Menu

మనకి సినిమాలు చూడడం వచ్చా?

మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో సినిమా అనేది మన దైనందిన జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయింది. నలుగురు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఆ చర్చ ఎక్కడోదగ్గర సినిమాల వైపుకి మళ్ళుతుంది. అంతెందుకు సినిమాల గురించి, సినిమా వాళ్ళ గురించి ఇప్పుడు అన్ని న్యూస్ ఛానెల్స్ వార్తలు కూడా ప్రసారం చేస్తుంది-అదీ హెడ్ లైన్స్ లో. ఎంత కాదన్నా మన రాష్ట్రంలో సామాన్యుకి అందుబాటులో ఉన్న కాలక్షేపం సినిమా ఒక్కటే. అయితే సినిమా అనేది చాలా మందికి కాలక్షేపం కోసం అయినప్పటికీ అది ఒక కళారూపం. నాట్యం, సంగీతం, సాహిత్యం కి లాగే సినిమా కూడా ఒక కళ. అయితే సినిమా అనేది అత్యంత వ్యయంతో కూడిన కళ కాబట్టి పెట్టిన డబ్బులు వెనక్కి రావాలంటే సామాన్య ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు తీయాల్సి రావడంతో సినిమా తీయడంలో కళాత్మక ధృష్టి కంటే కూడా వ్యాపార ధోరణి నే ఎక్కువ మంది అవలంబించడం మనకందరికీ తెలిసిందే. అయితే అన్ని సినిమాలూ ఒకేలా ఉండవు. కొంత మంది కేవలం డబ్బు సంపాదించాలనే సినిమాలు తీస్తే మరికొంతమంది సినిమా అనే మీడియంని ఉపయోగించుకుని అద్భుతమైన కళా సృష్టి చేస్తారు. ఇంకొంతమందైతే సినిమాని కళాత్మకంగా రూపొందిస్తూనే సామాన్య ప్రేక్షకుడిని కూడా అలరించే రీతిలో కళను కామర్స్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీస్తారు. ఇక కొద్ది మంది సినిమా అనే మీడియం ద్వారా కొత్త ప్రయోగాలు చేస్తారు. ఈ ప్రయోగాల ద్వారానే కొన్ని కొత్త టెక్నిక్స్ పుట్టుకొస్తాయి. (ఉదాహరణకు జంప్ కట్, వెర్టిగో షాట్, స్నోరీ క్యామ్ మెదలుగునవి). మొత్తానికి సినిమా అనేది మనం ఇప్పుడు వారం వారం చూస్తున్నట్టుగా- ఒక హీరో, ఒక హీరోయిన్ మధ్యలో విలన్, కొన్ని పాటలు, కొన్ని ఫైట్లు మాత్రమే కాదు. తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే సినిమా అనే ప్రక్రియ చాలా గమ్మత్తైనది. అందులోని వింతలూ విశేషాలు తెలుసుకునే కొద్దీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

దాదాపు నాలుగేళ్ళ క్రితం నవతరంగం స్థాపించేముందు, “అసలు ఈ సంస్థ యొక్క లక్ష్యం ఏంటీ?” అనే విషయం మీద చాలా పెద్ద చర్చే జరిగింది. నవతరంగం స్థాపించేటప్పటికి ఐడిల్ బ్రైన్, గ్రేట్ ఆంధ్రా, తెలుగు సినిమా, 123తెలుగు, దట్స్ తెలుగు లాంటి ఎన్నో వెబ్ సైట్లు తెలుగు సినిమా కి సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ఉన్నాయి. నవతరంగం స్థాపించిన ఈ మూడు నాలుగేళ్ళలో మరి కొన్ని సినిమా వెబ్ సైట్లు వచ్చాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ నవతరంగం లాంటి మరో సైట్ రాలేదు. ఇక ముందైనా వస్తుందనే నమ్మకంలేదు. అందుకు కారణం మిగతా వెబ్ సైట్ల్ లా కేవలం తెలుగు సినిమా వార్తా విశేషాలను పాఠకులకు తెలియచేయడం నవతరంగం లక్ష్యం కాదు. మా లక్ష్యాల్లో ముఖ్యమైనది మంచి సినిమాలు – అవి ప్రపంచంలోని ఈ మూలనుంచైనా కావొచ్చు మన తెలుగువాళ్ళకు పరిచయం చేయడం. అయితే మంచి సినిమా అంటే ఏంటి?

