచుకున్న శైలి అది.
ఆనందరావుకీ ఆనందరావుకీ మధ్య నడిచే డైలాగులు చిరునవ్వుల పువ్వులు పూయిస్తూనే గుండెని పట్టేస్తాయి. ఆ ఇడియమ్ ఎక్కడిదబ్బా? ఆ అదీ, చార్లీ చాప్లిన్ చూడండి: ఎంత విషాద గంభీర సన్నివేశాన్నయినా బుజాలెగరేసో, ఏడవడానికి సిద్ధంగా ఉన్న పెదవులపైకి రాని నవ్వును లాక్కువస్తూనో దులిపేసుకుంటాడే! అదీ ఆ టెక్నిక్కు. కథానాయకుడైన ఆనందరావు ఒక వైపు విషాద వీచికలతో పేచీ పడుతూనే, మరో వైపు మధురోహల మృదుడోలలలో ఉయ్యాల లూగుతూ, తన కష్టాల కన్నీళ్ళకు సుఖాంతాల ఇంద్రధనుస్సుల్ని తగిలించాలని ప్రయత్నిస్తాడు. కరుణ, హస్యరసాల కలనేతతో కథ నడిపించడం అప్పటికింకా పూర్తిగా కాదుగాని, చాలావరకు కొత్త. తెల్లవారేసరికి ముళ్లపూడి వెంకటరమణ పేరు పొందిన రచయితగా మేలుకున్నాడు.
ఆనందరావు ఎవరంటే ముళ్లపూడే. బాల్యం ఆఖరై యౌవనపు గుమ్మంలో అడుగుపెట్టే రోజుకి ముళ్లపూడికి ఆకలి కొత్తకాదు. ఆకలీ, ఆయనా కలిసి ఒకే హైస్కూల్లో చదువుకున్నారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడాయన. గోర్కీ లాగా ఆరంభయౌవనంలోనే తన జీవితపథం తాను వెతుక్కోవాల్సివచ్చింది. పేదరికంతో చుట్టరికం ఏర్పడింది. ఎంతటి కష్టాన్నయినా తేలికగా నవ్విపారేసే తత్వం, ఎప్పటికయినా రచయితగా పేరు తెచ్చుకోవాలనే తపన ఆయన్ని నిస్పృహకు లోను కాకుండా కాపాడాయి. ఉన్నత విద్య అభ్యసించలేదు. కాని, తిరిగి గోర్కీ లాగా తన చుట్టూ జీవితమే ఆయనకు యూనివర్శిటీ అయింది. ఇక పుస్తకాల సంగతి చెప్పనక్కరలేదు. తెలుగులోను, ఇంగ్లీషు లోను చెప్పుకోదగిన రచయితలెందరి గ్రంథాలో చదివి ఆకళించుకున్నారు. హైస్కూలు రోజుల్లోనే రచనా వ్యాసంగం ప్రారంభించారు. బాపుతో స్నేహం కలిసింది. అరవై ఏళ్ళ నాడు అవిచ్చిన్నంగా అలాగే కొనసాగింది.
ఒక లక్ష్యం, గమ్యం లేకుండా తిరిగారు. రకరకాల ఉద్యోగాలు చేశారు. మద్రాసులో అప్పుడే క్రొవ్విడి లింగరాజు ఎడిటరుగా ప్రారంభమైన ప్రకాశంగారి ’ప్రజాపత్రిక’ లో చేరారు. ఆనాటి సహోద్యోగులలో వాకాటి పాండురంగారావు, కోటగిరి విశ్వనాథరావు, తుర్లపాటి కుటుంబరావు ప్రభృతులు ఉండేవారు. అప్పుడే జర్నలిస్టుగాను, కథా రచయితగాను పేరు తెచ్చుకోవడం ప్రారంభించారు. కొద్ది కాలం తర్వాత(1954 లో) ఆంధ్రపత్రికలో చేరారు. మొదట కొన్ని కథలు ఆంధ్రప్రభలో పడిన తర్వాత, ఆంధ్ర పత్రిక వారపత్రికలో వరసగా కథ తర్వాత కథ, సీరియల్ తర్వాత సీరియల్ ప్రచురించడం ప్రారంభించారు. ఆనాటి వారి సహోద్యోగులలో ఈ రచయితతోపాటు సూరంపూడి సీతారాం, గోళ్లమూడి రామచంద్రరావు, ఎం. ఎస్ శర్మ, సిహెచ్.వి.రాజగోపాలరావు, దాసు వామనరావు, పిలకా గణపతిశాస్త్రి లుండేవారు.
