Menu

అ‘మంగళ’

అనగనగా ‘మంగళ’ (ఛార్మి) అనే ఒక సినీనటి. ఆవిడకున్న అభిమానుల్లో లో ఒక పిచ్చి అభిమాని ‘చిన్నా’(విజయ్ సాయి). చిన్నా తండ్రి ఒంటికన్ను క్షుద్ర మాంత్రికుడు (ప్రదీప్ రావత్). మంగళ మీద అభిమానంతో చిన్నా ఒక బుల్లి కారుని కొని బర్త్ డే గిఫ్ట్ గా ఇద్దామనుకుంటాడు. చిన్నా ఉన్న అభిమానుల గుంపులో నుంచీ ఒకరు మంగళ ఒంటిమీద చెయ్యివేస్తే అది చిన్నానే అనుకుని మంగళ ఫ్రెండు/ డ్రైవరు ‘సుబ్బు’(సుభాష్) చిన్నను తన్నితగలేస్తాడు. ఈ అవమాన భారంతో చిన్నా ఆత్మహత్య చేసుకుంటాడు. కొడుకు చావుకు కారణమైన మంగళపై ‘సకూచి’ అనే భయంకరమైన క్షుద్రశక్తిని  మాంత్రికుడు ప్రయోగిస్తాడు.

దుష్టశక్తి ఆవహించడంతో మంగళ జీవితం అల్లకల్లోలమైపోతుంది. భయంకరమైన పరిస్థితులు, శారీరక హింసలూ,  విపరీతపరిణామాలూ సంభవిస్తాయి. సుభాష్ సహాయంతో ఒక మాంత్రికుడిని ఆశ్రయిస్తే ప్రయోగించినవాడుతప్ప మరెవరూ తిప్పికొట్టలేడని తెలుస్తుంది. ఆ మంత్రగాడెవరో తెలుసుకుని వాడి కాళ్ళు పట్టుకుందామని వెళ్ళేసరికీ ప్రదీప్ రావత్ చనిపోయి కనిపిస్తాడు. తిరుగులేని క్షుద్రశక్తి ఆవహించి మంగళ, తిప్పికొట్టేదారి పూర్తిగా మూసుకుపోయిన మంగళ పరిస్థితి ఏమిటి?  శివకోనలోని ఒకేఒక్క అఘోరాకు మాత్రమే ఇప్పుడు సకూచీని వదలగొట్టే విద్య తెలసు, కానీ సమయం తక్కువుంది. మంగళ రక్షింపబడిందా ! లేదా !? అనేది కథ.

మంత్ర అనే సస్పెన్స్ చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తిన ‘ఓషో’తులసీరామ్ మలి ప్రయత్నం మంగళ అనే హర్రర్ చిత్రం. మొదటి చిత్రంలో టెక్నిక్ ని స్క్రీన్ ప్లేని నమ్ముకుని తీసిన తులసీరామ్ హార్రర్ లో లిబర్టీస్ తీసుకోవచ్చులే అనుకున్నాడో ఏమో…ప్రథమార్థంలో ఎత్తుగడ బాగున్నా, కొన్ని సీన్లు అత్యద్భుతం అనిపించినా ద్వితీయార్థంలో తడబడి, ఆతరువాత గడబిడై చివరికి మంగళం కాస్తా అమంగళంగా మారిపోయింది.  సాంకేతిక పరంగా ఉన్నతంగా ఉన్నా, ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని హర్రర్ చిత్రాలకన్నా ఇది బెటరైనా పూర్తిస్థాయిలో సంతృప్తిపరచడంలో విఫలమయ్యింది. అతకని తమిళ డైరెక్టర్ ట్రాక్,  గతితప్పిన స్క్రీన్ ప్లే అనే క్షుద్రశక్తులు ఈ చిత్రాన్ని బలిగొన్నాయి.

ఛార్మి నటన కొన్ని దృశ్యాల్లో అద్భుతంగా ఉంటే కొన్నింటిలో పేలవంగా ఉంది. పాత్ర మలిచిన తీరులోనే చాలా సమస్యలు ఉండటం, స్క్రీన్ ప్లే లోపాలు ఛార్మి నటనకు నిగారిం పు ఇవ్వలేకపోయాయి. భయంకరమైన హర్రర్ దృశ్యంలో ఛార్మి అందాల్ని ఆరబోసి దర్శకుడు భయపడాలో భావప్రాప్తి చెందాలో తెలీనిస్థితిలో ఉంచడం లాంటి చీప్ టిక్స్ తో పాటూ, కథకు మలుపొస్తుందని ప్రేక్షకుడు ఎదురుచూసేత తరుణంలో, ఛార్మి అందాల ఆరబోత గల శృంగార భరితమైన పాటలు జొప్పించి చికాకు కలిగిస్తాడు. ఫ్రెండు/ డ్రైవరు సుబ్బు గా నూతన నటుడు (?) సుభాష్ బాగానే ఉన్నాడు. మాంత్రికుడుగా ప్రదీప్ రావత్ భీకరంగా ఉన్నాడు. చిన్నాగా విజయ్ సాయి నటన పాత్రోచితం. మరో ప్రముఖ పాత్రలో ఉత్తేజ్ నటన బాగుంది. తెలుగువాళ్ళంటే చిన్నచూపుండే తమిళ దర్శకుడి పాత్రలో రామచంద్రరావు నటన అభినందనీయం.

దాశరథి శివేంద్ర సినెమాటోగ్రఫి, విశ్వ  సంగీతం చాలా బాగున్నాయి.

హర్రర్ సినిమాల్ని అభిమానించేవాళ్ళు, ఛార్మి అందాల్ని ఆరాధించేవాళ్ళు చూడదగిన సినిమా. ఈ రెండూ ఒద్దనుకుంటే DVD వచ్చేవరకూ ఎదురుచూడండి.

12 Comments
 1. holyman March 3, 2011 /
 2. Indian Minerva March 4, 2011 /
 3. chakradhar March 4, 2011 /
 4. chakradhar March 4, 2011 /
 5. Sudhakar March 4, 2011 /
 6. అరిపిరాల March 4, 2011 /
 7. tejkumar March 4, 2011 /
 8. vissu March 7, 2011 /
  • charan March 17, 2011 /
 9. pallavi reddy May 16, 2011 /
 10. sreenu June 28, 2011 /
 11. satya March 8, 2012 /