సినిమా అనేది కేవలం కాలక్షేపానికి మాత్రమే కాదు. సినిమా అనేది ఒక కళారూపం. కానీ సినిమాని ఒక కళారూపంగా ప్రేక్షకులు ఆదరించాలంటే ముందు వారికి “సినిమా చూడడం ఎలా” అనే విషయం పై అవగాహన ఉండాలి. అన్ని కళలకు లానే సినిమా కూడా ఒక కాంప్లెక్స్ ఆర్ట్. నిజంగా సినిమాను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే సినిమాను ఒక సబ్జెక్ట్ గా స్టడీ చెయ్యాలి. వారం వారం మన రాష్ట్రంలో విడుదలయ్యే సినిమాల్లో పెద్దగా కళాపోషణ లేకపోవడం మన దురదృష్టం. ఒక విధంగా చెప్పాలంటే మన సినిమాలు చాలా ఫ్లాట్ గా ఉంటాయి. అందులో శోధించి సాధించాల్సిన అంశాలేవీ పెద్దగా ఉండవు. ఉదాహరణకు ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఫలానా షాట్ ఎందుకు తీసారు, ఫలానా సీన్ ని అలా ఎందుకు ఎడిట్ చేసారు లాంటి విషయాలను శోధించాల్సిన అవసరం రాదు. కానీ కొన్ని సినిమాలను కేవలం చూసి ఆనందించడమే కాకుండా వాటిని స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలా చేసినఫ్ఫుడే ఆయా సినిమాల గొప్పతనం మనకి అర్థమవుతుంది. అందులోని విశేషాలు మనకి అర్థమైన కొద్దీ ఆ సినిమాలను మరింతగా అప్రిషియేట్ చెయ్యగలుగుతాం. అందుకే ఫిల్మ్ అప్రిషియేషన్ అనేది ఒక ఫీల్డ్ ఆఫ్ స్టడీగా గుర్తించి ఎన్నో విశ్వవిద్యాలయాల్లో ఫిల్మ్ అప్రియేషన్ ఒక కోర్స్ గా బోధించడం జరుగుతోంది.

ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మన రాష్ట్రంలో ఫిల్మ్ స్టడీస్ కి సంబంధించి కోర్స్ లు లేకపోవడం అనేది మన సినిమాల దుస్థితికి ఒక కారణం. ఇన్నాళ్ళ చలనచిత్ర చరిత్రలో మన రాష్ట్రానికి చెందిన ఒక్క సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో కానీ కనీసం జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సాధించలేదంటే అందుకు ప్రధాన కారణం మన రాష్ట్రంలో సినిమాను ఒక కళగా, ఒక భాషగా బోధన చెయ్యకపోవడమే. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కోర్సులు ఏర్పాటు చేపించడం మన చేతుల్లో లేకపోయినా కనీసం ఫిల్మ్ స్టడీస్ కి సంబంధించిన సాహిత్యమైనా అందుబాటులో ఉండుంటే కొంత మేలు జరిగుండేది. మన రాష్ట్రంలో సినిమాకి సంబంధించిన పుస్తకాలనగానే ప్రముఖ నటీ నటుల జీవిత చరిత్రలే తప్ప సినిమా అనే కళకు సంబంధించి చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. అప్పుడప్పుడూ ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పటికీ అవి కూడా సినిమా తీయాలనే ఆసక్తి మెండుగా ఉండే మన రాష్ట్ర ప్రజల బలహీనత ను అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకుందామనే తప్ప నిజాయితీగా సినిమా అనే ప్రక్రియ లోని వివిధ విషయాలను కూలంకుషంగా చర్చించిన పుస్తకాలు చాలా తక్కువ. ఫిల్మ్ అప్రిషియేషన్ లేదా ఫిల్మ్ స్టడీస్ కి సంబంధించి మన రాష్ట్రంలో నిజంగానే ఎవరూ ఏమీ చెయ్యలేదా అనే కుతూహలంతో అబిడ్స్ లోని పాత పుస్తకాల షాపులు. చిక్కడపల్లి లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ, కోటి లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ తిరిగి తిరిగి కాళ్ళరగాయి, పాత పుస్తకాల దుమ్ము దులిపి తుమ్ములొచ్చాయి కానీ నిజానికి నా శ్రమ వృధా అయిందనీ చెప్పలేను. ఎందుకంటే ఈ రెండేళ్ళలో కొన్ని మంచి పాత పుస్తకాలు నాకు దొరికాయి. అందులో నక్కా వెంకటేశ్వర రావు గారి “చలనచిత్ర సాంకేతిక శిల్పం” అనే పుస్తకం ముఖ్యమైనది. మన సినిమా పరిశ్రమ మద్రాస్ లో ఉండగా కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ నక్కా వెంకటేశ్వరరావు గారు వ్రాసిన ఈ గ్రంధం నిజంగా అమూల్యమైనది. దాదాపు ముప్ఫై ఏళ్ళకు ముందే తెలుగులో సినిమా అనే ప్రక్రియలోని అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ ఒక టెక్నికల్ మాన్యువల్ లాగా ఒక గ్రంధం ఉండేదంటేనే ఆశ్చర్యం వేసింది. కానీ మన వాళ్ళు మద్రాస్ వదిలి వస్తూ ఆ గ్రంధాన్ని అక్కడే వదిలేసి వచ్చినట్టున్నారు. అలాగే విజయవాడకు చెందిన జాక్సన్ రచించిన “ఎలా సినిమా చూస్తే అలా తయారవుతారు” అనే ఆసక్తికరమైన వ్యాసమాలిక కూడా నాకు దొరికింది. ఇక మన నవతరంగం సభ్యుడు ఆనంద్ వారాల కొన్ని పుస్తకాల ద్వారా కొన్ని కళాత్మకమైన సినిమాలను తెలుగు వారికి పరిచయం చేస్తూ కొన్ని రచనలు చేశారు. ఇవి కాకుండా ఫిల్మ్ స్టడీన్, ఫిల్మ్ అప్రిషియేషన్ లేదా ఫిల్మ్ టెక్నిక్ గురించి వచ్చిన పుస్తకాలు మన రాష్ట్రంలో అదీ తెలుగు భాషలో లేవనే చెప్పాలి.