ఆయన ఆ రోజులలో రాసిన కథలు యువతరం పాఠకులను ఉర్రూతలూగించాయి. కల్పనా చాతుర్యం, భావనా వైచిత్రి, పందెపు గుర్రంలా పరిగెత్తే వచనం, మానవ స్వభావ పరిశీలన, ముఖ్యంగా చాప్లిన్ లాగా దగాపడిన తమ్ముళ్ల పాత్రల చిత్రణ ఆయనకొక ప్రత్యేకత సంతరించి పెట్టాయి.
మళ్లీ మొదటికి వెడితే, అంటే వెనక్కి నడిస్తే, మన దృష్టిని ఆకర్షించే కథ “ఛాయలు”. ఇది “ఆకలీ-ఆనందరావు” తర్వాత కథ. ఇందులో కూడా అదే టెక్నిక్, ఊహాతరంగాలలో ఉయ్యాలలూగే కథన శిల్పం. కథా నాయకుని పేరు సుబ్రహ్మణ్యం. ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా కాసిని డబ్బులు “అరువు” తీసుకుని వెళ్లిపోయిన తమ్ముడిని వెతుకుతూ రాత్రి తొమ్మిదిగంటల వేళ మద్రాసు సెంట్రల్ స్టేషన్ కు వెడతాడు. అతడు అటూ ఇటూ తిరగడాన్ని అనుమానంగా చూస్తున్న పోలీసు తన వృత్తికి సజమైన భాషలో పలకరిస్తాడు. సుబ్రహ్మణ్యం ఎందుకేనా మంచిదని మైలాపూరులో స్వగృహంకేసి తిరుగు ముఖం పడతాడు. దారిలో రకరకాలుగా ఆలోచిస్తాడు. పో్లీసువాడికి ఎలా బుద్ధి చెప్పాలీ అని. దారిలో ఒక సినిమా హాలు దగ్గర ఆగుతాడు. పోలీసువాడు వాడిన భాషతో ఇంకా కుతకుత లాడిపోతున్న సుబ్రహ్మణ్యం టిక్కెట్ కొనుక్కుని, హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. సినిమా మీదా ఆసక్తితో కాదు, జరిగినదంతా తలుచుకుంటూ, పోలీసు వాడికి విధించవలసిన రకరకాల శిక్షలు ఊహించుకుంటూ, రైల్వే స్టేషన్ లో తారసిల్లిన ఆంగ్లో ఇండియన్ అమ్మాయితో తీరికగా రొమాంటిక్ సన్నివేశాన్ని టెక్నికలర్ లో మనోయవనికపై చిత్రించుకుంటూ, కాలం గడపడానికే అతడు హాలులో కూర్చుంటాడు.