ఏ కళకైనా ప్రదర్శన ముఖ్యం. అది కళాకారుల పని. కానీ ఆ కళ ను స్టడీ చేసి బోధించినప్పుడే ఆ కళ ప్రగతి సాధిస్తుంది. ఉదాహరణకు సాహిత్యం తీసుకుంటే కేవలం కథలు, నవలలు, కవితలు వ్రాయడంతో మన వాళ్ళు సరిపెట్టుకోలేదు. సాహిత్యం గురించి విమర్శనాత్మక విశ్లేషణాత్మక రచనలు ఎన్నో తెలుగులో ఉన్నాయి. అవి కేవలం మన సాహిత్యం గురించే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల సాహిత్యం గురించి విశ్లేషించిన గ్రంధాలు మనకి లభ్యమవుతున్నాయి. సామాన్య పాఠకులకు వీటితో పెద్దగా అవసరం రాకపోవచ్చు. కానీ ఇలాంటి గ్రంధాల వల్ల ఎంతటి ఉపయోగం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే సినిమాకి సంబంధించి కూడా విమర్శనాత్మక, విశ్లేషణాత్మక సాహిత్యం ఉన్నప్పుడు రచయితలకూ, దర్శకులకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఆసక్తిగల ప్రేక్షకులకి కూడా కొన్ని సినిమాలను పూర్తిగా ఆస్వాదించడంలో కూడా ఇలాంటి సాహిత్యం ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

ఒక శాస్త్రీయ సంగీత కచేరీకి వెళ్ళినప్పుడు పాడుతున్న వారితో తాళం వేస్తూ మమేకమై ఆనందించడానికి ఆ సంగీతం పై మనకి కొద్దో గొప్పో అవగాహన అవసరం అన్నది అందరికీ తెలిసిందే. అలాగే ఒక దర్శకుడు సినిమా ద్వారా మనకి అందించే అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ముందు మనం సినిమాలు ఎలా చూడాలో తెలుసుకోవాలి.

ముందే చెప్పినట్టు మన రాష్ట్రంలో అంత ప్రాముఖ్యత లేని ఫిల్మ్ స్టడీస్ అందులో ఒక ముఖ్య భాగమైన ఫిల్మ్ అప్రిషియేషన్ గురించి నవతరంగం ద్వారా ఒక ఆన్ లైన్ కోర్స్ మొదలుపెట్టాలనుకుంటూన్నాం.

వివరాలు త్వరలో

15 Comments
 1. రాణి May 31, 2011 /
 2. venkat May 31, 2011 /
 3. Rajesh Devabhaktuni May 31, 2011 /
 4. sateesh May 31, 2011 /
 5. శ్రీ May 31, 2011 /
 6. visu May 31, 2011 /
 7. A Varun May 31, 2011 /
 8. mohanramprasad June 1, 2011 /
 9. bhanu June 9, 2011 /
 10. srikanth June 9, 2011 /
 11. srikanth June 9, 2011 /
 12. sivalakshmi October 12, 2013 /