ఇలా ముళ్లపూడి కలంనుంచి కథ తర్వాత కగా వరుసగా ఎన్నో కథలు వెలువడ్డాయి. నాలాంటి కొందరు అతడిని మార్క్ ట్వేన్ ప్లస్ వుడ్‍హౌస్ అనిన్నీ హాస్యమూ ఇంటూ సెటైర్ డివైడెడ్ బై వర్డ్ పన్నింగ్ ఇజీక్వల్టు ముళ్లపూడి కథలు అనిన్నీ అనుకునేవారు, అనేవారు. ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలూ, ఏకలవ్యుడు, సెరిబ్రల్ సినేమియా, రాధా గోపాలం కథలు, ఋణానందలహరి, విక్రమార్కుడి మార్కు సింహాసనం, ఇంకా బోలెడు కథలూ 1950లలో ఆంధ్రవార పత్రికలో వెలువడి ముళ్లపూడిని అశేషపాఠకుల అభిమాన రచయితగా చేశాయి. రమణ రమణీయ రచలన్నిటిని బాపు అంతకంటే రమణీయమైన చిత్రాలతో అలంకరించేవాడు. జంటగా చేసిన ఈ కృషితో వీరిద్దరూ పాఠకులకు మరింతగా అభిమాన పాత్రులయ్యారు. నిజానికి ఆ రోజుల్లో (1950లలో) బాపు-రమణ అంటే పాఠకులకి చలనచిత్ర తారలంత గ్లామర్ ఉండేది.
ముళ్లపూడి ఆ రోజుల్లో ఆంధ్రవారపత్రికలో సినిమా శీర్షిక ఎడిటర్ గా వారం వారం చిత్ర సమీక్షలు వ్రాసేవార. ఎంత అగ్రశ్రేణి నిర్మాత, దర్శకుడు, నటి, నటుడు అయినా ముళ్లపూడి నిశిత విమర్శక దృష్టి నుంచి తప్పించుకునే వారు కాదు. అయితే ఆయన విమర్శ ధోరణి వేరు. అది గుచ్చుకునే విమర్శ కాదు. సరదాగా వేళాకోళం చేస్తూ సమీక్షించడం ఆయన పద్ధతి. ఆయన ఎవరిని వేళాకోళం చేసినా, వారే నవ్వుకొనే వారు. నిర్మాతలను, డైరెక్టర్లను సన్నిహితంగా స్టడీ చేసిన వాడైనందునే, వారి లోపాలను సెటైర్ చేస్తూ గిరీశం లెక్చర్లు లాంటి ఉత్తమ రచన చేయగలిగారు.
ఇలాగే సెటైర్ అనే అయుధాన్ని అవినీతిపరులు, వంచకలు అయిన రాజకీయవాదులపై విజయవంతంగా ప్రయోగిస్తూ ముళ్లపూడి చేసిన రాజకీయ భేతాళ పంచవింశతి. కాని, ముళ్లపూడి రచనలన్నింతికి తలమానికమైనది బుడుగు. చిచ్చరపిడుగులాంటి బుడుగును ప్రధాన పాత్రగా చేసి రాసిన కథలు ఆ రోజుల్లో పిల్లలను, పెద్దలను ఎంతగా ఉర్రూతలూగించాయో, ఎంతగా అలరించాయో చెప్పనలవి కాదు.
–ఇంకా ఉంది
నండూరి రాంమోహన్ రావు గారి ’అక్షరయాత్ర’ వ్యాసమాలిక నుంచి
sudha says:
వ్యాసం చాలా బాగుంది…. ఇలా రమణగారి మీద కనిపించే వ్యాసాలు పంపించవచ్చునా…
ముఖ్యంగా అతిథి గురించి మీరు ఇచ్చిన వివరణ చూసి నవ్వుకున్నాను.
నిజంగా చాలాసార్లు…అతిథి అనే వ్యక్తి వ్యాసాలు రాస్తున్నారనే ఇప్పటివరకు అనుకున్నాను.కానీ మీ రచయితల పేర్లలో ఎప్పుడూ ఆ పేరు కనిపించదే అనుకునేదాన్ని….
సందేహనివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.
ఎలక్ట్రాన్ says:
పైన బొమ్మ శ్రీరమణ గారిది కదా?
శిద్దారెడ్డి వెంకట్ says:
కాదే! ముళ్లపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం కవర్ పేజీ మీది బొమ్మ కదా ఇది. శ్రీ రమణ గారిది ఎలా అవుతుంది?
indrajit says:
site is very nice i am also want to be a member
tell me the process